'6 కోట్ల మంది అభీష్టానికి వ్యతిరేకం ఈ నిర్ణయం'
హైదారబాద్: ఆరు కోట్ల మంది అభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నారని ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. ఏపీ ఎన్జీవో భవన్‌లో సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక సదస్సులో ఆయన మాట్లాడారు. రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్రాన్ని విభజించారని మండిపడ్డారు. 6 కోట్ల మంది తప్పుబడుతున్నా, నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోవడం దారుణం అన్నారు.
సమైక్యాంధ్ర ఉద్యమంలో ఏపీ ఎన్జీవోలు చాలా నిబద్ధతో ఉన్నట్లు తెలిపారు. ఈ ఉద్యమానికి పౌరసమాజం నుంచి మరింత మద్దతు కావాలని కోరారు. తెలంగాణవాదుల ప్రశ్నలన్నింటికీ హైదరాబాద్ బహిరంగ సభ సమాధానం కాబోతుందన్నారు. త్వరలో హైదరాబాద్‌లో సమైక్యాంధ్ర సభ నిర్వహిస్తామని చెప్పారు. 1969, 72 ఉద్యమాల తర్వాత రాష్ట్రాన్ని విభజించేది లేదని పార్లమెంట్ స్పష్టం చేసిన విషయం గుర్తు చేశారు.
పార్లమెంట్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇప్పుడు రాష్ట్రాన్ని విభజించడం సమంజసం కాదన్నారు. గుంటూరులో రేపు అన్ని ఉద్యోగ, ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ నిర్ణయిస్తామని అశోక్‌బాబు చెప్పారు.