భువనగిరి, న్యూస్‌లైన్
హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలిస్తున్న నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని ప్రారంభించి నిజాం ప్రభువుల గుండెల్లో దడ పుట్టించిన వ్యక్తుల్లో నారాయణరెడ్డి ముఖ్యులు. ఉన్నత కుటుంబంలో పుట్టినా పేదవాడి కష్టసుఖాలు తెలుసుకుంటూ వారిలో ఒకరిగా బతుకుతూ ప్రజల హృదయాల్లో చెరగని గూడు కట్టుకున్న మహోన్నత ధీరోదాత్తుడు రావినారాయణరెడ్డి. నల్లగొండ జిల్లా భువనగిరి మండలం బొల్లేపల్లిలో 1908 జూన్ 4న భూస్వామ్య కుటుంబంలో ఆయన జన్మించారు. అభ్యుదయ భావాలతో 1930లో స్వాతంత్య్ర పోరాటంలో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో తెలంగాణ ప్రతినిధిగా హైదరాబాద్ రాష్ర్టం నుంచి పాల్గొన్నారు. 1944లో భువనగిరిలో జరిగిన ఆంధ్ర మహాసభకు అధ్యక్షునిగా ఎన్నికైన ఆయన సంఘం ద్వారా కమ్యూనిస్టు సాయుధ ఉద్యమాన్ని నడిపారు. ప్రజా వ్యతిరేకులైన నైజాం పాలకులకు, వారి తాబేదార్లయిన భూస్వాములు, పెత్తందార్లకు వ్యతిరేకంగా దళాలను ఏర్పాటు చేసి సాయుధ పోరాటాలు నడిపిన వీరోచిత సేనాని. భూమి లేని నిరుపేదలకు తన స్వంత భూమిని 200 ఎకరాలు దానం చేశారు. 1991 సెప్టెంబర్ 7న ఆయన తుదిశ్వాస విడిచారు.
సమావేశాలకు మారువేషంలో వచ్చేవారు
నైజాం నవాబులు తెలంగాణ పోరాటయోధులపై దమనకాండకు దిగుతుండడంతో వారి బారినుంచి తప్పించుకునేందుకు రావి నారాయణరెడ్డి మారువేషాల్లో తిరిగేవారు. గ్రామాల్లో ప్రజలను చైతన్యం చేసేందుకు ఆయన రాత్రి వేళల్లో మారువేషం వేసుకొని అక్కడికి వెళ్లి సమావేశాలు నిర్వహించి వారిని చైతన్యం చేసేవారు. అప్పట్లో కమ్యూనిస్టు నాయకులంతా బొల్లేపల్లి కేంద్రంగా ఉద్యమాలు నిర్మించేవాళ్లు. ముగ్ధుం మొయినొద్దీన్, పుచ్చలపల్లి సుందరయ్య, ఆరుట్ల రాంచంద్రారెడ్డి దంపతులు వంటి వారెందరో ఈ ఊరికి వచ్చేవారు.
- పడాల మధుసూదన్, రావి నారాయణరెడ్డి అనుచరుడు, బొల్లేపల్లి
రెండు సంవత్సరాల జైలు జీవితం గడిపా
సూర్యాపేట : తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడుతున్న బీఎన్‌రెడ్డి నాయకత్వంలో నేను పాల్గొన్నా. అందుకు గాను రెండు సంవత్సరాలు జైలుజీవితం గడిపాను. నాతో పాటు ఇదే గ్రామానికి చెందిన పొడపంగి భిక్షం, సీహెచ్.వీరయ్య, కొండ నర్సయ్య, పి.వీరయ్య, కాకి చంద్రారెడ్డి దళంలో సభ్యులుగా పనిచేశారు. వరంగల్ జిల్లా దాట్ల గ్రామంలో నైజాం సైన్యం దొరలకు వత్తాసు పలికి గ్రామంలోకి ఎవ్వరినీ రాకుండా అడ్డుకుంటున్నట్లు వార్త తెలుసుకొని ఆ గ్రామానికి వెళ్లి మహిళలచే నైజాం సైనికుల కళ్లల్లో కారం కొట్టించి ఎదురుదాడికి పాల్పడ్డాం. అనంతరం గ్రామంలో ఎర్రజెండాలను ఎగురవేశాం.
అదే విధంగా సర్వారం గ్రామంలో అగ్రకులస్తులు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంటే తమ దళ సభ్యులు మారువేషాల్లో అక్కడకు చేరుకొని తుపాకులతో దాడి చేసి గ్రామంలో ఉన్న చెట్టుకు ఎర్రజెండాను ఎగురవేశాం. అదే విధంగా ఆత్మకూర్.ఎస్ మండలం కోటపహాడ్ గ్రామంలో పోలీస్‌లకు, కమ్యూనిస్టులకు జరిగిన దాడిలో ఊదరబాంబు సంఘటనలో పోలీసులు చనిపోయేందుకు కీలకపాత్ర పోషించాను. మహారాష్ట్రలోని జాల్నా జైలులో ఒక సంవత్సరం, గుల్బర్గా జైలులో ఒక సంవత్సరం, వరంగల్ జైలులో ఆరు నెలలు జైలు జీవితం గడిపాను.
-కుశలపల్లి నారయ్య, రావిపహాడ్, మోతె (మం)
ప్రజల మనిషి రావి నారాయణరెడ్డి
Published Tue, Sep 17 2013 4:53 AM | Last Updated on Fri, Sep 1 2017 10:46 PM
Advertisement
Advertisement