ITDA officer
-
ఇలా విని... అలా నియామకం
సాక్షి, పాడేరు: గిరిజనుల సమస్యల పరిష్కారంలో ఐటీడీఏ పీవో ఆర్.గోపాలకృష్ణ తనదైన ముద్ర వేసుకుంటున్నారు. తన పరిధిలో వాటికి ఆగమేఘాల మీద పరిష్కారం చూపుతూ సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నారు. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం వేర్లమామిడి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు బదిలీ కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మంగళవారం పాడేరు కలెక్టరేట్‌కు తరలివచ్చారు. వీరంతా అక్కడ ఉండటాన్ని పీవో గమనించి పిలిచి ఎందుకు వచ్చారని అడిగారు. ఇటీవల తమ ఉపాధ్యాయుడిని చింతపల్లి మండలం ఉమరాసగొంది పాఠశాలకు బదిలీ చేశారని వాపోయారు. వెంటనే గిరిజన సంక్షేమ శాఖ విద్యా విభాగం అధికారులకు ఫోన్ చేసి ఉపాధ్యాయుడిని నియమించాలని ఆదేశించారు. అయితే అదే రోజు సాయంత్రం పాఠశాలకు తాత్కాలిక ఉపాధ్యాయినిగా ఎం.రాజేశ్వరిని నియమిస్తూ పీవో ఆదేశాలు జారీ చేశారు. కొక్కిరాపల్లి ఆశ్రమ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఆమెను బుధవారం విధుల్లోకి చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించిన ఐటీడీఏ పీవోకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. శరవేగంగా నిర్మాణాలు పూర్తి చేయాలి ఏజెన్సీలో చేపట్టిన నిర్మాణపు పనులు శరవేగంగా పూర్తి చేయాలని ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ ఇంజినీర్లను ఆదేశించారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, అంగన్వాడీ, డిజిటల్ లైబ్రరీ భవనాలు, మిషన్ కనెక్ట్ పాడేరు, రెండో దశ నాడు–నేడు నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. వీటికి సంబంధించి బిల్లులు సమర్పిస్తే త్వరితగతిన చెల్లిస్తామన్నారు. 58 గ్రావిటీ తాగునీటి పథకాలను నిర్దేశించిన సమయానికి పూర్తి చేయాలని ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్లను ఆదేశించారు. ఎప్పటికప్పుడూ పనులను పర్యవేక్షించాలన్నారు. కొత్త జిల్లాలో ప్రభుత్వ అంచనాల మేరకు పని చేయాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఈఈలు డీవీఆర్‌ఎం రాజు, కె.వేణుగోపాల్, పంచాయతీరాజ్ ఈఈ కె.లావణ్యకుమార్, గృహ నిర్మాణ శాఖ ఈఈ రఘుభూషణరావు పాల్గొన్నారు. హెచ్‌ఎన్‌టీసీల అభివృద్ధికి ప్రణాళికలపై ఆదేశం ఐటీడీఏ పరిధిలోని ఉద్యానవన విభాగాల(హెచ్‌ఎన్‌టీసీ) అభివృద్ధికి సమగ్రమైన కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ ఆదేశించారు. తన కార్యాలయంలో చింతపల్లి, కొత్తవలస హెచ్‌ఎన్‌టీసీల అభివృద్ధిపై ఉద్యానవన, డ్వామా అధికారులతో ఆయన మాట్లాడారు. ఏజెన్సీలోని అగ్రి టూరిజం అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. హెచ్‌ఎన్‌టీసీల్లో పండ్ల, పూలమొక్కలు, మెడిసిన్ ప్లాంట్ల నర్సరీలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వీటి ని పర్యాటకులు, స్థానిక గిరిజన రైతులకు సరఫరా చేస్తా మన్నారు. ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, డ్వామా పీడీ ఎన్.రమేష్‌రామన్, పీహెచ్‌వో అశోక్, డ్వామా ఏపీడీ రామారావు, ఉద్యానవన శాస్త్రవేత్త బిందు పాల్గొన్నారు. -
గిరిజనులకు మాత్రమే హక్కుంది..
ఖమ్మంమయూరిసెంటర్: షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజనులకు మాత్రమే భూములపై హక్కు ఉందని, వారి దగ్గరి నుంచి ఎవరైనా గిరిజనేతరులు భూములు అక్రమంగా ఆక్రమించుకుంటే నేరమని ఐటీడీఏ పీఓ వీపీ.గౌతమ్ పేర్కొన్నారు. నగరంలోని టీటీడీసీ సమావేశ మందిరంలో ఎల్టీఆర్(ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్) కేసు భూములకు సంబంధించి తహసీల్దార్లతో మండలాలవారీగా బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీఓ మాట్లాడుతూ గిరిజనుల నుంచి ఆక్రమించుకున్న భూములను గుర్తించి, ఎల్టీఆర్ ద్వారా పరిష్కారమైన భూములను వారికి అప్పగించాలన్నారు. గిరిజనులకు భూములను అప్పగించే సమయంలో గిరిజనేతరులు వినకుంటే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. కోర్టు ఆదేశాలు ఉన్న గిరిజనులకు వెంటనే పంచనామా చేసి.. ఆ భూములను అందేలా చూడాలన్నారు. మండలాల్లో ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఉంటే గుర్తించి.. పంచనామా చేసి ప్రతిపాదనలు పంపించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అనురాగ్ జయంతి, ట్రెయినీ కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఇన్చార్జ్ డీటీడీఓ అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఇంనీరింగ్ అధికారులపై ఆగ్రహం.. కాగా.. అధికారులతో సమీక్ష సమావేశం అనంతరం ఖమ్మం నగరంలోని నయాబజార్ కళాశాల ఎదుట నిర్మిస్తున్న మహిళా వసతి గృహాన్ని పీఓ పరిశీలించారు. వసతి గృహ నిర్మాణం ఆలస్యంపై ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భవన నిర్మాణం ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా నిర్మాణం పూర్తికాకపోవడంపై అధికారులను ప్రశ్నించారు. నిర్లక్ష్యం చేస్తున్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రెండు నెలల్లో భవన నిర్మాణం పూర్తి కావాలని, 15 రోజులకు ఒక ఫ్లోర్ నిర్మాణం జరగాలని ఆదేశించారు. భవన నిర్మాణంలో ఎలాంటి అలసత్వం వహించినా సంబంధీకులపై చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో డీఈ మురళి, ఏఈ ప్రసాద్ పాల్గొన్నారు. -
సారూ.. ఉపాధి కల్పించరూ..?
సాక్షి, శ్రీకాకుళం : ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ ఐటీడీఏలో సోమవారం జరిగిన గిరిజన దర్బార్‌లో పలువురు గిరిజనులు ఐటీడీఏ పరిపాలనాధికారి ఎల్.ఆనందరావుకు పెద్దమడికాలనీ, సీతంపేట, గడిగుడ్డిలకు చెందిన జన్నివాడు, జ్యోతి, సోమేశ్వర్రావు వినతిపత్రాలు సమర్పించారు. జీతం ఇప్పించాలని లబ్బకు చెందిన కీర్తి, విద్యుత్ స్తంభాలకు మరమ్మతులు చేయాలని నందిగాంకు చెందిన గున్నయ్య కోరారు. స్టాఫ్‌నర్స్ ఉద్యోగం ఇప్పించాలని దీనబందుపురానికి చెందిన తేజమ్మ పేర్కొన్నారు. ఆరో తరగతిలో చదివేందుకు సీటు ఇప్పించాలని కొత్తగూడకు చెందిన సౌందర్య విన్నవించారు. తిత్లీ నష్ట పరిహారం అందజేయాలని జాడుపల్లికి చెందిన పారమ్మ, గాసన్న వినతిపత్రం అందించారు. గ్రావిటేషన్ ఫ్లో మంజూరు చేయాలని గోటిగూడ గ్రామానికి చెందిన మోహన్‌రావు, ఆటో కొనుగోలుకు రుణం ఇప్పించాలని వజ్జాయిగూడకు చెందిన చంద్రరావు కోరారు. కొత్త పంచాయతీ భవనం నిర్మించాలని ఇరపాడుకు చెందిన రామారావు, తాగునీటి సదుపాయం కల్పించాలని కన్నయ్యగూడకు చెందిన దుర్గారావు విన్నవించారు. బోరు మంజూరు చేయాలని సూదిరాయగూడకు చెందిన ఎండయ్య, యూనిఫాం కుట్టేందుకు అనుమతి ఇప్పించాలని పెద్దూరుకు చెందిన పార్వతీ అధికారులకు వినతిపత్రం అందజేశారు. సీఆర్టీ పోస్టు ఇప్పించాలని టెక్కలికి చెందిన ధనలక్ష్మి, పూనుపేటకు చెందిన రోహిణి పేర్కొన్నారు. నాటుకోళ్ల ఫారం పెట్టేందుకు రుణం ఇప్పించాలని ఉల్లిమానుగూడకు చెందిన సుంకయ్య, ఆశ వర్కర్ పోస్టు ఇప్పించాలని వి.కుమారి తెలిపారు. జలసిరి బోరు మంజూరు చేయాలని మనుమకొండకు చెందిన అన్నయ్య, రక్షణగోడ ఇప్పించాలని దీనబంధుపురానికి చెందిన లక్ష్మణరావు కోరారు. డీ పట్టాలు ఇప్పించాలని చిన్నబగ్గ కాలనీకి చెందిన కృష్ణారావు, మొబైల్ దుకాణం పెట్టుకునేందుకు రుణం ఇప్పించాలని భరణికోటకు చెందిన వినోద్ విన్నవించారు. చెరువు పనులు చేయించాలని సందిమానుగూడకు చెందిన బి.కూర్మారావు, బొండి గ్రామానికి చెందిన నాగేశ్వర్రావు పాఠశాల తెరిపించాలని వినతిపత్రం అందజేశారు. దర్బార్‌లో ఈఈ మురళీ, డైజీ, హౌసింగ్ ఏఈ సంగమేషు తదితరులు పాల్గొన్నారు. -
శ్రీకాకుళం.. మీ ఓటు ఉందా ? లేదా.. తెలుసుకొండి
సాక్షి, శ్రీకాకుళం : నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ (www.nvsp.in) ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటర్ ఐడీ కార్డు ఎపిక్ నంబర్ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు. 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. www.ceoandhra.nic.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే search your name పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల ప్రత్యేక సెల్లో ఓటరు కార్డు ఎపిక్ నంబర్ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి అక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చు. మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు Check Your Vote పేరుతో ఎన్నికల అధికారులు ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఓటు ఉందో లేదో సరిచూసుకోవడానికి ఇవి ఉపయోగపడ్డాయి. ఈసారి కూడా అటువంటి సౌకర్యం అందుబాటులోకి వస్తే.. వినియోగించుకోవచ్చు. సాధారణంగా ఎన్నికల నామినేషన్‌కు వారం ముందు వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంటుంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు. మీ ఓటుకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా ఈ మొబైల్ నంబరుకు సంప్రదించవచ్చు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్, శ్రీకాకుళం , సెల్ నెంబర్ : 7995995801 - ప్రజల చైతన్యం కోసమే సాక్షి ప్రయత్నం -
ఆశ్రమ పాఠశాలలో యూనిసెఫ్ బృందం
సాక్షి, వాంకిడి(ఆసిఫాబాద్): మండలంలోని వాంకిడి గిరిజన బాలికల ఉన్నత పాఠశాల, బంబార ఆశ్రమ ఉన్నత పాఠశాలలను శుక్రవారం యూనిసెఫ్ బృందం సభ్యులు తనిఖీ చేశారు. ఆయా పాఠశాలలో నిర్వహిస్తున్న నవోదయ, ప్రథం, వేదిక్ మ్యాథ్స్, వందేమాతరం, దిశ మోడల్ స్కూల్ నిర్వహణ విషయాలు పరిశీలించారు. అనంతరం తరగతి వారీగా విద్యార్థులకు బోధన అంశాలపై, మధ్యాహ్న భోజన నిర్వహణ, సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. యూనిసెఫ్ ఎడ్యుకేషనల్ చీఫ్ రాంచంద్రరావు బెగూర్ మాట్లాడుతూ గత నవంబర్‌మాసం నుంచి ఆయా పాఠశాలల్లో ఈ కార్యక్రమాలు ప్రవేశపెట్టామని తెలిపారు. అప్పటి నుంచి కార్యక్రమాల తీరుపై పరిశీలన చేస్తున్నామని తెలిపారు. విద్యార్థుల్లో వచ్చిన మార్పులపై వివరాల సేకరణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పాఠశాలల పనితీరు బట్టి ఆయా పాఠశాలల్లో కావాల్సిన వసతులకు నిధులు మంజూరు చేస్తామన్నారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు వసతులు కల్పించడమే యూనిసెఫ్ ముఖ్యఉద్దేశమన్నారు. వారి వెంట యూనిసెఫ్ స్టేట్ ఎడ్యుకేషనల్ స్పెషలిస్టు సుకన్య, ఐటీడీఏ పీవో కష్ణ ఆదిత్య, డీటీడీవో దిలీప్‌కుమార్, ఏటీడీవో కనకదుర్గ, హెచ్ఎండి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి ఆసిఫాబాద్‌రూరల్: దిశ మోడల్ స్కూల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని గిరిజన అభివృద్ధి ప్రాజెక్టు అధికారి కిష్ట్ర ఆదిత్య అన్నారు. శుక్రవారం మండలంలోని వట్టివాగు కాలనీలో పైలెట్ ప్రాజెక్టు కింద నూతనంగా ఏర్పాటు చేసిన దిశ మోడల్ స్కూల్‌ను సెంట్రల్ స్టేట్ యూనిసెఫ్ ప్రతినిధి రామ చంద్రన్, డీటీడీవో దిలీప్‌కుమార్ సందర్శించి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ఇంగ్లిష్ మీడియం బోధన సౌకర్యాలు, హాజరు శాతం, మెనూ ప్రకారం భోజనం వంటి విషయాలు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యా సామర్థాలు, నైపుణ్యాలు ప్రదర్శించడంతో అభినంధించారు. దీంతోపాటు గ్రామస్తులు పాఠశాల చుట్టు ప్రహరీ గోడ, కమ్యూనిటీ భవనం నిర్మించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో ఎసీఎంవో ఉద్దవ్, జీసీడీవో శకుంతల, సీఆర్పీ రవీందర్ పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు. -
ఐటీడీఏలో కలకలం
ఉట్నూర్(ఖానాపూర్) : ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ విభాగం ఈఈ ఎస్.రమేష్ ఇంటిపై, ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్య సోదాలు నిర్వహించారు. మరో మూడు చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించి రమేష్‌ను అరెస్టు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఫిర్యాదులతో కొంతకాలంగా నిఘా ఉంచిన ఏసీబీ అధికారులు ఒక్కసారిగా ఈఈటీడబ్ల్యూ రమేష్ నివాసం ఉండే ఐటీడీఏ క్వార్టర్స్, కార్యాలయంలో కరీంనగర్ ఏసీబీ సీఐ జి.వెంకటేశ్వర్లు, వరంగల్ ఏసీబీ సీఐ వాసాల సతీష్‌లు సోదాలు నిర్వహించగా ఖమ్మం, హైదరాబాద్‌లోని వనస్థలిపురం, వరంగల్ ప్రాంతాల్లోని బంధువుల నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. సోదాల అనంతరం ఈఈటీడబ్ల్యూ ఎస్.రమేష్‌ను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. శనివారం కోర్టులో హాజరుపరుస్తామని పేర్కొన్నారు. ఈ సోదాల్లో విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే సమాచారంతో ఏకకాలంలో నాలుగు చోట్ల సోదాలు చేపట్టామని అన్నారు. తమ సోదాల్లో స్వాధీనం చేసుకున్న విలువైన పత్రాలు, ఆస్తుల వివరాలను క్రోడీకరించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని చెప్పారు. ఆయన సతీమణిపై ఉన్న బంగారు నగల విలువను నమోదు చేసుకున్నామని, సోదాలు నిర్వహిస్తున్నప్పుడు అక్కడికి చేరుకున్న కొందరు కాంట్రాక్టర్లు తమని నట్టేట ముంచాడని తమకు కాంట్రాక్ట్ పనులు ఇస్తానని నమ్మబలికి ఇతరులకు అప్పగించారని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. కాంట్రాక్టర్ల ఆరోపణతో స్పందించిన ఏసీబీ అధికారులు రాతపూర్వకంగా ఏసీబీ కోర్టులో ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు చేపడుతామని పేర్కొన్నారు. గిరిజన ఇంజినీరింగ్ విభాగంలో .... కొత్త జిల్లాల ఏర్పాటు నుంచే ఐటీడీఏకు పూర్తిస్థాయి ప్రాజెక్టు అధికారి లేకపోవడంతో పాలన గాడితప్పిందని ఆరోపణలు ఉన్నాయి. ఇన్చార్జి పాలనలోకి సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ వెళ్లడంతో అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారిందని గిరిజనులు ఆది నుంచీ ఆరోపిస్తున్నారు. ఐటీడీఏ విభాగాల్లో గిరిజన ఇంజినీరింగ్ విభాగం అతి ముఖ్యమైనది కావడం, పలు అభివృద్ధి పనులకు, గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు విడుదల చేస్తుండడంతో పనులు, నిధుల ఖర్చుపై పర్యవేక్షణకు ప్రాజెక్టు అధికారి లేకపోవడంతో అవినీతి అక్రమాలకు బీజం పడిందనే ఆరోపణలు ఉన్నాయి. గిరిజన ఇంజినీరింగ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న పలువురు అధికారులు పర్సంటేజీలకు ఆశపడుతూ ఒకరికి కాక మరొకరికి పనులు అప్పగించడం, వారి నుంచి భారీగా అక్రమ వసూళ్లకు పాల్పడం షరా మామూలుగా మారిందని విమర్శలు ఉన్నాయి. ఏసీబీ అధికారులు ఐటీడీఏ ఈఈ టీడబ్ల్యూ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నప్పుడు ఓ కాంట్రాక్టర్ నేరుగా అధికారుల దగ్గరికే వచ్చే తనకు వచ్చిన కాంట్రాక్ట్ పనిని ఇంజినీరింగ్ అధికారులు మధ్యలో తమకు అనుకూలంగా ఉన్నవారికి అప్పగించారని ఫిర్యాదు చేశాడంటే ఆ విభాగంలో ఏ మేర అవినీతి చోటు చేసుకుంటుందో ఇట్టే తెలుస్తోంది. ఏసీబీ అధికారులు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణతో నేరుగా ఈఈ రమేష్‌ను అరెస్టు చేయడంతో ఐటీడీఏ ఇంజినీరింగ్ విభాగంలో కలకలం చెలరేగడంతోపాటు ఎప్పుడు ఎవరిపై దాడులు జరుగుతాయోనని అధికారులు ఆందోళనలో పడ్డారు. ఏసీబీ దాడులకు కేరాఫ్ ఉట్నూర్ గత కొన్నేళ్లుగా అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు ఉట్నూర్ కేంద్రంగా దాడులు చేయడం పరిపాటిగా మారింది. 2007లో మేజర్ గ్రామపంచాయితీ ఈఓను వలపన్ని పట్టుకున్నారు. 2009లో ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు శ్రీధర్ ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి నుంచి తన నివాసంలో లంచం తీసుకుంటూ పట్టుపడ్డాడు. 2011లో గిరిజన సహకార సంస్థ గోదాంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి ఇన్చార్జి అధికారి వసంత్‌పై విచారణ చేపట్టారు. 2013 ఆగస్టు 3న ఇంద్రవెల్లి మండలం గృహనిర్మాణ శాఖ కాంట్రాక్ట్ ఏఈ రాథోడ్ అరవింద్ ఉట్నూర్ పాతబస్టాండ్ సమీపంలోని ఓ హోటల్ వద్ద ఇంద్రవెల్లి మండలం మిలింద్నగర్కు చెందిన వాగ్మారే దయానంద్ నుంచి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కోసం రూ.10 వేలు లంచం తీసుకుంటూ పట్టుపడ్డాడు. 2016 ఆగస్టు 19న ప్రభుత్వం నిర్వహించిన కుటుంబ సమగ్ర సర్వే ఆన్లైన్ డాటా ఎంట్రీ బిల్లు మంజూరు కోసం ఉట్నూర్ తహసీల్దార్ అర్షద్ రహమాన్ మండల కేంద్రంలోని క్లాసిక్ కంప్యూటర్ నిర్వాహకుడు సయ్యద్ నిసార్ నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ పట్టుపడ్డాడు. తాజాగా ఏసీబీ అధికారులు ఈఈ టీడబ్ల్యూ రమేష్ నివాసంతోపాటు కార్యాలయంపై దాడులు చేయడంతో ఏజెన్సీలో అవినీతి అధికారులపై చర్చ మొదలైంది. -
ఉట్నూర్ ఐటీడీఏ ఈఈ ఇంటిపై దాడులు
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని ఈఈ రమేష్‌పై ఆరోపణలు ఉన్నాయి. దీంతో నిఘా పెట్టిన ఏసీబీ శుక్రవారం తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్, వరంగల్, ఉట్నూరు సహా 8 చోట్ల అవినీతి నిరోధక శాఖ ఏకకాలంలో సోదాలు జరుపుతోంది. రమేశ్ బంధువులు, కుటుంబ సభ్యుల ఇళ్లల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. కాగా, గడిచిన రెండేళ్లుగా రమేష్ ఐటీడీఏ ఈఈగా పని చేస్తున్నారు. గతంలోనూ ఆయనపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. -
డీడీటీడబ్ల్యూ సస్పెన్షన్
ఉట్నూర్, న్యూస్‌లైన్ : ఐటీడీఏ గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకులు ఎంఏ.రషీద్‌ను సస్పెండ్ చేస్తూ గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎ.విద్యాసాగర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, రషీద్‌ను సస్పెండ్ చేసినట్లు ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్ ఈ నెల 18న పత్రిక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డీడీటీడబ్ల్యూను సస్పెండ్ చేసే అధికారం ఐటీడీఏ పీవోకు లేదని, గతంలో సస్పెండైన గెజిటెడ్, నాన్‌గెజిటెడ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పోస్టింగ్ ఇవ్వాలని కోరుతూ ఐటీడీఏ ఎదుట మూడు రోజులుగా ఉద్యోగులు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గిరిజన సంక్షేమ శాఖ నుంచి శనివారం రషీద్ సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడడం గమనార్హం. విధి నిర్వహణలో బాధ్యతరాహిత్యం, ఉన్నతాధికారుల ఆదేశాలు పట్టించుకోకపోవడం, రూల్ 3 ఆఫ్ సీసీఎల్ 1991కు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగిగా ధర్నాలో పాల్గొనడం, ఉన్నతాధికారులపై ఒత్తిడి తేవడం తదితర చర్యలకు పాల్పడినందుకు జీవో నంబర్ 274 ప్రకారం రషీద్‌ను సస్పెండ్ చేసినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
మూణ్నాళ్ల ముచ్చటే నా..!
ఖమ్మం, న్యూస్‌లైన్ : కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలల ప్రత్యేకాధికారుల ఉద్యోగం మూణ్నాళ్ల ముచ్చటగానే మారింది. రాజీవ్ విద్యామిషన్ అధికారులు కేజీబీవీ ఎస్‌వోలకు ఉద్యోగ నియామకాల పత్రాలు ఇచ్చి పాఠశాలకు వెళ్లమని చెప్పారు. అయితే మైదాన ప్రాంత అభ్యర్థులు ఏజన్సీ పాఠశాలల్లో పనిచేయడానికి ఒప్పుకునేది లేదని, ఇక్కడి నుంచి తిరిగి వెళ్లాలని ఐటీడీఏ అధికారులు ఆదేశించారు. దీంతో ఇప్పటి వరకు చేస్తున్న ఉద్యోగాలను వదులుకున్న ఎస్వోలు గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగం చేసే అవకాశం లేకపోవడంతో లబోదిబోమంటూ ఆర్వీఎం అధికారి వద్దకు వచ్చి మొరపెట్టుకున్నారు. బాలికల విద్యను మెరుగుపరిచేందుకు దేశవ్యాప్తంగా కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలను ప్రారంభించారు. ఇలా జిల్లాలో ఆర్వీఎం ఆధ్వర్యంలో 21, ఏపీఆర్ఈఐఎస్ పరిధిలో నాలుగు, ఏపీడబ్ల్యూఆర్ఈఐఎస్ పరిధిలో ఎనిమిది మొత్తం 33 పాఠశాలలు మంజూరు చేశారు. వీటి నిర్వహణకు ఉద్యోగ విరమణ పొందిన పలువురు ఉపాధ్యాయులను ప్రత్యేకాధికారులుగా నియమించారు. వీరి పర్యవేక్షణ లోపంతో కేజీబీవీ లక్ష్యం నెరవేరడం లేదని అభిప్రాయపడిన రాష్ట్ర అధికారులు.. ప్రత్యేక అధికారుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తు చేసుకున్న మహిళా అభ్యర్థులకు వరంగల్‌లో రాత పరీక్ష నిర్వహించి తొలుత 28 మందిని ఎంపిక చేశారు. ఆ తర్వాత వయసు తక్కువగా ఉందని ఒకరిని, ఏ కారణం చూపకుండానే మరొకరిని పక్కన పెట్టి మిగితా 26 మందికి ఎస్‌వోలుగా నియామక పత్రాలు అందజేశారు. ఇందులో 17 మందిని ఏజెన్సీ ప్రాంత పాఠశాలలకు, 9 మందిని మైదాన ప్రాంతాలకు పంపించారు. అయితే మైదాన ప్రాంత ఎస్‌వోలకు ఎలాంటి ఆటంకాలు లేనప్పటికీ, ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లిన వారిలో కూనవరం మినహా మిగితా 16 మంది మైదాన ప్రాంత అభ్యర్థులే కావడంతో వారు ఇక్కడ ఉద్యోగం చేసేందుకు అనర్హులని, తక్షణమే ఇక్కడినుంచి వెళ్లాలని ఐటీడీఏ పీవో ఆదేశించారు. నెలకు రూ.20 వేల వేతనం, బాలికలకు విద్య బోధించడం, మహిళా ఉపాధ్యాయులతోనే కలిసి పనిచేసే అవకాశం రావడంతో ఉత్సాహంగా వెళ్లిన ఎస్వోలు అక్కడ ఏర్పడిన పరిస్థితితో కంగుతిన్నారు. ఏజన్సీ, మైదాన ప్రాంతాల్లో వేర్వేరుగా ఉంటారనే విషయం తమకు నోటిఫికేషన్ సందర్భంగా కానీ, నియామక పత్రాలు ఇచ్చినప్పుడు కానీ చెప్పలేదని ఆర్వీఎం పీవో శ్రీనివాస్ ఎదుట మంగళవారం తమ గోడు వినిపించారు. ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలో మెరిట్ సాధించామని, తమ స్వగ్రామాలకు దగ్గరగా ఉంటుందనే ఆలోచనతో ఏజెన్సీ ప్రాంతాలను ఎంపిక చేసుకున్నామని, అక్కడికి వెళ్తే ఈ పరిస్థితి ఎదురైందని వాపోయారు. దీనికోసం వెళ్తే గతంలో చేసిన ఉద్యోగం పోయిందని, ఇప్పుడు ఈ ఉద్యోగానికి అవకాశం లేకుంటే తమ పరిస్థితి ఏమిటని, ఎలాగైనా న్యాయం చేయాలని పీవోను వేడుకున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా ఈ విషయాన్ని రాష్ట్ర రాజీవ్ విద్యామిషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. ఎస్‌వోల నియామక ప్రక్రియ అంతా హైదరాబాద్‌లోని ఆర్వీఎం ప్రధాన కార్యాలయంలోనే జరిగింది. అప్పటి వరకు ఎస్వోలు స్థానికంగా ఉన్న కేజీబీవీల్లోకి వెళ్లి సీఆర్టీలుగా పనిచేయవచ్చు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే వారివారి పాఠశాలలకు వెళ్లాల్సి ఉంటుంది. - శ్రీనివాస్, ఆర్వీఎం పీవో