సాక్షి, నల్లగొండ: జిల్లాలో మొత్తం 45 కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ) ఉన్నాయి. ఆర్వీఎం, ఏపీ గురుకుల సొసైటీ పరిధిలో 18 చొప్పున, గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో 9 ఉండగా.. వీటిలో దాదాపు 700 మంది ఆరు నుంచి పదోతరగతి వరకు విద్యను అభ్యసిస్తున్నారు. వాస్తవంగా ప్రతి కేజీబీవీలో మహిళలే పనిచేయాలి. ప్రత్యేకాధికారి నుంచి వాచ్‌మన్ వరకు వారే తప్పనిసరి. ప్రత్యేకాధికారిగా మహిళ అందుబాటులో లేకుంటే విశ్రాంత పురుష ఎంఈ ఓలు, 45 ఏళ్ల వయసు దాటిన వారు విధులు నిర్వహించవచ్చు. ఈ మేరకు జూన్ 20న ఆర్వీఎం రాష్ట్ర ప్రాజెక్ట్ డెరైక్టర్ నుంచి సర్క్యులర్ జారీ అయ్యింది.
వారిదే ఇష్టారాజ్యం
గుండాల, తుంగతుర్తిలో ఇటీవలే ఇద్దరు విధుల నుంచి తప్పుకోగా,ప్రస్తుతం పదిమంది పురుషులు కేజీబీవీల్లో అకౌంటెంట్లుగా పనిచేస్తున్నారు. వీరిలో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ఉన్నతాధికారుల అండదండలతో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కేజీబీవీలపై ఉన్నతాధికారుల అజమాయిషీ కొరవడడంతో బిడ్డల వయస్సున్న విద్యార్థినుల పట్ల కొందరు అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఆ విద్యాలయాలకే మాయని మచ్చ తెస్తున్నారు.
ఇలా కొంతకాలంగా జరుగుతోంది. ఇటీవల అర్వపల్లి కేజీబీవీలో బయటపడిన ఉదంతం ద్వారా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. చీటికి మాటికి దగ్గరికి పిలవడం, శరీరంపై చేతులు వేయడం, చెప్పరాని చోట తాకడం వంటి వికృత చేష్టలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. తమకు ఎక్కడ ఏంచేస్తారోనని ఎవరికీ చెప్పకుండా విద్యార్థినులు మథనపడుతున్నారు. ఈ విషయం సీఆర్‌టీలకు తెలిసినా... సదరు అకౌంటెంట్లకు ఉన్నతాధికారుల అండదండలు ఉండ డంతో వీరూ బయటపెట్టడానికి సాహసించడం లేదు. మొత్తంగా కొన్ని కేజీబీవీలు వేధింపులకు నిలయాలుగా మారాయి. సిబ్బంది నిర్వాకం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో బాలికలు భయపడుతున్నారు.
ఆ అధికారికి రక్త సంబంధీకుడే...
ఓ కేజీబీవీలో ఓ ఉన్నతాధికారి బంధువే అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. వాస్తవంగా కామర్స్‌లో పట్టా ఉన్న మహిళలే ఆ స్థానంలో ఉండాలి. కానీ ఎంఏ చేసిన పురుషుడు అకౌం టెంట్‌గా విధులు నిర్వహిస్తుండడం గమనార్హం. అంతేగాక ఇతను స్థానికేతరుడు. వరంగల్ జిల్లాకు చెందినవాడు. జిల్లాలో అర్హులైన ఎంతోమంది దరఖాస్తు చేసుకున్నా.. వారిని పక్కనబెట్టి నిబంధనలు ఉల్లంఘించి అయిన వారికి పట్టం కట్టడం విశేషం. అంతేగాక సదరు అకౌంటెంట్ భార్య కూడా అదే కేజీబీవీలో గతేడాది గెస్ట్ టీచర్‌గా పనిచేసింది. ఈ ఏడాది ఆమెను అక్కడే సీఆర్‌టీగా నియమించారు. అదికూడా నోటిఫికేషన్ సమయంలో అక్కడ ఖాళీ పోస్టు చూపించకుండా గుట్టుచప్పుడు కాకుండా భర్తీ చేశారని ఆరోపణలు పెద్దఎత్తున వస్తున్నాయి. వీటితోపాటు నూతన్‌కల్‌లో పనిచేస్తున్న అభ్యర్థి కూడా ఓ ఉన్నతాధికారికి బంధువేనని సమాచారం.
నిబంధనలకు పాతర
అకౌంటెంట్‌గా పనిచేయాలంటే 18-35 ఏళ్ల వయసు ఉండి, తప్పనిసరిగా కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. కానీ ఇవేవీ పరిగణనలోకి తీసుకోకుండా నిబంధనలకు నీళ్లొదిలారనే ఆరోపణలున్నాయి. అకౌంటెంట్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వేసిన సమయంలో పెద్ద ఎత్తున మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఎంకాం చేసిన వారు అధిక సంఖ్యలో ఉన్నారు. అన్ని అర్హతలున్నా వీరిని పక్కనబెట్టి నిబంధనలకు విరుద్ధంగా పురుషులకు పోస్టులు అప్పజెప్పారనే ఆరోపణలు వస్తున్నాయి.
కోర్టును ఆశ్రయించారు
మూడేళ్ల కిందట విడుదలైన జీఓలో పురుషులను నియమించుకోవద్దని లేదు. పురుషుల నియామకాలు చేపట్టకూడదని ఇటీవల వచ్చిన సర్క్యులర్‌లో పేర్కొన్నారు. దీన్ని బట్టి ఆయా కేజీబీవీల్లో పనిచేస్తున్న పురుషుడిని వెళ్లిపోవాలని ఆదేశించాం. దీంతో వారు కోర్టుకు వెళ్లారు. స్టే కోసం ప్రయత్నిస్తున్నారు. మూడేళ్లుగా లేని వేధింపులు.. ఇప్పుడెలా వచ్చాయి? వేధింపులు జరుగుతున్నట్లు మా దృష్టికి రాలేదు.
- బాబూ భూక్యా, ఆర్వీఎం పీఓ
కేజీబీవీల్లో వెలుగుచూడని ఉదంతాలెన్నో
Published Wed, Sep 11 2013 4:52 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement