
న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీలు), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెట్(ఐఐఎంల)లో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటం అత్యంత దురదృష్టకరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇటువంటి ఘటనల నివారణకు బలమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరముందని నొక్కిచెప్పింది. ఐఐటీలు, ఐఐఎంల్లో గడిచిన 14 నెలల్లో 18 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు సీనియర్ లాయర్ ఇందిరా జైసింగ్ తెలపడంతో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్‌ల ధర్మాసనం పైవిధంగా వ్యాఖ్యానించింది.
ఈ అంశానికి న్యాయపరమైన ముగింపు ఇస్తామని పేర్కొంది. హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్‌డీ స్కాలర్ రోహిత్ వేముల 2017లో, మహారాష్ట్రలోని టీఎన్ టోపీవాలా మెడికల్ కాలేజీ విద్యార్థిని పాయల్ తాడ్వి 2019లో బలవన్మరణం చెందారు. తమ విద్యాసంస్థల్లో కులపరమైన వివక్షను భరించలేకే ప్రాణాలు తీసుకున్నారంటూ వీరి తల్లులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇటువంటి ఘటనల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే, కోర్టు ఆదేశాలున్నా విద్యార్థుల ఆత్మహత్యల ఘటనల వివరాలను ఇచ్చేందుకు విద్యాసంస్థలు ససేమిరా అంటున్నాయని లాయర్ జైసింగ్ శుక్రవారం ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.