
ఈ ఏడాది మెడిసిన్‌లో 6,200 ఎంబీబీఎస్ సీట్లు
నిర్ధారించిన వైద్య విద్యాశాఖ
ప్రభుత్వ కళాశాలల్లో 2,400, ప్రైవేటులో 3,800 సీట్లు
ప్రస్తుత సీట్ల ప్రకారం ఒక్కో సీటుకు 23 మంది పోటీ
మొత్తం పరీక్ష రాస్తున్న వారు లక్షా తొమ్మిదివేలు
హైదరాబాద్: ఈ ఏడాది మెడిసిన్ ప్రవేశ పరీక్షకు భారీ డిమాండ్ ఉంది. ఎప్పుడూ లేనంతగా ఒక లక్షా తొమ్మిది వేల మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లకు పోటీ పడుతున్నారు. కాగా, వైద్య విద్యాశాఖ ఈ ఏడాది కళాశాలలు, ఎంబీబీఎస్ సీట్లపై ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఈ విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో 6,200 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నట్టు నిర్ధారించింది. వచ్చే నెలలో మెడిసిన్ ప్రవేశ పరీక్ష జరగనున్న తరుణంలో తొలి కౌన్సెలింగ్ నాటికి ఎన్ని సీట్లు ఉండనున్నాయో ఒక అంచనాకు వచ్చింది. మొత్తం 15 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,400 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ఉస్మానియా కళాశాలలో 250 సీట్లుండగా, గాంధీ, ఆంధ్రా మెడికల్ కళాశాల (వైజాగ్), గుంటూరు వైద్య కళాశాల, కర్నూలు వైద్య కళాశాల, వెంకటేశ్వర వైద్య కళాశాల, కాకతీయ వైద్య కళాశాల (వరంగల్), రంగరాయ వైద్య కళాశాలల్లో 200 సీట్ల చొప్పున ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 28 ప్రైవేటు కళాశాలల్లో 3,800 సీట్లున్నాయి. మొత్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కలిపి 6,200 ఎంబీబీఎస్ సీట్లున్నాయి.
40 శాతం యాజమాన్య కోటా: ప్రైవేటు వైద్య కళాశాలల సీట్లలో నలభై శాతం.. అంటే 1,520 సీట్లు యాజమాన్య కోటా కింద ఉన్నాయి. వీటిలో 950 సీట్లను (మొత్తం ప్రైవేటు సీట్లలో 25 శాతం) స్థానికులకు కేటాయించాలి. మిగిలిన 570 సీట్లను (మొత్తం ప్రైవేటు సీట్లలో 15 శాతం) ఎన్‌ఆర్‌ఐ కోటాకింద భర్తీ చేస్తారు. ఇవి పోగా మిగిలిన 2,280 ప్రైవేటు కళాశాలల సీట్లలో కన్వీనర్ కోటా కింద 1,900 సీట్లు (మొత్తం ప్రైవేటు సీట్లలో 50 శాతం), ‘బి’ కేటగిరీ కింద 380 సీట్లను (మొత్తం ప్రైవేటు సీట్లలో 10 శాతం) భర్తీ చేస్తారు. యాజమాన్య కోటా మినహాయిస్తే ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద ఉన్న సీట్లు 4,680 మాత్రమే. ఈ సీట్లకు లక్షకు పైగా విద్యార్థులు పోటీ పడుతున్నారు. అంటే ఒక్కో సీటుకు 23 మందికి పైగా పోటీ పడుతున్నట్టు లెక్క. మే నెలలో ఎంసెట్ జరగనుంది. సెకండ్ కౌన్సెలింగ్ నాటికి మరికొన్ని సీట్లు పెరిగే అవకాశమున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది నెల్లూరు ప్రభుత్వ కళాశాల సీట్లు అందుబాటులోకి రావడం లేదని తేలింది.