16 నుంచి సకల జనుల సమ్మె
Published Wed, Jan 8 2014 2:07 AM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర సాధన కోసం అన్ని వర్గాలను కలుపుకుని ఈనెల 16 నుంచి సకల జనుల సమ్మె చేపట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడు చౌదరి పురుషోత్తమనాయుడు తెలిపారు. ఏపీ ఎన్జీవో సంఘం సహాధ్యక్షునిగా గెలుపొందిన తర్వాత జిల్లాకు వచ్చిన సందర్భంగా శ్రీకాకుళంలోని ఎన్జీవో కార్యాలయంలో మంగళవారం విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పురుషోత్తమనాయుడు మాట్లాడుతూ ఈనెల 5న జరిగిన సంఘ ఎన్నికల్లో అశోక్‌బాబు ప్యానెల్‌ను గెలిపిం చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇటు సమైక్యాంధ్ర కోసం, అటు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రాన్ని విభజించాలన్న సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడిన తర్వాత రాజకీయ పార్టీలు విఫలమవడంతో అశోక్‌బాబు నేతృత్వంలో ఉద్యమించామన్నారు.
పార్టీలు ఎలా ఉన్నా ఆ పార్టీల స్థానిక నాయకులు తమ ఉద్యమానికి మద్దతు తెలిపారన్నారు. తాము ఏ రాజకీయ పార్టీకి మద్దతు ప్రకటించలేదని స్పష్టం చేశారు. ఉద్యోగ వ్యతిరేక ప్రభుత్వాలు ఏవైనా ఎన్జీవోలంతా సంఘటితంగా ఎదుర్కొందామన్నారు. ప్రజాభిప్రాయానికనుగుణంగా నడుచుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ప్రత్యేక తెలంగాణా కోసం అన్ని పార్టీలు, ఉద్యోగులు ఒకే వేదికపైకి వ చ్చారని, సీమాంధ్రలో ఆ పరిస్థితి లేదన్నారు. ఎన్జీవో సంఘం ఆ దిశగా ప్రయత్నాలు చేపట్టిందన్నారు. సమైక్యాంధ్ర కోసం సమ్మె చేసిన 66 రోజులను రెగ్యులర్ చేయాలని ముఖ్యమంత్రితో చర్చించామని, దీనికి ఐదారు నెలలు పడుతుందని చెప్పారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం మాట్లాడుతూ ఇటీవల జరిగిన సంఘ ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయన్నారు.
ఘన స్వాగతం
సంఘ రాష్ట్ర సహాధ్యక్షుడిగా ఎన్నికై వచ్చిన చౌదరి పురుషోత్తమ నాయుడుకు జిల్లా ఎన్జీవోలు ఘన స్వాగతం పలికారు. శ్రీకాకుళం ముఖద్వారం నుంచి కొత్తబ్రిడ్జి, డే అండ్ నైట్ జంక్షన్, పాలకొండ రోడ్, వైఎస్‌ఆర్ కూడలి, పాతబస్టాండ్ మీదుగా ఎన్జీవో కార్యాలయం వరకు భారీ ర్యాలీగా ఆయనను తీసుకువచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బుక్కూరు ఉమామహేశ్వరరావు, ఎన్జీవో సంఘ ప్రతినిధులు ఎం. కాళీప్రసాద్, వీఎస్‌ఎస్ కేశవరావు, కిలారి నారాయణరావు, బమ్మిడి హరి కృష్ణ, బమ్మిడి నర్సింగరావు, పూజారి జానకిరాం, ఆర్.వి.ఎన్.శర్మ, చల్లా శ్రీను, టీడీపీ జిల్లా అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి (బాబ్జి), శ్రీకాకుళం ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు కొంక్యాణ వేణుగోపాల్, సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక కన్వీనర్ గీతా శ్రీకాంత్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement