దర్బార్‌లో వినతులు స్వీకరిస్తున్న పరిపాలనాధికారి
సాక్షి, శ్రీకాకుళం : ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ ఐటీడీఏలో సోమవారం జరిగిన గిరిజన దర్బార్‌లో పలువురు గిరిజనులు ఐటీడీఏ పరిపాలనాధికారి ఎల్.ఆనందరావుకు పెద్దమడికాలనీ, సీతంపేట, గడిగుడ్డిలకు చెందిన జన్నివాడు, జ్యోతి, సోమేశ్వర్రావు వినతిపత్రాలు సమర్పించారు. జీతం ఇప్పించాలని లబ్బకు చెందిన కీర్తి, విద్యుత్ స్తంభాలకు మరమ్మతులు చేయాలని నందిగాంకు చెందిన గున్నయ్య కోరారు. స్టాఫ్‌నర్స్ ఉద్యోగం ఇప్పించాలని దీనబందుపురానికి చెందిన తేజమ్మ పేర్కొన్నారు. ఆరో తరగతిలో చదివేందుకు సీటు ఇప్పించాలని కొత్తగూడకు చెందిన సౌందర్య విన్నవించారు. తిత్లీ నష్ట పరిహారం అందజేయాలని జాడుపల్లికి చెందిన పారమ్మ, గాసన్న వినతిపత్రం అందించారు. గ్రావిటేషన్ ఫ్లో మంజూరు చేయాలని గోటిగూడ గ్రామానికి చెందిన మోహన్‌రావు, ఆటో కొనుగోలుకు రుణం ఇప్పించాలని వజ్జాయిగూడకు చెందిన చంద్రరావు కోరారు. కొత్త పంచాయతీ భవనం నిర్మించాలని ఇరపాడుకు చెందిన రామారావు, తాగునీటి సదుపాయం కల్పించాలని కన్నయ్యగూడకు చెందిన దుర్గారావు విన్నవించారు.
బోరు మంజూరు చేయాలని సూదిరాయగూడకు చెందిన ఎండయ్య, యూనిఫాం కుట్టేందుకు అనుమతి ఇప్పించాలని పెద్దూరుకు చెందిన పార్వతీ అధికారులకు వినతిపత్రం అందజేశారు. సీఆర్‌టీ పోస్టు ఇప్పించాలని టెక్కలికి చెందిన ధనలక్ష్మి, పూనుపేటకు చెందిన రోహిణి పేర్కొన్నారు. నాటుకోళ్ల ఫారం పెట్టేందుకు రుణం ఇప్పించాలని ఉల్లిమానుగూడకు చెందిన సుంకయ్య, ఆశ వర్కర్ పోస్టు ఇప్పించాలని వి.కుమారి తెలిపారు. జలసిరి బోరు మంజూరు చేయాలని మనుమకొండకు చెందిన అన్నయ్య, రక్షణగోడ ఇప్పించాలని దీనబంధుపురానికి చెందిన లక్ష్మణరావు కోరారు. డీ పట్టాలు ఇప్పించాలని చిన్నబగ్గ కాలనీకి చెందిన కృష్ణారావు, మొబైల్ దుకాణం పెట్టుకునేందుకు రుణం ఇప్పించాలని భరణికోటకు చెందిన వినోద్ విన్నవించారు. చెరువు పనులు చేయించాలని సందిమానుగూడకు చెందిన బి.కూర్మారావు, బొండి గ్రామానికి చెందిన నాగేశ్వర్రావు పాఠశాల తెరిపించాలని వినతిపత్రం అందజేశారు. దర్బార్‌లో ఈఈ మురళీ, డైజీ, హౌసింగ్ ఏఈ సంగమేషు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment