Kasturibha Gandhi Girls Schools
-
‘ఆ మేడం మాకొద్దు సార్’
భీమిని: ఈ ఎస్వో మేడమ్ ఉంటే తాము ఉండబో మంటూ కన్నెపల్లి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులు బుధవారం భవనంపైకి ఎక్కి ఆందోళన చేపట్టారు. 15రోజుల క్రితం సస్పెండ్ అ యిన ఎస్వో(ప్రత్యేక అధికారి) అమూల్య జిల్లా వి ద్యాశాఖ అధికారి ఆదేశాలతో తిరిగి విధుల్లో చేరడానికి వచ్చారు. విద్యార్థుల గదుల్లోకి వెళ్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో విద్యార్థులు భవనం పైకి ఎక్కి ఆందోళన చేపట్టారు. ఉపాధ్యాయులు, సిబ్బంది న చ్చజెప్పినా వినలేదు. కన్నెపల్లి తహసీల్దార్ రాంచందర్ అక్కడికి చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పి కిందికి రప్పించారు. మేడమ్ విధుల్లో చేరితే తాము చదువుకోలేమని, గతంలో మీ రిజల్ట్ ఎలా వస్తుందో చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడిన విషయాన్ని గుర్తు చేశారు. కాగా, విద్యార్థుల ఆందోళనతో ఈ నెల 12న ఎస్వో సస్పెండైన విషయం తెలిసిందే. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితోనే విధుల్లో చేరికకు అనుమతి ఇచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి. -
జీతాల్లో కోత..అసౌకర్యాల వాత!
సాక్షి, అమరావతి: ఒకే రకమైన ఉద్యోగం.. విధులన్నీ ఇద్దరికీ సమానమే.. కానీ, వారికిచ్చే వేతనాల్లోనే భారీ తేడా. ఇది ఏపీ, తెలంగాణాల్లో కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల పరిధిలోని జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న పార్ట్‌టైమ్ అధ్యాపక సిబ్బంది పరిస్థితి. తెలంగాణ అధ్యాపకులకు అక్కడి ప్రభుత్వం రూ.23వేలు వేతనం ఇస్తుండగా ఏపీ సర్కారు మాత్రం ఇక్కడ రూ.12వేలు మాత్రమే ఇస్తోంది. అంతేకాక, వీరిని తగినంత సంఖ్యలో నియమించకపోవడం, బోధనేతర సిబ్బంది నియామకాలు చేపట్టకపోవడంతో అధ్యాపకులపై రెట్టింపు భారం పడుతోంది. బోధనా కార్యక్ర మాలతో పాటు వసతిగృహాల్లో ఉండే బాలికల రక్షణ బాధ్యత కూడా వీరిపైనే ఉంది. మరోపక్క ముందస్తు ఏర్పాట్లు, నిధుల కేటాయింపు లేకుండా వీటిని ప్రారంభించడంతో విద్యార్థినులకు వసతి సమస్యలతో పాటు భోజనం, ఇతర సదుపాయాలూ అరకొరగా ఉంటున్నాయి. అలాగే, రాత్రి వేళల్లో బాలికలకు రక్షణగా ఉండే అధ్యాపక సిబ్బందికి ఇక్కడ సరైన వసతిలేక నానా అవస్థలు పడుతున్నారు. స్కూళ్ల భవనాల్లోనే కాలేజీ విద్యార్థులు ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల పరిధిలో ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్తగా బాలికల కోసం 33 జూనియర్ కాలేజీలను కూడా ఏర్పాటుచేశారు. వీటిని కేజీబీవీ స్కూళ్లలోనే ప్రారంభించారు. 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్నవిద్యార్థినులకే ఇక్కడి భవనాలు సరిపోక నానా ఇబ్బందులు పడుతుంటే ఇక్కడే కాలేజీలను సైతం ఏర్పాటుచేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్నిచోట్ల తాత్కాలిక రేకుల షెడ్లను ఏర్పాటుచేశారు. వీరందరికీ 2, 3 మరుగుదొడ్లు మాత్రమే ఉండడంతో బాలికలు నానా అవస్థలు పడుతున్నారు. ఫుల్‌టైమ్ వర్క్‌కు పార్టు టైమ్ వేతనమూ లేదు ఈ 33 కేజీబీవీ కాలేజీల్లో మొత్తం 231 మంది పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లను తాత్కాలిక ప్రాతిపదికన నియమించారు. రెగ్యులర్ అధ్యాపకులతో సమానమైన అర్హతలుండి ఇంటర్వ్యూ, డెమోలను నిర్వహించిన అనంతరం మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను అనుసరించి వీరిని ఎంపికచేశారు. వాస్తవానికి వీరిని కాంట్రాక్టు పద్ధతి మీద నియమించాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం పార్ట్‌టైమ్ అని పేరుపెట్టి నియామకాలు జరిపింది. అలాగే, సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సి ఉన్నప్పటికీ వేతనాల్లో భారీగా కోత పెడుతోంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న తాత్కాలిక సిబ్బందికి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రెగ్యులర్ సిబ్బంది మూల వేతనంతో సమానంగా వేతనం కల్పించారు. ఇటీవల పీఆర్సీ ప్రకారం కూడా రాష్ట్రంలోని కాంట్రాక్టు సిబ్బందికి వేతనాలు పెరిగాయి. ఈ తరుణంలో పార్ట్‌టైమ్ అధ్యాపకులకు ఆ మేర కూడా వేతనాలివ్వడం లేదు. పనిచేస్తున్నది ఫుల్‌టైమ్ అయినా పార్ట్‌టైమ్ పేరిట వేతనాల్లో భారీగా కోతపెట్టారు. పక్కనే ఉన్న తెలంగాణ కేజీబీవీ కాలేజీల్లో పనిచేస్తున్న ఇదే అధ్యాపకులకు అక్కడి ప్రభుత్వం రూ.23వేలు వేతనంగా చెల్లిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని మరింత పెంచుతామని చెబుతోంది. ఇక్కడ మాత్రం కేవలం 12వేలు మాత్రమే ఇస్తున్నారు. ఇక్కడి వంట పనివారికి, అటెండర్లకు ఇచ్చే వేతనం కన్నా వీరికి వచ్చే జీతం తక్కువ. వీరికి నియామక ఉత్తర్వులు కూడా ఇవ్వకపోవడం గమనార్హం. పార్ట్‌టైమ్ అని తీసుకుని వీరికి నైట్‌డ్యూటీ, హాలిడే డ్యూటీ, హౌస్‌టీచర్ డ్యూటీ ఇలా అన్ని రకాల డ్యూటీలు కేటాయిస్తున్నారు. కాలేజీ బోధన కోసం నియమితులైన వీరికి అక్కడి స్కూళ్లలోని బోధనేతర సిబ్బంది ఖాళీలను భర్తీ చేయకుండా ఆ పని కూడా చేయిస్తున్నారు. పగలు తరగతుల్లో బోధన.. రాత్రి బాలికలకు రక్షణగా ఉండి మళ్లీ బోధనకు సిద్ధం కావలసి వస్తోంది. కాగా, ఈ కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ గ్రూపులను ఈ ఏడాది చాలా ఆలస్యంగా ప్రారంభించారు. డిసెంబర్‌కల్లా సిలబస్ పూర్తిచేయాలని ఆదేశాలివ్వడంతో అదనపు తరగతులు నిర్వహించి బోధిస్తున్నారు. కేజీబీవీల్లో స్పెషలాఫీసర్ తరువాత కేడర్ వీరిదే అయినా కనీసం జాబ్‌చార్టు కూడా ఇవ్వలేదు. మరోపక్క బాలికలను జేఈఈ, ఎంసెట్, జిప్మెర్ వంటి పరీక్షలకు సిద్ధం చేయాలని ప్రభుత్వం చెబుతోంది. కానీ, అదనపు సిబ్బందిని నియమించకుండా ఈ సిబ్బందిపైనే రెట్టింపు భారం మోపుతోంది. -
మూణ్నాళ్ల ముచ్చటే నా..!
ఖమ్మం, న్యూస్‌లైన్ : కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలల ప్రత్యేకాధికారుల ఉద్యోగం మూణ్నాళ్ల ముచ్చటగానే మారింది. రాజీవ్ విద్యామిషన్ అధికారులు కేజీబీవీ ఎస్‌వోలకు ఉద్యోగ నియామకాల పత్రాలు ఇచ్చి పాఠశాలకు వెళ్లమని చెప్పారు. అయితే మైదాన ప్రాంత అభ్యర్థులు ఏజన్సీ పాఠశాలల్లో పనిచేయడానికి ఒప్పుకునేది లేదని, ఇక్కడి నుంచి తిరిగి వెళ్లాలని ఐటీడీఏ అధికారులు ఆదేశించారు. దీంతో ఇప్పటి వరకు చేస్తున్న ఉద్యోగాలను వదులుకున్న ఎస్వోలు గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగం చేసే అవకాశం లేకపోవడంతో లబోదిబోమంటూ ఆర్వీఎం అధికారి వద్దకు వచ్చి మొరపెట్టుకున్నారు. బాలికల విద్యను మెరుగుపరిచేందుకు దేశవ్యాప్తంగా కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలను ప్రారంభించారు. ఇలా జిల్లాలో ఆర్వీఎం ఆధ్వర్యంలో 21, ఏపీఆర్ఈఐఎస్ పరిధిలో నాలుగు, ఏపీడబ్ల్యూఆర్ఈఐఎస్ పరిధిలో ఎనిమిది మొత్తం 33 పాఠశాలలు మంజూరు చేశారు. వీటి నిర్వహణకు ఉద్యోగ విరమణ పొందిన పలువురు ఉపాధ్యాయులను ప్రత్యేకాధికారులుగా నియమించారు. వీరి పర్యవేక్షణ లోపంతో కేజీబీవీ లక్ష్యం నెరవేరడం లేదని అభిప్రాయపడిన రాష్ట్ర అధికారులు.. ప్రత్యేక అధికారుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తు చేసుకున్న మహిళా అభ్యర్థులకు వరంగల్‌లో రాత పరీక్ష నిర్వహించి తొలుత 28 మందిని ఎంపిక చేశారు. ఆ తర్వాత వయసు తక్కువగా ఉందని ఒకరిని, ఏ కారణం చూపకుండానే మరొకరిని పక్కన పెట్టి మిగితా 26 మందికి ఎస్‌వోలుగా నియామక పత్రాలు అందజేశారు. ఇందులో 17 మందిని ఏజెన్సీ ప్రాంత పాఠశాలలకు, 9 మందిని మైదాన ప్రాంతాలకు పంపించారు. అయితే మైదాన ప్రాంత ఎస్‌వోలకు ఎలాంటి ఆటంకాలు లేనప్పటికీ, ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లిన వారిలో కూనవరం మినహా మిగితా 16 మంది మైదాన ప్రాంత అభ్యర్థులే కావడంతో వారు ఇక్కడ ఉద్యోగం చేసేందుకు అనర్హులని, తక్షణమే ఇక్కడినుంచి వెళ్లాలని ఐటీడీఏ పీవో ఆదేశించారు. నెలకు రూ.20 వేల వేతనం, బాలికలకు విద్య బోధించడం, మహిళా ఉపాధ్యాయులతోనే కలిసి పనిచేసే అవకాశం రావడంతో ఉత్సాహంగా వెళ్లిన ఎస్వోలు అక్కడ ఏర్పడిన పరిస్థితితో కంగుతిన్నారు. ఏజన్సీ, మైదాన ప్రాంతాల్లో వేర్వేరుగా ఉంటారనే విషయం తమకు నోటిఫికేషన్ సందర్భంగా కానీ, నియామక పత్రాలు ఇచ్చినప్పుడు కానీ చెప్పలేదని ఆర్వీఎం పీవో శ్రీనివాస్ ఎదుట మంగళవారం తమ గోడు వినిపించారు. ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలో మెరిట్ సాధించామని, తమ స్వగ్రామాలకు దగ్గరగా ఉంటుందనే ఆలోచనతో ఏజెన్సీ ప్రాంతాలను ఎంపిక చేసుకున్నామని, అక్కడికి వెళ్తే ఈ పరిస్థితి ఎదురైందని వాపోయారు. దీనికోసం వెళ్తే గతంలో చేసిన ఉద్యోగం పోయిందని, ఇప్పుడు ఈ ఉద్యోగానికి అవకాశం లేకుంటే తమ పరిస్థితి ఏమిటని, ఎలాగైనా న్యాయం చేయాలని పీవోను వేడుకున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా ఈ విషయాన్ని రాష్ట్ర రాజీవ్ విద్యామిషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. ఎస్‌వోల నియామక ప్రక్రియ అంతా హైదరాబాద్‌లోని ఆర్వీఎం ప్రధాన కార్యాలయంలోనే జరిగింది. అప్పటి వరకు ఎస్వోలు స్థానికంగా ఉన్న కేజీబీవీల్లోకి వెళ్లి సీఆర్టీలుగా పనిచేయవచ్చు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే వారివారి పాఠశాలలకు వెళ్లాల్సి ఉంటుంది. - శ్రీనివాస్, ఆర్వీఎం పీవో -
కేజీబీవీల్లో వెలుగుచూడని ఉదంతాలెన్నో
సాక్షి, నల్లగొండ: జిల్లాలో మొత్తం 45 కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ) ఉన్నాయి. ఆర్వీఎం, ఏపీ గురుకుల సొసైటీ పరిధిలో 18 చొప్పున, గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో 9 ఉండగా.. వీటిలో దాదాపు 700 మంది ఆరు నుంచి పదోతరగతి వరకు విద్యను అభ్యసిస్తున్నారు. వాస్తవంగా ప్రతి కేజీబీవీలో మహిళలే పనిచేయాలి. ప్రత్యేకాధికారి నుంచి వాచ్‌మన్ వరకు వారే తప్పనిసరి. ప్రత్యేకాధికారిగా మహిళ అందుబాటులో లేకుంటే విశ్రాంత పురుష ఎంఈ ఓలు, 45 ఏళ్ల వయసు దాటిన వారు విధులు నిర్వహించవచ్చు. ఈ మేరకు జూన్ 20న ఆర్వీఎం రాష్ట్ర ప్రాజెక్ట్ డెరైక్టర్ నుంచి సర్క్యులర్ జారీ అయ్యింది. వారిదే ఇష్టారాజ్యం గుండాల, తుంగతుర్తిలో ఇటీవలే ఇద్దరు విధుల నుంచి తప్పుకోగా,ప్రస్తుతం పదిమంది పురుషులు కేజీబీవీల్లో అకౌంటెంట్లుగా పనిచేస్తున్నారు. వీరిలో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ఉన్నతాధికారుల అండదండలతో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కేజీబీవీలపై ఉన్నతాధికారుల అజమాయిషీ కొరవడడంతో బిడ్డల వయస్సున్న విద్యార్థినుల పట్ల కొందరు అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఆ విద్యాలయాలకే మాయని మచ్చ తెస్తున్నారు. ఇలా కొంతకాలంగా జరుగుతోంది. ఇటీవల అర్వపల్లి కేజీబీవీలో బయటపడిన ఉదంతం ద్వారా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. చీటికి మాటికి దగ్గరికి పిలవడం, శరీరంపై చేతులు వేయడం, చెప్పరాని చోట తాకడం వంటి వికృత చేష్టలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. తమకు ఎక్కడ ఏంచేస్తారోనని ఎవరికీ చెప్పకుండా విద్యార్థినులు మథనపడుతున్నారు. ఈ విషయం సీఆర్టీలకు తెలిసినా... సదరు అకౌంటెంట్లకు ఉన్నతాధికారుల అండదండలు ఉండ డంతో వీరూ బయటపెట్టడానికి సాహసించడం లేదు. మొత్తంగా కొన్ని కేజీబీవీలు వేధింపులకు నిలయాలుగా మారాయి. సిబ్బంది నిర్వాకం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో బాలికలు భయపడుతున్నారు. ఆ అధికారికి రక్త సంబంధీకుడే... ఓ కేజీబీవీలో ఓ ఉన్నతాధికారి బంధువే అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. వాస్తవంగా కామర్స్‌లో పట్టా ఉన్న మహిళలే ఆ స్థానంలో ఉండాలి. కానీ ఎంఏ చేసిన పురుషుడు అకౌం టెంట్‌గా విధులు నిర్వహిస్తుండడం గమనార్హం. అంతేగాక ఇతను స్థానికేతరుడు. వరంగల్ జిల్లాకు చెందినవాడు. జిల్లాలో అర్హులైన ఎంతోమంది దరఖాస్తు చేసుకున్నా.. వారిని పక్కనబెట్టి నిబంధనలు ఉల్లంఘించి అయిన వారికి పట్టం కట్టడం విశేషం. అంతేగాక సదరు అకౌంటెంట్ భార్య కూడా అదే కేజీబీవీలో గతేడాది గెస్ట్ టీచర్‌గా పనిచేసింది. ఈ ఏడాది ఆమెను అక్కడే సీఆర్టీగా నియమించారు. అదికూడా నోటిఫికేషన్ సమయంలో అక్కడ ఖాళీ పోస్టు చూపించకుండా గుట్టుచప్పుడు కాకుండా భర్తీ చేశారని ఆరోపణలు పెద్దఎత్తున వస్తున్నాయి. వీటితోపాటు నూతన్‌కల్‌లో పనిచేస్తున్న అభ్యర్థి కూడా ఓ ఉన్నతాధికారికి బంధువేనని సమాచారం. నిబంధనలకు పాతర అకౌంటెంట్‌గా పనిచేయాలంటే 18-35 ఏళ్ల వయసు ఉండి, తప్పనిసరిగా కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. కానీ ఇవేవీ పరిగణనలోకి తీసుకోకుండా నిబంధనలకు నీళ్లొదిలారనే ఆరోపణలున్నాయి. అకౌంటెంట్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వేసిన సమయంలో పెద్ద ఎత్తున మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఎంకాం చేసిన వారు అధిక సంఖ్యలో ఉన్నారు. అన్ని అర్హతలున్నా వీరిని పక్కనబెట్టి నిబంధనలకు విరుద్ధంగా పురుషులకు పోస్టులు అప్పజెప్పారనే ఆరోపణలు వస్తున్నాయి. కోర్టును ఆశ్రయించారు మూడేళ్ల కిందట విడుదలైన జీఓలో పురుషులను నియమించుకోవద్దని లేదు. పురుషుల నియామకాలు చేపట్టకూడదని ఇటీవల వచ్చిన సర్క్యులర్‌లో పేర్కొన్నారు. దీన్ని బట్టి ఆయా కేజీబీవీల్లో పనిచేస్తున్న పురుషుడిని వెళ్లిపోవాలని ఆదేశించాం. దీంతో వారు కోర్టుకు వెళ్లారు. స్టే కోసం ప్రయత్నిస్తున్నారు. మూడేళ్లుగా లేని వేధింపులు.. ఇప్పుడెలా వచ్చాయి? వేధింపులు జరుగుతున్నట్లు మా దృష్టికి రాలేదు. - బాబూ భూక్యా, ఆర్వీఎం పీఓ