ఉట్నూర్, న్యూస్‌లైన్ : ఐటీడీఏ గిరిజన సంక్షేమశాఖ ఆధీనంలో జిల్లావ్యాప్తంగా 37 బాలికల ఆశ్రమ పాఠశాలలు, 14 కస్తూర్భా గాంధీ విద్యాలయాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 20,749 మంది గిరిజన బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి ప్రభుత్వం ఉచిత భోజన వసతితోపాటు మౌలిక వసతులు కల్పిస్తుంది. మొదటి విడుతగా ఆగస్టులో 26 విద్యాలయాల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉట్నూర్, ఇంద్రవెల్లి, భీమిని, నెన్నెల, తాండూర్, దండేపల్లి, మంచిర్యాల, కాసిపేట, జైపూర్, సిర్పూర్(టి), బాబాసాగర్, ఆసిఫాబాద్, వాంకిడి, రెబ్బెన, ఇచ్చోడ, నేరడిగొండ, సోనాల, కాతిగూడ, కడెం, ఖానాపూర్, మాణిక్యాపూర్, తలమడుగు, జైనథ్, తాంసి, బేల, తోషం ప్రాంతాల్లోని విద్యాలయాల్లో వైద్య పరీక్షలు జరిగాయి. సాధారణంగా బాలికల్లో హిమోగ్లోబిన్ శాతం 11.5 నుంచి 16.5 గ్రాములు ఉండాలి.కానీ 5 గ్రాముల నుంచి 11 గ్రాముల వరకు ఉంది. దాదాపు 625 మంది బాలికలకు రక్తహీనత ఉందని, ఇందులో 11మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తేలింది. ఈ నివేదికను వైద్యులు ఐటీడీఏ పీవోకు సమర్పించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆశ్రమాలు, కేజీబీవీల్లో పరీక్షలు నిర్వహిస్తే రక్తహీనత విద్యార్థినులు వేల సంఖ్యలో ఉండే అవకాశం ఉంది. దీంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
విద్యాలయాల్లో పోషకాహారం కరువు
గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమాలు, కేజీబీవీల్లో విద్యార్థినులకు మెనూ ప్రకారం భోజనం అందడం లేదు. ఈ పాఠశాలలకు పేద విద్యార్థులే వస్తుంటారు. నీళ్ల చారు.. ఉడకని, దొడ్డు అన్నం పెడుతున్నారు. పోషక విలువలు కలిగిన అందించాలని ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంటే అధికారులు మాత్రం అధికారులు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పోషక విలువలు గల ఆహారం అందిస్తే విద్యార్థులకు రోగనిరోధక శక్తి పెరిగి ఉత్సాహంగా ఉంటారు. దీనితోపాటు జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఆటల్లో చదువులో రాణిస్తారు. కానీ, విద్యార్థులకు మంచి భోజనం పెట్టకపోవడంతో అనారోగ్యం పాలవుతున్నారు. గతంలో జ్వరం వంటి వ్యాధులతో చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. కొందరు ఇంటికి తీసుకెళ్లి చదివిస్తున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం రూ.కోట్ల నిధులు విడుదల చేస్తున్నా, అధికారులు నిర్లక్ష్యంతో బలవర్ధకమైన ఆహారం అందడం లేదు. ఫలితంగా విద్యార్థినులు అనారోగ్యం పాలవుతున్నారు. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు దృష్టిసారించి విద్యార్థినులకు పోషకాహరం అందించాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
రక్తహీనత కేసులు నిజమే..
ఆశ్రమ, కేజీబీవీల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించగా రక్తహీనత ఉందని తేలింది. ఈ నివేదికను ఐటీడీఏ పీవోకు ఇచ్చాము. విద్యార్థినులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తే రక్తహీనత రాదు. కొన్ని విద్యాలయాల్లో మోనూ ప్రకారం భోజనం అందడం లేదు.దీంతోనే విద్యార్థినులకు రక్తహీనత వస్తుంది.
- వెంకటేశ్వర్లు, ఇన్‌చార్జి డీడీటీడబ్ల్యూ
26 పాఠశాలల్లో 625 మంది విద్యార్థినులకు రక్తహీనత
Published Mon, Sep 23 2013 3:08 AM | Last Updated on Fri, Nov 9 2018 4:59 PM
Advertisement
Advertisement