=జిల్లాకు కండలేరు నీళ్లు
=18 మాసాల్లో పనుల పూర్తికి చర్యలు
=రూ.182 కోట్లతో తొలి మహిళా వైద్య కళాశాల
=శంకుస్థాపన కార్యక్రమాల్లో సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి
తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్: జిల్లాలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం రూ.7200 కోట్లతో సమగ్ర తాగునీటి పథకానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. తిరుపతిలోని స్విమ్స్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమగ్ర తాగునీటి పథకం పనుల శిలాఫలకానికి ఆయన శంకుస్థాపన చేశారు. దీంతో పాటు రూ.182 కోట్లతో నిర్మించనున్న తొలి మహిళా వైద్య కళాశాల పనులకు కూడా శంకుస్థాపన చేశారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా ప్రజల దాహార్తిని తీర్చడానికి కండలేరు నుంచి నీటిని తరలించనున్నామని పేర్కొన్నారు. అందుకోసం అయ్యే వ్యయంలో మొదటి విడతగా రూ.5800 కోట్లు మంజూరు చేస్తున్నామని వివరించారు. ఈ నిధులతో 8468 హ్యాబిటేషన్లలో తాగునీటి సమస్య తీరుతుందన్నారు. రెండవ విడతగా మరో రూ.1400 కోట్లతో 2449 హ్యాబిటేషన్లకు తాగునీరు అందిస్తామని చెప్పారు. ఈ పనులన్నింటినీ 18 నెలల్లో పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నామని చెప్పారు.
రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి మహిళా వైద్య కళాశాలను ఏర్పాటు చేసుకుంటున్నామంటే అంతా వేంకటేశ్వర స్వామి కృపాకటాక్షాలేనని సీఎం స్పష్టం చేశారు. కండలేరు నుంచి చిత్తూరుకు చేపడుతున్న తాగునీటి తరలింపు పనులను అడ్డుకుంటామంటూ నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న హెచ్చరికలను విలేకరులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అందుకు స్పందించిన సీఎం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కండలేరు నీటి తరలింపును అడ్డుకోగలరా..? చెప్పమనండి అంటూ ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి పార్థసారధి, భూగర్భ గనుల శాఖా మంత్రి గల్లా అరుణకుమారి, వైద్య విద్య శాఖా మంత్రి కొండ్రు మురళి, మౌలిక వసతుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు, టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఎమ్మెల్యేలు సీకే బాబు, షాజహాన్, రవి, మాజీ ఎమ్మెల్యేలు రెడ్డివారి చెంగారెడ్డి, ఎస్సీవీ నాయుడు, వెంకట్రమణ, కలెక్టర్ రాంగోపాల్, స్విమ్స్ డెరైక్టర్ వెంగమ్మ, డీసీసీ అధ్యక్షుడు అమాస రాజశేఖర రెడ్డి పాల్గొన్నారు.
తాగునీటి కోసంరూ.7200 కోట్లు
Published Thu, Nov 21 2013 3:14 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM
Advertisement