హిట్‌మ్యాన్‌ అరుదైన ఘనత.. సచిన్‌, విరాట్‌, ద్రవిడ్‌, గంగూలీ తర్వాత..! | CWC 2023 IND vs ENG: Rohit Sharma Becomes Fifth Indian Player To Score 18000 Runs In International Cricket | Sakshi

CWC 2023 IND VS ENG: హిట్‌మ్యాన్‌ అరుదైన ఘనత

Oct 29 2023 6:55 PM | Updated on Oct 30 2023 9:22 AM

CWC 2023 IND VS ENG: Rohit Sharma Became The Fifth Indian Player To Score 18000 Runs In International Cricket - Sakshi

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా ఇంగ్లండ్‌తో ఇవాళ (అక్టోబర్‌ 29) జరుగుతున్న ఆసక్తికర మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్‌ ఆడిన హిట్‌మ్యాన్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో 18000 పరుగుల మార్కును దాటాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఐదో భారత క్రికెటర్‌గా, ఓవరాల్‌గా 20వ ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు.

రోహిత్‌కు ముందు సచిన్‌ (34357), కోహ్లి (26121), ద్రవిడ్‌ (24208), గంగూలీ (18575) 18000 పరుగుల మార్కును దాటిన భారత ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా సచిన్‌ కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో సంగక్కర (28016), పాంటింగ్‌ (27483), కోహ్లి రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. 

ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌ హిట్‌మ్యాన్‌ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ (101 బంతుల్లో 87; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆడి టీమిండియా గౌరవప్రదమైన స్కోర్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. రోహిత్‌తో పాటు కేఎల్‌ రాహుల్‌ (58 బంతుల్లో 39; 3 ఫోర్లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (47 బంతుల్లో 49; 4 ఫోర్లు, సిక్స్‌) ఓ మోస్తరుగా రాణించడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. 

భారత ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్‌ గిల్‌ (9), విరాట్‌ కోహ్లి (0), శ్రేయస్‌ అయ్యర్‌ (4), జడేజా (8), షమీ (1) తక్కువ స్కోర్లకే ఔటై దారుణంగా నిరాశపరిచారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో డేవిడ్‌ విల్లే 3, క్రిస్‌ వోక్స్‌, ఆదిల్‌ రషీద్‌ తలో 2, మార్క వుడ్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ ఓడి ఇంగ్లండ్‌ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన విషయం తెలిసిందే.


    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement