కలెక్టర్ జలీల్‌కు వినతిపత్రం ఇస్తున్న సాక్షరభారత్ కో ఆర్డినేటర్లు
వికారాబాద్ అర్బన్ : అక్షరాస్యతను పెంపొందించేందుకు ఏర్పాటుచేసిన సాక్షరభారత్ కేంద్రాలను కొనసాగించాలని సాక్షర భారత్ కో ఆర్డినేటర్లు సోమవారం ప్రజావాణిలో కోరారు. కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్‌కు వినతిపత్రం ఇచ్చి మాట్లాడారు. సాక్షర భారత్ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలని కోరారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అక్షరాస్యత శాతం తక్కువగా ఉందని వాపోయారు.
బంగారు తెలంగాణకు బాటలు వేయాలంటే అక్షరాస్యత పెరగాల్సి ఉందని తెలిపారు. ఎలాంటి ప్రణాళిక లేకుండా కేంద్ర ప్రభుత్వం సాక్షర భారత్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు గుర్తుచేశారు. ఎంతోమంది డిగ్రీలు, పీజీలు చేసిన నిరుద్యోగులు సాక్షర భారత్‌ను నమ్ముకొని ఎనిమిదేళ్లుగా చాలీచాలని వేతనాలతో జీవనం సాగిస్తున్నట్లు వాపోయారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ పథకాన్ని ఎత్తివేయాలనే నిర్ణయం తీసుకోవడంతో కో ఆర్డినేటర్లు బజారునపడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఓపెన్ స్కూల్ కేంద్రాల నిర్వాహణ బాధ్యతను అర్హతలు ఉన్న కో ఆర్డినేటర్లకు అప్పగించాలని కోరారు. గ్రామ, మండల, జిల్లా కో ఆర్డినేటర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాలతోపాటు టీఏ,డీఏలు ఇవ్వాలన్నారు.వారం రోజులుగా రాష్ట్రంలో మొత్తంలో కో ఆర్డినేటర్లు రిలే దీక్షలు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా కో ఆర్డినేటర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బి.వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి వి. శ్రీనివాస్, నాయకులు నాగరాజు, సురేందర్, ఆంజనేయులు, రాములు,నర్సిములు, శ్వేత, శ్రీవాణి, విద్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment