Business
-
హైదరాబాద్‌లో ప్రాపర్టీ కొంటున్నారా?
సాక్షి, సిటీబ్యూరో: రాజధాని చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్ఆర్) హద్దుగా జలవనరులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) పేరు చెబితే ఇప్పుడు అందరూ ఉలిక్కిపడుతున్నారు. ఈ ప్రత్యేక విభాగం ఆపరేషన్స్ నేపథ్యంలో స్థిరాస్తి క్రయవిక్రయాలకు సంబంధించి సామాన్యుల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని కొన్ని విభాగాలతో పాటు కొందరు వ్యక్తులూ రెచ్చిపోతున్నారు. ఓ పక్క నోటీసులు, మరోపక్క బెదిరింపులతో తమ ‘పని’ పూర్తి చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ అంశాలను ‘సాక్షి’.. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ దృష్టికి తీసుకువెళ్లింది. వివరాలు ఆయన మాటల్లోనే.. అక్రమ నిర్మాణం అయినప్పటికీ ఇప్పటికే ప్రజలు నివసిస్తుంటే ఆ జనావాసాల జోలికి హైడ్రా వెళ్లదు. జలవనరుల పరిరక్షణలో భాగంగా కొత్తగా నిర్మిస్తున్న వాటిపైనే చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం సామాన్యుడికి అండగా నిలవాలనే స్పష్టం చేస్తోంది. ఎవరైనా ప్లాట్, ఫ్లాట్ ఖరీదు చేసుకునే ముందు దానికి సంబంధించిన వివరాలు సరిచూసుకోండి. నగరంలోని అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం కుంట, చెరువు కనిపించకపోయినప్పటికీ ఒకప్పుడు అక్కడ ఉండొచ్చు. ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం అక్కడ జలవనరు ఉన్నట్లు రికార్డు ఉంటుంది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న పట్టాభూములు సైతం కేవలం వ్యవసాయం చేసుకోవడానికి ఉద్దేశించినవి. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు, ఈ భూములు క్రయవిక్రయాలు చేయకూడదు.రాజధానిలోని భూములకు సంబంధించిన సమగ్ర వివరాలు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌కి (ఎన్ఆర్ఎస్సీ) ఆధీనంలోని భువన్, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ధరణి వెబ్సైట్లలో, జలవనరులకు సంబంధించిన వివరాలు హెచ్ఎండీఏ లేక్స్ వెబ్‌సైట్స్‌లో ఉంటాయి. వీటితో పాటు రెవెన్యూ రికార్డులను సైతం సరిచూసుకున్న తర్వాతే క్రయవిక్రయాల విషయంలో ముందుకు వెళ్లాలి. రాజధానిలో ఎక్కడైనా స్థిరాస్తి కొనుగోలు చేసేప్పుడు మరికొన్ని అంశాలనూ సరిచూసుకోండి. ఆ నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా? అవి ఇవ్వాల్సిన విభాగాలే ఇచ్చినవి సక్రమ అనుమతులేనా? ఆ అనుమతుల్ని రద్దు చేయడం వంటివి జరిగాయా? కోర్టు వివాదాలు ఉన్నాయా? అనేవి చూసుకోండి. కొన్ని నిర్మాణాలకు హెచ్ఎండీఏకు బదులు పంచాయితీ సెక్రటరీ, ఆర్ఐలు అనుమతులు మంజూరు చేసిన ఉదంతాలు ఉన్నాయి. లేఅవుట్లలో ఉన్న కామన్ ఏరియాలు, పార్కులు, రహదారులు సైతం కాలక్రమంలో ఆక్రమణలకు గురవుతున్నాయి. కేవలం రికార్డుల్లో మాత్రమే ఇవి ఉంటూ.. వాస్తవంలో కనుమరుగు అవుతున్నాయి. ఈ విషయాన్ని హైడ్రా సీరియస్‌గా తీసుకుంటోంది. ఇలా ఆక్రమణలకు గురైన వాటినీ పునరుద్ధరిస్తుంది. వీటిని పరిరక్షించడం కోసం నిర్దిష్ట విధానాన్ని రూపొందించింది. -
ట్రంప్ గెలుపుతో మస్క్ పంట పండింది!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో టెస్లా అధినేత ఇలాన్ మస్క్‌కు సిరుల పంట పండుతోంది. ట్రంప్ విజయం తర్వాత టెస్లా స్టాక్ ఏకంగా 40 శాతం పెరిగింది. దాంతో మస్క్ సంపద ఏకంగా 70 బిలియన్ డాలర్లు(రూ.5.8 లక్షల కోట్లు) పెరిగి నికరంగా సుమారు 340 బిలియన్ అమెరికన్ డాలర్ల(రూ.28 లక్షల కోట్లు) మార్కును దాటినట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది.యూఎస్ ఎన్నికల నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్‌నకు మస్క్ మద్దతిచ్చారు. దాంతోపాటు ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ పార్టీకి మస్క్ భారీగానే విరాళాలు అందించారని కొన్ని సంస్థలు వెల్లడించాయి. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇలాన్ మస్క్‌కు సముచిత స్థానాన్ని కల్పిస్తానని చెప్పారు. ఇటీవల ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించాక అనుకున్న విధంగానే ట్రంప్ కార్యవర్గంలో మస్క్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) సంయుక్త సారథులుగా మస్క్, వివేక్ రామస్వామిలను నియమించారు.ఇదీ చదవండి: ‘ఆరోగ్య నిధి’ ప్రాధాన్యం తెలుసా?డొనాల్డ్ ట్రంప్‌తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండబట్టే మస్క్ సంపద అధికమవుతున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ట్రంప్ భవిష్యత్తులో తీసుకోబోయే కార్పొరేట్ నిర్ణయాల వల్ల మాస్క్‌కు లాభం చేకూరుతుందని, దాంతో కంపెనీకి మేలు కలుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా మస్క్ కంపెనీల్లో భారీగా పెట్టుబడి పెడుతున్నారు. దాంతో ఆయన సంపద పెరుగుతోంది. -
థీమ్..హోమ్! ఇళ్ల నిర్మాణంలో సరికొత్త ట్రెండ్
సాక్షి, సిటీబ్యూరో: మార్పు అనివార్యం.. జీవనశైలిలోనైనా, నిర్మాణ శైలిలోనైనా.. కాలానుగుణంగా అభిరుచులను, అవసరాలను తీర్చే వాటికి ఎవరైనా జై కొడతారు. వినూత్న నిర్మాణ శైలి, విలాసవంతం, ఆధునికత నగర గృహ నిర్మాణ రంగంలో ఇప్పుడిదే ట్రెండ్ కొనసాగుతోంది. లగ్జరీ వసతులు, ఇంటీరియర్ మాత్రమే కాదు డిజైనింగ్, ఆర్కిటెక్చర్ నుంచే ప్రత్యేకత కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే థీమ్ బేస్డ్ హోమ్స్ ట్రెండ్‌గా మారిపోయాయి.థీమ్ ఆధారిత నిర్మాణాలు కొత్తదేమీ కాదు. పురాతన కాలంలో రాజ భవనాలు, రాజ ప్రాసాదాలు, కోటలు, గోపురాలను దైవం, వాస్తు, శిల్పం వంటి ఇతివృత్తంగా ఆయా నిర్మాణాలు ఉండేవి. వాటికే డెవలపర్లు ఆధునికతను జోడించి గృహ సముదాయాల స్థాయికి తీసుకొచ్చేశారు. సాధారణంగా థీమ్ బేస్డ్ రిసార్ట్లు, హోటళ్లు, పార్క్‌లు ఉంటాయి. కానీ, ఇప్పుడు మెట్రో నగరాల్లో లగ్జరీ అపార్ట్మెంట్లు, విల్లాలు, క్లబ్ హౌస్‌లను ఈ తరహాలో నిర్మిస్తున్నారు.థీమ్ బేస్డ్ అంటే? స్పోర్ట్స్, డిస్నీ, హెల్త్ అండ్ వెల్నెస్, గోల్ఫ్, ఈజిప్టియన్, అరబిక్, స్పానిష్, రోమన్ వంటి ఏదైనా ఇతివృతం ఆధారంగా నిర్మించే నివాస సముదాయాలనే థీమ్ బేస్డ్ హోమ్స్ అంటారు. ఒకే రకమైన అభిరుచులు, ఆసక్తులు ఉన్న నివాసితులు ఒకే గృహ సముదాయంలో ఉండటమే వీటి ప్రత్యేకత. దీంతో నివాసితుల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. అద్భుతమైన శిల్పా లు, విశాలమైన ద్వారాలు, కిటికీలు, అందమైన మంటపాలు, గ్రాండ్ గ్యాలరీ, ఆహ్లాదకరమైన పచ్చదనంతో ఉంటాయి.అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనే.. కొనుగోలుదారుల అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా థీమ్ ఆధారిత గృహాలను నిర్మించేందుకు డెవలపర్లు ముందుకు వస్తున్నారు. అపార్ట్మెంట్లు, విల్లాలు, క్లబ్ హౌస్‌లను కూడా థీమ్ ఆధారంగానే నిర్మిస్తున్నారు. పౌలోమి ఎస్టేట్స్, సుచిరిండియా, రాంకీ, గిరిధారి హోమ్స్ వంటి పలు నిర్మాణ సంస్థలు ఈ తరహా ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నాయి. కోకాపేట, తెల్లాపూర్, నల్లగండ్ల, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొల్లూరు, మాదాపూర్ వంటి అన్ని రకాల మౌలిక వసతులతో అభివృద్ధి చెందిన ప్రాంతాలలో ఎక్కువగా నిర్మిస్తున్నారు.మౌలిక వసతులూ మెరుగ్గానే.. గృహ కొనుగోలుదారుల అభిరుచులు మారిపోయాయి. స్విమ్మింగ్ పూల్, జిమ్, పార్క్, క్లబ్ హౌస్ వంటి సౌకర్యాలను విలాసవంతమైన వసతులుగా పరిగణించడం లేదు. అంతకుమించి ఆధునికతను కావాలంటున్నారు. ఒక వసతుల విషయంలోనే కాదు ప్రాజెక్ట్ డిజైనింగ్, ఆర్కిటెక్చర్ అన్నింట్లోనూ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని భావిస్తున్నారు. ప్రత్యేకత లేదో ప్రాజెక్ట్‌ను ఎంపిక చేయడం లేదు. మెరుగైన మౌలిక వసతులు, అన్ని రకాల రవాణా సదుపాయాలు, విస్తీర్ణమైన స్థలం ఉన్న ప్రాంతాల థీమ్ బేస్డ్ ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి సరైనవి.థీమ్ బేస్ట్ ప్రాజెక్ట్‌లను ఆర్కిటెక్చర్, కల్చర్, లైఫ్ స్టయిల్ మూడు రకాలుగా వర్గీకరిస్తారు.1. ఆర్కిటెక్చర్: ఈ భవన నిర్మాణాల శైలి వినూత్నంగా ఉంటాయి. ఈ తరహా నిర్మాణ శైలిని ప్రపంచ దేశాల్లోని చరిత్రలో వివిధ కాల వ్యవధుల్లో వచ్చిన నిర్మాణాలను ప్రేరణగా తీసుకొని ఆర్కిటెక్చర్ డిజైనింగ్‌ను రూపొందిస్తారు. ఈ తరహా భవన నిర్మాణాలు సమగ్రత్తను నిర్ధారించడంతో పాటు ఫ్యాషన్ సింబల్‌గా మారాయి. ఉదాహరణ: ఇండో సార్సెనిక్, గోతిక్ అండ్ విక్టోరియన్, మొగల్స్, ఈజిప్టియన్, అరబిక్, స్పానిష్, రోమన్, మొరాకన్ ఆర్కిటెక్చర్ నిర్మాణాలు.2. కల్చర్: ప్రపంచంలోని వివిధ సంస్కృతులను ప్రతిబింబించేలా ఈ నివాస సముదాయాలు ఉంటాయి. ఉదాహరణకు: డెన్మార్క్, నార్వే, స్వీడన్ వంటి స్కాండినేవియన్ దేశాల్లో గృహాల డిజైన్లు ప్రకృతిని పెంపొందించేలా, జపనీయుల హోమ్స్ మినిమలిస్టిక్ డిజైన్లను అవలంభిస్తుంటారు. భారతీయులు చైతన్యపరిచే గృహాలను ఇష్టపడుతుంటారు.3. లైఫ్ స్టయిల్: కొనుగోలుదారుల జీవనశైలి, అవసరాలు, అభిరుచులకు తగ్గట్టుగా నిర్మించే కస్టమైజ్డ్ గృహాలివీ. ఈ ప్రాజెక్ట్‌లలో గ్రీనరీకి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో ధారాళమైన గాలి, వెలుతురుతో ఇట్టే ఆకట్టుకుంటాయి.ఉదాహరణకు: స్పోర్ట్స్ టౌన్‌షిప్‌లు, డిస్నీ, చిల్డ్రన్ సెంట్రిక్ హోమ్స్, హెల్త్ అండ్ వెల్నెస్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లు వంటివి. -
రిటైర్మెంట్ ప్లానింగ్‌లో అక్కడివాళ్లే టాప్
కోల్‌కతా: విశ్రాంత జీవనం (రిటైర్మెంట్ తర్వాత) కోసం సన్నద్ధతతో తూర్పు భారత్ ప్రజలు ఇతర ప్రాంతాల వారితో పోల్చితే ముందున్నారు. ఇండియా రిటైర్మెంట్ ఇండెక్స్‌లో సున్నా నుంచి నూరు వరకు స్కేల్‌పై ఉత్తర భారత్ 54 పాయింట్ల వద్ద ఉంది. అదే దక్షిణాది, ఉత్తరాది ప్రాంతాలు రిటైర్మెంట్ జీవితానికి సన్నద్ధతలో 48 పాయింట్ల వద్దే ఉన్నాయి. పశ్చిమ భారత్ 49 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.జాతీయ సగటు 49 పాయింట్లుగా ఉంది. కాంటార్‌తో కలసి మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నిర్వహించిన ‘ఇండియా రిటైర్మెంట్ ఇండెక్స్ అధ్యయనం’ నాలుగో ఎడిషన్ నివేదిక ఈ వివరాలు వెల్లడించింది. పట్టణ వాసుల్లో రిటైర్మెంట్ సన్నద్ధత ఎలా ఉంది, దీనిపై వారిలో ఉన్న అవగాహన, ఆకాంక్షలు, రిటైర్మెంట్ సమయంలో ఎదుర్కొనే సవాళ్లు, ప్రణాళికల గురించి ఈ అధ్యయనం తెలుసుకునే ప్రయత్నం చేసింది. దేశవ్యాప్తంగా 28 పట్టణాల్లో 25–65 ఏళ్ల వయసులోని వారి అభిప్రాయాలు తెలుసుకుంది.అధ్యయనం వివరాలు.. తూర్పు భారత్‌లో 72 శాతం మంది రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు. గతేడాది ఇది 67 శాతంగా ఉంది. ఇదే ప్రాంతంలో 82 శాతం మంది ఆరోగ్యం కాపాడుకుంటామని నమ్మకంగా చెప్పారు. 67 శాతం మంది లైఫ్ ఇన్సూరెన్స్‌ను రిటైర్మెంట్ భద్రత కోసం ఎంపిక చేసుకుంటున్నారు. ప్రతి నలుగురిలో ఒకరికి ఎన్పీఎస్ ఖాతా ఉంది. ఈ ప్రాంతంలో జీవిత బీమాపై 97 శాతం మందికి, హెల్త్ ఇన్సూరెన్స్‌పై 90 శాతం మందికి అవగాహన ఉంది.పశ్చిమ భారత్‌లో 66 శాతం మంది, ఉత్తర భారత్‌లో 60 శాతం, దక్షిణ భారత్‌లో 58 శాతం మంది రిటైర్మెంట్ కోసం పెట్టుబడులు పెడుతున్నారు.తూర్పు భారత్‌లో 56 శాతం మంది 35 ఏళ్లలోపే రిటైర్మెంట్ ప్రణాళిక మొదలు పెట్టడాన్ని సమర్థించారు. 50 ఏళ్లకు పైబడిన వారిలో 94 శాతం మంది ముందుగా రిటైర్మెంట్ కోసం పెట్టుబడులు ప్రారంభించకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. కనీస అవసరాలను తీర్చుకునే విషయంలో 62 శాతం మంది, పిల్లల భవిష్యత్ విషయమై 64 శాతం మందిలో ఆందోళన కనిపించింది. 94 శాతం మంది కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి సహకారం విషయంలో విశ్వాసాన్ని వ్యక్తం చేయగా, 64 శాతం మంది ఒంటరితనం విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు. మారుతున్న పర్యావరణం పట్ల 76 శాతం మందిలో ఆందోళన కనిపించింది. తూర్పు భారత్‌లో ప్రతి నలుగురిలో ఒకరు రిటైర్మెంట్ తర్వాత కుటుంబ సభ్యులపై ఆధారపడాల్సి వస్తుందని చెప్పారు. ప్రతి ముగ్గురిలో ఒకరు వైద్య అవసరాలు, పిల్లల భవిష్యత్‌కూ తమ ప్రణాళికల్లో భాగంగా ప్రాధాన్యం ఇస్తున్నారు.పెరుగుతున్న ప్రాధాన్యత..జీవనకాలం పెరుగుతుండడంతో భారతీయులకు రిటైర్మెంట్ ప్రణాళిక అత్యంత కీలకంగా మారుతోంది. మా అధ్యయనంలో గుర్తించిన అంశాలు మారుతున్న రిటైర్మెంట్ అవసరాలు, ప్రాధాన్యతలను అర్థం చేసుకునేందుకు ఉపకరిస్తాయి. దేశవ్యాప్తంగా రిటైర్మెంట్ విషయమై సమగ్రమైన విధానాన్ని అనుసరించేందుకు ఈ అధ్యయనం స్ఫూర్తినిస్తుంది.– ఈవీపీ రాహుల్ తల్వార్,మ్యాక్స్‌లైఫ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ -
‘ఆరోగ్య నిధి’ ప్రాధాన్యం తెలుసా?
మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లతో అనారోగ్యాలు పెరుగుతున్నాయి. దాంతో వైద్య ఖర్చులు అధికమవుతున్నాయి. అందుకు అనుగుణంగా ఆరోగ్య బీమా తీసుకోవాలి. అయితే కొన్ని సందర్భాల్లో వైద్య ఖర్చులకు బీమా మొత్తం సరిపోకపోవచ్చు. కాబట్టి కొంత ‘ఆరోగ్య నిధి’ని సైతం ప్రత్యేకంగా సమకూర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.ఏదైనా అనారోగ్య పరిస్థితుల్లో ఆరోగ్య బీమా సరిపోనట్లయితే అత్యవసర నిధిని ఉపయోగించాల్సి రావొచ్చు. దాంతోపాటు అప్పు కూడా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు. అలాంటి సందర్భాల్లో ఆర్థికంగా ఆదుకునేందుకు ఆరోగ్య నిధిని ఏర్పాటు చేసుకోవాలి. అప్పటివరకు చేసిన పొదుపు, పెట్టుబడులు కరిగిపోకుండా ఇది రక్షిస్తుంది. క్యాన్సర్, గుండె జబ్బులు వంటి ప్రత్యేక అనారోగ్య పరిస్థితులున్నవారు ఈ నిధిని తప్పకుండా సిద్ధం చేసుకోవాలి.ఈ నిధి ఎందుకంటే..ఆరోగ్య బీమా పాలసీలో కేవలం వైద్యానికి అవసరమయ్యే ఖర్చులు మాత్రమే అందిస్తారు. కానీ వైద్యేతర ఖర్చులు పాలసీదారులే భరించాలి. ఒకేవేళ పాలసీ తీసుకునే సందర్భంలో కో-పే(కొంత పాలసీ కంపెనీ, ఇంకొంత పాలసీదారు చెల్లించే విధానం) ఎంచుకుంటే మాత్రం వైద్య ఖర్చుల్లో కొంత పాలసీదారు చెల్లించాల్సి ఉంటుంది. వైద్యం పూర్తవ్వకముందు, వైద్య పూర్తయిన తర్వాత అయ్యే ఖర్చులను పాలసీదారులే భరించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నిధిని ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.చిన్నపాటి ఖర్చుల కోసం..అత్యవసర పరిస్థితులకు ఆరోగ్య బీమా సరిపోతుంది. అయినప్పటికీ కొద్ది మొత్తంలో వైద్య నిధిని ఏర్పాటు చేసుకోవడం ముఖ్యం. ఉదాహరణకు రూ.15వేల లోపు వైద్య బిల్లులు అయితే దానికోసం ఆరోగ్య బీమాను వినియోగించకపోవడమే మేలు. ఒకవేళ క్లెయిమ్ చేస్తే పాలసీ రిన్యువల్ సమయంలో వచ్చే అదనపు బోనస్ ప్రయోజనాలను కోల్పోయే అవకాశం ఉంది. అలాగని అప్పుచేసి ఆ ఖర్చులు భరించాలని కాదు. అందుకే ఇలాంటి ఖర్చుల కోసం సొంతంగా ఆరోగ్య నిధిని ఏర్పాటు చేసుకోవాలి.ఇదీ చదవండి: ఒళ్లో వేసుకుంటే ఫోన్ ఛార్జింగ్!ఎంత ఉండాలంటే..ఈ నిధి ఎంత మొత్తం అవసరం అనేదానికి కచ్చితమైన అంచనాలేం లేవు. మీ జీవినశైలి, మీరున్న ప్రాంతంలో ఖర్చులు, నెలవారీ మిగులుపై ఇది ఆధారపడి ఉంటుంది. ఆసుపత్రిలో చేరితే అయ్యే ఖర్చులు సొంతంగా భరించాలి. కాబట్టి అందుకు అనుగుణంగా ఈ నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి వ్యక్తి ఆరోగ్య పరిస్థితి వేర్వేరుగా ఉంటుంది. కాబట్టి, ఈ నిధిని సొంతంగా నిర్ణయించుకోవాలి. ఆరోగ్య బీమా పాలసీలో కో-పే లేకపోతే రూ.50 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు అత్యవసర ఆరోగ్య నిధి ఉంటే మేలని నిపుణులు సూచిస్తున్నారు. -
అద్దె అర లక్ష! హైదరాబాద్‌లో హడలెత్తిస్తున్న హౌస్ రెంట్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగరంలో అద్దెలు హడలెత్తిస్తున్నాయి. మూడు నెలల్లో కిరాయిలు 1–4 శాతం మేర పెరిగాయి. ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో, ఆఫీసులకు దగ్గరగా ఉన్న చోట, అలాగే మెట్రో కనెక్టివిటీ, ఇతర రవాణా సదుపాయాలు మెరుగ్గా ఉన్న ప్రాంతాల్లో నెలవారీ అద్దెలు ఎక్కువగా వృద్ధి చెందుతున్నాయని అనరాక్ అధ్యయనంలో వెల్లడైంది.ప్రస్తుతం హైదరాబాద్‌లో 1000-1,300 చదరపు అడుగుల 2 బీహెచ్‌కే ఫ్లాట్ ధరలను పరిశీలిస్తే.. కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, జూబ్లీహిల్స్, కొండాపూర్ వంటి ప్రాంతాలలో నెలవారీ అద్దె అర లక్ష రూపాయలకు పైగానే ఉంటోంది. -
బంగారం డబుల్ హ్యాట్రిక్..
Gold Price Today: దేశంలో బంగారం ధరలు డబుల్ హ్యాట్రిక్ కొట్టాయి. వరుసగా ఆరో రోజూ పసిడి ధరలు భారీగా ఎగిశాయి. నేడు (నవంబర్ 23) పెరిగిన ధరలతో కొత్త మార్కులను తాకాయి. ఆగకుండా పెరుగుతున్న ధరలు పసిడి కొనుగోలుదారులను నిరాశకు గురి చేస్తున్నాయి.తెలుగు రాష్ట్రాలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.750 పెరిగి రూ.73,000 లను తాకింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం రూ.820 ఎగసి రూ.79,640 వద్దకు చేరింది. చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో బంగారం ధరలు బెంబేలిత్తించాయి.ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే ఇక్కడా పసిడి ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.750 పెరిగి రూ.73,150 వద్దకు చేరగా, 24 క్యారెట్ల పసిడి రూ.820 పెరిగి రూ.79,790 వద్దకు ఎగిసింది.ఇదీ చదవండి: పసిడిపై పైచేయి.. సిల్వర్ ఈటీఎఫ్‌లకు డిమాండ్మరోవైపు వెండి ధరలు (Silver Price Today) మాత్రం నేడు ఎలాంటి మార్పు లేకుండా నిలకడగా కొనసాగున్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.10,01,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
ఒళ్లో వేసుకుంటే ఫోన్ ఛార్జింగ్!
ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందంటే ఛార్జర్ కోసం వెతకాల్సిన పనిలేదు. అదేంటి ఛార్జర్ లేకుండా ఫోన్ ఎలా ఛార్జ్ అవుతుందనేగా మీ అనుమానం.. సింపుల్.. ఫోన్‌ను మీ ఒళ్లో పెట్టుకోండి. వెంటనే ఛార్జింగ్ అవుతుంది. అవునండి.. మీరు విన్నది నిజమే. ఇదో కొత్తరకం టెక్నాలజీ. థెర్మో ఎలక్ట్రిక్ టెక్స్టైల్స్ అనే టెక్నాలజీతో ఇది సాధ్యమేనని శాస్త్రవేత్తలు తెలియజేశారు. ఈమేరకు స్వీడన్‌లోని ఛామర్స్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని నిరూపించారు.థెర్మో ఎలక్ట్రిక్ టెక్స్టైల్స్ సాంకేతిక ద్వారా మనం ధరించే దుస్తుల్లోని సిల్క్ దారాలను ఉపయోగించి విద్యుత్తును తయారు చేస్తున్నారు. ఆ సిల్క్ దారాలకు కండక్టివ్ ప్లాస్టిక్ అనే లోహాన్ని పూయడం ద్వారా బ్యాటరీ లేకుండానే విద్యుత్తుని ఉత్పత్తి చేయొచ్చని నిరూపించారు. ఈ టెక్నాలజీ ద్వారా బయటి వాతావరణం, శరీర ఉష్ణోగ్రత వ్యత్యాసాల నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ టెక్నాలజీను విభిన్న పరిస్థితుల్లో పరీక్షించి, మరింత మెరుగ్గా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.ఉపయోగాలెన్నో..సంప్రదాయ బ్యాటరీలు లేకుండా చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాటరీ అవసరంలేని సెన్సార్ల వంటి వాటికి ఈ సాంకేతికతతో విద్యుత్‌ను సరఫరా చేయవచ్చని చెబుతున్నారు. కొన్ని సంస్థలు వినియోగదారుల హృదయ స్పందనలను ట్రాక్ చేయడానికి, ఆరోగ్య కొలమానాలను పర్యవేక్షించడానికి టెక్స్టైల్ సెన్సార్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. వాటికి ఈ థెర్మో ఎలక్ట్రిక్ టెక్స్టైల్స్ ద్వారా ఎనర్జీని అందించవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ఆర్మీ ఉద్యోగులకూ, విద్యుత్ సదుపాయం లేని ప్రాంతాల్లో ఉండేవారికీ ఉపయోగపడేలా ఈ దుస్తుల్ని రూపొందిస్తున్నారు.ఇదీ చదవండి: క్షీణిస్తున్న ఫారెక్స్ నిల్వలు.. కారణాలుఏ ప్రమాదం లేదు..అసలే కరెంటుతో వ్యవహారం.. అలాంటిది మనం ఎలక్ట్రిక్ టెక్స్టైల్స్ ధరించొచ్చా అనే సందేహం అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటితో మానవులకు ఎలాంటి హాని ఉండదంటున్నారు. ఈ ప్రక్రియతో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సైతం తగ్గించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
టాప్ న్యూస్ యాప్‌గా ఎక్స్: మస్క్
న్యూఢిల్లీ: భారత్‌లోని యాప్ స్టోర్‌లో సామాజిక మాధ్యమం ఎక్స్ (గతంలో ట్విటర్) ప్రస్తుతం టాప్ న్యూస్ యాప్ అని ఎలాన్ మస్క్ తెలిపారు. భారత్‌లో యాపిల్ యాప్‌స్టోర్‌లో ఎక్స్ మొదటి స్థానంలో నిలిచిన న్యూస్ యాప్ అని డోజ్‌డిజైనర్ అనే ఒక వినియోగదారు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన తర్వాత.. భారత్‌లో వార్తల కోసం ప్లాట్‌ఫామ్ నిజంగా నంబర్ వన్ అయిందని బిలియనీర్ ఎలాన్ మస్క్ అన్నారు.మస్క్ 2022 అక్టోబర్‌లో ఎక్స్‌ను (గతంలో ట్విటర్) 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. స్టాటిస్టా (Statista.com) ప్రకారం, దేశం వారీగా అత్యధిక ట్విటర్ యూజర్ల సంఖ్యలో సుమారుగా 25 మిలియన్లకు పైగా వినియోగదారులతో భారత్ మూడవ స్థానంలో ఉంది. మస్క్ ప్రకటన తరువాత అభినందనలు వెల్లువెత్తాయి.𝕏 is now #1 for news in India! https://t.co/beLobq1Dfo— Elon Musk (@elonmusk) November 22, 2024 -
క్షీణిస్తున్న ఫారెక్స్ నిల్వలు.. కారణాలు
భారత విదేశీ మారక నిల్వలు(ఫారెక్స్ రిజర్వ్‌లు) భారీగా క్షీణిస్తున్నాయి. నవంబరు 15తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 17.76 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1.44 లక్షల కోట్లు) తగ్గి 657.8 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.55.31 లక్షల కోట్ల)కు చేరినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పేర్కొంది. అంతకుముందు ఇవి 6.477 బిలియన్ డాలర్లు క్షీణించి 675.6 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అందుకు అంతర్జాతీయంగా కొన్ని కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.యూఎస్ డాలర్ పెరుగుదల: అమెరికా ఎన్నికల ప్రచార సమయం వరకు స్థిరంగా కదలాడిన డాలర్, ఫలితాల తర్వాత ఊపందుకుంది. దాంతో రూపాయి విలువ పడిపోయింది. ఫలితంగా దేశీయ పారెక్స్ నిల్వలు తగ్గిపోతున్నాయి.పెరుగుతున్న దిగుమతులు: దేశీయ దిగుమతులు అధికమవుతున్నాయి. విదేశీ వస్తువులను దిగుమతి చేసుకునేందుకు ఆయా ఉత్పత్తులకు డాలర్లలోనే చెల్లించాలి.ఆర్బీఐ: మార్కెట్ ఒత్తిళ్ల మధ్య రూపాయికి మద్దతుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వద్ద ఉన్న ఫారెక్స్ నిల్వలను విక్రయిస్తోంది. రూపాయి మరింత పడిపోకుండా చర్యలు తీసుకుంటోంది. డాలర్-రూపీ మార్కెట్ అస్థిరతను తగ్గించడానికి ఇది దోహదపడుతోంది.ఇదీ చదవండి: అదానీ కంపెనీల రేటింగ్ తగ్గింపువిదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) అమ్మకాలు: విదేశీ ఇన్వెస్టర్లు భారత స్టాక్స్, బాండ్లను విక్రయించడంతో స్థానిక ఈక్విటీ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. నవంబర్‌లో ఇప్పటి వరకు దాదాపు 4 బిలియన్ డాలర్ల(రూ.33 వేలకోట్లు)కు పైగా అమ్మకాలు చేపట్టారు.ఫెడరల్ రిజర్వ్ విధానాలు: అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు ఇటీవల కాలంలో కీలక వడ్డీరేట్లను 75 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దాంతో భారత ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసిన విదేశీ పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియోలను ఉపసంహరిస్తున్నారు. -
పసిడిపై పైచేయి.. సిల్వర్ ఈటీఎఫ్‌లకు డిమాండ్
కోల్‌కతా: ఇటీవల కొంతకాలంగా వెండి ఈటీఎఫ్‌లు పెట్టుబడులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఏడాది కాలంలో సిల్వర్ ఈటీఎఫ్‌ల నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) విలువ నాలుగు రెట్లు ఎగసింది. వెరసి గత నెల(అక్టోబర్)కల్లా వెండి ఈటీఎఫ్‌ల ఏయూఎం రూ. 12,331 కోట్లను తాకింది.2023 అక్టోబర్‌లో ఈ విలువ కేవలం రూ. 2,845 కోట్లుగా నమోదైంది. ఇన్వెస్టర్లు సిల్వర్‌ను దేశీయంగా ధరల పెరుగుదలతోపాటు, రాజకీయ, భౌగోళిక అనిశ్చితులకు హెడ్జింగ్‌గా భావించడం ఇందుకు జతకలిసినట్లు రేటింగ్ సంస్థ ఇక్రా అనలిటిక్స్ పేర్కొంది. ఈ వివరాల ప్రకారం..2022లో షురూ సిల్వర్ ఈటీఎఫ్‌లకు 2022లో తెరతీశారు. వీటి అందుబాటు, పారదర్శకతల కారణంగా రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి వీటికి డిమాండ్ పెరగుతోంది. దీంతో సిల్వర్ ఈటీఎఫ్ ఫోలియోల సంఖ్య 215 శాతం జంప్‌చేసి 4.47 లక్షలకు చేరింది. 2023 అక్టోబర్‌లో ఇది 1.42 లక్షలు మాత్రమే. ఈ కాలంలో నికర పెట్టుబడులు 24 శాతం ఎగశాయి. రూ. 643 కోట్లను తాకాయి.మరోపక్క మార్కెట్లో 2023 ఏప్రిల్‌లో 8 వెండి ఈటీఎఫ్‌లు నమోదుకాగా.. 2024 ఆగస్ట్‌కల్లా 12కు పెరిగినట్లు ఇక్రా అనలిటిక్స్ మార్కెట్ డేటా హెడ్, సీనియర్ వీపీ అశ్వినీ కుమార్ వెల్లడించారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, రాజకీయ, భౌగోళిక అనిశ్చితులు కొనసాగుతుండటంతో సిల్వర్ ఈటీఎఫ్‌లకు డిమాండ్ కొనసాగనున్నట్లు కుమార్ అంచనా వేశారు. సులభ నిర్వహణ సులభంగా స్టోర్ చేయగలగడం, తగినంత లిక్విడిటీ, చౌక వ్యయాలు వంటి అంశాలు సిల్వర్ ఈటీఎఫ్‌లకు ఆకర్షణను పెంచుతున్నాయి. ఫిజికల్ కొనుగోళ్లకు జీఎస్టీ వర్తించే సంగతి తెలిసిందే. స్టాక్ ఎక్స్చేంజీలలో లిస్ట్‌కావడంతో పెట్టుబడులకు లిక్విడిటీ సైతం ఉంటుంది. యూనిట్ల రూపంలో సులభంగా లావాదేవీలు చేపట్టవచ్చునని కుమార్ తెలియజేశారు.అంతేకాకుండా వీటిలో పెట్టుబడులు ఉత్తమ రిటర్నులను సైతం అందిస్తున్నాయి. నెల రోజుల్లో 7.6 శాతం, 3 నెలల్లో 16 శాతం, 6 నెలలు పరిగణిస్తే 20.25 శాతం సగటున రాబడినిచ్చాయి. ఏడాది కాలాన్ని తీసుకుంటే 32.5 శాతం రిటర్నులు అందించాయి. ఇదే కాలంలో గోల్డ్ ఈటీఎఫ్‌ల రాబడులతో పోలిస్తే ఇవి అధికంకావడం గమనార్హం! -
నోకియాకు ఎయిర్టెల్ నుంచి భారీ ఆర్డర్
న్యూఢిల్లీ: టెలికం పరికరాల తయారీలో ఉన్న ఫిన్లాండ్ దిగ్గజం నోకియా తాజాగా భారతీ ఎయిర్టెల్ నుండి భారీ ఆర్డర్‌ను దక్కించుకుంది. ఇందులో భాగంగా భారత్‌లోని ముఖ్య నగరాలు, రాష్ట్రాలలో నోకియా తయారీ 4జీ, 5జీ పరికరాలను వినియోగంలోకి తెస్తారు. రీఫ్షార్క్ సిస్టమ్ ఆన్ చిప్ టెక్నాలజీ ఆధారిత బేస్ స్టేషన్స్, బేస్‌బ్యాండ్ యూనిట్స్, మాసివ్ మల్టిపుల్ ఇన్పుట్ మల్టిపుల్ ఔట్పుట్ వైర్లెస్ కమ్యూనికేషన్స్‌ను నోకియా అందించనుంది.‘వీటి చేరికతో ఎయిర్టెల్ నెట్‌వర్క్‌ను అసాధారణమైన 5జీ సామర్థ్యం, కవరేజీతో మెరుగుపరుస్తాయి. అలాగే నెట్వర్క్ వికాసానికి మద్దతు ఇస్తాయి. ఎయిర్టెల్ యొక్క ప్రస్తుత 4జీ నెట్‌వర్క్‌ను మల్టీబ్యాండ్ రేడియోలు, బేస్‌బ్యాండ్ పరికరాలతో నోకియా ఆధునీకరించనుంది. ఇది 5జీకి కూడా మద్దతు ఇస్తుంది’ అని నోకియా వెల్లడించింది.నోకియాతో ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం సంస్థ నెట్వర్క్ మౌలిక సదుపాయాల సామర్థాన్ని రుజువు చేస్తుందని భారతీ ఎయిర్టెల్ వైస్ చైర్మన్, ఎండీ గోపాల్ విట్టల్ ఈ సందర్భంగా తెలిపారు. వినియోగదారులకు అసమానమైన అనుభవాన్ని అందిస్తుందని, ఈ నెట్వర్క్ పర్యావరణ అనుకూలమైనదని వివరించారు. ఎయిర్‌టెల్‌కు రెండు దశాబ్దాలకుపైగా సేవలు అందిస్తూ 2జీ, 3జీ, 4జీ, 5జీ నెట్వర్క్ ఉపకరణాలను నోకియా సరఫరా చేస్తోంది. -
EPFO: కొత్తగా 18.81 లక్షల మందికి పీఎఫ్
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సభ్యులు సెప్టెంబర్‌లో 18.81 లక్షల మంది పెరిగారు. క్రితం ఏడాది ఇదే నెలలోని గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 9.33 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. ఉపాధి అవకాశాల పెరుగుదలను ఇది సూచిస్తోంది. వీరిలో 9.47 లక్షల మంది కొత్త సభ్యులు.క్రితం ఏడాది ఇదే నెల కంటే 6.22 శాతం పెరిగారు. సభ్యుల్లో 8.36 లక్షల మంది 18–25 ఏళ్లలోపు వారే (60 శాతం) కావడం గమనార్హం. అంటే వీరు మొదటిసారి సంఘటిత రంగంలో ఉపాధి పొందినట్టు అర్థం చేసుకోవచ్చు. 14.10 లక్షల మంది సభ్యులు సెప్టెంబర్ నెలలో ఈపీఎఫ్‌వో పరిధిలోనే ఒక సంస్థ నుంచి మానేసి, మరో సంస్థలో చేరారు.వార్షికంగా క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే ఇది 18 శాతం అధికం. కొత్త సభ్యుల్లో 2.47 లక్షల మంది మహిళలు ఉన్నారు. 9 శాతం వృద్ధి నమోదైంది. సెప్టెంబర్ నెల మొత్తం మీద నికరంగా చేరిన మహిళా సభ్యుల సంఖ్య 3.70 లక్షలుగా ఉంది. ఇది కూడా 12 శాతం అధికం. 21 శాతం మహారాష్ట్ర నుంచే.. సెప్టెంబర్ నెలలో నికర సభ్యుల చేరికలో మహారాష్ట్ర నుంచే 21.20 శాతం మంది ఉన్నారు. ఇక కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, హర్యాన, గుజరాత్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ నుంచి విడిగా 5 శాతం కంటే ఎక్కువ సభ్యులు చేరారు. నైపుణ్య సేవలు, ట్రేడింగ్–వాణిజ్య సంస్థలు, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇంజనీరింగ్ ఉత్పత్తులు, వస్త్రాల తయారీ, క్లీనింగ్, స్వీపింగ్ సేవలు, హాస్పిటళ్లలో ఎక్కువ మందికి ఉపాధి లభించింది. -
అదానీ కంపెనీల రేటింగ్ తగ్గింపు
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్అదానీతోపాటు మరో ఏడుగురు అధికారులపై అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో ప్రముఖ స్టాక్‌మార్కెట్ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ స్పందించింది. అదానీ గ్రూప్ స్టాక్లను రివ్యూచేసి రేటింగ్ ఇచ్చింది. గతంలో ఇచ్చిన రేటింగ్ తగ్గిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల చెలరేగిన నేరాభియోగాల కారణంగా భవిష్యత్తులో అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ టోటల్ గ్యాస్ కంపెనీలపై ప్రభావం పడుతుందని భావించి ఆయా సంస్థల రేటింగ్‌ను ‘బీబీబీ-’(ప్రతికూలం)గా మార్చింది.పాలనా ధోరణులపై అనుమానంఅదానీ గ్రూప్‌పై గతంలో హిండెన్‌బర్గ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కానీ ఈసారి ఏకంగా అమెరికా న్యాయశాఖ, యూఎస్ ఎస్ఈసీ కలిసి దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించడంతో అదానీ సంస్థల పాలనా ధోరణులపై అనుమానం వ్యక్తమవుతుంది. కంపెనీపై ఇలా వస్తున్న ఆరోపణలు అదానీ గ్రూప్ ప్రతిష్ఠను దెబ్బతీయవచ్చనీ ఎస్ అండ్ పీ అభిప్రాయపడింది. కంపెనీ వృద్ధికి సాయం చేసిన రుణదాతల్లో ఆందోళన పెరిగే అవకాశం ఉందని తెలిపింది. దాంతో కంపెనీకి నిధుల సమీకరణ సవాలుగా మారే ప్రమాదం ఉందని చెప్పింది.ఇదీ చదవండి: ఒక్క నెలలో రూ.3,617 కోట్ల ఇళ్ల అమ్మకాలుఎక్స్ఛేంజీల రియాక్షన్ఇండియన్ స్టాక్ ఎక్స్ఛేంజీలు అదానీ గ్రూప్‌పై వస్తున్న నేరారోపణలపై వివరణ కోరాయి. అదానీపై అమెరికా న్యాయశాఖతోపాటు యూఎస్ ఎస్ఈసీలో లంచం కేసు నమోదు అవ్వడంతోపాటు, ఇటీవల కెన్యా అదానీ గ్రూప్ కంపెనీలతో గతంలో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి. దాంతో భారత స్టాక్ ఎక్స్ఛేంజీలు వివరణ కోరాయి. సెబీ కూడా ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తుందని నిపుణులు చెబుతున్నారు. -
