ఐటీడీఏలో కలకలం | ACB Raids on ITDA Officer House | Sakshi
Sakshi News home page

ఐటీడీఏలో కలకలం

Published Sat, Jan 13 2018 6:59 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

ACB Raids on ITDA Officer House - Sakshi

ఉట్నూర్‌(ఖానాపూర్‌) : ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్‌ విభాగం ఈఈ ఎస్‌.రమేష్‌ ఇంటిపై, ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్య సోదాలు నిర్వహించారు. మరో మూడు చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించి రమేష్‌ను అరెస్టు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఫిర్యాదులతో కొంతకాలంగా నిఘా ఉంచిన ఏసీబీ అధికారులు ఒక్కసారిగా ఈఈటీడబ్ల్యూ రమేష్‌ నివాసం ఉండే ఐటీడీఏ క్వార్టర్స్, కార్యాలయంలో కరీంనగర్‌ ఏసీబీ సీఐ జి.వెంకటేశ్వర్లు, వరంగల్‌ ఏసీబీ సీఐ వాసాల సతీష్‌లు సోదాలు నిర్వహించగా ఖమ్మం, హైదరాబాద్‌లోని వనస్థలిపురం, వరంగల్‌ ప్రాంతాల్లోని బంధువుల నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.

సోదాల అనంతరం ఈఈటీడబ్ల్యూ ఎస్‌.రమేష్‌ను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. శనివారం కోర్టులో హాజరుపరుస్తామని పేర్కొన్నారు. ఈ సోదాల్లో విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే సమాచారంతో ఏకకాలంలో నాలుగు చోట్ల సోదాలు చేపట్టామని అన్నారు. తమ సోదాల్లో స్వాధీనం చేసుకున్న విలువైన పత్రాలు, ఆస్తుల వివరాలను క్రోడీకరించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని చెప్పారు. ఆయన సతీమణిపై ఉన్న బంగారు నగల విలువను నమోదు చేసుకున్నామని, సోదాలు నిర్వహిస్తున్నప్పుడు అక్కడికి చేరుకున్న కొందరు కాంట్రాక్టర్లు తమని నట్టేట ముంచాడని తమకు కాంట్రాక్ట్‌ పనులు ఇస్తానని నమ్మబలికి ఇతరులకు అప్పగించారని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. కాంట్రాక్టర్‌ల ఆరోపణతో స్పందించిన ఏసీబీ అధికారులు రాతపూర్వకంగా ఏసీబీ కోర్టులో ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు చేపడుతామని పేర్కొన్నారు.

గిరిజన ఇంజినీరింగ్‌ విభాగంలో ....
కొత్త జిల్లాల ఏర్పాటు నుంచే ఐటీడీఏకు పూర్తిస్థాయి ప్రాజెక్టు అధికారి లేకపోవడంతో పాలన గాడితప్పిందని ఆరోపణలు ఉన్నాయి. ఇన్‌చార్జి పాలనలోకి సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ వెళ్లడంతో అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారిందని గిరిజనులు ఆది నుంచీ ఆరోపిస్తున్నారు. ఐటీడీఏ విభాగాల్లో గిరిజన ఇంజినీరింగ్‌ విభాగం అతి ముఖ్యమైనది కావడం, పలు అభివృద్ధి పనులకు, గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు విడుదల చేస్తుండడంతో పనులు, నిధుల ఖర్చుపై  పర్యవేక్షణకు ప్రాజెక్టు అధికారి లేకపోవడంతో అవినీతి అక్రమాలకు బీజం పడిందనే ఆరోపణలు ఉన్నాయి. గిరిజన ఇంజినీరింగ్‌ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న పలువురు అధికారులు పర్సంటేజీలకు ఆశపడుతూ ఒకరికి కాక మరొకరికి పనులు అప్పగించడం, వారి నుంచి భారీగా అక్రమ వసూళ్లకు పాల్పడం షరా మామూలుగా మారిందని విమర్శలు ఉన్నాయి. ఏసీబీ అధికారులు ఐటీడీఏ ఈఈ టీడబ్ల్యూ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నప్పుడు ఓ కాంట్రాక్టర్‌ నేరుగా అధికారుల దగ్గరికే వచ్చే తనకు వచ్చిన కాంట్రాక్ట్‌ పనిని ఇంజినీరింగ్‌ అధికారులు మధ్యలో తమకు అనుకూలంగా ఉన్నవారికి అప్పగించారని ఫిర్యాదు చేశాడంటే ఆ విభాగంలో ఏ మేర అవినీతి చోటు చేసుకుంటుందో ఇట్టే తెలుస్తోంది. ఏసీబీ అధికారులు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణతో నేరుగా ఈఈ  రమేష్‌ను అరెస్టు చేయడంతో ఐటీడీఏ ఇంజినీరింగ్‌ విభాగంలో కలకలం చెలరేగడంతోపాటు ఎప్పుడు ఎవరిపై దాడులు జరుగుతాయోనని అధికారులు ఆందోళనలో పడ్డారు.

ఏసీబీ దాడులకు కేరాఫ్‌ ఉట్నూర్‌
గత కొన్నేళ్లుగా అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు ఉట్నూర్‌ కేంద్రంగా దాడులు చేయడం పరిపాటిగా మారింది. 2007లో మేజర్‌ గ్రామపంచాయితీ ఈఓను వలపన్ని పట్టుకున్నారు. 2009లో ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు శ్రీధర్‌ ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి నుంచి తన నివాసంలో లంచం తీసుకుంటూ పట్టుపడ్డాడు. 2011లో గిరిజన సహకార సంస్థ గోదాంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి ఇన్‌చార్జి అధికారి వసంత్‌పై విచారణ చేపట్టారు. 2013 ఆగస్టు 3న ఇంద్రవెల్లి మండలం గృహనిర్మాణ శాఖ కాంట్రాక్ట్‌ ఏఈ రాథోడ్‌ అరవింద్‌ ఉట్నూర్‌ పాతబస్టాండ్‌ సమీపంలోని ఓ హోటల్‌ వద్ద ఇంద్రవెల్లి మండలం మిలింద్‌నగర్‌కు చెందిన వాగ్మారే దయానంద్‌ నుంచి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కోసం రూ.10 వేలు లంచం తీసుకుంటూ పట్టుపడ్డాడు. 2016 ఆగస్టు 19న ప్రభుత్వం నిర్వహించిన కుటుంబ సమగ్ర సర్వే ఆన్‌లైన్‌ డాటా ఎంట్రీ బిల్లు మంజూరు కోసం ఉట్నూర్‌ తహసీల్దార్‌ అర్షద్‌ రహమాన్‌ మండల కేంద్రంలోని క్లాసిక్‌ కంప్యూటర్‌ నిర్వాహకుడు సయ్యద్‌ నిసార్‌ నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ పట్టుపడ్డాడు. తాజాగా ఏసీబీ అధికారులు ఈఈ టీడబ్ల్యూ రమేష్‌ నివాసంతోపాటు కార్యాలయంపై దాడులు చేయడంతో ఏజెన్సీలో అవినీతి అధికారులపై చర్చ మొదలైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement