మాది న్యాయ పోరాటం! | TSRTC Strike: Employee Gives Memorandum To Minister | Sakshi
Sakshi News home page

మాది న్యాయ పోరాటం!

Published Thu, Oct 24 2019 2:21 AM | Last Updated on Thu, Oct 24 2019 2:21 AM

TSRTC Strike: Employee Gives Memorandum To Minister - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘మాది న్యాయపోరాటం.. ఆర్టీసీని పరిరక్షించు కోవటమే ధ్యేయంగా సమ్మె చేస్తున్నాం. ఇప్పటికైనా సీఎం స్పందించి చర్చలకు ఆహ్వానించాలి. మీరైనా ఆయనకు చెప్పండి’అంటూ ఆర్టీసీ కార్మికులు మంత్రులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులను కలిసి విజ్ఞప్తి చేశారు. తమ సమ్మెకు మద్దతు తెలపాలంటూ విపక్షాల ప్రజాప్రతినిధులనూ కోరారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా 19వ రోజైన బుధవారం మండల స్థాయి ప్రజాప్రతినిధి నుంచి ఎంపీ వరకు అందరినీ కలిసి విన్నవించు కున్నారు. వారికి వినతిపత్రాలు సమర్పించారు. నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని కలసి ఆయనకు వినతిపత్రం ఇచ్చి సమ్మెకు మద్దతివ్వాలని కోరారు. తాను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీ ఇచ్చారు. హన్మకొండలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కలసి వినతిపత్రం ఇచ్చారు. ఆర్టీసీ పరిరక్షణ ఒక్క కేసీఆర్‌తోనే సాధ్యమని, కొన్ని రాజకీయ పార్టీలు కావాలనే కార్మికులను రెచ్చగొట్టి సమ్మెకు పోయేలా చేశాయని మంత్రి ఆరోపించారు.

ఆదిలాబాద్‌లో నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో అటు వైపు వచ్చిన ఎమ్మెల్యే జోగు రామన్న కారు ఆపి వినతి పత్రం ఇచ్చారు. వారి వినతిని సీఎం దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. ఎంపీ బండ ప్రకాశ్, చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, శంకర్‌ నాయక్, రాజయ్యలకు కూడా వినతి పత్రాలు అందించారు. మంచిర్యాల బస్టాండు వద్ద ఏర్పాటు చేసిన జేఏసీ శిబిరాన్ని పోలీసులు తొలగించటంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు స్టేషన్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. సాయంత్రం తర్వాత పోలీసులు తిరిగి శిబిరం ఏర్పాటుకు సమ్మతించటంతో శాంతించారు.

కరీంనగర్‌లో మంత్రి ఈటల ఇంటి ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు. వినతిపత్రం తీసుకునేందుకు ఎవరూ అందుబాటులో లేకపోవటంతో ఇంటి గోడకు అతికించారు. మంత్రి గంగుల కమలాకర్‌ ఇంటి ఎదుట కూడా ధర్నా నిర్వహించి కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం ఇచ్చారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ ఇంటి ఎదుట ధర్నా నిర్వహించి పీఏకు వినతిపత్రం అందజేశారు. నల్లగొండ జెడ్పీ సమావేశం జరుగుతున్న సమయంలో సమావేశ మందిరం ఎదుట కార్మికులు ధర్నా చేశారు. సమావేశంలో పాల్గొన్న మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందజేశారు. సూర్యాపేటలో ఆర్టీసీ నిరసనల్లో సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు. ఖమ్మం డిపో ఎదుట దివంగత డ్రైవర్‌ శ్రీనివాసరెడ్డి దశదిన కర్మ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళా కార్మికులు బతుకమ్మ ఆడి నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ, ఖమ్మం జెడ్పీ చైర్మన్‌ కమలరాజ్, మేయర్‌ పాపలాల్‌ను కలసి వినతి పత్రాలు అందించారు. ఖమ్మం కలెక్టర్‌ కార్యాలయం వద్ద జేఏసీ నేతలు అఖిలపక్ష నేతలతో కలసి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.

విద్యార్థుల ఆందోళన..
జనగామ డిపో నుంచి మరిగడి మోడల్‌ స్కూల్‌ వెళ్లే బస్సు రావట్లేదని, దీంతో ఇబ్బంది పడుతున్నామంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. జనగామ డిపోను కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి సందర్శించి అధికారులతో చర్చించారు. సిద్దిపేట నుంచి హన్మకొండకు వస్తున్న బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆందోళన చేశారు. హసన్‌పర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కండక్టర్‌ను ఇన్‌స్పెక్టర్‌ మందలించారు.

గుండెపోటుతో డ్రైవర్‌ మృతి..
ముషీరాబాద్‌ డిపో డ్రైవర్‌ రమేశ్‌ మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. నాగిరెడ్డిపేట మండలం గోలి లింగాల గ్రామానికి చెందిన డ్రైవర్‌ గఫూర్‌ గుండెపోటుతో మృతి చెందారు. జహీరాబాద్‌ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న సోఫియా ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే ఆమెను రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఇబ్రహీంపట్నంలో జరిగిన ధర్నాలో ఆర్టీసీ జేఏసీ–1 కన్వీనర్‌ హన్మంతు పాల్గొన్నారు.

5,912 బస్సులు నడిపిన అధికారులు
మంగళవారంతో పోలిస్తే బుధవారం ఎక్కువ బస్సులు రోడ్డెక్కాయి. 4,231 ఆర్టీసీ బస్సులు, 1,681 అద్దె బస్సులు కలిపి 5,912 బస్సులు తిప్పినట్లు ఆర్టీసీ ప్రకటించింది. బుధవారం 4,231 మంది తాత్కాలిక డ్రైవర్లు, 5912 మంది తాత్కాలిక కండక్టర్లు విధుల్లో ఉన్నారని పేర్కొంది. 3,815 బస్సుల్లో టికెట్‌ జారీ యంత్రాలు వాడారని, 1,478 బస్సుల్లో పాత పద్ధతిలో టికెట్లు జారీ చేశారని అధికారులు వెల్లడించారు. 

ప్రజాభిప్రాయసేకరణ చేయండి: ఆర్టీసీ జేఏసీ
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న తమ తొలి డిమాండు విషయంలో వెనక్కి తగ్గలేదని ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసింది. ఆ డిమాండును తాము వదులుకున్నామన్న సీఎం మాటల్లో నిజం లేదని స్పష్టం చేసింది. బుధవారం జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ఆధ్వర్యంలో దిల్‌సుఖ్‌నగర్‌ బస్టాండ్‌ వద్ద భారీ సభ జరిగింది. భవిష్యత్తులో ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తే, అందులో తాము గతంలో ప్రభుత్వం ముందుంచిన 26 డిమాండ్లపై చర్చించాల్సిందేనని పేర్కొంటామని వెల్లడించారు. తమది న్యాయపోరాటమని, కావాలంటే ఈ విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని సూచించారు. ప్రజలు తమ పోరాటం న్యాయసమ్మతం కాదని చెబితే తాము వెంటనే సమ్మె వదిలేసి విధుల్లో చేరేందుకు సిద్ధమన్నారు. ఈ సభలో తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్‌రెడ్డి, వీహెచ్, మోత్కుపల్లి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

వెయ్యి బస్సులకు నేడు నోటిఫికేషన్‌
సీఎం ఆదేశంతో కొత్తగా మరో వెయ్యి బస్సులను అద్దెకు తీసుకునేందుకు ఆర్టీసీ అధికారులు గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. మూడు రోజుల కిందే.. వెయ్యి బస్సులకు అధికారులు టెండర్లు తెరిచారు. అందులో జిల్లాల్లో 275 బస్సులకు 9,700 టెండర్లు దాఖలయ్యాయి. హైదరాబాద్‌లో 725 బస్సులకు 18 మాత్రమే దాఖలయ్యాయి. ఇప్పుడు మరో వెయ్యి బస్సులకు టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించటంతో వాటికి సంబంధించి టెండర్లు దాఖలు చేయాలని కోరుతూ గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేస్తున్నారు.

అధికారుల కమిటీ కసరత్తు 
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు సంబంధించి కోర్టు సూచించిన 21 అంశాలను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్‌ ఆదేశంతో ఏర్పాటు చేసిన ఆరుగురు సభ్యుల ఆర్టీసీ అధికారుల కమిటీ బుధవారం మధ్యాహ్నం సమావేశమైంది. ఈడీలు టి.వెంకటేశ్వర్‌రావు, వెంకటేశ్వర్‌రావు, వినోద్, పురుషోత్తంనాయక్, యాదగిరి, ఫైనాన్స్‌ అడ్వైజర్‌ రమేశ్‌లు ఇందులో పాల్గొన్నారు. కార్మికుల కీలక డిమాండ్‌ డ్రైవర్, కండక్టర్ల ఉద్యోగ భద్రతతో పాటు ఆర్థిక అంశాలపై చర్చించారు. గురువారం మరోసారి భేటీ కానున్నారు. గురువారం రాత్రి కానీ, శుక్రవారం కానీ ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మకు నివేదిక సమర్పించనున్నారు. దానిపై సీఎం సమీక్షించనున్నారు. అందులో సమ్మె విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. అవే వివరాలను కోర్టుకు సమర్పించనున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement