రేవంత్‌.. మై హోమ్ విహంగ కూల్చే దమ్ముందా?: కవిత సవాల్‌ | BRS MLC Kavitha Political Counter To CM Revanth | Sakshi
Sakshi News home page

రేవంత్‌.. మై హోమ్ విహంగ కూల్చే దమ్ముందా?: కవిత సవాల్‌

Published Wed, Apr 2 2025 11:25 AM | Last Updated on Wed, Apr 2 2025 11:49 AM

BRS MLC Kavitha Political Counter To CM Revanth

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్‌ఎస్‌ ఎమ్మల్సీ కల్వకుంట్ల కవిత. ముఖ్యమంత్రి రేవంత్‌ చర్యల వల్ల హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ పడిపోయింది. అందుకే హెచ్‌సీయూ వద్ద 400 ఎకరాల భూమిని విక్రయించాలని చూస్తున్నారు అని ఘాటు విమర్శలు చేశారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా కవిత మీడియాతో మాట్లాడుతూ..‘సెంట్రల్ యూనివర్సిటీ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా 400 ఎకరాల భూమిని బీఆర్ఎస్ ప్రభుత్వం కాపాడింది. ఆ భూముల పరిరక్షణ కోసం కేసీఆర్ నిర్దేశం మేరకు న్యాయవాదులు కోర్టులో గట్టిగా వాదనలు వినిపించారు. ఇది యూనివర్సిటీ భూమి అని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లవద్దన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయ పోరాటం చేసింది.

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నారు. రేవంత్ రెడ్డి దుశ్చర్య వల్ల హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పడిపోయింది కాబట్టి 400 ఎకరాల భూమిని విక్రయించాలని నిర్ణయించారు. యూనివర్సిటీ నుంచి తీసుకున్న భూమిని యూనివర్సిటీకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. 397 ఎకరాలను ఇతర చోట యూనివర్సిటీకి ఇచ్చామని ప్రభుత్వం వితండవాదం చేస్తుంది. పరిశ్రమల ఏర్పాటు, భూముల విక్రయం ఆ 397 ఎకరాల్లో చేసుకోవచ్చు కదా?. ప్రభుత్వం పర్యావరణం, ప్రకృతి కోణంలో కూడా ఆలోచించాలి.

ఇప్పటికే కాంక్రీట్ జంగిల్ లాగా మారిన గచ్చిబౌలి ప్రాంతంలో ఈ 400 ఎకరాల్లో కూడా పెద్ద ఎత్తున కంపెనీలు ఏర్పాటు అయితే వాతావరణంపై ఎంత ఒత్తిడి పెరుగుతుందో ఆలోచించాలి. బీఆర్ఎస్ హయాంలో మై హోమ్ విహంగ నిర్మాణానికి భూములు కేటాయించాం అనడంలో వాస్తవం లేదు. మై హోమ్ విహంగా ప్రభుత్వ భూముల్లో నిర్మించినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి బుల్డోజర్లను పంపించాలి. కానీ, మై హోమ్ రామేశ్వరరావు బీజేపీ మనిషి కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ఆ ధైర్యం చేయలేరు. పేదలు, మూగజీవులు ఉంటేనే బుల్డోజర్లను ప్రయోగిస్తారు..పెద్దవాళ్లనేమో ముట్టుకోరు అంటూ విమర్శలు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement