ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీ పరిధిలోని టకారిపాలెంలో 130 బస్తాల నకిలీ కందిపప్పును మంగళవారం అర్ధరాత్రి పోలీసులు సీజ్ చేశారు. కందిపప్పు పేరుతో సన్నటి పప్పును విక్రయిస్తున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అది నకిలీ పప్పుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పైగా కిలో రూ.50కే విక్రయిస్తుండడం వారి అనుమానానికి బలం చేకూర్చేలా ఉంది. దీంతో కందిపప్పును సీజ్ చేశారు. తమకు ఆ పప్పు తమిళనాడులోని రాయవేలూరు నుంచి నాగరాజు అనే వ్యక్తి ద్వారా వచ్చినట్టు వారు విచారణలో తెలిపారు. దీంతో ఆ నిల్వలను విజిలెన్స్ విభాగానికి అప్పగించనున్నారు.