Memorandums
-
మాది న్యాయ పోరాటం!
సాక్షి, హైదరాబాద్: ‘మాది న్యాయపోరాటం.. ఆర్టీసీని పరిరక్షించు కోవటమే ధ్యేయంగా సమ్మె చేస్తున్నాం. ఇప్పటికైనా సీఎం స్పందించి చర్చలకు ఆహ్వానించాలి. మీరైనా ఆయనకు చెప్పండి’అంటూ ఆర్టీసీ కార్మికులు మంత్రులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులను కలిసి విజ్ఞప్తి చేశారు. తమ సమ్మెకు మద్దతు తెలపాలంటూ విపక్షాల ప్రజాప్రతినిధులనూ కోరారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా 19వ రోజైన బుధవారం మండల స్థాయి ప్రజాప్రతినిధి నుంచి ఎంపీ వరకు అందరినీ కలిసి విన్నవించు కున్నారు. వారికి వినతిపత్రాలు సమర్పించారు. నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని కలసి ఆయనకు వినతిపత్రం ఇచ్చి సమ్మెకు మద్దతివ్వాలని కోరారు. తాను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీ ఇచ్చారు. హన్మకొండలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కలసి వినతిపత్రం ఇచ్చారు. ఆర్టీసీ పరిరక్షణ ఒక్క కేసీఆర్‌తోనే సాధ్యమని, కొన్ని రాజకీయ పార్టీలు కావాలనే కార్మికులను రెచ్చగొట్టి సమ్మెకు పోయేలా చేశాయని మంత్రి ఆరోపించారు. ఆదిలాబాద్‌లో నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో అటు వైపు వచ్చిన ఎమ్మెల్యే జోగు రామన్న కారు ఆపి వినతి పత్రం ఇచ్చారు. వారి వినతిని సీఎం దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. ఎంపీ బండ ప్రకాశ్, చీఫ్ విప్ వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, శంకర్ నాయక్, రాజయ్యలకు కూడా వినతి పత్రాలు అందించారు. మంచిర్యాల బస్టాండు వద్ద ఏర్పాటు చేసిన జేఏసీ శిబిరాన్ని పోలీసులు తొలగించటంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. సాయంత్రం తర్వాత పోలీసులు తిరిగి శిబిరం ఏర్పాటుకు సమ్మతించటంతో శాంతించారు. కరీంనగర్లో మంత్రి ఈటల ఇంటి ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు. వినతిపత్రం తీసుకునేందుకు ఎవరూ అందుబాటులో లేకపోవటంతో ఇంటి గోడకు అతికించారు. మంత్రి గంగుల కమలాకర్ ఇంటి ఎదుట కూడా ధర్నా నిర్వహించి కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం ఇచ్చారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ ఇంటి ఎదుట ధర్నా నిర్వహించి పీఏకు వినతిపత్రం అందజేశారు. నల్లగొండ జెడ్పీ సమావేశం జరుగుతున్న సమయంలో సమావేశ మందిరం ఎదుట కార్మికులు ధర్నా చేశారు. సమావేశంలో పాల్గొన్న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందజేశారు. సూర్యాపేటలో ఆర్టీసీ నిరసనల్లో సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు. ఖమ్మం డిపో ఎదుట దివంగత డ్రైవర్ శ్రీనివాసరెడ్డి దశదిన కర్మ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళా కార్మికులు బతుకమ్మ ఆడి నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ, ఖమ్మం జెడ్పీ చైర్మన్ కమలరాజ్, మేయర్ పాపలాల్ను కలసి వినతి పత్రాలు అందించారు. ఖమ్మం కలెక్టర్ కార్యాలయం వద్ద జేఏసీ నేతలు అఖిలపక్ష నేతలతో కలసి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. విద్యార్థుల ఆందోళన.. జనగామ డిపో నుంచి మరిగడి మోడల్ స్కూల్ వెళ్లే బస్సు రావట్లేదని, దీంతో ఇబ్బంది పడుతున్నామంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. జనగామ డిపోను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సందర్శించి అధికారులతో చర్చించారు. సిద్దిపేట నుంచి హన్మకొండకు వస్తున్న బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆందోళన చేశారు. హసన్‌పర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కండక్టర్‌ను ఇన్స్పెక్టర్ మందలించారు. గుండెపోటుతో డ్రైవర్ మృతి.. ముషీరాబాద్ డిపో డ్రైవర్ రమేశ్ మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. నాగిరెడ్డిపేట మండలం గోలి లింగాల గ్రామానికి చెందిన డ్రైవర్ గఫూర్ గుండెపోటుతో మృతి చెందారు. జహీరాబాద్ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న సోఫియా ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే ఆమెను రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఇబ్రహీంపట్నంలో జరిగిన ధర్నాలో ఆర్టీసీ జేఏసీ–1 కన్వీనర్ హన్మంతు పాల్గొన్నారు. 5,912 బస్సులు నడిపిన అధికారులు మంగళవారంతో పోలిస్తే బుధవారం ఎక్కువ బస్సులు రోడ్డెక్కాయి. 4,231 ఆర్టీసీ బస్సులు, 1,681 అద్దె బస్సులు కలిపి 5,912 బస్సులు తిప్పినట్లు ఆర్టీసీ ప్రకటించింది. బుధవారం 4,231 మంది తాత్కాలిక డ్రైవర్లు, 5912 మంది తాత్కాలిక కండక్టర్లు విధుల్లో ఉన్నారని పేర్కొంది. 3,815 బస్సుల్లో టికెట్ జారీ యంత్రాలు వాడారని, 1,478 బస్సుల్లో పాత పద్ధతిలో టికెట్లు జారీ చేశారని అధికారులు వెల్లడించారు. ప్రజాభిప్రాయసేకరణ చేయండి: ఆర్టీసీ జేఏసీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న తమ తొలి డిమాండు విషయంలో వెనక్కి తగ్గలేదని ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసింది. ఆ డిమాండును తాము వదులుకున్నామన్న సీఎం మాటల్లో నిజం లేదని స్పష్టం చేసింది. బుధవారం జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆధ్వర్యంలో దిల్సుఖ్నగర్ బస్టాండ్ వద్ద భారీ సభ జరిగింది. భవిష్యత్తులో ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తే, అందులో తాము గతంలో ప్రభుత్వం ముందుంచిన 26 డిమాండ్లపై చర్చించాల్సిందేనని పేర్కొంటామని వెల్లడించారు. తమది న్యాయపోరాటమని, కావాలంటే ఈ విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని సూచించారు. ప్రజలు తమ పోరాటం న్యాయసమ్మతం కాదని చెబితే తాము వెంటనే సమ్మె వదిలేసి విధుల్లో చేరేందుకు సిద్ధమన్నారు. ఈ సభలో తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్‌రెడ్డి, వీహెచ్, మోత్కుపల్లి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. వెయ్యి బస్సులకు నేడు నోటిఫికేషన్ సీఎం ఆదేశంతో కొత్తగా మరో వెయ్యి బస్సులను అద్దెకు తీసుకునేందుకు ఆర్టీసీ అధికారులు గురువారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మూడు రోజుల కిందే.. వెయ్యి బస్సులకు అధికారులు టెండర్లు తెరిచారు. అందులో జిల్లాల్లో 275 బస్సులకు 9,700 టెండర్లు దాఖలయ్యాయి. హైదరాబాద్‌లో 725 బస్సులకు 18 మాత్రమే దాఖలయ్యాయి. ఇప్పుడు మరో వెయ్యి బస్సులకు టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించటంతో వాటికి సంబంధించి టెండర్లు దాఖలు చేయాలని కోరుతూ గురువారం నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. అధికారుల కమిటీ కసరత్తు ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు సంబంధించి కోర్టు సూచించిన 21 అంశాలను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ ఆదేశంతో ఏర్పాటు చేసిన ఆరుగురు సభ్యుల ఆర్టీసీ అధికారుల కమిటీ బుధవారం మధ్యాహ్నం సమావేశమైంది. ఈడీలు టి.వెంకటేశ్వర్రావు, వెంకటేశ్వర్రావు, వినోద్, పురుషోత్తంనాయక్, యాదగిరి, ఫైనాన్స్ అడ్వైజర్ రమేశ్‌లు ఇందులో పాల్గొన్నారు. కార్మికుల కీలక డిమాండ్ డ్రైవర్, కండక్టర్ల ఉద్యోగ భద్రతతో పాటు ఆర్థిక అంశాలపై చర్చించారు. గురువారం మరోసారి భేటీ కానున్నారు. గురువారం రాత్రి కానీ, శుక్రవారం కానీ ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మకు నివేదిక సమర్పించనున్నారు. దానిపై సీఎం సమీక్షించనున్నారు. అందులో సమ్మె విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. అవే వివరాలను కోర్టుకు సమర్పించనున్నారు. -
సారూ.. ఉపాధి కల్పించరూ..?
సాక్షి, శ్రీకాకుళం : ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ ఐటీడీఏలో సోమవారం జరిగిన గిరిజన దర్బార్‌లో పలువురు గిరిజనులు ఐటీడీఏ పరిపాలనాధికారి ఎల్.ఆనందరావుకు పెద్దమడికాలనీ, సీతంపేట, గడిగుడ్డిలకు చెందిన జన్నివాడు, జ్యోతి, సోమేశ్వర్రావు వినతిపత్రాలు సమర్పించారు. జీతం ఇప్పించాలని లబ్బకు చెందిన కీర్తి, విద్యుత్ స్తంభాలకు మరమ్మతులు చేయాలని నందిగాంకు చెందిన గున్నయ్య కోరారు. స్టాఫ్‌నర్స్ ఉద్యోగం ఇప్పించాలని దీనబందుపురానికి చెందిన తేజమ్మ పేర్కొన్నారు. ఆరో తరగతిలో చదివేందుకు సీటు ఇప్పించాలని కొత్తగూడకు చెందిన సౌందర్య విన్నవించారు. తిత్లీ నష్ట పరిహారం అందజేయాలని జాడుపల్లికి చెందిన పారమ్మ, గాసన్న వినతిపత్రం అందించారు. గ్రావిటేషన్ ఫ్లో మంజూరు చేయాలని గోటిగూడ గ్రామానికి చెందిన మోహన్‌రావు, ఆటో కొనుగోలుకు రుణం ఇప్పించాలని వజ్జాయిగూడకు చెందిన చంద్రరావు కోరారు. కొత్త పంచాయతీ భవనం నిర్మించాలని ఇరపాడుకు చెందిన రామారావు, తాగునీటి సదుపాయం కల్పించాలని కన్నయ్యగూడకు చెందిన దుర్గారావు విన్నవించారు. బోరు మంజూరు చేయాలని సూదిరాయగూడకు చెందిన ఎండయ్య, యూనిఫాం కుట్టేందుకు అనుమతి ఇప్పించాలని పెద్దూరుకు చెందిన పార్వతీ అధికారులకు వినతిపత్రం అందజేశారు. సీఆర్టీ పోస్టు ఇప్పించాలని టెక్కలికి చెందిన ధనలక్ష్మి, పూనుపేటకు చెందిన రోహిణి పేర్కొన్నారు. నాటుకోళ్ల ఫారం పెట్టేందుకు రుణం ఇప్పించాలని ఉల్లిమానుగూడకు చెందిన సుంకయ్య, ఆశ వర్కర్ పోస్టు ఇప్పించాలని వి.కుమారి తెలిపారు. జలసిరి బోరు మంజూరు చేయాలని మనుమకొండకు చెందిన అన్నయ్య, రక్షణగోడ ఇప్పించాలని దీనబంధుపురానికి చెందిన లక్ష్మణరావు కోరారు. డీ పట్టాలు ఇప్పించాలని చిన్నబగ్గ కాలనీకి చెందిన కృష్ణారావు, మొబైల్ దుకాణం పెట్టుకునేందుకు రుణం ఇప్పించాలని భరణికోటకు చెందిన వినోద్ విన్నవించారు. చెరువు పనులు చేయించాలని సందిమానుగూడకు చెందిన బి.కూర్మారావు, బొండి గ్రామానికి చెందిన నాగేశ్వర్రావు పాఠశాల తెరిపించాలని వినతిపత్రం అందజేశారు. దర్బార్‌లో ఈఈ మురళీ, డైజీ, హౌసింగ్ ఏఈ సంగమేషు తదితరులు పాల్గొన్నారు. -
ఓబీసీలకు...ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించండి
బరంపురం : ఓబీసీలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని ఓబీసీ రిజర్వేషన్ సాధన సంఘం అధ్యక్షుడు ప్రభాత్ సాహు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గంజాం జిల్లా వెనుకబడిన తరగతుల వికాస్ మంచ్ ఆధ్వర్యంలో దక్షిణాంచల్ ఆర్డీసీ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓబీసీల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. సుప్రీంకోర్టు 1993లో ఓబీసీ వర్గానికి 52 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. ఓబీసీలకు కర్ణాటకలో 69 శాతం, బీహార్‌లో 73 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 80 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారన్నారు. 1994లో జరిగిన కేబినేట్ సమావేశంలో ఓబీసీలకు 27 శాతం ఉన్న రిజర్వేషన్లను 11 శాతానికి పరిమితం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓబీసీలకు తక్షణమే 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి.. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న ఓబీసీ విద్యార్థులకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. పదోతరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ చదివే విద్యార్థులకు ఉచితంగా విద్యాభోదన అందించాలన్నారు. పరీక్షల సమయంలో ప్రత్యేక విద్యను అందించే శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఉన్నత విద్యను అభ్యసించే ఓబీసీలకు తక్కువ వడ్డీతో బ్యాంకులు రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఓబీసీ విద్యార్థులందరికీ నిర్దిష్ట సమయంలో ఓటరు కార్డులు పంపిణీ చేయాలన్నారు. వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ఓబీసీలకు పదోన్నతులు కల్పించాలని కోరారు. ఓబీసీ వర్గ నిరుద్యోగులకు 50 శాతం సబ్సిడీతో కూడిన రుణాలు అందజేయాలన్నారు. అనంతరం డిమాండ్ల సాధనను కోరుతూ ఆర్డీసీకి వినతిపత్రం అందజేశారు. ఆందోళనలో ఉపాధ్యక్షుడు చిత్రంజన్ మహరణ, కార్యదర్శి చంద్రమణి స్వంయి, ఓబీసీ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
సాక్షర భారత్‌ను కొనసాగించండి
వికారాబాద్ అర్బన్ : అక్షరాస్యతను పెంపొందించేందుకు ఏర్పాటుచేసిన సాక్షరభారత్ కేంద్రాలను కొనసాగించాలని సాక్షర భారత్ కో ఆర్డినేటర్లు సోమవారం ప్రజావాణిలో కోరారు. కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్‌కు వినతిపత్రం ఇచ్చి మాట్లాడారు. సాక్షర భారత్ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలని కోరారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అక్షరాస్యత శాతం తక్కువగా ఉందని వాపోయారు. బంగారు తెలంగాణకు బాటలు వేయాలంటే అక్షరాస్యత పెరగాల్సి ఉందని తెలిపారు. ఎలాంటి ప్రణాళిక లేకుండా కేంద్ర ప్రభుత్వం సాక్షర భారత్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు గుర్తుచేశారు. ఎంతోమంది డిగ్రీలు, పీజీలు చేసిన నిరుద్యోగులు సాక్షర భారత్‌ను నమ్ముకొని ఎనిమిదేళ్లుగా చాలీచాలని వేతనాలతో జీవనం సాగిస్తున్నట్లు వాపోయారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ పథకాన్ని ఎత్తివేయాలనే నిర్ణయం తీసుకోవడంతో కో ఆర్డినేటర్లు బజారునపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఓపెన్ స్కూల్ కేంద్రాల నిర్వాహణ బాధ్యతను అర్హతలు ఉన్న కో ఆర్డినేటర్లకు అప్పగించాలని కోరారు. గ్రామ, మండల, జిల్లా కో ఆర్డినేటర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాలతోపాటు టీఏ,డీఏలు ఇవ్వాలన్నారు.వారం రోజులుగా రాష్ట్రంలో మొత్తంలో కో ఆర్డినేటర్లు రిలే దీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కో ఆర్డినేటర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బి.వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి వి. శ్రీనివాస్, నాయకులు నాగరాజు, సురేందర్, ఆంజనేయులు, రాములు,నర్సిములు, శ్వేత, శ్రీవాణి, విద్య తదితరులు పాల్గొన్నారు. -
మా మండలాన్నిహన్మకొండలోనే ఉంచాలి
హన్మకొండ అర్బన్ : ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఉన్న హసన్‌పర్తి మండలాన్ని కొత్తగా ఏర్పడనున్న హన్మకొండ జిల్లాలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ మండలంలోని పలు గ్రామాల ప్రజలు పెద్దసంఖ్యలో శుక్రవారం కలెక్టరేట్లో అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఆయా గ్రామాల నుంచి హసన్‌పర్తి మండల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సుల్లో కలెక్టరేట్‌కు వచ్చిన సుమారు 300 మంది విడివిడిగా బారులు తీరి కలెక్టరేట్లో వినతిపత్రాలు అందజేశారు. హసన్‌పర్తి మండలాన్ని కొత్తగా ఏర్పాటు చేయనున్న వరంగల్ జిల్లాలో కలపనున్నట్లు ఇటీవల ప్రకటన వచ్చిన నేపథ్యంలో వారు ఇలా వినతిపత్రాలు ఇచ్చారు. ఆ తర్వాత కలెక్టరేట్ ఎదుట కొద్దిసేపు రాస్తారోకో చేశారు. ఆందోళనలో పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు పుట్ట రవి, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌తో పాటు శీలం సారయ్య, గురుమూర్తి, శివకుమార్, ఆరెపల్లి పవన్, జన్ను రవీందర్, బోడ యుగేందర్, పెట్ట బిక్షపతి, యాదగిరి, వల్లాల గణేష్, బొక్క కుమార్, రమణ, రమేష్ పాల్గొన్నారు.