
రంజీ ట్రోఫీ 2024-25 (Ranji Trophy) సెమీ ఫైనల్లో హైడ్రామా చోటు చేసుకుంది. గుజరాత్‌తో (Gujarat) జరుగుతున్న తొలి సెమీస్‌లో కేరళ (Kerala) 2 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సాధించి, ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 457 పరుగులు చేయగా.. గుజరాత్ తొలి ఇన్నింగ్స్‌లో 455 పరుగులకు ఆలౌటైంది. రంజీ రూల్స్ ప్రకారం.. మ్యాచ్‌లో ఫలితం తేలని పక్షంలో తొలి ఇన్నింగ్స్‌లో లీడ్ సాధించిన జట్టు విజేతగా నిలుస్తుంది. గుజరాత్, కేరళ మ్యాచ్‌లో ఫలితం తేలడం అసాధ్యం కాబట్టి, కేరళ విజేతగా నిలిచి ఫైనల్‌కు చేరుకుంటుంది.
Drama in the Ranji Trophy semifinals🤯pic.twitter.com/o8Bykc8Q4P
— CricTracker (@Cricketracker) February 21, 2025
కాగా, ఈ మ్యాచ్‌లో గుజరాత్.. కేరళకు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, ఆ జట్టును దురదృష్టం వెంటాడింది. కేరళపై లీడ్ సాధించేందుకు కేవలం మూడు పరుగులు అవసరమైన తరుణంలో గుజరాత్ ఆఖరి ఆటగాడు సగస్వల్లా ఔటయ్యాడు. నగస్వల్లా బౌలర్ ప్రతిభ కారణంగా ఔటై ఉంటే గుజరాత్ అంత ఫీల్ అయ్యేది కాదు.
నగస్వల్లా కొట్టిన షాట్ షార్ట్ లెగ్ ఫీల్డర్ సల్మాన్ నిజర్ హెల్మెట్‌కు తాకి స్లిప్స్‌లో ఉన్న సచిన్ బేబి చేతుల్లోకి వెళ్లింది. దీంతో నగస్వల్లా పెవిలియన్ ముఖం పట్టాడు. అప్పటివరకు బాగా ఆడిన నగస్వల్లా ఔట్ కావడంతో గుజరాత్ శిబిరంలో ఒక్కసారిగా నైరాశ్యం ఆవహించింది. తాము ఫైనల్‌కు చేరలేమన్న విషయం తెలుసుకుని గుజరాత్ ఆటగాళ్లు కృంగిపోయారు. తృటిలో గుజరాత్‌కు ఫైనల్ బెర్త్ మిస్ అయ్యింది. ఈ సీజన్‌లో కేరళను లక్కీ జట్టుగా చెప్పాలి. క్వార్టర్ ఫైనల్లోనూ ఆ జట్టు ఇలాగే స్వల్ప ఆధిక్యంతో (ఒక్క పరుగు) సెమీస్‌కు చేరుకుంది. 91 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో కేరళ ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి.
స్కోర్ల విషయానికొస్తే.. వికెట్‌కీపర్ బ్యాటర్ మహ్మద్ అజహరుద్దీన్ భారీ సెంచరీతో (177 నాటౌట్) కదంతొక్కడంతో కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 457 పరుగులు చేసింది. కేరళ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ సచిన్ బేబి (69), సల్మాన్ నిజర్ (52) అర్ద సెంచరీలతో రాణించారు. గుజరాత్ బౌలర్లలో సగస్వల్లా 3, చింతన్ గజా 2, పి జడేజా, రవి బిష్ణోయ్, విశాల్ జేస్వాల్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం ప్రియాంక్ పంచల్ (148) సెంచరీతో అదరగొట్టడంతో గుజరాత్ తొలి ఇన్నింగ్స్‌లో 455 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో ఆర్య దేశాయ్ (73), జయ్‌మీత్ పటేల్ (79) అర్ద సెంచరీలతో రాణించారు. కేరళ బౌలర్లలో సర్వటే, జలజ్ సక్సేనా తలో 4 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటర్లు సైతం బాగానే బ్యాటింగ్ చేసినప్పటికీ.. కేరళ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు రెండు పరుగుల దూరంలో నిలిచిపోయారు. చివరి రోజు లంచ్ సమయానికి కేరళ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. రోహన్ కన్నుమ్మల్ (15), అక్షయ్ చంద్రన్ (9) క్రీజ్‌లో ఉన్నారు.