సమావేశానికి హాజరైన వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు
అధికార పార్టీ హైడ్రామా
Published Wed, Aug 30 2017 10:34 PM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM
- నంద్యాల మునిసిపల్ కౌన్సిల్ మీట్ జరగకుండా కుయుక్తులు
- అటెండెన్స్ రిజిష్టర్‌లో సంతకాలు చేసి, తర్వాత కొట్టేసిన టీడీపీ కౌన్సిలర్లు
- కోరం లేక సమావేశం వాయిదా
- అభివృద్ధిపై టీడీపీకి చిత్తశుద్ధి లేదని చైర్‌పర్సన్ మండిపాటు
నంద్యాల : నంద్యాల అభివృద్ధే తమ ధ్యేయమంటూ ఉప ఎన్నిక వేళ ఊదరగొట్టిన టీడీపీ నాయకులు..తమ అసలు ఆలోచనలు మాత్రం భిన్నమని రెండురోజులకే నిరూపించారు. అభివృద్ధి ఎలా పోయినా ఫర్వాలేదు గానీ..రాజకీయంగా తమదే పైచేయి కావాలన్న రీతిలో వ్యవహరించారు. పట్టణంలో అభివృద్ధి పనులకు ఆమోదం కోసం బుధవారం మున్సిపల్ చైర్‌పర్సన్ దేశం సులోచన అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైఎస్సార్‌సీపీ, టీడీపీ కౌన్సిలర్లు హాజరయ్యారు. అయితే.. ముగ్గురు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. దీన్ని గ్రహించిన టీడీపీ కౌన్సిలర్లు అప్పటికప్పుడు కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయించాలని పన్నాగం పన్నారు. అప్పటికే సమావేశానికి హాజరైనట్లు టీడీపీ కౌన్సిలర్లు గంగిశెట్టి విజయ్‌కుమార్, దియ్యాల సులోచన, నూర్జహాన్, హనీఫ్, సర్తాజ్‌లు రిజిష్టర్‌లో సంతకాలు చేశారు. వీరితో పాటు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు కూడా సంతకాలు పెట్టారు.
ఇంతలోనే టీడీపీ ముఖ్య నాయకుల నుంచి ఆ పార్టీ కౌన్సిలర్లకు ఫోన్‌లో ఆదేశాలు రావడంతో వెంటనే వారు కౌన్సిల్ హాలు నుంచి బయటకు వచ్చారు. పార్టీ మారిన చైర్‌పర్సన్ దేశం సులోచన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఉదయం పది గంటలకు సమావేశం ప్రారంభం కాగా.. 12గంటల వరకు సభ్యుల కోసం చైర్‌పర్సన్ వేచిచూశారు. ధర్నాకు దిగిన టీడీపీ కౌన్సిలర్లు కొందరు అటెండెన్స్ రిజిష్టర్‌లో సంతకాలు పెట్టిన విషయాన్ని ముఖ్య నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆదేశాల మేరకు సంతకాలు చేసిన కౌన్సిలర్లు తిరిగి సమావేశం హాలులోకి వెళ్లి రిజిష్టర్ తీసుకొని వాటిని కొట్టేశారు.దీంతో సమావేశం నిర్వహించడానికి ముగ్గురు సభ్యులు తక్కువ కావడంతో కోరం లేదంటూ చైర్‌పర్సన్ వాయిదా వేశారు.
ఇలా అయితే అభివృద్ధి ఎలా?
నంద్యాల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని, ఇందుకోసం రూ.1,500 కోట్లు మంజూరు చేశామని చెబుతున్న ఆ పార్టీ నాయకులు పట్టణంలో అభివృద్ధి పనుల ఆమోదం కోసం నిర్వహించిన సమావేశం నుంచి బయటకు రావడాన్ని వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రశ్నించారు. ముగ్గురు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు అనారోగ్యం కారణంగా రాకపోవడాన్ని గ్రహించిన టీడీపీ కౌన్సిలర్లు అప్పటికప్పుడు సమావేశం నుంచి వెళ్లిపోవడం తగదన్నారు. తద్వారా పట్టణంలో జరిగే అభివృద్ధి పనులను ఆపడం భావ్యం కాదన్నారు.
కోరం లేక వాయిదా–చైర్‌పర్సన్ దేశం సులోచన
మునిసిపల్ సమావేశానికి ముగ్గురు కౌన్సిలర్లు తక్కువ కావడంతో కోరం లేక వాయిదా వేశాం. వచ్చే నెల జరిగే సమావేశానికి ఆ ముగ్గురు కౌన్సిలర్లు హాజరవుతారు. ఇప్పుడు వారు అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయారు. టీడీపీ కౌన్సిలర్లు అభివృద్ధికి సహకరించాలి. నేను ఏనాడూ వారిని ఇబ్బంది పెట్టాలని చూడలేదు. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా సమావేశాన్ని రద్దు చేయించడం బాధాకరం. అధికార పార్టీ నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నేను టీడీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదు.
Advertisement
Advertisement