రియల్ ఎస్టేట్‌లో ఈక్విటీ పెట్టుబడుల జోరు
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రంగంలో దేశంలో ప్రస్తుత సంవత్సరం ఈక్విటీ పెట్టుబడులు 49 శాతం పెరిగి 11 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని పరిశ్రమల సమాఖ్య సీఐఐ, రియల్టీ కన్సల్టెంట్ సీబీఆర్ఈ నివేదిక తెలిపింది. ఆస్తులకు బలమైన డిమాండ్ ఈ స్థాయి జోరుకు కారణమని వివరించింది.‘2023లో ఈక్విటీ పెట్టుబడులు ఈ రంగంలో 7.4 బిలియన్ డాలర్లు. ఈక్విటీ మూలధన ప్రవాహం 2024 జనవరి–సెప్టెంబర్ మధ్య 8.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 46 శాతం వృద్ధిని నమోదు చేసింది. రియల్ ఎస్టేట్ రంగంలో 2024లో మొత్తం ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ మొదటిసారిగా 10 బిలియన్ డాలర్లను అధిగమించి కొత్త రికార్డును నమోదు చేయబోతున్నాయి. నిర్మాణం పూర్తి అయిన ఆఫీస్ అసెట్స్‌లో పెట్టుబడుల పునరుద్ధరణ, రెసిడెన్షియల్ విభాగంలో స్థలాల కోసం బలమైన డిమాండ్‌తో ప్రస్తుత సంవత్సరం మొత్తం ఈక్విటీ పెట్టుబడులు 10–11 బిలియన్ డాలర్ల శ్రేణిలో ఉంటాయి.2024 జనవరి–సెప్టెంబర్ మధ్య పరిశ్రమ అందుకున్న నిధుల్లో విదేశీ ఇన్వెస్టర్ల వాటా 3.1 బిలియన్ డాలర్లు ఉంది. ఇందులో ఉత్తర అమెరికా, సింగపూర్ ఇన్వెస్టర్లు 85 శాతం సమకూర్చారు. సెబీ యొక్క ఎస్ఎం–ఆర్ఈఐటీ ఫ్రేమ్‌వర్క్‌తో ద్వితీయ శ్రేణి నగరాల్లో అధిక నాణ్యత గల చిన్న స్థాయి ఆస్తులు కూడా వ్యూహా త్మక మూలధన విస్తరణకు కొత్త మార్గాలను అందజేస్తాయి’ అని నివేదిక వివరించింది. -
2030 నాటికి సేవల ఎగుమతులదే పైచేయి
న్యూఢిల్లీ: దేశ ఎగుమతుల్లో వస్తువులను సేవలు అధిగమించనున్నాయి. 2030 మార్చి నాటికి 618.21 బిలియన్ డాలర్లకు (51.92లక్షల కోట్లు) చేరుకుంటాయని స్వతంత్ర పరిశోధనా సంస్థ ‘గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్’ (జీటీఆర్ఐ) అంచనా వేసింది. అదే కాలంలో వస్తు ఎగుమతుల విలువ 613 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని తెలిపింది. 2018–19 నుంచి 2023–24 వరకు దేశ వస్తు ఎగుమతులు ఏటా 5.8 శాతం చొప్పున కాంపౌండెడ్ వృద్ధి చెందాయని, ఇదే కాలంలో సేవల ఎగుమతులు 10.5 శాతం చొప్పున పెరుగుతూ వచ్చాయని జీటీఆర్ఐ నివేదిక తెలిపింది. ఇదే స్థాయిలో వృద్ధి కొనసాగితే 2030 మార్చి నాటికి సేవల ఎగుమతులు 618.21 బిలియన్ డాలర్లకు, వస్తు ఎగుమతులు 613 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని అంచనా కట్టింది. ఐటీ, సాఫ్ట్వేర్, ఓబీఎస్ హవా.. భారత సేవల రంగం వృద్ధిలో అధిక భాగం సాఫ్ట్వేర్, ఐటీ సేవలు, ఇతర వ్యాపార సేవల (ఓబీఎస్) నుంచే ఉంటోందని.. 2023–24 ఎగుమతుల్లో వీటి వాటా 86.4 శాతంగా ఉన్నట్టు జీటీఆర్ఐ తెలిపింది. ఓబీఎస్ పరిధిలోని న్యాయ సేవలు, అకౌంటింగ్, పన్ను సంబంధిత సేవలు, మేనేజ్మెంట్ కన్సలి్టంగ్, మార్కెట్ పరిశోధన కలిపి 2023–24లో 10.28 బిలియన్ డాలర్ల ఎగుమతులు నమోదైనట్టు జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. మొత్తం సేవలు ఎగుమతుల్లో ఓబీఎస్ వాటా 33.2 శాతంగా ఉన్నట్టు చెప్పారు. దేశంలో అత్యంత నైపుణ్య మానన వనరులు, అభివృద్ధి చెందుతున్న ఐటీ సదుపాయాలు అంతర్జాతీయ సేవల కేంద్రంగా భారత్ ప్రతిష్టను పెంచుతున్నట్టు జీటీఆర్ఐ తెలిపింది. జెనరేటివ్ ఏఐ, మెషిన్ లెరి్నంగ్(ఎంఎల్), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) భారత కంపెనీల అవకాశాలను అధికం చేస్తున్నట్టు పేర్కొంది. ‘‘సాఫ్ట్వేర్, ఐటీ సేవలు అతిపెద్ద విభాగంగా ఉండగా, వృద్ధిలో ఈ విభాగాన్ని ఓబీఎస్ దాటిపోనుంది. ప్రత్యేకమైన సేవలకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతోంది’’అని శ్రీవాస్తవ తెలిపారు. యూఎస్ వెలుపల ఐటీ సేవల విస్తరణ.. యూఎస్‌కు బయట ఐటీ ఎగుమతులను వైవిధ్యం చేసుకోవడం మొదట చేయాల్సిన పనిగా జీటీఆర్ఐ పేర్కొంది. దేశ ఐటీ ఎగుమతుల్లో 70 శాతం యూఎస్‌కే వెళుతున్న నేపథ్యంలో, అక్కడి విధానాల్లో మార్పుల రిస్క్ ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడింది. ‘‘ప్రెసిడెంట్‌గా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ ఔట్సోర్స్ను విమర్శించడం, హెచ్–1బి వీసా పాలసీల కట్టడి తదితర విధానాలు ఈ రిస్‌్కలను గుర్తు చేస్తున్నాయి. ఆటోమేషన్, కృత్రిమ మేథ (ఏఐ) 40 శాతం మేర ఐటీ ఉద్యోగులకు ముప్పుగా మారే ప్రమాదం కూడా ఉంది’’అని శ్రీవాస్తవ తెలిపారు. ఇతర మార్కెట్లకు విస్తరించడం, డిజిటల్ పరివర్తిన, ఏఐ ఇంటెగ్రేషన్ యూఎస్‌పై ఎక్కువగా ఆధారపడడాన్ని తగ్గిస్తాయని పేర్కొన్నారు. ఓబీఎస్ ఎగుమతులను ప్రోత్సహించాలని జీటీఆర్ఐ నివేదిక సూచించింది. ఈ విభాగంలో ఎగుమతులకు గణనీయమైన అవకాశాలున్నప్పటికీ, భారత సంస్థలు పూర్తి స్థాయిలో వినియోగంచుకోవడం లేదని పేర్కొంది. ఇంజనీరింగ్, పరిశోధన, మేనేజ్మెంట్ నిపుణులకు అంతర్జాతీయంగా ఉన్న అవకాశాలపై అవగాహన పెరిగితే వృద్ధి అవకాశాలను మరింత ఇతోధికం చేసుకోవచ్చని తెలిపింది. -
ఎనర్జీ సంస్థ ప్రచారకర్తగా మహేశ్ బాబు
హైదరాబాద్: సోలార్ ఎనర్జీ సెక్టార్‌లోని సన్‌టెక్ ఎనర్జీ బ్రాండ్ ‘ట్రూజన్ సోలార్’కు సినీనటుడు మహేశ్‌బాబు ప్రచారకర్తగా నియమితులయ్యారు. రూఫ్టాఫ్ సోలార్ ఇన్స్టలేషన్లో 2025 మార్చి నాటికి భారత్‌లో అగ్రగామిగా నిలిచేందుకు కట్టుబడి ఉన్నామని సన్‌టెక్ ఎనర్జీ సిస్టమ్స్ వ్యవస్థాపకులు, ఎండీ, సీ.హెచ్. భవానీసురేశ్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న సంస్థతో కలిసి పనిచేయడం గౌరవంగా ఉందని మహేశ్‌బాబు తెలిపారు. -
సీజన్ ముగిసినా.. సందడే సందడి
పండుగ సీజన్ ముగిసిపోయినా కార్ల విషయంలో మాత్రం ఆఫర్ల పర్వం కొనసాగుతూనే ఉంది. వివిధ కార్ల కంపెనీలు నగదు డిస్కౌంట్లు, ఇతరత్రా బహుమతులతో కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆటో డీలర్ల అసోసియేషన్ సమాఖ్య (ఎఫ్ఏడీఏ) గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా వాహన రిటైలర్ల దగ్గర 75–80 రోజులకు సరిపోయే నిల్వలు పేరుకుపోయాయి. వీటి విలువ సుమారు రూ. 75,000 కోట్లుగా ఉంటుంది. వాహన విక్రయాల గణాంకాలకు సంబంధించిన వాహన్ పోర్టల్ ప్రకారం నవంబర్‌లో తొలి ఇరవై రోజుల్లో 1,77,362 ప్యాసింజర్ వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. మరోవైపు, కార్ల కంపెనీలన్నీ కలిసి నవంబర్‌లో సుమారు 3,25,000 నుంచి 3,30,000 వరకు వాహనాలను హోల్‌సేల్‌గా డీలర్లకు సరఫరా చేయనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న వాహన నిల్వలను తగ్గించుకోవడంపై కంపెనీలు మరింతగా దృష్టి పెడుతున్నాయి. ‘‘ఏడాది చివరన పాత స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు కంపెనీలు సాధారణంగా ఆఫర్లు ఇస్తుంటాయి. కానీ ఈసారి మాత్రం భిన్నమైన పరిస్థితి నెలకొంది. డీలర్ల దగ్గర ఏకంగా 65–70 రోజులకు సరిపడా నిల్వలు పేరుకుపోయాయి. దీంతో సంస్థలు భారీగా డిస్కౌంట్లకు తెరతీశాయి. ఇది ఒక రకంగా కార్ల కొనుగోలుదార్లకు అసాధారణ అవకాశంలాంటిదే’’ అని ఎస్అండ్పీ గ్లోబల్ మొబిలిటీ వర్గాలు తెలిపాయి.30% వరకు..కంపెనీలు అధికారికంగా రేట్ల తగ్గింపు లేదా డిస్కౌంట్లపై ఎటువంటి ప్రకటన చేయనప్పటికీ డిసెంబర్ 31 వరకు డీలర్ల దగ్గర చాలామటుకు మోడల్స్ ధరలపై (ఎక్స్‌షోరూమ్) 20–30 శాతం డిస్కౌంటును కొనుగోలుదార్లు ఆశించవచ్చని ఎఫ్ఏడీఏ వర్గాలు తెలిపాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి డిస్కౌంట్లు ఉంటాయని మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. అంతగా అమ్ముడు కాని మోడల్స్ పేరుకుపోయినా, లేక అమ్ముడవుతున్న స్థాయికి మించి ఉత్పత్తి చేసినా.. ఆ నిల్వలను వదిలించుకోవడానికి భారీ డిస్కౌంట్లు ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. మరోవైపు, పెళ్ళిళ్ల సీజన్, ప్రమోషనల్ ఆఫర్లు మొదలైనవి ప్యాసింజర్ కార్ల అమ్మకాలు పెరగడానికి దోహదపడగలవని ఆశిస్తున్నట్లు ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ సీఎస్ విఘ్నేశ్వర్ తెలిపారు. గణనీయంగా నిల్వలు పేరుకుపోయి ఉన్నందున తయారీ కంపెనీలు సరఫరాలను క్రమబద్ధీకరించుకోవాలని కోరారు. ఆఫర్ల వెల్లువ.. → ఎరీనా షోరూమ్‌లలో మారుతీ సుజుకీ ఇండియా తమ ఆల్టో కే10, వ్యాగన్ఆర్, సెలీరియో, ఎస్ప్రెసో కార్లపై రూ. 20,000–35,000 వరకు రిబేట్ ఇస్తోంది. వేరియంట్లను బట్టి స్విఫ్ట్‌పై రూ. 25,000–50,000 వరకు, బ్రెజాపై రూ. 10,000–20,000 వరకు డిస్కౌంట్ ఉంటోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రూ. 15,000 ఎక్సే్చంజ్ బోనస్, మోడల్‌ను బట్టి రూ. 2,100–2,300 వరకు కార్పొరేట్ డిస్కౌంట్లకు ఇది అదనమని పేర్కొన్నాయి. → హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ గ్రాండ్ ఐ10 నియోస్‌పై రూ. 35,000–45,000 వరకు, ఆరాపై రూ. 20,000 వరకు, ఐ20పై 20,000–45,000 వరకు, ఎక్స్టర్పై (నిర్దిష్ట వేరియంట్స్‌పై) రూ. 20,000–30,000 వరకు, వెన్యూపై 45,000–50,000 వరకు (వేరియంట్‌ను బట్టి), వెర్నాపై రూ. 70,000 డిస్కౌంట్ అందిస్తోంది. ఇక టక్సన్పై రూ. 50,000, అయానిక్ 5 ఈ–ఎస్‌యూవీపై రూ. 2 లక్షల మేర డిస్కౌంట్లు ఇస్తోంది. → టాటా మోటార్స్ కూడా అ్రల్టోజ్పై రూ. 25,000, పంచ్‌పై (ఐసీఈ వెర్షన్) రూ. 20,000 నగదు డిస్కౌంట్ ఇస్తోంది. అటు టియాగో హ్యాచ్‌బ్యాక్, టిగోర్ సెడాన్, నెక్సాన్ ఎస్‌యూవీల ధరలు (ఐసీఈ మోడల్స్) వరుసగా రూ. 4.99 లక్షలు, రూ. 5.99 లక్షలు, రూ. 7.99 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. → మహీంద్రా అండ్ మహీంద్రా కూడా కొన్ని మోడల్స్‌లో నిర్దిష్ట వేరియంట్లపై, లభ్యతను బట్టి, పరిమిత కాలంపాటు ఆఫర్లు అందిస్తోంది. బొలెరో నియోపై రూ. 70,000 వరకు, స్కారి్పయో ఎన్‌పై రూ. 50,000, థార్ 4 ్ఠ4పై రూ. 1.25 లక్షలు క్యాష్ డిస్కౌంటు ఇస్తోంది. ఎక్స్‌యూవీ 400 ఎలక్ట్రిక్‌పై ఏకంగా రూ. 3 లక్షల నగదు డిస్కౌంట్ ఉంటోంది. → హోండా కార్స్ ఇండియా, జీప్ ఇండియా, స్కోడా ఆటో ఇండియా, ఫోక్స్‌వ్యాగన్ ఇండియా తదితర కార్ల కంపెనీలు కూడా ఏడాది ఆఖరు నాటికి నిల్వలను తగ్గించుకునేందుకు భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తున్నాయి.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఫోన్‌పేకు 'బిన్నీ బన్సాల్' గుడ్‌బై
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బోర్డు నుంచి బయటకు వచ్చిన సంస్థ కో-ఫౌండర్ 'బిన్నీ బన్సాల్'.. తాజాగా డిజిటల్ పేమెంట్స్ యాప్ 'ఫోన్‌పే' నుంచి కూడా బయటకు వచ్చేసారు. అయితే కంపెనీ నుంచి వైదొలగడానికి కారణం ఏమిటనే విషయాన్ని వెల్లడించలేదు.నిజానికి బిన్నీ బన్సాల్ ఆప్‌డోర్ ప్రారంభించిన తరువాత ఫ్లిప్‌కార్ట్‌లో కొన్ని వైరుధ్యాలు తలెత్తాయి. దీంతో ఈయన 2024 జనవరిలో సంస్థను వీడి బయటకు వచ్చేసారు. ఆ తరువాత ఫోన్‌పే బోర్డులో చేరారు. దానికిప్పుడు గుడ్ బై చెప్పేసారు.బిన్నీ బన్సాల్ ఫోన్‌పే నుంచి బయటకు వెళ్లడం గురించి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO), వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ స్పందిస్తూ.. సంస్థ ఎదగటానికి ప్రారంభం నుంచి ఆయన ఎంతో మద్దతు తెలిపారని.. ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. టీమ్‌లీజ్ సర్వీసెస్‌లో వైస్-ఛైర్మన్‌గా ఉన్న 'మనీష్ సబర్వాల్'ను స్వతంత్ర డైరెక్టర్, ఆడిట్ కమిటీ అధ్యక్షుడిగా నియమించారు. -
రెండేళ్లు.. లక్ష సేల్స్: ఈ కారు రేటెంతో తెలుసా?
భారతదేశంలో వాహన విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అయితే ప్రజలు కొన్ని బ్రాండ్ కార్లను మాత్రమే అధికంగా కొనుగోలు చేస్తుంటారు. ఇలాంటి కోవకు చెందిన కార్లలో ఒకటి ఇన్నోవా హైక్రాస్. ఇప్పటికే ఈ కారును లక్ష మంది కొనుగోలు చేసినట్లు సమాచారం. కేవలం రెండేళ్లలో కంపెనీ ఈ అరుదైన ఘనతను సాధించింది.2022లో అమ్మకానికి వచ్చిన టయోటా ఇన్నోవా హైక్రాస్.. ఇన్నోవా క్రిస్టాతో పాటు అమ్ముడైంది. ప్రారంభంలో అమ్మకాలు అంతంత మాత్రంగా ఉన్నపటికీ.. ఆ తరువాత సేల్స్ భారీగా పెరిగాయి. ఈ కారు పెట్రోల్ - హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ పొందుతుంది. కాబట్టి ఇది అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.ఇదీ చదవండి: పెరగనున్న బీఎండబ్ల్యూ ధరలు: ఎప్పటి నుంచో తెలుసా?టయోటా ఇన్నోవా హైక్రాస్ నాన్-హైబ్రిడ్ వేరియంట్లు 172 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసే 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. టాప్ వేరియంట్లు స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో 184 హార్స్ పవర్ అందించే 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ పొందుతాయి. మార్కెట్లో ఈ కారు ధరలు రూ. 19.77 లక్షల నుంచి రూ. 30.98 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ధరలు మీరు ఎంచుకునే వేరియంట్ ఆధారంగా మారుతూ ఉంటాయి. -
వాట్సప్ కొత్త ఫీచర్: దీని గురించి తెలిస్తే..
స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చిన తరువాత దాదాపు అందరూ వాట్సప్ వినియోగిస్తున్నారు. కంపెనీ కూడా యూజర్ల సౌకర్యార్థం.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ పరిచయం చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు తాజాగా 'వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్' అనే ఫీచర్ తీసుకువచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.వాట్సప్ పరిచయం చేసిన కొత్త వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్ ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లను టెక్స్ట్ రూపంలోకి మారుస్తుంది. ఇది చాలా ఉపయోగకరమైన ఫీచర్ అని పలువురు చెబుతున్నారు.నిజానికి వాయిస్ మెసేజ్ అనేది నలుగురిలో వినడానికి బహుశా చాలామందికి ఇష్టం ఉండకపోవచ్చు. అలాంటి వారు వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్.. ఉపయోగించి టెక్స్ట్ రూపంలోకి మార్చుకోవచ్చు. అయితే ఇది ట్రాన్స్‌లేటర్ కాదు, వాయిస్ మెసేజ్ ఏ రూపంలో ఉంటుందో.. ఆ భాషకు టెక్స్ట్ రూపం ఇస్తుంది.మెసేజ్ అందుకున్న వ్యక్తి మాత్రమే.. దీనిని వాయిస్ నుంచి టెక్స్ట్ రూపంలో మార్చుకోగలడు. కానీ పంపిన వ్యక్తికి ఆ అవకాశం లేదు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్లు ఇంగ్లీష్, రష్యన్, స్పానిష్, పోర్చుగీస్ వంటి భాషలకు సపోర్ట్ చేస్తాయి. ఐఓఎస్ ఫోన్లు ఇంగ్లీష్, రష్యన్, స్పానిష్, పోర్చుగీస్ భాషలకు మాత్రమే కాకుండా.. అరబిక్, చైనీస్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, జపనీస్ వంటి వాటికి సపోర్ట్ చేస్తాయి. రాబోయే రోజుల్లో.. మరిన్ని భాషలకు కూడా ఇవి సపోర్ట్ చేస్తాయి.ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే కంటే ఎక్కువ ఉద్యోగాలు!.. జెప్టో ఫౌండర్వాట్సప్ వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్ ఫీచర్ యాక్టివేట్ చేసుకోవాలంటే.. సెట్టింగ్స్‌లో చాట్స్ ఆప్షన్ ఎంచుకోవాలి. అక్కడ ఈ కొత్త ఫీచర్ కనిపిస్తుంది. దానిని ఆన్ లేదా ఆఫ్ చేసుకోవడం ద్వారా.. భాషను సెలక్ట్ చేసుకోవచ్చు. అయితే సపోర్ట్ చేయని భాషలను ఎంచుకుంటే.. ఎర్రర్ వస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉంది, రాబోయే రోజుల్లో ఇది యూజర్లందరికీ అందుబాటులోకి వస్తుంది. -
పెరగనున్న బీఎండబ్ల్యూ ధరలు: ఎప్పటి నుంచో తెలుసా?
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'బీఎండబ్ల్యూ' (BMW) 2025 జనవరి 1నుంచి కార్ల ధరలను 3 శాతం పెంచనున్నట్లు ప్రకటించింది. అయితే ఏ మోడల్ ధర ఎంత పెరుగుతుంది అనే విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.భారతదేశంలోని బీఎండబ్ల్యూ చెన్నై సదుపాయంతో 10 మోడళ్లను అసెంబుల్ చేసింది. ఇందులో ఎక్స్1, ఎక్స్3, ఎక్స్5, ఎక్స్7, ఎం340ఐ, 2 సిరీస్ గ్రాన్ కూపే, 3 సిరీస్ లాంగ్ వీల్‌బేస్, 5 సిరీస్ లాంగ్ వీల్‌బేస్, 7 సిరీస్ మొదలైనవి ఉన్నాయి. ఇక సీబీయూ మార్గం ద్వారా ఐ4, ఐ5, ఐ7, ఐ7 ఎం70, ఐఎక్స్1, ఐఎక్స్ వంటి ఎలక్ట్రిక్ కార్లు దిగుమతి అవుతాయి.ఇన్పుట్ ఖర్చులు పెరగడం వల్ల కంపెనీ తన ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే ఇప్పటికే మెర్సిడెస్ బెంజ్ కంపెనీ కూడా జనవరి 1 నుంచి తన వాహనాల ధరలను పెంచనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. బెంజ్ ధరల పెరుగుదలకు సంబంధించిన నిర్ణయం తీసుకున్న తరువాత, బీఎండబ్ల్యూ కూడా ఇదే బాటలో అడుగులు వేసింది. కాబట్టి బీఎండబ్ల్యూ కార్ల ధరలు వచ్చే ఏడాది ప్రారంభం నుంచే పెరగనున్నాయి. -
ఓలా ఎలక్ట్రిక్ కీలక నిర్ణయం: వందలాది ఉద్యోగులపై ఎఫెక్ట్
దేశీయ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric) 500 మంది ఉద్యోగులను తొలగించింది. సంస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఉద్యోగులను ఇంటికి పంపించినట్లు సమాచారం. ఇందులో వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు ఉన్నారు.భారతీయ విఫణిలో.. ప్రారంభం నుంచి అనేక విమర్శలకు గురవుతూ వస్తున్న ఓలా ఎలక్ట్రిక్.. ఇప్పటికి కూడా విక్రయానంత సేవలు అందించడంలో అంతంత మాత్రంగానే ఉందని.. చాలామంది కస్టమర్లు విమర్శిస్తూనే ఉన్నారు. ఈ తరుణంలో ఉద్యోగులను తొలగించడం అనేది కంపెనీ తీసుకున్న కఠినమైన నిర్ణయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఓలా ఎలక్ట్రిక్ లేఆఫ్స్ ప్రక్రియ జులై నుంచి కొనసాగుతున్నట్లు, ఇందులో భాగంగానే దశల వారీగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ లేఆఫ్స్ ప్రక్రియ ఈ నెల చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఉన్న ఉద్యోగులతో కంపెనీ లాభాలను గడించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.