న్యూఢిల్లీ : సమైక్యాంధ్ర నినాదాలతో పార్లమెంట్ సోమవారం మార్మోగిపోయింది. సేవ్ ఆంధ్ర ప్రదేశ్, జై సమ్యాంధ్ర అంటూ సీమాంధ్ర ఎంపీలు సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు. దాంతో లోక్సభలో తొమ్మిదిమంది సీమాంధ్ర ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. కాంగ్రెస్, టీడీపీ ఎంపీలను స్పీకర్ మీరాకుమార్ అయిదు రోజుల పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్నారంటూ 347A నిబంధన కింద విచక్షణ అధికారంతో వారిపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు.
సస్పెండ్ అయినవారిలో ఎంపీలు సాయి ప్రతాప్, అనంత వెంకట్రామిరెడ్డి, మాగంట శ్రీనివాసులరెడ్డి,లగడపాటి రాజగోపాల్, కనుమూరి బాపిరాజు, కొనకళ్ల నారాయణ, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నిమ్మల కిష్టప్ప, శివప్రసాద్ ఉన్నారు. ఈ నేపథ్యంలో లోక్ సభ సమావేశాలను స్పీకర్ మధ్యాహ్నం రెండు గంటల వరకూ వాయిదా పడ్డాయి. సస్పెన్షన్ను నిరసిస్తూ టీడీపీ ఎంపీలు సభలోనే ఆందోళనకు దిగారు. ఇక రాజ్యసభలో సభా కార్యక్రమాలు అడ్డుకున్న ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ లను రాజ్యసభ ఛైర్మన్ సభనుంచి సస్పెండ్ చేశారు.