ఆర్‌డీసీ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న ఓబీసీ అభివృద్ధి మంచ్ ప్రతినిధులు తదితరులు
బరంపురం : ఓబీసీలకు ప్రత్యేక రిజర్వేషన్‌లు కల్పించాలని ఓబీసీ రిజర్వేషన్ సాధన సంఘం అధ్యక్షుడు ప్రభాత్ సాహు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గంజాం జిల్లా వెనుకబడిన తరగతుల వికాస్ మంచ్ ఆధ్వర్యంలో దక్షిణాంచల్ ఆర్‌డీసీ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓబీసీల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. సుప్రీంకోర్టు 1993లో ఓబీసీ వర్గానికి 52 శాతం రిజర్వేషన్‌లు కల్పించాలంటూ ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు.
ఓబీసీలకు కర్ణాటకలో 69 శాతం, బీహార్‌లో 73 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 80 శాతం రిజర్వేషన్‌లు అమలు చేస్తున్నారన్నారు. 1994లో జరిగిన కేబినేట్ సమావేశంలో ఓబీసీలకు 27 శాతం ఉన్న రిజర్వేషన్‌లను 11 శాతానికి పరిమితం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓబీసీలకు తక్షణమే 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఉద్యోగాల్లో రిజర్వేషన్‌లు అమలు చేయాలి..
ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న ఓబీసీ విద్యార్థులకు 27 శాతం రిజర్వేషన్‌లు కల్పించాలన్నారు. పదోతరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ చదివే విద్యార్థులకు ఉచితంగా విద్యాభోదన అందించాలన్నారు. పరీక్షల సమయంలో ప్రత్యేక విద్యను అందించే శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు.
ఉన్నత విద్యను అభ్యసించే ఓబీసీలకు తక్కువ వడ్డీతో బ్యాంకులు రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఓబీసీ విద్యార్థులందరికీ నిర్దిష్ట సమయంలో ఓటరు కార్డులు పంపిణీ చేయాలన్నారు. వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ఓబీసీలకు పదోన్నతులు కల్పించాలని కోరారు.
ఓబీసీ వర్గ నిరుద్యోగులకు 50 శాతం సబ్సిడీతో కూడిన రుణాలు అందజేయాలన్నారు. అనంతరం డిమాండ్ల సాధనను కోరుతూ ఆర్‌డీసీకి వినతిపత్రం అందజేశారు.
ఆందోళనలో ఉపాధ్యక్షుడు చిత్రంజన్ మహరణ, కార్యదర్శి చంద్రమణి స్వంయి, ఓబీసీ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment