
'డియర్ క్రికెట్.. నాకు ఒక్క చాన్స్ ఇవ్వు' మూడేళ్ల కిందట టీమిండియా వెటరన్ కరుణ్ నాయర్ చేసిన ట్వీట్ ఇది.
రంజీట్రోఫీకు కర్ణాటక జట్టులో తనకు చోటు దక్కకపోవడంతో భావోద్వేగానికి లోనైన కరణ్ మాటలవి. కోరుకున్నట్లే క్రికెట్ అతడికి మరో ఛాన్స్ ఇచ్చింది. కర్ణాటక నుంచి విదర్భకు మాకం మార్చిన కరణ్ నాయర్.. దేశీవాళీ క్రికెట్‌లో పరుగులు వరద పారిస్తున్నాడు.
2024-25 దేశవాళీ సీజన్‌లో అన్ని ఫార్మాట్‌లు కలిపి దాదాపు 2000 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఏకంగా 9 సెంచరీలు ఉన్నాయి. ఈ క్రమంలోనే మూడేళ్ల తర్వాత ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున రీఎంట్రీ ఇచ్చాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే అద్భుత ఇన్నింగ్స్‌తో క్రికెట్ ప్రపంచానికి మరోసారి తన పేరును పరిచయం చేసుకున్నాడు.
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్‌పై కేవలం 40 బంతుల్లోనే 89 పరుగులు చేసి ఔరా అన్పించాడు. వరల్డ్ క్లాస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను సైతం నాయర్ ఊతికారేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నప్పటికి తనలో ఏ మాత్రం జోరు తగ్గలేదని మరోసారి నాయర్ నిరూపించుకున్నాడు. ఈ క్రమంలో కరుణ్ నాయర్ టీమిండియా రీఎంట్రీకి మార్గం సుగమైనట్లు తెలుస్తోంది.
ఇంగ్లండ్ టూర్‌కు కరుణ్ నాయర్..
ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు కరుణ్ నాయర్‌ను ఎంపిక చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ సిరీస్‌కు కంటే ముందు భారత-ఎ జట్టు అనాధికారిక టెస్టు సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్‌కు వెళ్లనుంది. భారత-ఎ జట్టుకు నాయర్‌ను ఎంపిక చేసి ముందుగానే ఇంగ్లండ్‌కు పంపాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాడు. అక్కడ అతడి ప్రదర్శన ఆధారంగా సీనియర్ జట్టులో చోటు ఇచ్చే సూచనలు కన్పిస్తున్నాయి.
"అర్హులైన ప్రతీ ప్లేయర్‌కు భారత జట్టులోకి తిరిగి వచ్చేందుకు తలుపులు తెరిచే ఉంటాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కరుణ్ నాయర్ విషయాన్ని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ప్రస్తావించాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు ఇండియా ఎ టీమ్ అనాధికారిక టెస్టు సిరీస్ ఆడేందుకు వెళ్లనుంది.
ఇండియా ఎ జట్టులో నాయర్‌కు అవకాశం లభిస్తుంది. కరుణ్ అద్భుతమైన ఆటగాడనడంలో ఎటువంటి సందేహం లేదు. భారత-ఎ జట్టు తరపున బాగా రాణిస్తే, సెలక్టర్లు ఖచ్చితంగా అతడి పేరును పరిగణలోకి తీసుకుంటారు" అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో పేర్కొన్నారు.
ఇంగ్లండ్‌పై ట్రిపుల్ సెంచరీ
కరుణ్ నాయర్ 2016 నవంబర్‌లో ఇంగ్లండ్‌పై టెస్టు అరంగేట్రం చేశాడు. ఈ సిరీస్ ఐదో టెస్టులో ఇంగ్లీష్ జట్టుపై నాయర్ అద్భుతమైన ట్రిపుల్ సెంచరీ సాధించాడు. నాయర్ సూపర్ ఇన్నింగ్స్ ఫలితంగా భారత జట్టు 75 పరుగుల తేడాతో విజయం సాధించింది. నాయర్ చివరసారిగా భారత జట్టు తరపున 2017లో ఆడాడు. కాగా వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన ఏకైక భారత ఆటగాడిగా కరుణ్ నాయర్ కొనసాగుతున్నాడు.