పార్టీ అధిష్టానానికి ఫ్యాక్స్
మాచర్ల టౌన్ : మాచర్ల పురపాలక సంఘంలో అధికార పార్టీకి చెందిన 11 మంది కౌన్సిలర్లు తమ కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం పురపాలక సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో వారు మాట్లాడారు. రాజీనామాకి దారి తీసిన పరిస్థితులపై వివరించారు. మున్సిపల్ చైర్మన్ పదవీ కాలంపై జరిగిన ఒప్పందాలను ఉల్లఘించటమే రాజీనామాకు కారణమని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇన్‌చార్జిలుగా వ్యవహరించిన చిరుమామిళ్ల మధు, కొమ్మారెడ్డి చలమారెడ్డి సమక్షంలో చైర్మన్ పదవిపై ఒప్పందం జరిగిందన్నారు. దీనిని అనుసరించి చైర్మన్‌గా గోపవరపు శ్రీదేవి రెండేళ్లు, నెల్లూరి మంగమ్మ రెండు సంవత్సరాలుగా, షేక్ షాకూరీన్ ఏడాదిపాటు చైర్మన్‌గా కొనసాగే విధంగా పెద్దల సమక్షంలో అంగీకారం కుదిరిందని తెలిపారు.
పదవీకాలం ముగిసినా..
జూలై 3వ తేదీ నాటికి శ్రీదేవి పదవీ కాలం ముగిసినా ఆమె రాజీనామా చేయలేదని, ఈ రెం డేళ్ల కాలంలో చైర్మన్ శ్రీదేవి భర్త ఆమె పదవిని అడ్డం పెట్టుకుని పలు అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు కౌన్సిలర్లు ఆరోపిం చారు. చైర్మన్ భర్త కారణంగా పార్టీ అభాసుపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి అక్రమాలపై జిల్లా పార్టీ అధ్యక్షుడు, పార్టీ పెద్దలదృష్టికి తీసుకెళ్లినా నేతలు స్పందించలేదని తెలిపారు. నేతలు పట్టించుకోని తీరుకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. రాజీనామా ప్రతులను సీఎం పేషీ, జిల్లా పార్టీ అధ్యక్షుడు, వ్యవసాయ శాఖామంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్, స్థానిక ఇన్‌చార్జి చలమారెడ్డికు పంపినట్లు వివరించారు.