ఖమ్మం, న్యూస్‌లైన్ : కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలల ప్రత్యేకాధికారుల ఉద్యోగం మూణ్నాళ్ల ముచ్చటగానే మారింది. రాజీవ్ విద్యామిషన్ అధికారులు కేజీబీవీ ఎస్‌వోలకు ఉద్యోగ నియామకాల పత్రాలు ఇచ్చి పాఠశాలకు వెళ్లమని చెప్పారు. అయితే మైదాన ప్రాంత అభ్యర్థులు ఏజన్సీ పాఠశాలల్లో పనిచేయడానికి ఒప్పుకునేది లేదని, ఇక్కడి నుంచి తిరిగి వెళ్లాలని ఐటీడీఏ అధికారులు ఆదేశించారు. దీంతో ఇప్పటి వరకు చేస్తున్న ఉద్యోగాలను వదులుకున్న ఎస్‌వోలు గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగం చేసే అవకాశం లేకపోవడంతో లబోదిబోమంటూ ఆర్వీఎం అధికారి వద్దకు వచ్చి మొరపెట్టుకున్నారు. బాలికల విద్యను మెరుగుపరిచేందుకు దేశవ్యాప్తంగా కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలను ప్రారంభించారు. ఇలా జిల్లాలో ఆర్వీఎం ఆధ్వర్యంలో 21, ఏపీఆర్‌ఈఐఎస్ పరిధిలో నాలుగు, ఏపీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ పరిధిలో ఎనిమిది మొత్తం 33 పాఠశాలలు మంజూరు చేశారు. వీటి నిర్వహణకు ఉద్యోగ విరమణ పొందిన పలువురు ఉపాధ్యాయులను ప్రత్యేకాధికారులుగా నియమించారు.
వీరి పర్యవేక్షణ లోపంతో కేజీబీవీ లక్ష్యం నెరవేరడం లేదని అభిప్రాయపడిన రాష్ట్ర అధికారులు.. ప్రత్యేక అధికారుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తు చేసుకున్న మహిళా అభ్యర్థులకు వరంగల్‌లో రాత పరీక్ష నిర్వహించి తొలుత 28 మందిని ఎంపిక చేశారు. ఆ తర్వాత వయసు తక్కువగా ఉందని ఒకరిని, ఏ కారణం చూపకుండానే మరొకరిని పక్కన పెట్టి మిగితా 26 మందికి ఎస్‌వోలుగా నియామక పత్రాలు అందజేశారు. ఇందులో 17 మందిని ఏజెన్సీ ప్రాంత పాఠశాలలకు, 9 మందిని మైదాన ప్రాంతాలకు పంపించారు. అయితే మైదాన ప్రాంత ఎస్‌వోలకు ఎలాంటి ఆటంకాలు లేనప్పటికీ, ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లిన వారిలో కూనవరం మినహా మిగితా 16 మంది మైదాన ప్రాంత అభ్యర్థులే కావడంతో వారు ఇక్కడ ఉద్యోగం చేసేందుకు అనర్హులని, తక్షణమే ఇక్కడినుంచి వెళ్లాలని ఐటీడీఏ పీవో ఆదేశించారు. నెలకు రూ.20 వేల వేతనం, బాలికలకు విద్య బోధించడం, మహిళా ఉపాధ్యాయులతోనే కలిసి పనిచేసే అవకాశం రావడంతో ఉత్సాహంగా వెళ్లిన ఎస్‌వోలు అక్కడ ఏర్పడిన పరిస్థితితో కంగుతిన్నారు. ఏజన్సీ, మైదాన ప్రాంతాల్లో వేర్వేరుగా ఉంటారనే విషయం తమకు నోటిఫికేషన్ సందర్భంగా కానీ, నియామక పత్రాలు ఇచ్చినప్పుడు కానీ చెప్పలేదని ఆర్‌వీఎం పీవో శ్రీనివాస్ ఎదుట మంగళవారం తమ గోడు వినిపించారు. ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలో మెరిట్ సాధించామని, తమ స్వగ్రామాలకు దగ్గరగా ఉంటుందనే ఆలోచనతో ఏజెన్సీ ప్రాంతాలను ఎంపిక చేసుకున్నామని, అక్కడికి వెళ్తే ఈ పరిస్థితి ఎదురైందని వాపోయారు. దీనికోసం వెళ్తే గతంలో చేసిన ఉద్యోగం పోయిందని, ఇప్పుడు ఈ ఉద్యోగానికి అవకాశం లేకుంటే తమ పరిస్థితి ఏమిటని, ఎలాగైనా న్యాయం చేయాలని పీవోను వేడుకున్నారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా
ఈ విషయాన్ని రాష్ట్ర రాజీవ్ విద్యామిషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. ఎస్‌వోల నియామక ప్రక్రియ అంతా హైదరాబాద్‌లోని ఆర్‌వీఎం ప్రధాన కార్యాలయంలోనే జరిగింది. అప్పటి వరకు ఎస్‌వోలు స్థానికంగా ఉన్న కేజీబీవీల్లోకి వెళ్లి సీఆర్‌టీలుగా పనిచేయవచ్చు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే వారివారి పాఠశాలలకు వెళ్లాల్సి ఉంటుంది.
- శ్రీనివాస్, ఆర్‌వీఎం పీవో
మూణ్నాళ్ల ముచ్చటే నా..!
Published Wed, Dec 18 2013 4:41 AM | Last Updated on Sat, Sep 2 2017 1:42 AM
Advertisement