Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

TDP liquor syndicate loots indiscriminately1
డెత్‌ ‘స్పిరిట్‌’.. కబళిస్తున్న కల్తీ మద్యం...!

అప్పటిదాకా అలవాటైన ‘సరుకే’..! కాస్త పడగానే ‘కిక్‌’ ఇచ్చేదే..! కానీ.. ఇప్పుడెందుకో హఠాత్తుగా తీవ్ర అనారోగ్యం.. ఏమైందో తెలుసుకునేలోపే మృత్యు కౌగిట్లోకి!!ఇదేదో కోవిడ్‌ మహమ్మారి కాదు... కొత్త వైరస్‌ అంతకంటే కాదు..!!టీడీపీ మద్యం సిండికేట్‌ ముఠాలు తయారు చేస్తున్న కల్తీ మందు ఎఫెక్ట్‌ ఇదీ!ప్రమాదకర స్పిరిట్‌లో కారమిల్, రంగునీళ్లు కలిపి బ్రాండెడ్‌ మద్యంగా విక్రయిస్తున్నారు!రాష్ట్రవ్యాప్తంగా కల్తీ మద్యం దందా గుప్పుమంటోంది..కల్తీ మద్యాన్ని తాగడంతో ఇటీవల పలువురు హఠాత్తుగా తీవ్ర అనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఆ చావులకు టీడీపీ కల్తీ మద్యం సిండికేట్‌ కారణమన్న వాస్తవాన్ని చంద్రబాబు సర్కారు కప్పి పుచ్చుతోంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో తప్పనిసరిగా నిర్వహిస్తున్న దాడులతో అనకాపల్లి, పశ్చిమ గోదావరి, ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు, అనంతపురం, వైఎస్సార్‌ కడప తదితర జిల్లాల్లో కల్తీ మద్యం దందా ఇప్పటికే బహిర్గతమైంది. కల్తీ మద్యం తయారీకి కీలకమైన స్పిరిట్‌ను అక్రమంగా సరఫరా చేస్తున్న టీడీపీ పెద్ద తలకాయల జోలికి వెళ్లేందుకు ఎక్సైజ్‌ శాఖ సాహసించడం లేదు. కల్తీ మద్యం రాకెట్‌ దందా వెనుక టీడీపీ కీలక నేతలు, ప్రజాప్రతినిధుల కుటుంబాలే ఉండటంతో వెనకడుగు వేస్తోంది!(సాక్షి, అమరావతి): బాటిల్‌ మీద ఏసీ బ్లాక్‌ విస్కీ అని ఉంటుంది... లోపల సరుకు మాత్రం కల్తీ..! సీసా మీద ఓల్డ్‌ అడ్మిరల్‌ అని అందంగా కనిపిస్తుంది... మూత తీస్తే కల్తీ మద్యం గుప్పుమంటుంది..! ఏస్పీవై 999 అనే ఆకర్షణీయమైన బ్రాండ్‌... అది తాగితే కల్తీ నరనరాల్లోకి పాకుతుంది...! రాష్ట్రంలో విక్రయిస్తున్న ప్రతి మూడు మద్యం సీసాల్లో ఒకటి కల్తీ మద్యమే అన్నది నిఖార్సైన నిజం! దీనికి సూత్రధారులు టీడీపీ కీలక నేతలు అన్నది నగ్న సత్యం...!! మద్యం ప్రియుల ప్రాణాలను ఫణంగా పెట్టి టీడీపీ మద్యం సిండికేట్‌ ఒక్క ఏడాదిలో రూ.వేల కోట్ల దోపిడీని సాగించింది!రాష్ట్రాన్ని కల్తీ మద్యం కబళిస్తోంది. అత్యంత హానికరమైన స్పిరిట్‌లో రంగు నీళ్లు కలిపి బ్రాండెడ్‌ మద్యంగా విక్రయించేస్తున్నారు. టీడీపీ పెద్దల అండదండలతో కల్తీ మద్యం రాకెట్‌ వ్యవస్థీకృతమైంది. కల్తీ మద్యం తయారీ యూనిట్లను నెలకొల్పి మద్యం ప్రియుల ప్రాణాలను హరిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక ఆదేశాలను వక్రీకరిస్తూ బరి తెగించి స్పిరిట్‌ అక్రమ రవాణాకు పాల్పడుతోంది. టీడీపీ సిండికేట్‌ నిర్వహిస్తున్న దుకాణాలు, బెల్ట్‌ షాపుల ద్వారా కల్తీ మద్యాన్ని ఏరులై పారిస్తూ ప్రాణాలను బలిగొంటున్న వైనం ఇదిగో ఇలా ఉంది..! కేంద్రం ఆదేశాల వక్రీకరణ.. భారీగా స్పిరిట్‌ అక్రమ సరఫరా కల్తీ మద్యం రాకెట్‌ నిర్వహణకు టీడీపీ సిండికేట్‌ వేసిన పన్నాగం విస్మయపరుస్తోంది. కోవిడ్‌ సమయంలో దేశంలో శానిటైజర్లను అత్యధికంగా ఉత్పత్తి చేయాల్సిన అనివార్యత ఏర్పడింది. దీంతో శానిటైజర్ల తయారీ కోసం అవసరమైన ‘ఎక్స్‌ట్రా న్యూట్రల్‌ ఆల్కహాల్‌ (వాడుక భాషలో స్పిరిట్‌ అంటారు) భారీగా కొనుగోలు చేసేందుకు అప్పట్లో డిస్టిలరీలను అనుమతించారు. సాధారణంగా స్పిరిట్‌ కొనుగోలుపై నియంత్రణ ఉంటుంది. పరిశ్రమలు కూడా ఓ పరిమితికి మించి కొనుగోలు చేయకూడదు. అయితే కోవిడ్‌ వ్యాప్తి సమయంలో శానిటైజర్ల తయారీ కోసం ఆ పరిమితిని తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కోవిడ్‌ పరిస్థితులు ఏవీ లేనప్పటికీ స్పిరిట్‌ను భారీగా కొనుగోలుకు అనుమతిస్తూ గతంలో జారీ చేసిన ఆదేశాలు ఇంకా కొనసాగుతున్నాయి. సరిగ్గా దీన్ని టీడీపీ మద్యం సిండికేట్‌ తమ దందాకు అవకాశంగా మలుచుకుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ఆసరాగా చేసుకుని కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుల్లోని స్పిరిట్‌ తయారీ పరిశ్రమల నుంచి డిస్టిలరీల పేరిట అవసరానికి మించి భారీ ఎత్తున కొనుగోలు చేస్తున్నాయి. అలా సేకరించిన స్పిరిట్‌ను అక్రమంగా కల్తీ మద్యం యూనిట్లకు తరలిస్తున్నాయి. రాష్ట్రంలో దాదాపు అన్ని డిస్టిలరీలు టీడీపీ కీలక నేతల కుటుంబాలకు చెందినవే కావడంతో కల్తీ దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. యథేచ్ఛగా కల్తీ మద్యం విక్రయాలు.. సిండికేట్‌ దుకణాలు, బెల్టు షాపులకు సరఫరా టీడీపీ సిండికేట్‌ రాష్ట్రంలో దాదాపు డజను కల్తీ మద్యం యూనిట్లను నెలకొల్పి దందా కొనసాగిస్తోంది. రెండు మూడు జిల్లాలకు ఒక యూనిట్‌ను స్థాపించి రాష్ట్రవ్యాప్తంగా ఏరులై పారిస్తోంది. యానాంతోపాటు పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడుకు కూడా కల్తీ మద్యాన్ని సరఫరా చేయడం గమనార్హం. కల్తీ సరుకును బ్రాండెడ్‌ మద్యంగా విక్రయించేందుకు టీడీపీ సిండికేట్‌కు అధికారిక నెట్‌వర్క్‌ఉండటం కలసి వస్తోంది. ఎందుకంటే రాష్ట్రంలో 3,396 ప్రైవేటు మద్యం దుకాణాలన్నీ టీడీపీ సిండికేట్‌ గుప్పిట్లోనే ఉన్నాయి. ఇక వాటికి అనుబంధంగా దాదాపు 75 వేల బెల్ట్‌ దుకాణాలను కూడా సిండికేట్‌ నిర్వహిస్తోంది. ఆ మద్యం దుకాణాలు, బెల్ట్‌ షాపుల్లో కల్తీ మద్యాన్ని బ్రాండెడ్‌ మద్యంగా విక్రయిస్తున్నారు. ఏసీ బ్లాక్, ఓల్డ్‌ అడ్మిరల్, ఎస్పీవై 999 తదితర బ్రాండెడ్‌ మద్యంగా నమ్మబలుకుతూ కల్తీ మద్యాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఏడాదిలో రూ.5,280 కోట్ల దందా 48 కోట్ల కల్తీ మద్యం బాటిళ్ల విక్రయం..! కల్తీ మద్యం దందాను టీడీపీ సిండికేట్‌ యథేచ్ఛగా కొనసాగిస్తోంది. డిస్టిలరీలు, కల్తీ మద్యం తయారీ యూనిట్లు, దుకాణాలు, బెల్ట్‌ షాపులు.. అన్నింటినీ సిండికేటే నిర్వహిస్తోంది. ఇదే అదనుగా బ్రాండెడ్‌ మద్యం పేరిట కల్తీ మద్యాన్ని బరితెగించి విక్రయిస్తోంది. రాష్ట్రంలో అమ్ముడవుతున్న ప్రతి మూడు మద్యం బాటిళ్లలో ఒకటి కల్తీ మద్యమేనని ఎక్సైజ్‌ శాఖ వర్గాలే అనధికారికంగా వెల్లడిస్తుండటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2024–25లో మద్యం అమ్మకాల ద్వారా రూ.28,500 కోట్ల ఆదాయం వచ్చిoది. 2025–26లో రూ.35 వేల కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకుంది. 2024–25లో 4.26 కోట్ల ఐఎంఎల్‌ మద్యం కేసులు, 3.25 కోట్ల బీరు కేసులు విక్రయించారు. 4.26 కోట్ల ఐంఎఎల్‌ మద్యం కేసుల్లో 70 శాతం క్వార్టర్‌ బాటిళ్ల కేసులే ఉన్నాయి. అంటే 2.98 కోట్ల కేసుల్లో క్వార్టర్‌ బాటిళ్లే విక్రయించారు. ఒక్కో కేసులో 48 క్వార్టర్‌ బాటిళ్లు ఉంటాయి. దీన్నిబట్టి 143 కోట్ల క్వార్టర్‌ బాటిళ్లు విక్రయించినట్లు వెల్లడవుతోంది. మొత్తం క్వార్టర్‌ బాటిళ్లలో మూడోవంతు కల్తీ మద్యం విక్రయించినట్లు అంచనా వేస్తున్నారు. ఆ ప్రకారం దాదాపు 48 కోట్ల క్వార్టర్‌ బాటిళ్ల మేర కల్తీ మద్యాన్ని విక్రయించినట్లు స్పష్టమవుతోంది. ఒక్కో క్వార్టర్‌ బాటిల్‌ను రూ.110 చొప్పున విక్రయిస్తున్నారు. ఈ లెక్కన ఒక్క ఏడాదిలోనే రూ.5,280 కోట్ల విలువైన కల్తీ మద్యాన్ని తాగించి సొమ్ము చేసుకున్నారు. అత్యంత హానికరం... ఇటీవల పలువురు హఠాన్మరణం.. టీడీపీ సిండికేట్‌ సాగిస్తున్న కల్తీ దందా మద్యం ప్రియులకు ప్రాణాంతకంగా మారింది. కల్తీ మద్యం తాగడం అత్యంత హానికరం, తీవ్ర అనారోగ్యం పాలై ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘ఎక్స్‌ట్రా న్యూట్రల్‌ ఆల్కహాల్‌ (స్పిరిట్‌)లో వంద శాతం ఆల్కహాల్‌ ఉంటుంది. అది మనుషులు వినియోగించకూడదు. పరిశ్రమల్లో వివిధ ఉత్పత్తుల (ఆహార ఉత్పత్తులు కాదు) తయారీలో ఉ్రత్పేరకంగా మాత్రమే వాడతారు. స్పిరిట్‌ను బాగా డైల్యూట్‌ చేసి ఆల్కహాల్‌ను 42 శాతానికి తగ్గించాలి. అనంతరమే బ్రాండెడ్‌ మద్యం తయారీలో వాడాలి. అంతకంటే ఎక్కువ శాతం ఆల్కహాల్‌ ఉంటే అది ఆరోగ్యానికి తీవ్ర హానికరం. టీడీపీ సిండికేట్‌ నిర్వహిస్తున్న కల్తీ మద్యం యూనిట్లలో ఎలాంటి ప్రమాణాలు పాటించడం లేదు. ప్రమాదకర స్పిరిట్‌లో కారమిల్, రంగునీళ్లు కలిపి బ్రాండెడ్‌ మద్యంగా విక్రయిస్తున్నారు. అది తెలియని పేద, సామాన్య వర్గాలకు చెందినవారు ఆ కల్తీ మద్యాన్ని సేవించడంతో వారి ఆరోగ్యాన్ని కబళిస్తోంది. రాష్ట్రంలో ఇటీవల పలువురు మద్యం ప్రియులు హఠాత్తుగా తీవ్ర అనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలే దీనికి నిదర్శనం. టీడీపీ కల్తీ మద్యం సిండికేట్‌ ఈ చావులకు కారణమన్న వాస్తవాన్ని చంద్రబాబు సర్కారు కప్పి పుచ్చుతోంది. సిండికేట్‌కు స్పిరిట్‌ సరఫరా చేసిందెవరు? రాష్ట్రంలో బయటపడిన కల్తీ మద్యం దందాను కప్పి­పుచ్చాలని ప్రభుత్వ పెద్దలు ఎక్సైజ్, పోలీసు శాఖలను ఆదేశించినట్లు తెలుస్తోంది. కోనసీమ జిల్లా కొమరగిరిపట్నం, పశ్చిమ గోదావరి పాలకొల్లు, అనకాపల్లి జిల్లా పాయకరావుపేటతోపాటు కడప, అనంతపురంలో కల్తీ మద్యం తయారీ యూనిట్లపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఎక్సైజ్‌శాఖ దాడులు జరిపింది. కల్తీ మద్యం తయారీకి ఉపయోగిస్తున్న యంత్ర సామగ్రిని జప్తు చేసి కొందరిని అరెస్టు చేశారు. ఆ వెంటనే టీడీపీ పెద్దలు రంగంలోకి దిగడంతో దర్యాప్తు అటకెక్కింది. కల్తీ మద్యం సిండికేట్‌కు అక్రమంగా స్పిరిట్‌ను ఎవరు సరఫరా చేస్తున్నారన్నది ఈ కేసులో అత్యంత కీలకం. దీన్ని ఛేదిస్తే మొత్తం సిండికేట్‌ దందా బయటపడుతుంది. టీడీపీ కీలక నేతల కుటుంబాల ఆధ్వర్యంలో ఉన్న డిస్టిలరీల గుట్టు రట్టు అవుతుంది. అందుకే ప్రభుత్వ పెద్దలు దర్యాప్తునకు బ్రేకులు వేశారు. టీడీపీ నేతల డిస్టిలరీల జోలికి వెళ్లకుండా ఈ కేసును పక్కదారి పట్టించాలని హకుం జారీ చేశారు. కల్తీ మద్యం తయారీ ఇలా... భారీగా స్పిరిట్‌ తమ గుప్పిట్లోకి వచ్చిన తరువాత టీడీపీ సిండికేట్‌ కల్తీ మద్యం తయారీ చేపడుతోంది. అందుకోసం కల్తీ మద్యం యూనిట్లలో యంత్ర సామగ్రిని తెప్పించి పక్కాగా వ్యవస్థను నెలకొల్పారు. అక్రమంగా సేకరించిన స్పిరిట్‌ను డైల్యూట్‌ (పలుచన) చేసి అందులో కారమెల్, కలర్డ్‌ ఫ్లేవర్లు (రంగు నీళ్లు) కలిపి కల్తీ మద్యం తయారు చేస్తున్నారు. వివిధ ప్రముఖ బ్రాండ్ల పేరిట లేబుళ్లు, బిరడాలు ఇతర ప్రాంతాల్లో తయారు చేయించి తెప్పిస్తున్నారు. ఆ కల్తీ మద్యాన్ని బాట్లింగ్‌ చేసి బ్రాండెడ్‌ మద్యంగా మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నారు. ఇలా కల్తీ దందా సాగిపోతోంది. కల్తీ మద్యంతో తీవ్ర దుష్ప్రభావాలు ఇలా... » కల్తీ మద్యంలో ఉండే మెటబాలిజ్డ్‌ యాసిడ్‌ మిథనాల్‌ వల్ల నాడీ వ్యవస్థ దెబ్బ తింటుంది. న్యూరోసిస్‌ లాంటి తీవ్ర వ్యాధుల బారిన పడటంతోపాటు కంటి నరాలు దెబ్బతిని అంధత్వం సోకుతుంది. » ఉదర సంబంధిత జబ్బుల పాలవుతారు. » శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. » హృద్రోగ సమస్యల బారిన పడతారు. » కొన్ని రకాల క్యాన్సర్ల బారిన పడే ప్రమాదం ఉంది. » తీవ్ర అనారోగ్యంతో కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. కల్తీ మద్యం దందా సూత్రధారుల పాత్రపై ష్‌...గప్‌చుప్‌» ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ఎక్సైజ్‌ శాఖ వెనకడుగు » గుడ్లూరు కేంద్రంగా మూడు జిల్లాల్లో రాకెట్‌.. » ఎక్సైజ్‌శాఖ దాడుల్లో ఖాళీ బాటిళ్లు, లేబుళ్లు లభ్యం.. ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా కందకూరు మండలం గుడ్లూరు కేంద్రంగా కల్తీ మద్యం రాకెట్‌ బట్టబయలైంది. టీడీపీ సిండికేట్‌ సభ్యుడైన వీరాంజనేయులు గుడ్లూరులోని మిట్టపాలెంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కల్తీ మద్యం తయారీ మిషన్, ఇతర సామగ్రితో పూర్తి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలకు కల్తీ మద్యం సరఫరా చేశాడు. చీరాలలో స్వాదీనం చేసుకున్న కల్తీ మద్యం కేసులో కూపీ లాగితే గుడ్లూరు కేంద్రంగా సాగుతున్న దందా డొంక కదిలింది. ఎక్సైజ్‌శాఖ అధికారుల దాడుల్లో 6,200 ఖాళీ క్వార్టర్‌ బాటిల్స్‌తో పాటు 3,500 ఏసీ ప్రీమియం క్వార్టర్‌ బాటిల్‌ లేబుళ్లు బయటపడ్డాయి. కల్తీ మద్యం క్వార్టర్‌ బాటిల్‌ను రూ.120 చొప్పున విక్రయిస్తూ ఏడాదిగా ఈ రాకెట్‌ భారీగా కొల్లగొట్టింది. నెల్లూరులో రొట్టెల పండుగను ఆసరాగా చేసుకుని కల్తీ మద్యాన్ని భారీగా తరలించినట్లు వెల్లడైంది. అందుకోసం 400 లీటర్ల స్పిరిట్‌ను తెప్పించడం గమనార్హం. వీరాంజనేయులను అరెస్టు చేసిన ఎక్సైజ్‌ శాఖ అధికారులు కల్తీ మద్యం రాకెట్‌ అసలు సూత్రధారుల గురించి దర్యాప్తు చేయకపోవడం గమనార్హం. ఉన్నతస్థాయి ఒత్తిళ్లతోనే ఎక్సైజ్‌ శాఖ అధికారులు వెనక్కి తగ్గినట్టు సమాచారం. టీడీపీ సీనియర్‌ నేత కుటుంబమే రింగ్‌ లీడర్‌అనకాపల్లి కేంద్రంగా టీడీపీ సిండికేట్‌ కల్తీ మద్యాన్ని ఏరులై పారిస్తోంది. ప్రస్తుతం కీలక పదవిలో ఉన్న టీడీపీ సీనియర్‌ నేత కుటుంబం దీనికి రింగ్‌ మాస్టర్‌గా వ్యవహరిస్తోంది. ఆ కుటుంబానికి డిస్టిలరీల వ్యాపారంతో సన్నిహిత సంబంధాలు ఉండటం గమనార్హం. డిస్టిలరీల నుంచి అక్రమంగా స్పిరిట్‌ను సరఫరా చేస్తూ కల్తీ మద్యం దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు. పరవాడలో ఇటీవల కల్తీ మద్యం విక్రయాలపై ఎక్సైజ్‌శాఖ దాడులు నిర్వహించడంతో ఈ రాకెట్‌ గుట్టు రట్టైంది. టీడీపీ నాయకుడు రుత్తల రాము, యలమంచిలి వెంకటేశ్వరరావు నుంచి 72 లీటర్ల స్పిరిట్, 180 మిల్లీ లీటర్ల 455 ఖాళీ బాటిళ్లు, 1,389 మూతలు, బాటిళ్లపై అతికించేందుకు ముద్రించిన ఏసీ బ్లాక్‌ స్టిక్కర్లు, కారామిల్‌ రసాయనం, యంత్ర సామగ్రిని స్వా«దీనం చేసుకున్నారు. కల్తీ మద్యాన్ని టీడీపీ సిండికేట్‌కు చెందిన బెల్ట్‌ దుకాణాల ద్వారా క్వార్టర్‌ బాటిల్‌ రూ.130 చొప్పున విక్రయిస్తున్నట్టు వెల్లడైంది. కల్తీ మద్యం దందాకు రింగ్‌ లీడర్‌గా ఉన్న టీడీపీ సీనియర్‌ నేత కుటుంబ సభ్యులను విచారించేందుకు ఎక్సైజ్‌ శాఖ అధికారులు సాహసించకపోవడం గమనార్హం. అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల వ్యాప్తంగా సాగుతున్న దందాపై దృష్టి పెట్టలేదు. గోదావరి జిల్లాల్లో పాలకొల్లు స్థావరంగా... నాలుగు జిల్లాల్లో యథేచ్ఛగా సరఫరా.. గోదావరి జిల్లాల్లో కల్తీ మద్యం రాకెట్‌ పాలకొల్లును స్థావరంగా చేసుకుంది. పాలకొల్లులో నకిలీ మద్యం తయారీ యూనిట్‌ను నెలకొల్పి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో పారిస్తోంది. ఇటీవల పాలకొల్లులో కల్తీ మద్యం తయారీ యూనిట్‌పై ఎక్సైజ్‌ శాఖ అధికారులు దాడులు నిర్వహించడంతో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. నాలుగు జిల్లాల్లో మద్యం దుకాణాలు, బెల్ట్‌ దుకాణాల ద్వారా ఏకంగా 25 శాతం వరకు కల్తీ మద్యాన్నే విక్రయిస్తున్నట్టు సమాచారం. దీని వెనుక పశ్చిమ గోదావరి జిల్లాలో చక్రం తిప్పుతున్న ముఖ్య నేతతోపాటు ఏలూరు జిల్లాకు చెందిన వివాదాస్పద ప్రజా ప్రతినిధి ఉన్నట్లు తెలియడంతో ఎక్సైజ్‌ శాఖ అధికారులు వెనక్కి తగ్గారు. కేవలం పాలకొల్లులో అదుపులోకి తీసుకున్న పులి శీతల్‌ అరెస్టుతో సరిపెట్టారు.

Telangana Farmers Worried Over Rain Deficit in State2
వర్షం లోటు..సాగు తడబాటు!

పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు.. ఈ ఏడాది వ్యవసాయానికి తగ్గట్టుగా వర్షాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నం. నాతో పాటు చాలామంది రైతులు అప్పులు చేసి విత్తనాలు కొనుగోలు చేసి పత్తి పంట వేశారు. కానీ వర్షాలు సరిగా లేకపోవడంతో విత్తనాలు మొలకెత్తే పరిస్థితి లేదు. నేను మూడున్నర ఎకరాల్లో రెండుసార్లు గింజలు పెడితే ఎకరన్నరలోనే ఓ తీరుగా మొలిచినయ్‌. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. – మురావత్‌ రాంసింగ్, లోక్యతండా, వేలేరు మండలం, హనుమకొండ జిల్లాసాక్షి ప్రతినిధి, వరంగల్‌: ఈ వానాకాలం సీజన్‌లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులతో రైతాంగం సతమతమవుతోంది. ముఖ్యంగా జూలైలో పది రోజులు దాటినా ఇప్పటివరకు సరైన వర్షాలు లేకపోవడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. మేలో వర్షాలు కురవడంతో మురిసిపోయిన రైతాంగం.. గతేడాదిలా ఈసారి కూడా సాగు సాఫీగా సాగుతుందని భావించారు. కానీ వానాకాలం సీజన్‌ ముగింపు దశకు చేరుకున్నా ఇంకా లోటు వర్షపాతమే ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా 42.48 శాతం విస్తీర్ణంలోనే పంటల సాగు జరిగింది.ఈ సీజన్‌లో 1.32 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనా వేయగా, ఇప్పటివరకు కేవలం 56,26,243 (42.48 శాతం) ఎకరాల్లోనే రైతులు వివిధ పంటలు వేశారు. అయితే సరైన వర్షాలు లేక విత్తనాలు మొలకెత్తకపోవడం, మొలకలు ఎండిపోతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పెట్టుబడి సైతం దక్కే పరిస్థితి లేదంటూ వాపోతున్నారు. లోటు వర్షపాతంతో కష్టకాలం గత సీజన్‌లో ఈ సమయానికి రాష్ట్ర సగటు వర్షపాతం 191.90 సె.మీ.లు ఉండాల్సి ఉండగా..అంతకు మించి 224.90 సె.మీ.లు నమోదు అయ్యిది. అయితే ఈ సీజన్‌లో మాత్రం అతి తక్కువగా కేవలం 165.5 సె.మీ.లే నమోదు కావడం గమనార్హం. గత సీజన్‌లో కరీంనగర్, ములుగు, ఖమ్మం, బి.కొత్తగూడెం, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 20 నుంచి 59 శాతం అధిక వర్షపాతం నమోదైంది. నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాలలలో 60 శాతానికి పైగా (లార్జ్‌ ఎక్సెస్‌) వర్షం పడగా, 21 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.అయితే ఈసారి మంచిర్యాల, పెద్దపల్లి, సంగారెడ్డి, జేఎస్‌ భూపాలపల్లి, జనగామ, మేడ్చల్‌ మల్కాజిగిరి, నల్లగొండ, సూర్యాపేట, యాదగిరి భువనగిరి, హైదరాబాద్‌ జిల్లాల్లో 20 నుంచి 59 శాతం లోటు వర్షాపాతం ఉంది. తక్కిన 23 జిల్లాల్లో 19 శాతం వరకు లోటు వర్షం ఉంది. ఈ నేపథ్యంలోనే సాగు నెమ్మదించిందని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. ఒక్క ఆదిలాబాద్‌లోనే 95% మించి సాగు ఈ వానాకాలంలో ఆదిలాబాద్‌ జిల్లాలో సాగు అంచనా 5,77,255 ఎకరాలు అయితే 5,51,573 (95.55 శాతం) ఎకరాల్లో రైతులు పంటలు వేశారు. అంటే ఆదిలాబాద్‌లో దాదాపు అంచనాలకు తగినట్టుగా సాగు జరిగిందన్న మాట. ఆ తర్వాతి స్థానాల్లో కేబీ ఆసిఫాబాద్‌ (76.33 శాతం), సంగారెడ్డి (66.81 శాతం), నిజామాబాద్‌ (65.36 శాతం), బి.కొత్తగూడెం (61.85 శాతం) జిల్లాలు ఉన్నాయి. ఇక అతి తక్కువ విస్తీర్ణంలో సాగైన జిల్లాల్లో వనపర్తి 2,46,582 ఎకరాలకు గాను 17,879 (7.25 శాతం) ఎకరాల్లో సాగుతో మొదటి స్థానంలో ఉంది.ఇక సూర్యాపేటలో 5,81,915 ఎకరాలకు 44,195 (7.59 శాతం) ఎకరాలలో, మెదక్‌లో 3,37,641 ఎకరాలకు 32,789 (9.71 శాతం) ఎకరాలలో, ఎం.మల్కాజిగిరిలో 23,430 ఎకరాలకు గాను 2,583 (11.02 శాతం) ఎకరాల్లో, ములుగులో 1,26,973 ఎకరాలకు 19,877 (15.65 శాతం) ఎకరాల్లో పంటలు వేశారు. కాగా ప్రతికూల పరిస్థితుల్లోనూ రైతులు పత్తి పంటపైనే ఆసక్తి చూపారు. పత్తి సాగు అంచనా 48,93,016 ఎకరాలకు గాను 36,30,988 (74.21 శాతం) ఎకరాలలో సాగయ్యింది. వరిసాగు అంచనా 62,47,868 ఎకరాలకు గాను కేవలం 5,01,129 (8.02 శాతం) ఎకరాల్లోనే సాగయ్యింది. వర్షాలు లేకపోవడం వరిసాగుపై తీవ్రంగా ప్రభావం చూపించింది. ప్రత్యామ్నాయంగా తృణ ధాన్యాలు, ఆహారేతర పంటలు... వర్షాభావం, ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర రైతాంగం ఈసారి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపింది. ముఖ్యంగా ప్రధాన తృణ ధాన్యాలు (మిల్లెట్స్‌), ఆహారేతర పంటలపై దృష్టి పెట్టినట్లు సాగు విస్తీర్ణాన్ని బట్టి అవగతమవుతోంది. మేజర్‌ మిల్లెట్స్‌ (జొన్న, మొక్కజొన్న, రాగులు) 5,73,643 ఎకరాల్లో సాగవచ్చని అంచనా వేయగా అంచనాలకు తగినట్టుగా 5,61,240 (97.84 శాతం) ఎకరాల్లో ఈ పంటలు వేశారు. మొక్కజొన్న 5,21,206 ఎకరాలకు గాను 5,34,318 (102.52 శాతం) ఎకరాలలో సాగైంది. ఆహారేతర పంటలు 1,02,576 ఎకరాలు అంచనా వేయగా రెట్టింపునకు మించి 2,35,614 (229.70 శాతం) ఎకరాల్లో రైతులు దైంచా, పిల్లిపెసర, సన్‌ హెంప్, పారాగ్రాస్, మేత జోవార్‌లు సాగు చేశారు. నారు పోసిననప్పటి నుంచి వానలు లేవు.. మే నెలలో వానలు పడితే ఈసారి కాలం మంచిగనే అయితది అనుకున్నం. ఆ వానలు తప్ప మల్ల చినుకు పడలేదు. ఆలస్యంగనైన వరి ఏద్దమని ఆగినం. పది రోజుల కింద మబ్బులు చేసి తుంపురు తుంపురు వానలు పడ్డయి. కాలం మంచిగైతే నాట్లు వేసుకోవచ్చని నమ్మి నారు పోసినం. ఇగ వర్షాలు పడుతలేవు. చెరువులు, కుంటలల్ల కూడా నీళ్లు లేవు. ఎటూ తోస్తలేదు. – యెడబోయిన పద్మ, మహిళా రైతు, గ్రామం బేతోల్, మహబూబాబాద్‌ జిల్లా వానాకాలం 2025 సాగు ప్రణాళిక.. సాగైన విస్తీర్ణం (ఎకరాలలో) – ఈ వానాకాలం సాగు అంచనా ః 13244305 – ఇప్పటివరకైన సాగు విస్తీర్ణంః 5626243 – పత్తి సాగు అంచనాః 4893016 – సాగైన పత్తి విస్తీర్ణంః 3630988 – వరిసాగు అంచనాః 6247868 – సాగైన వరి విస్తీర్ణంః 501129 – మొక్కజొన్న సాగు అంచనాః 521206 – సాగైన మొక్కజొన్న విస్తీర్ణంః 534318

Party ready to file habeas corpus petition against Chittoor police3
కాయలు పారబోశారని.. అక్రమ కేసులు

సాక్షి, అమరావతి: ప్రజా సమస్యలపై ఎప్పటి­కప్పుడు నిలదీస్తూ కూటమి సర్కారు మోసాలను ఎండగడుతున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని జనంలోకి వెళ్లకుండా పోలీసులతో అడ్డుకుంటూ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం అంతటితో ఆగడం లేదు! వైఎస్‌ జగన్‌ పర్యటనల్లో పాల్గొన్న వారిని, పార్టీ కార్యక్రమాలకు హాజరైన వారిని లక్ష్యంగా చేసుకుని వెంటాడుతోంది. ప్రధానంగా రైతులు, యువత, వైఎస్సార్‌సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తోంది. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మామిడి రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు వైఎస్‌ జగన్‌ అక్కడకు వెళ్లగా తాజాగా కూటమి ప్రభుత్వం పలువురు రైతులపై అక్రమ కేసులు మోపింది. మామిడికి గిట్టుబాటు ధరలు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డుపై కాయలు పారబోసినందుకు బంగారుపాళ్యంలో రైతులపై పోలీసులు శుక్రవారం అక్రమ కేసులు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా తుంబపాళ్యానికి చెందిన రైతు దేవేంద్ర, తిమ్మోజుపల్లెకు చెందిన రైతులు ప్రకాష్‌రెడ్డి, భగత్‌రెడ్డి, తుంబపాళ్యానికి చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్లు అక్బర్, ఉదయ్‌పై కేసులు బనాయించారు. మామిడికి గిట్టుబాటు ధర చెల్లించి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్‌ జగన్‌ బంగారుపాళెం మార్కెట్‌యార్డును సందర్శించిన విషయం తెలిసిందే. గిట్టుబాటు ధరలేక నష్టపోతున్న మామిడి రైతన్నలు తమ గోడు చెప్పుకునేందుకు పోలీసు ఆంక్షలను లెక్క చేయకుండా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వైఎస్‌ జగన్‌ పర్యటనకు లభించిన స్పందన చూసి ఉలిక్కిపడ్డ ప్రభుత్వ పెద్దలు పోలీసులను ప్రయోగించి సరికొత్త నాటకానికి తెర తీసినట్లు స్పష్టమవుతోంది.పిలవని పేరంటానికి హాజరై...!ఈనెల 8వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బంగారుపాళ్యం మార్కెట్‌ యార్డులో మామిడి రైతుల కష్టాలు తెలుసుకోవడానికి వచ్చారు. అక్కడకు వేలాది మంది ప్రజలు, పార్టీ శ్రేణులు తరలిరాగా, ఆహ్వానం లేకున్నా ఎల్లో మీడియా కూడా దూరిపోయింది! అసలు ఈ కార్యక్రమానికి తాము ఎల్లో మీడియాను పిలవలేదని వైఎస్సార్‌సీపీ నాయకులు చెబుతున్నారు. ఈ క్రమంలో బంగారుపాళ్యం చేరుకున్న పచ్చ మీడియాకు చెందిన ఓ ఫోటోగ్రాఫర్‌ అత్యుత్సాహం ప్రదర్శించాడు. మామిడికి గిట్టుబాటు ధర దక్కడం లేదని కాయలను కింద పోసి నిరసన వ్యక్తంచేస్తున్న రైతులను ఉద్దేశించి.. ‘మీకు బుద్ధుందా..? ఏం చేస్తున్నారు..? అన్నం తింటున్నారా? ఇంకేమైనా తింటున్నారా...?’ అంటూ దుర్భాషలాడి రైతులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో మాటామాట పెరిగి తోపులాట చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారంటూ ఫోటోగ్రాఫర్‌ బంగారుపాళ్యం పోలీసులకు ఫిర్యాదు చేయడం.. కేసు నమోదు చేయడం చకచకా జరిగిపోయాయి. తమ అనుకూల మీడియాకు చెందిన ప్రతినిధి కావడంతో సీఎం చంద్రబాబు నుంచి ఆయన తనయుడు, మంత్రులు వరుస ట్వీట్లు పెడుతూ ఆగమేఘాలపై స్పందించారు. నిందితులను వదిలేది లేదని, చట్టరీత్యా చర్యలు తప్పవంటూ మామిడి రైతుల సమస్యను డైవర్ట్‌ చేశారు. చిత్తూరుకు చెందిన చక్రి తనపై దాడి చేయలేదని, తన కెమెరాను అతడే కాపాడాడని ఫోటోగ్రాఫర్‌ చెబుతున్నా ఖాకీలు పరిగణలోకి తీసుకోలేదు. ‘కేసు ఇప్పుడు మా పరిధిలో లేదు...! సీఎం వరకు వెళ్లిపోయింది.. నువ్వు ఏదిపడితే అది మాట్లాడొద్దు.. మేమేం చెబితే అది చెయ్‌.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టు.. ఏం జరిగిందో కూడా మేమే చెబుతాం.. అందరికీ అలాగే చెప్పు..’’ అంటూ పోలీసులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.వైఎస్సార్‌సీపీ శ్రేణులే లక్ష్యంగా..ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఫోటోగ్రాఫర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాకుండా ఉన్నత స్థాయి ఆదేశాల మేరకు అనుమానితుల పేరిట వైఎస్సార్‌సీపీ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రాత్రి నుంచే పలువురు కార్యకర్తలను అక్రమంగా నిర్భందించారు. గంగాధర నెల్లూరుకు చెందిన వైఎస్సార్‌సీపీ మండల ఎస్సీ విభాగం ఉపాధ్యక్షుడు కె.మోహన్, మండల సోషల్‌ మీడియా కో–కన్వీనర్‌ వినోద్, చిత్తూరు సమన్వయకర్త విజయానందరెడ్డి అనుచరుడు చక్రవర్తి (చక్రి), పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ అనుచరుడు ఆచార్య, పూతలపట్టుకు చెందిన మరికొంత మందిని అక్రమంగా నిర్భందించి అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజులుగా బంగారుపాళ్యం పోలీస్‌ స్టేషన్‌లో నిర్భందించి శుక్రవారం చిత్తూరులోని పోలీసు శిక్షణా కేంద్రానికి (డీటీసీ) తరలించారు. అక్కడకు వెళ్లిన న్యాయవాదులను లోపలకు అనుమతించలేదు. ఫొటోగ్రాఫర్‌ను కులం పేరు చెప్పాలంటూ బెదిరించి ఆయుధాలతో దాడి చేశారంటూ అట్రాసిటీ, హత్యాయత్నం కింద నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్లు బనాయించి కేసు నమోదు చేశారు. దాదాపు 20 మందికి పైగా వైఎస్సార్‌సీపీ శ్రేణులను పోలీసులు అక్రమంగా నిర్భందించగా మరి కొందరి కోసం ఓ బృందం బెంగళూరుకు వెళ్లినట్లు చెబుతున్నారు.హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌.హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌.!తమ శ్రేణుల అక్రమ నిర్భందంపై వైఎస్సార్‌సీపీ నాయకులు హైకోర్టు తలుపు తట్టడానికి సిద్ధమవుతున్నారు. రెండు రోజులుగా కనిపించకుండా పోయిన వారి పేర్లను సేకరించి హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు పార్టీ సీనియర్‌ నేత భూమన కరుణాకరరెడ్డి తెలిపారు.ఎల్లో మీడియాపై రైతన్న కన్నెర్ర..బంగారుపాళ్యంలో మామిడి రైతుల ఆవేదనను ‘సాక్షి’ ప్రచురించిన నేపథ్యంలో ఎల్లో మీడియా రంగంలోకి దిగింది. ‘సాక్షి’ మీడియాకు మీరు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ నిజమేనా..? మీతో బలవంతంగా చెప్పించారా..? అంటూ రైతులను ఆరా తీస్తోంది. అయితే మామిడి రైతులను రౌడీలు, గొంతులు కోసే ఉన్మాదులతో ఎల్లో మీడియా పోల్చడం, దండుపాళ్యం బ్యాచ్‌గా అభివర్ణించడంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న అన్నదాతలు వారిపై మండిపడుతున్నారు.తప్పుడు ఫిర్యాదుతో అక్రమ నిర్భందం..సీఎం చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌కు బంగారుపాళ్యం ఘటన మరో నిదర్శనం. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు తరలి వచ్చిన జన సముద్రాన్ని చూసి జీర్ణించుకోలేని కూటమి నేతలు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదుతో మా పార్టీ కార్యకర్తలను అక్రమంగా నిర్భందించారు. కుప్పంలో ఓ వార్త రాసినందుకు అక్కడి సాక్షి విలేకరిపై తప్పుడు కేసు పెట్టారు. వాట్సాప్‌ గ్రూపులో ఎవరో ఏదో పెడితే మరో టీవీ ఛానల్‌ రిపోర్టర్‌పై కేసు పెట్టారు. వారిని సీఎం స్థాయిలో చంద్రబాబు ఎందుకు పరామర్శించలేదు? మీడియాలో మీకు అనుకూలంగా ఉన్నవారికి ఒక న్యాయం, నిజాలు నిర్భయంగా ఎలుగెత్తే వారికి మరో న్యాయమా..? పార్టీ కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తప్పు చేస్తున్న పోలీసులను చట్టం ముందు నిలబెడతాం. – భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్‌ సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లా అధ్యక్షుడుఅక్రమ కేసులు బనాయించారు..మా కార్యక్రమానికి రావాలని మేమేమైనా పచ్చ మీడియాను ఆహ్వానించామా..? గొడవ చేసి దృష్టి మళ్లించేందుకే తప్పుడు కేసులకు శ్రీకారం చుట్టారు. ఆ ఫోటోగ్రాఫర్‌ను ఎవరు కొట్టారు..? నాపేరు ఎలా చెబుతారు..? కుప్పంలో పని చేస్తున్న సాక్షి రిపోర్టర్, మరి కొంతమందిపై టీడీపీ నేతలు తప్పుడు ఫిర్యాదు ఇస్తే.. ఎస్పీ అక్రమ కేసులు బనాయించారు. జిల్లావ్యాప్తంగా మావారిని 25 మందికిపైగా రెండు రోజులుగా అదుపులోకి తీసుకుని వేధిస్తున్నా ఎస్పీ నోరు మెదపడంలేదు. హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు పెట్టాలని కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు పోలీసులకు చెబుతున్నారు. మా నియోజకవర్గానికి చెందిన ఎస్సీ యువకులను అక్రమంగా నిర్బంధించారు. దీనికంతటికీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. – కె.నారాయణస్వామి, మాజీ ఉప ముఖ్యమంత్రి. కాపాడినందుకు కేసా..? ఆ ఫోటోగ్రాఫర్‌ను ఎవరో తోస్తా ఉంటే మా ఆయనే కాపాడారని చెప్పారు. కెమెరా ఎక్కడ విరిగిపోతుందోనని కెమెరాను పట్టుకున్నారు. కాపాడిన పాపానికి మా ఆయన్ను ఇరికించాలని చూస్తున్నారు. చక్రి నన్ను కాపాడాడు అని ఆసుపత్రిలో ఆ ఫోటోగ్రాఫరే చెప్పారు. ఇప్పుడు ఓ డీఎస్పీ స్ట్రిప్టు రాసిచ్చి, దీని ప్రకారం ఇవ్వాలని ఫోటోగ్రాఫర్‌తో అబద్ధపు ఫిర్యాదు తీసుకున్నారు. రెండు రోజుల క్రితం యూనిఫామ్‌ వేసుకున్న ఇద్దరు కానిస్టేబుళ్లు ఇంట్లో అన్నం తింటా ఉన్న నా భర్తను ఇప్పుడే పంపిస్తామని తీసుకెళ్లారు. ఇప్పటివరకు నా భర్త ఆచూకీ చెప్పలేదు. చిత్తూరు డీటీసీ వద్ద ఉన్నారని తెలిసి అక్కడకు వెళితే లోపలకు కూడా పంపలేదు. ఇంట్లో నేనొక్కదాన్నే ఉంటున్నా. పోలీసులు తప్పుడు కేసులు పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారా..? – కవిత, చక్రవర్తి (చక్రి) భార్య, చిత్తూరు.నా భర్తకు ఏదైనా జరిగితే ఎస్పీదే బాధ్యతజగన్‌పై అభిమానంతో చూడడానికి మా ఇంటాయన అక్కడికి పోయినాడు. ఫోటోగ్రాఫర్‌ను ఎవరో తోస్తా ఉంటే మా ఆయన పక్కన నిలబడి ఉన్నాడు. అంతే.. ఇంట్లో ఉన్నోడిని ఇప్పుడే పంపిస్తామని పోలీసులు తీసుకుపోయినారు. ఇంతవరకు పంపలేదు. నా భర్తకు ఒక కన్ను కనిపించదు. షుగర్‌ కూడా ఉంది. రోజూ మూడుసార్లు మాత్రలు వేసుకోవాలి.చిత్తూరు డీటీసీలో ఉండానని చెబితే అక్కడి పోయినాము. ఆ అడవిలో నా భర్తను చూపీకుండా పోలీసులు తరిమేసినారు. ఇపుడు కేసులు పెడతామంటా ఉండారు. మేమే ఎస్సీలైతే మాపైనే ఎట్లా అట్రాసిటీ కేసు పెడతారు..? నా భర్తకు జరగరానికి ఏదైనా జరిగితే ఎస్పీనే బాధ్యత వహించాలి. – రాసాత్తి, మోహన్‌ భార్య, గంగాధరనెల్లూరు.

Rasi Phalalu: Daily Horoscope On 12-07-2025 In Telugu4
ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలు సజావుగానే సాగుతాయి.

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: బ.విదియ సా.6.23 వరకు, తదుపరి తదియ, నక్షత్రం: ఉత్తరాషాఢ ఉ.7.25 వరకు, తదుపరి శ్రవణం, వర్జ్యం: ప.11.29 నుండి 1.06 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.32 నుండి 7.17 వరకు, అమృతఘడియలు: రా.9.14 నుండి 10.53 వరకు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 5.35, సూర్యాస్తమయం: 6.35.మేషం: అప్రయత్న కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. నూతన విద్యావకాశాలు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలం.వృషభం: రాబడికి మించిన ఖర్చులు. వ్యయప్రయాసలు. మిత్రులు, బంధువులతో తగాదాలు. స్వల్ప అనారోగ్యం. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగించవచ్చు.మిథునం: కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్యసమస్యలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.కర్కాటకం: పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. కొత్త పరిచయాలు. బంధువుల ద్వారా శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటుంది.సింహం: ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యవహారాలలో పురోగతి. కొన్ని వివాదాలు తీరతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగానే సాగుతాయి.కన్య: బంధువులతో వివాదాలు. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. పనులలో తొందరపాటు. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.తుల: కుటుంబంలో కలహాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.వృశ్చికం: వ్యవహారాలలో పురోగతి. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దైవదర్శనాలు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.ధనుస్సు: మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. స్వల్ప అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు.మకరం: ఇంటర్వ్యూలు అందుకుంటారు. శ్రమ ఫలిస్తుంది. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆప్తుల ద్వారా కీలక సమాచారం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.కుంభం: ముఖ్య కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువిరోధాలు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.మీనం: రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు కీలక సమాచారం రావచ్చు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

India Vs England 3rd Test Day 2 Match Highlights And Full Scorecard5
బుమ్రా కూల్చాడు... ఇక బ్యాటర్లే నిలబెట్టాలి

మూడో టెస్టు రెండో రోజు రసవత్తర ఆటకు తెరలేచింది. తొలిరోజంతా కష్టపడినా బుమ్రా ఒక వికెట్‌ మాత్రమే తీస్తే... రెండో రోజు తొలి సెషన్‌లోనూ వైవిధ్యమైన బంతులతో ఇంగ్లండ్‌ ప్రధాన బ్యాటింగ్‌ బలగాన్ని కూల్చేశాడు. అయితే భారత బ్యాటింగ్‌ మాత్రం తడబడింది. ఆరంభంలోనే విలువైన వికెట్లను కోల్పోయింది. మొదటి రోజు 4 వికెట్లు పడితే... రెండో రోజు ఆటలో 9 వికెట్లు కూలాయి. ఇరుజట్లు బ్యాటింగ్‌ కంటే కూడా బౌలింగ్‌తోనే సత్తా చాటుకున్నాయి. లండన్‌: భారత ప్రీమియర్‌ బౌలర్‌ బుమ్రా తానెంత విలువైన ఆటగాడో మరోసారి చాటుకున్నాడు. తొలిరోజు శ్రమించినా దక్కని సాఫల్యం రెండో రోజు ఆరంభంలోనే సాధ్యమైంది. క్రీజులో పాతుకుపోయిన బ్యాటర్లను తొలి సెషన్‌ మొదలైన కొద్దిసేపటికే అవుట్‌ చేశాడు. భారత్‌ పట్టుబిగించేలా చేశాడు. నింపాదిగానే పరుగులు చేద్దామనుకున్న ఇంగ్లండ్‌ బ్యాటర్లపై నిప్పులు చెరిగాడు. ఇంగ్లండ్‌ భారీ స్కోరుకు బాట వేసినా... బుమ్రా బాధ్యతగా అడ్డుకట్ట వేశాడు. అయితే టీమిండియా ఇన్నింగ్సే సానుకూల దృక్పథంతో మొదలవలేదు.ఆతిథ్య బౌలర్లు కీలక వికెట్లను తీసి మ్యాచ్‌ను రసపట్టుగా మార్చేశారు. ముందుగా ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 112.3 ఓవర్లలో 387 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ జో రూట్‌ (199 బంతుల్లో 104; 10 ఫోర్లు) ‘శత’క్కొట్టగా... వికెట్‌ కీపర్‌ జేమీ స్మిత్‌ (56 బంతుల్లో 51; 6 ఫోర్లు), బౌలర్‌ బ్రైడన్‌ కార్స్‌ (83 బంతుల్లో 56; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలతో రాణించారు. భారత స్పీడ్‌స్టర్‌ బుమ్రా 5 వికెట్లు తీశాడు. సిరాజ్, నితీశ్‌ కుమార్‌ రెడ్డి చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత భారత్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 43 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ (113 బంతుల్లో 53 బ్యాటింగ్‌; 5 ఫోర్లు), కరుణ్‌ నాయర్‌ (62 బంతుల్లో 40; 4 ఫోర్లు) రాణించారు. ఆర్చర్, వోక్స్, స్టోక్స్‌ తలా ఒక వికెట్‌ తీశారు. చేతిలో 7 వికెట్లున్న టీమిండియా ఇంగ్లండ్‌ స్కోరుకు ఇంకా 242 పరుగుల దూరంలో ఉంది. బుమ్రా పేస్‌... స్టోక్స్, రూట్‌ క్లీన్‌బౌల్డ్‌ రెండో రోజు ఆరంభాన్ని భారత పేస్‌ స్టార్‌ బుమ్రా దెబ్బతీశాడు. ఓవర్‌నైట్‌ స్కోరు 251/4తో శుక్రవారం ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌ కాసేపటికే కెప్టెన్‌ స్టోక్స్‌ (44) వికెట్‌ను కోల్పోయింది. సెంచరీ మురిపెం పూర్తవగానే రూట్‌ వికెట్‌ పడింది. ఈ ఇద్దరూ క్లీన్‌ బౌల్డయ్యారు. రూట్‌ అవుటైన మరుసటి బంతికే క్రిస్‌ వోక్స్‌ (0) డకౌట్‌ అయ్యాడు! ముగ్గుర్ని బుమ్రానే అవుట్‌ చేశాడు. బుమ్రా పేస్‌కు విలవిలలాడిన ఇంగ్లండ్‌కు స్మిత్‌ క్యాచ్‌ నేలపాలవడం వరమైంది. సిరాజ్‌ బౌలింగ్‌లో రాహుల్‌ క్యాచ్‌ చేజార్చినపుడు అతని స్కోరు 5 మాత్రమే.ఈ లైఫ్‌లైన్‌తో కార్స్‌తో కలిసి ఇంగ్లండ్‌ పోటీ స్కోరుకు స్మిత్‌ బాట వేశాడు. ముందుగా ఇద్దరు జట్టు స్కోరును 300 దాటించారు. తర్వాత క్రీజులో పాతుకుపోయి ఎనిమిదో వికెట్‌కు 84 పరుగులు జోడించారు. ఫిఫ్టీ పూర్తయ్యాక మళ్లీ సిరాజ్‌కే అతని వికెట్‌ దక్కింది. బుమ్రా... ఆర్చర్‌ (4)ను ఎక్కువసేపు నిలువనీయలేదు. అయితే కార్స్‌ అడపాదడపా బౌండరీలు, ఓ భారీ సిక్సర్‌తో అర్ధసెంచరీ చేసుకున్నాడు. 387 వద్ద సిరాజ్‌ అతన్ని అవుట్‌ చేయడంతో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.యశస్వి, గిల్‌ విఫలం ఆరంభం నుంచే దూకుడుగా ఆడుదామనుకున్న యశస్వి జైస్వాల్‌ (13; 3 ఫోర్లు) జోరుకు ఆర్చర్‌ ఆదిలోనే అడ్డుకట్ట వేశాడు. తద్వారా నాలుగేళ్ల తర్వాత మళ్లీ భారత్‌తోనే అంతర్జాతీయ టెస్టుల్లో పునరాగమనం చేసిన ఆర్చర్‌ ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే వికెట్‌తో సత్తా చాటుకున్నాడు. ఈ దశలో రాహుల్‌కు కరుణ్‌ నాయర్‌ జతయ్యాడు. ఇద్దరు ఇంగ్లండ్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్ని నింపాదిగా పరుగులు రాబట్టారు. ఈ జోడీ క్రీజులో పాగా వేస్తున్న సమయంలోనే నాయర్‌ వికెట్‌ తీసిన స్టోక్స్‌ రెండో వికెట్‌కు 61 పరుగులు భాగస్వామ్యానికి తెరదించాడు.తర్వాత ఈ సిరీస్‌లో భీకరమైన ఫామ్‌లో ఉన్న భారత కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (44 బంతుల్లో 16; 2 ఫోర్లు)ను వోక్స్‌ అవుట్‌ చేసి ఇంగ్లండ్‌ శిబిరంలో ఆనందాన్ని నింపాడు. ఇలా 107 పరుగులకే టీమిండియా కీలకమైన 3 వికెట్లు కోల్పోంది. దీంతో రాహుల్‌ బాధ్యతగా ఆడి అర్ధసెంచరీ పూర్తిచేసుకోగా... గాయంతో కీపింగ్‌ చేయలేకపోయినా రిషభ్‌ పంత్‌ (19 బ్యాటింగ్‌; 3 ఫోర్లు) బ్యాటింగ్‌లో కుదురుగా ఆడాడు. స్కోరు వివరాలు ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: క్రాలీ (సి) పంత్‌ (బి) నితీశ్‌ 18; డకెట్‌ (సి) పంత్‌ (బి) నితీశ్‌ 23; పోప్‌ (సి) సబ్‌–జురేల్‌ (బి) జడేజా 44; జో రూట్‌ (బి) బుమ్రా 104; బ్రూక్‌ (బి) బుమ్రా 11; స్టోక్స్‌ (బి) బుమ్రా 44; స్మిత్‌ (సి) సబ్‌–జురేల్‌ (బి) సిరాజ్‌ 51; వోక్స్‌ (సి) సబ్‌–జురేల్‌ (బి) బుమ్రా 0; కార్స్‌ (బి) సిరాజ్‌ 56; ఆర్చర్‌ (బి) బుమ్రా 4; బషీర్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 31; మొత్తం (112.3 ఓవర్లలో ఆలౌట్‌) 387.వికెట్ల పతనం: 1–43, 2–44, 3–153, 4–172, 5–260, 6–271, 7–271, 8–355, 9–370, 10–387.బౌలింగ్‌: బుమ్రా 27–5–74–5, ఆకాశ్‌దీప్‌ 23–3–92–0, సిరాజ్‌ 23.3–6–85–2; నితీశ్‌ కుమార్‌ 17–0–62–2, జడేజా 12–1–29–1, సుందర్‌ 10–1–21–0. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) బ్రూక్‌ (బి) ఆర్చర్‌ 13; రాహుల్‌ (బ్యాటింగ్‌) 53; కరుణ్‌ (సి) రూట్‌ (బి) స్టోక్స్‌ 40; గిల్‌ (సి) స్మిత్‌ (బి) వోక్స్‌ 16; పంత్‌ (బ్యాటింగ్‌) 19; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (43 ఓవర్లలో 3 వికెట్లకు) 145.వికెట్ల పతనం: 1–13, 2–74, 3–107.బౌలింగ్‌: వోక్స్‌ 13–1–56–1, ఆర్చర్‌ 10–3–22–1, కార్స్‌ 8–1–27–0, స్టోక్స్‌ 6–2–16–1, బషీర్‌ 6–1–22–0. ⇒ 37 టెస్టుల్లో జో రూట్‌ సెంచరీల సంఖ్య. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ల జాబితాలో రూట్‌ ఐదో స్థానానికి చేరుకున్నాడు. సచిన్‌ టెండూల్కర్‌ (51), జాక్వస్‌ కలిస్‌ (45), రికీ పాంటింగ్‌ (41), కుమార సంగక్కర (38) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు.⇒ 211 టెస్టుల్లో అత్యధిక క్యాచ్‌లు తీసుకున్న ఫీల్డర్‌గా జో రూట్‌ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 210 క్యాచ్‌లతో రాహుల్‌ ద్రవిడ్‌ (భారత్‌) పేరిట ఉన్న రికార్డును రూట్‌ సవరించాడు.⇒ 11 భారత్‌పై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్‌గా స్టీవ్‌ స్మిత్‌ (11) పేరిట ఉన్న రికార్డును జో రూట్‌ (11) సమం చేశాడు.⇒ 4 లార్డ్స్‌ మైదానంలో వరుసగా మూడు సెంచరీలు చేసిన నాలుగో క్రికెటర్‌గా రూట్‌ గుర్తింపు పొందాడు. గతంలో మైకేల్‌ వాన్, జాక్‌ హాబ్స్, దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ ఈ ఘనత సాధించారు.

Despite high foreign exchange reserves Indian economy is not performing as expected6
మారక నిల్వలు కరిగిస్తేనే కదలిక!

మోదీ ప్రభుత్వం చెప్పుకొనే గొప్పల్లో తరచూ వినిపించేవి... విదేశీ మారక ద్రవ్య నిల్వలు! ఆయన వచ్చిన తర్వాత ఫారిన్‌ ఎక్స్‌ఛేంజ్‌ (ఫారెక్స్‌) రిజర్వులు 700 బిలి యన్‌ డాలర్లకు పెరిగాయి (2025 జూన్‌ నాటికి). ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న చైనా వద్ద 3 ట్రిలియన్‌ (3,000 బిలియన్లు లేదా 3 లక్షల కోట్లు) డాలర్లు ఉన్నాయి. గతంలో చైనా ఫారెక్స్‌ నిల్వలు 4 ట్రిలియన్‌ డాలర్లుగా ఉండేవి. చైనా తర్వాత జపాన్‌ (1.25 ట్రిలియన్‌ డాలర్లు), స్విట్జర్లాండ్‌ (800 బిలియన్‌ డాలర్లు) ఆగ్రస్థానంలో నిలుస్తాయి. మారక ద్రవ్య నిల్వలు ఇంత అధికంగా ఉన్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ ఆశించిన స్థాయిలో లేదు. ఎన్డీయే ప్రభుత్వం ఆర్థిక చక్ర వ్యూహంలో చిక్కుకుంది. ఎలా బయట పడాలో తెలియడం లేదు. ఆర్థిక వ్యవస్థను మళ్లీ ఉత్తేజపరచడానికి కొత్త పెట్టుబడులు ఇబ్బడి ముబ్భడిగా రావాలి. కానీ ప్రభుత్వం వాటిని ఆకర్షించలేక పోతోంది. 2004–14 మధ్య మన ఎకానమీ అసాధారణ వృద్ధి సాధించింది. తర్వాత ఆ ఊపు కనబడటం లేదు. యూపీఏ పాలన సాగిన పదేళ్లలో సాధించిన ప్రగతికి 7.7 శాతం సగటు వృద్ధి రేటే నిదర్శనం. గడచిన పదేళ్లలో ఈ సగటు అంతకంటే తక్కువగా 6.2 గానే నమోదైంది.ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవు!అయితే, యూపీఏ హయాం చివరి రెండేళ్లలో ఎకానమీ మంద గించింది. పెట్టుబడుల వ్యయం (క్యాపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌ – క్యాపెక్స్‌) భారీగా క్షీణించడం ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొ నాలి. దురదృష్టవశాత్తూ అదే ట్రెండ్‌ ఎన్డీయే హయాంలోనూ కొన సాగుతోంది. భారత ఆర్థిక వృద్ధి నేటికీ చాలావరకు ప్రభుత్వ పెట్టు బడి మీదే ఆ«ధారపడుతోంది. పెట్టుబడులు ఎందుకు పడిపోతు న్నాయి? ప్రభుత్వం దగ్గర కాసులు లేవు. యూపీఏ పాలన నాటి అధిక సబ్సిడీలను ఎన్డీయే ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది. దీనికి తోడు, ఏడో వేతన సంఘం సిఫారసులు అమలు వల్ల వేతనాలు 23 శాతం (రూ. లక్ష కోట్లు) పెరిగాయి. తనకు ముందు సంవత్సరాల మందగమనాన్నుంచి ఎకానమీని గట్టెక్కించి పరుగులు తీయిస్తానని మోదీ హామీ ఇచ్చారు. ప్రభుత్వ పెట్టుబడులను గణనీయంగా పెంచుతానన్నారు. 100 కొత్త సిటీలు, హైస్పీడ్‌ రైళ్ల నేషనల్‌ నెట్‌వర్క్, దేశ వ్యాప్త నదుల అనుసంధానం, ఇంకా ఇలాంటి పలు భారీ ప్రాజెక్టులు చేపట్టబోతున్నట్టు వాగ్దానం చేశారు. 100 కొత్త నగరాల నిర్మాణం కాస్తా 100 స్మార్ట్‌ సిటీలకు పరిమితమైంది.స్మార్ట్‌ సిటీలంటే ఉచిత వైఫై నెట్‌వర్కులు ఏర్పాటు చేయడమే. ఇక దేశవ్యాప్త హైస్పీడ్‌ రైళ్ల నెట్‌వర్క్‌ కాస్తా అహ్మదాబాద్‌ – ముంబాయి బుల్లెట్‌ ట్రెయిన్‌గా రూపాంతరం చెందింది. అది కూడా ఆర్థికంగా ఓ గుదిబండ అయ్యేట్లుంది. ఇతర వాగ్దానాలు సైతం ‘ప్రతి భారతీయుడి ఖాతాలో 15 లక్షల రూపాయల జమ’ లాంటి జుమ్లాల జాబితాలో చేరాయి. దెబ్బ మీద దెబ్బఆ తర్వాత రెండు అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిలో ఒకటైన పెద్దనోట్ల రద్దు (డీమానిటైజేషన్‌) చర్య అసంఘటిత రంగపు దినసరి వేతన జీవులను చావుదెబ్బ తీసింది. దేశ జీడీపీలో 40 శాతం ఈ రంగం నుంచే సమకూరుతుంది. ఉపాధి పరంగా చూసినా, మొత్తం 45 కోట్ల మందిలో 90 శాతం మంది ఈ రంగం నుంచే ఉపాధి పొందుతున్నారు. రెండో చర్య జీఎస్టీ తొందరపాటు అమలు. ఈ రెండు చర్యల వల్ల కచ్చితంగా ఎంత మంది ఉపాధి కోల్పోయారో ఇప్పటికీ గణాంకాలు లభ్యం కావడం లేదు. అంచ నాలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. ముఖ్యంగా నిర్మాణ రంగం, ఫుడ్, రిటెయిల్‌ రంగాల్లో ఉపాధి నష్టం భారీగా జరిగింది. ఈ నిర్ణ యాలు 2–3 కోట్ల మంది పొట్ట గొట్టి ఉంటాయని అంచనా. సరైన ఆలోచన లేకుండా జీఎస్టీని తొందరపడి అమలు చేయడం వల్ల ఉత్పత్తిపై ప్రభావం పడింది. తుది గడువు తక్కువగా ఉండటంతో డీలర్లు స్టాక్స్‌ తగ్గించుకున్నారు. దాంతో కంపెనీలు ఉత్పత్తి తగ్గించాయి. జీఎస్టీ ఇన్‌పుట్, ఔట్‌పుట్‌ రేట్లు పొంతన లేకుండాఉండటం వల్ల గందరగోళం మరింత పెరిగింది. మొదటి నెల రూ. 95 వేల కోట్ల వసూళ్లు ఉన్నా, అందులో రూ. 65 వేల కోట్లు తర్వాత రీఫండ్‌ చేయాల్సి వచ్చింది. కానీ అన్ని నిధులు ప్రభుత్వం వద్ద లేవు. దాదాపు రూ. 50 వేల కోట్ల వ్యయానికి నిధులు సమకూర్చు కునేందుకు వీలుగా జీడీపీలో 3.2 శాతం మించకూడదన్న ద్రవ్య లోటు లక్ష్యాన్ని సడలించుకోవలసి వచ్చింది. ఈ స్వయంకృత అపరా ధాలకు కోవిడ్‌ వైపరీత్యం తోడైంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. వినియోగం తగ్గింది. దాంతో ఉత్పత్తి తగ్గింది. ఫలితంగా వినియోగం మరింత తగ్గింది. ఈ విషవలయం నుంచి ఆర్థిక వ్యవస్థను తిరిగి ఒడ్డున పడేయాలంటే, ప్రభుత్వ వ్యయాలు భారీగా పెరగాలి. తద్వారా ప్రజల చేతికి డబ్బు వస్తుంది. తిరిగి వినియోగం, ఉత్పత్తి పెరుగుతాయి. ప్రభుత్వం సబ్సిడీలను అర్థవంతంగా తగ్గిస్తే తప్ప పెట్టుబడి వ్యయం పెంచలేదు. రాజకీయంగా ఇది సాధ్యం కానిది. కానీ ఎలాగైనా పెట్టుబడులు పెంచాలి. వాస్తవికతను విస్మరించకుండానే సృజనాత్మక ప్రణాళికలు రూపొందించుకోవాలి. పెట్టుబ డులు పెంచాలి. తద్వారా వినియోగం పెరగాలి. ఈ పెట్టుబడుల ప్రణాళిక కోసం నిధులు అవసరం. ఈ డబ్బు సమ కూర్చుకోడానికి మోదీ అటూ ఇటూ పరుగులు తీయాల్సిన పని లేదు. డబ్బే డబ్బు!ప్రభుత్వం డబ్బు పాతర మీద కూర్చుని ఉంది. దశాబ్దాలుగా పోగుపడిన విదేశీ మారక ద్రవ్య నిల్వలు (ఇందులో అమెరికాబ్యాంకుల్లో మూలుగుతున్నవి 135 బిలియన్‌ డాలర్లు) కొండంతఅండగా కలిసి వస్తాయి. ఈ రిజర్వులు మన విదేశీ రుణాల్లో(736 బిలియన్‌ డాలర్లు) సుమారు 95 శాతానికి సమానం. ఫారెక్స్‌ రిజర్వుల్లో నాలుగో వంతు హాట్‌ మనీ (అంటే ఎన్‌ఆర్‌ఐ ఇన్వెస్టర్లు, విదేశీ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థల స్వల్ప కాలిక పెట్టుబడులు) ఉపసంహ రణల కోసం పక్కన పెట్టినా, మన దగ్గర ఇంకా చాలా డబ్బు చేతిలోఉంటుంది. ఇందులో ఎంత వాడుకోగలమన్నది ఇప్పుడు ఆలోచించాలి. కౌశిక్‌ బసు (ప్రపంచ బ్యాంకు మాజీ ప్రధాన ఆర్థికవేత్త) ప్రకారం, విదేశీ మారక ద్రవ్య నిల్వలు మన కరెంట్‌ అకౌంట్‌ డెఫిసిట్‌ (సిఏడీ)కి సరిపడా ఉంటే చాలు. (ప్రస్తుత కరెంట్‌ ఖాతా లోటు 11 బిలియన్‌ డాలర్లు – వస్తుసేవల ఎగుమతులు, విదేశీ పెట్టుబడుల మీద వచ్చే ఆదాయం కంటే దిగుమతులకు చేసే చెల్లింపులు, విదేశీ పెట్టుబడుల మీద వెనక్కు పోయే ఆదాయం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ వ్యత్యాసాన్ని కరెంటు ఖాతా లోటు అంటారు). సింపుల్‌గా చెప్పాలంటే, కనీసం 6 నెలల దిగుమతులకు సరి పడా మారక ద్రవ్యం నిల్వ పెట్టుకుంటే చాలని ‘వాషింగ్టన్‌ కన్సెన్సస్‌’ నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా దేశీయ వినియోగదారుల కోసం తాము ఎందుకు చౌకగా నిధులు సమకూర్చాలన్న భావనతో చైనా తన విదేశీ మారక ద్రవ్య నిల్వలను ఒక ట్రిలియన్‌ డాలర్లు తగ్గించుకుంది. మనం కూడా దాన్ని 100 బిలియన్‌ డాలర్లకు తగ్గించుకునే యోచన చేయాలి. ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ నెలకొల్పి, దానిలోకి అదనపు ఫారెక్స్‌ రిజర్వులను కొంచెంకొంచెంగా తరలిస్తూ పోవాలి. ఇది ఇండియాలో పెట్టుబడి పెట్టేఇండియా సావరిన్‌ ఫండ్‌ అవుతుంది. దీని ద్వారా పెట్టుబడులు సమ కూర్చుకునే సంస్థలు తమకు అవసరమైన వాటిని దేశీయంగా సమ కూర్చుకోవాలన్న నిబంధన పెట్టాలి. తద్వారా ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ నినాదం ఆచరణలోకి వస్తుంది. పెట్టుబడులు ఊపందుకుని ఆర్థిక వ్యవస్థ ఒడ్డున పడేందుకు ఇదొక అత్యుత్తమ మార్గం.-వ్యాసకర్త విధాన నిర్ణయాల విశ్లేషకుడు, రచయితmohanguru@gmail.com-మోహన్‌గురుస్వామి

Shocking incident in Gurugram Haryana7
ఘోరం... ఇది దారుణం!

‘గర్భ’ గుడిలో జీవం పోసుకోవటంతో మొదలై కడదాకా అడుగడుగునా వివక్ష ఎదుర్కొంటున్న ఆడపిల్లకు మృత్యువు తరచు తారసపడుతుంటుంది. అది పుట్టినిల్లా, మెట్టినిల్లా, నడివీధా, జనసమ్మర్ధం లేని ప్రాంతమా అనే తారతమ్యం లేదు. హంతకులు ఏ రూపంలో వుంటారో, ఎక్కడ కాపుగాస్తారో తెలియదు. తండ్రా, సోదరుడా, కట్టుకున్నవాడా, అపరిచితుడా అనే తేడా కూడా లేదు. ఉసురు తీసేవాడు ఎవడైనా కావొచ్చు. కారణం ఏదైనా ఉండొచ్చు. హరియాణాలోని గురుగ్రామ్‌లో కన్నతండ్రే కాలయముడై నిష్కారణంగా తన కంటిపాపను చిదిమేసిన ఈ ఉదంతం దిగ్భ్రాంతికరమైనది. తండ్రి దీపక్‌ యాదవ్‌ తుపాకి గుళ్లకు బలైపోయిన టెన్నిస్‌ క్రీడాకారిణి రాధికా యాదవ్‌ చేసిన ‘నేరం’ ఏమీ లేదు. చిన్న వయసులోనే ఆ క్రీడలో రాణించి, ప్రతిభా పాటవాలు సొంతం చేసుకుని, అంచెలంచెలుగా ఎదగటమే ఆమె నేరం. కేవలం ఇరవై అయిదేళ్లకే రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఇంటర్నేషనల్‌ టెన్నిస్‌ ఫెడరేషన్‌ సర్క్యూట్‌లో ఆమె ర్యాంకు 113. ఆ విధంగా అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణిగా కూడా నిరూపించుకుంది. సొంతంగా టెన్నిస్‌ అకాడెమీ నెలకొల్పింది. తన వంటి బాలికలకు శిక్షణనిస్తున్నది. వారు ఎదగటానికి ఆసరాగా నిలు స్తున్నది. అటువంటి రాధిక, కన్నతండ్రికి కంట్లో నలుసుగా మారిందంటే నమ్మగలమా? ఆమెను కాల్చిచంపటం తప్ప మరో దారిలేదని విశ్వసించాడంటే ఊహించగలమా? యువతరంలో చాలా మందికి ఆ వయసుకల్లా ఏం ఎంచుకోవాలో, ఎటుపోవాలో తెలియని అయోమయం ఆవరిస్తుంది. సంకోచం వెనక్కు లాగుతుంది. కింకర్తవ్య విమూఢత కాటేస్తుంది. ఆశించిన ఉద్యోగం అందక, ఇష్టంలేని కొలువుతో సరిపడక నిస్పృహలో కూరుకుపోతారు. కానీ రాధిక అలా కాదు. టెన్నిస్‌ రంగంలో ఎదిగి ఒక సానియా మీర్జాలా, ఒక సెరెనా విలియమ్స్‌లా మెరిసిపోవాలనుకుంది. ఇప్ప టికే రాష్ట్ర స్థాయిలో సత్తా చాటి ఎన్నో అవార్డులూ, రివార్డులూ సాధించింది. జాతీయ స్థాయి టెన్ని స్‌లో సైతం స్థానం సంపాదించుకోవాలని తపన పడుతోంది. కన్నవారికే కాదు... దేశానికే పేరు ప్రఖ్యాతులు తీసుకురాగలదన్న భరోసానిచ్చింది. ఇవన్నీ ఆమె తండ్రి దృష్టిలో నేరాలయ్యాయి. రాధికా యాదవ్‌ ఉదంతం మనందరం నమ్ముతున్న విలువల్ని ప్రశ్నార్థకం చేస్తోంది. చిన్ననాటి నుంచీ టెన్నిస్‌లో ఆమెను వెన్నుతట్టి ప్రోత్సహించినవాడే హఠాత్తుగా ఎలా హంతకుడయ్యాడు? మెచ్చిన నోటితోనే దుర్భాషలాడే స్థితికి అతగాడు చేరటం వెనకున్న పరిణామాలెలాంటివి? పోలీ సులకిచ్చిన వాంగ్మూలంలో అతను ప్రస్తావించిన అంశాలు వింటే ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్న మన సమాజం నిజస్వరూపం బట్టబయలవుతుంది. అంతా సవ్యంగా వుందని ఆత్మవంచనతో బతికేవారిని నిలదీస్తుంది. అందరూ దీపక్‌లాగే స్పందించక పోవచ్చుగానీ ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రుల్లో చాలామందికి కన్నకూతురు గురించి నలుగురూ నాలుగు రకాలుగా మాట్లాడటం, ఆమెను చిన్నచూపు చూడటం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం కనబడుతూనే వుంటుంది. ఇలాంటి దుర్మార్గ ధోరణులను ప్రతిఘటించాల్సిన దీపక్‌ యాదవ్‌ తానూ ఆ తానులో ముక్కయ్యాడు. వారు ప్రవచిస్తున్న విలువల పరిధిలో, పరిమితిలో వుండకుండా కుటుంబాన్ని రాధిక వీధిన పడేస్తున్నదని అపోహపడ్డాడు. టెన్నిస్‌ క్రీడ గురించీ, తానిస్తున్న శిక్షణలో పాటించే ప్రమాణాల గురించీ ఆమె చేసిన వీడియోపై వచ్చిన కామెంట్లు తట్టుకోలేక సోషల్‌ మీడియా ఖాతాను అప్పటికే తీయించేశాడు. అకాడెమీని సైతం మూసేయాలన్న సలహా కూడా పాటించాలని కోరుకున్నాడు. దాన్ని తిర స్కరించిందన్న ఉన్మాదంతో మానవత్వాన్ని మరిచాడు. కూతురి సంపాదనపై బతుకుతున్నావని ఛీత్కరించిన మృగాల్లో కనీసం ఒక్కరికి తన లైసెన్స్‌ రివాల్వర్‌ను గురిపెట్టివుంటే ఆ బాపతు నోళ్లు మూతబడేవి. స్వయంశక్తితో ఎదుగుతున్న కన్నకూతురి కోసం దృఢంగా నిలబడిన ఒక మంచి నాన్నగా నిలిచేవాడు. ఏమైంది ఇవాళ? యుక్తాయుక్త విచక్షణ కోల్పోయి హంతకుడిగా మిగిలాడు! ఆడపిల్లను పెంచటం, ఆమె అభీష్టానికి అనుగుణంగా ఎదగనివ్వటం, ఇష్టపడిన చదువు చది వించటం, కోరుకున్న వాడికిచ్చి పెళ్లిచేయటం వర్తమానంలో పెను సవాలుగా మారిందన్నది వాస్తవం. తల్లిదండ్రులు విద్యావంతులైనా, ఉన్నతోద్యోగాలు చేస్తున్నా, సమాజం పెట్టిన ప్రమాణా లను ఆడపిల్ల మీరితే ఎలా అన్న విచికిత్సలో పడుతున్నవారు చాలామందే తారసపడతారు. వారిలో అనేకులు చుట్టూవున్నవారి ఒత్తిళ్లకు లొంగి ఇంటి ఆడపిల్లను అదుపు చేయటానికి ప్రయ త్నించేవారే. ఆ క్రమంలో అనేకమంది పిల్లలు తమ ఇష్టాలను వదులుకుని బతుకులు వెళ్లదీస్తు న్నారు. అసలు బయటికెళ్లిన ఆడపిల్ల సురక్షితంగా ఇంటికొస్తుందో లేదో తెలియని ఆందోళనతో నిత్యం భయంభయంగా బతుకుతున్న తల్లిదండ్రులకు మేమున్నామంటూ భరోసానిచ్చే వ్యవస్థలు న్నాయా? సామాజిక కట్టుబాట్ల పేరుతో రూపొందుతున్న తప్పుడు విలువలు ఇళ్లల్లోకి చొరబడకుండా, వాటి దుష్ప్రభావాలు కుటుంబాలపై పడకుండా నివారించే సంస్కృతి ఆచూకీ ఏది? మన ప్రభుత్వాలు తీసుకుంటున్న కనీస చర్యలేమిటి?ఆడవాళ్లను కించపరిచే సినిమాలనూ, ఇతరేతర మాధ్యమాలనూ ఏ మేరకు కట్టడి చేయగలుగుతున్నాం? ఎటువంటి వివక్షకూ తావు లేకుండా దేశ పౌరులందరికీ సమాన అవకాశాలు లభించాలన్న మన రాజ్యాంగం సక్రమంగా అమలవు తున్నదా? ఇవన్నీ సరిగా లేనప్పుడు దీపక్‌లాంటివారు రూపొందుతారు. వారికి నారూ నీరూ పోస్తున్నవారు ఎప్పటికీ పదిలంగా వుంటారు. రాధికా యాదవ్‌ వంటి మణిపూసలు నిస్సహాయంగా నేల రాలుతారు.

Luxury Home Sales Down in Hyderabad8
హైదరాబాద్‌లో తగ్గిన లగ్జరీ ఇళ్ల విక్రయాలు 

న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలు ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఢీలాపడ్డాయి. మొత్తం రూ.1,025 యూనిట్ల విక్రయాలు (రూ.5 కోట్లు అంతకు మించిన ధర) నమోదయ్యాయి. క్రితం ఏడాది తొలి ఆరు నెలల్లో అమ్మకాలు 1,140 యూనిట్లుగా ఉండడం గమనార్హం. ఢిల్లీ ఎన్‌సీఆర్‌ మార్కెట్లో మాత్రం విలాసవంతమైన గృహ విక్రయాలు (రూ.6 కోట్లు, అంతకుమించి) మూడింతలు పెరిగి 3,960 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు 1,280 యూనిట్లుగా ఉండడం గమనార్హం. సీబీఆర్‌ఈ, అసోచామ్‌ సంయుక్త నివేదిక ఈ వివరాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా టాప్‌–7 నగరాల్లో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు జనవరి–జూన్‌ మధ్య కాలంలో అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 85 శాతం పెరిగి 6,950 యూనిట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది తొలి ఆరు నెలల్లో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు 3,750 యూనిట్లుగా ఉన్నాయి. → బెంగళూరులో లగ్జరీ ఇళ్ల విక్రయాలు 200 యూనిట్లకు చేరాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 80 యూనిట్లుగానే ఉన్నాయి. → చెన్నైలోనూ మూడు రెట్లు పెరిగి 220 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 65 యూనిట్లుగా ఉన్నాయి. → పుణెలో అమ్మకాలు 120 యూనిట్లకు తగ్గాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో లగ్జరీ ఇళ్ల విక్రయాలు 160 యూనిట్లుగా ఉన్నాయి. → కోల్‌కతాలో అమ్మకాలు రెట్టింపై 190 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 70 యూనిట్లుగానే ఉండడం గమనార్హం. → ముంబైలో 1,240 యూనిట్ల లగ్జరీ ఇళ్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 950 యూనిట్లుగా ఉన్నాయి. → పుణె, చెన్నై, కోల్‌కతా నగరాల్లో రూ.4కోట్లు అంతకుమించిన విలువైన ఇళ్లను లగ్జరీ ఇళ్ల కింద పరిగణనలోకి తీసుకున్నారు. బెంగళూరులో రూ.5 కోట్లు అంతకుమించిన ధరల శ్రేణిని లగ్జరీ ఇళ్ల కింద ఈ నివేదిక పరిగణించింది. స్థిరమైన డిమాండ్‌.. ‘‘దేశ ఇళ్ల మార్కెట్‌ వ్యూహాత్మక స్థిరమైన దశలోకి ప్రవేశించింది. స్థూల ఆర్థిక అంశాలు బలంగా ఉన్నాయి. లగ్జరీ, ప్రీమియం ఇళ్ల మా ర్కెట్‌లో స్థిరమైన వృద్ధి అన్నది వినియోగదారుల విశ్వాసం పెరుగుదలను జీవనశైలి ఆకాంక్షలను సూచిస్తోంది’’అని సీబీఆర్‌ఈ ఇండియా ఎండీ (భూమి) గౌరవ్‌ కుమార్‌ తెలపారు. డెవలపర్లు నాణ్యత, పారదర్శకత, ఈ రంగం తదుపరి దశకు ఇవి కీలకంగా పనిచేస్తాయన్నారు. హౌసింగ్‌ బూమ్‌కు అనుగుణంగా సులభతర అనుమతులు, పట్టణాల్లో అందుబాటు ధరల ఇళ్లను ప్రోత్సహించేలా విధానపరమైన సంస్కరణలు అవసరమని అసోచామ్‌ సెక్రటరీ జనరల్‌ మనీష్‌ సింఘాల్‌ ఈ నివేదిక విడుదల సందర్భంగా సూచించారు.

New World screwworm disease is an infestation cases in usa9
అమెరికాను హడలెత్తిస్తున్న ఈగ

న్యూ వరల్డ్‌ స్క్రూవార్మ్‌.. అగ్రరాజ్యం అమెరికాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఈగ. ముఖ్యంగా పాడి రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్న ఈ ఎగిరే జీవుల సంతతిని నియంత్రించడానికి ఏకంగా ప్రభుత్వమే రంగంలోకి దిగింది. ఆడ ఈగల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీయడానికి స్టెరిలైజ్‌ చేసిన మగ ఈగలను వదలడానికి ఏర్పాట్లు చేస్తోంది. న్యూ వరల్డ్‌ స్క్రూవార్మ్‌ను సైన్స్‌ పరిభాషలో కొష్లియోమియా హొమినివోరక్స్‌ అంటారు. ఇవి ప్రధానంగా పరాన్న జీవులు. అంటే ఆవులు, గేదెలు, గుర్రాలు, గొర్రెల వంటి జంతువులపై ఆవాసం ఏర్పర్చుకుంటాయి. వాటి శరీరంపై గాయాలు చేసి, మాంసాన్ని భక్షిస్తాయి. దాంతో ఆయా జంతువులకు ప్రాణాపాయం సంభవిస్తుంది. అమెరికాతోపాటు దక్షిణ అమెరికా దేశాల్లో ఈగలు పెద్ద సమస్యగా మారిపోయాయి. 2023 నుంచి సెంట్రల్‌ అమెరికాలో వీటి వ్యాప్తి పెరిగిపోయింది. పనామా, కోస్టారికా, నికరాగ్వా, హోండూరస్, గ్యాటెమాలా, ఎల్‌సాల్వెడార్‌ తదితర దేశాల్లో ఎన్నో కేసులు నమోదయ్యాయి. ఈగలు గత ఏడాది దక్షిణ మెక్సికోకు చేరుకున్నాయి. అటునుంచి అమెరికా దక్షిణ సరిహద్దు ప్రాంతాలకు వ్యాప్తి చెందాయి. వీటి దెబ్బకు అమెరికా–మెక్సికో సరిహద్దుల్లో పశువుల వ్యాపార కేంద్రాలు మూసివేయాల్సి వచ్చింది. మెక్సికో నుంచి పశువుల దిగుమతి నిలిపివేశారు. పాలు ఇచ్చే ఆవులు, గేదెలు మరణిస్తుండడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. 2023 నుంచి ఇప్పటివరకు 35,000 న్యూవరల్డ్‌ స్క్రూవార్మ్‌ ఇన్ఫెక్షన్‌ కేసులు నమోదయ్యాయి. నమోదు కానివి మరెన్నో ఉన్నాయి. ఎలా నియంత్రిస్తారు? స్క్రూవార్మ్‌ ఈగలను అరికట్టడానికి పెద్ద తతంగమే ఉంటుంది. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అన్నట్లుగా ఈగలను ఈగలతోనే నియంత్రిస్తారు. మగ ఈగలను సేకరించి, ప్రయోగశాలలో స్టెరిలైజ్‌ చేస్తారు. ఇలాంటి కోట్లాది మగ ఈగలను హెలికాప్టర్ల ద్వారా ప్రభావిత ప్రాంతాల్లో వదులుతారు. ఇవి ఆడ ఈగలతో జతకడతాయి. దాంతో ఆడ ఈగల్లో సంతానోత్పత్తి సామర్థ్యం క్షీణిస్తుంది. అవి గుడ్లు పెట్టలేవు. ఫలితంగా సంతానోత్పత్తి తగ్గిపోతోంది. కొన్ని దశాబ్దాలుగా ఇదే వ్యూహం అమలు చేస్తున్నారు. అయితే, అమెరికాలో స్టెరిలైజేషన్‌ కేంద్రం ప్రస్తుతం ఒక్కటే ఉన్నట్లు తెలుస్తోంది. మరికొన్ని కేంద్రాలు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని అమెరికా చట్టసభ సభ్యులు జూన్‌ 17న ప్రభుత్వానికి లేఖ రాశారు. అమెరికా వ్యవసాయ శాఖ వెంటనే స్పందించింది. ‘ఫ్లై ఫ్యాక్టరీ’ ప్రారంభిస్తామని ప్రకటించింది. టెక్సాస్‌–మెక్సికో సరిహద్దుల్లో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిసింది. పశువుల రక్తమాంసాలు రుచి మరిగిన ప్రాణాంతక ఈగలను అంతం చేయడం చెప్పినంత సులువు కాదు. ఇది చాలా వ్యయప్రయాసలతో కూడిన ప్రక్రియ. మెక్సికోలో ఈగల లార్వాల ఉనికిని గుర్తించడానికి జాగిలాలు ఉపయోగిస్తున్నారు. ఇవి వాసన ద్వారా లార్వాలను పసిగడతాయి. ఇందుకోసం జాగిలాలకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. మనుషులకు ముప్పు స్వల్పమే పూర్తిగా ఎదిగిన స్క్రూవార్మ్‌ పశువులపై గాయాలున్న చోట వందల సంఖ్యలో గుడ్లు పెడుతుంది. గుడ్ల నుంచి బయటకు వచ్చిన లార్వాలు అక్కడే మాంసం తింటూ ఎదుగుతాయి. పశువుల పుండే వాటికి ఆవాసం. రెక్కలొచ్చిన తర్వాత ఎగిరిపోతాయి. మరో పశువుపై వాలి సంతతిని వృద్ధి చేస్తాయి. అమెరికాలో ఇలాంటి ఈగల బెడద ఇదే మొదటిసారి కాదు. 1960, 1970వ దశకంలో విపరీతంగా బాధించాయి. అప్పట్లో పాడి పరిశ్రమకు భారీగా నష్టం వాటిల్లింది. మగ ఈగల ద్వారా అతికష్టంమీద, ఎంతో ఖర్చుతో వీటిని నియంత్రించగలిగారు. స్క్రూవార్స్మ్‌ మృత పశువుల కంటే బతికి ఉన్న పశువులపై ఉండడానికే ఇష్టపడతాయి. ఇంట్లో పెంచుకొనే శునకాలు, పిల్లులకు కూడా ఇవి వ్యాప్తి చెందుతాయి. మనుషులకు కూడా ముప్పు ఉన్నప్పటికీ అది చాలా స్వల్పమే. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Unfavorable weather in India10
గతి తప్పిన వాతావరణం

న్యూఢిల్లీ: దేశంలో సాధారణం కంటే భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత నెలలో ఈ పరిణామం స్పష్టంగా కనిపించినట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. చల్లగా ఉండే హిమాలయ ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా, వేడిగా ఉండే మధ్య భారతదేశంలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గత 30 ఏళ్ల సగటు ఉష్ణోగ్రతలను పరిగణనలోకి తీసుకొని, ఈ అంశం నిగ్గుతేల్చారు. ‘వాటర్‌ టవర్‌ ఆఫ్‌ ఆసియా’గా భావించే హిమాలయాలు వేగంగా వేడెక్కుతున్నాయి. హిమానీనదాలు కరిగిపోతున్నాయి. మంచు చరియలు విరిగిపడుతున్నాయి. మొత్తంగా వాతావరణమే గతి తప్పుతోంది. ఎడారి రాష్ట్రమైన రాజస్తాన్‌ రాజధాని జైపూర్‌లో గత నెలలో 30 ఏళ్ల సగటు ఉష్ణోగ్రత కంటే 2 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యింది. అలాగే 78 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం రికార్డయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలోనూ సాధారణం కంటే 1.3 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత నమోదు కాగా, 36 మిల్లీమీటర్ల అధిక వర్షం కురిసింది. హిమాలయాల్లో భాగమైన సిమ్లాలో 0.6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత, 186 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం నమోదయ్యాయి. జమ్మూకశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఇక్కడ ఏకంగా 2.6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత, 55 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం రికార్డు కావడం గమనార్హం. ఎందుకీ పరిస్థితి? వాతావరణం గతి తప్పడానికి కాలుష్యం, వాతావరణ మార్పులే ప్రధాన కారణం అని చెప్పొచ్చు. హిమాలయాలు వేగంగా కరిగిపోతే దిగువ ప్రాంతాలకు పెనుముప్పు తప్పదు. వరదలు ముంచెత్తుతాయి. ఆస్తి నష్టం, ప్రాణనష్టం సంభవిస్తుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ ఈ ముప్పు కూడా అదే స్థాయిలో పెరిగిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హిమాలయాలు, టిబెట్‌ పీఠభూమిలో అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. 2015 నుంచి 2024 దాకా హిమాలయాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలే రికార్డయ్యాయి. 2016 నుంచి ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. 2024లో 19.99 డిగ్రీల వార్షిక సగటు ఉష్ణోగ్రత నమోదు కాగా, ఇది సాధారణం కంటే 0.77 డిగ్రీలు అధికం. ప్రపంచ బ్యాంక్‌ నివేదిక ప్రకారం చూస్తే.. 1901 నుంచి 2020 దాకా ఇండియాలో సగటు ఉష్ణోగ్రత 0.62 డిగ్రీలు పెరిగింది. గరిష్ట ఉష్ణోగ్రత 0.99 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 0.24 డిగ్రీలు పెరిగాయి. అడవులను నరికివేయడం, పట్టణీకరణ, శిలాజ ఇంధనాల వాడకం ఇలాగే పెరిగిపోతే రానున్న రోజుల్లో పరిస్థితి మరింత భయానకంగా మారుతుందనడంలో సందేహం లేదు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement