మరో 21 మంది ఎంపీలపై వేటు | 45 LS members suspended in 2 days for disruptions | Sakshi
Sakshi News home page

మరో 21 మంది ఎంపీలపై వేటు

Published Fri, Jan 4 2019 3:37 AM | Last Updated on Fri, Jan 4 2019 3:37 AM

45 LS members suspended in 2 days for disruptions - Sakshi

పార్లమెంటు ప్రాంగణంలో ఆందోళనకు దిగిన అన్నాడీఎంకే ఎంపీలు

సాక్షి, న్యూఢిల్లీ: సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్న సభ్యులపై లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ వరుసగా రెండో రోజు కొరడా ఝుళిపించారు. బుధవారం 24 మందిని సస్పెండ్‌ చేసిన ఆమె..గురువారం మరో 21 మందిని నాలుగు రోజుల పాటు సస్పెండ్‌ చేశారు. ఈ 45 మంది ఇక ఈ సెషన్‌లో సభకు హాజరుకావొద్దని ఆదేశించారు. జనవరి 8న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి. గురువారం సభ నుంచి ఉద్వాసనకు గురైన వారిలో 13 మంది టీడీపీ ఎంపీలు, ఏడుగురు ఏఐఏడీఎంకే సభ్యులు, వైఎస్సార్సీపీ టికెట్‌పై గెలిచి టీడీపీలో చేరిన సభ్యురాలు ఉన్నారు.

ఇంతమంది సభ్యులపై స్పీకర్‌ ఒకేసారి చర్యలు తీసుకోవడం పార్లమెంట్‌ చరిత్రలో అసాధారణ పరిణామమని భావిస్తున్నారు. డిసెంబర్‌ 11న పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కావేరి అంశంపై ఏఐఏడీఎంకే సభ్యులు తరచూ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం జీరో అవర్‌ ప్రారంభమైన వెంటనే ఏఐఏడీఎంకే, టీడీపీ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. ఏఐఏడీఎంకే సభ్యులు స్పీకర్‌ కుర్చీ వైపు కాగితాలు విసిరారు. ఆగ్రహించిన స్పీకర్‌..గొడవ సృష్టిస్తున్న సభ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో వారిని సభ నుంచి సస్పెండ్‌ చేశారు.  

రాజ్యసభ నుంచి ఏఐఏడీఎంకే వాకౌట్‌
కావేరి జలాల వివాదంపై మాట్లాడేందుకు అనుమతి లభించనందుకు నిరసనగా ఏఐఏడీఎంకే సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్‌ చేశారు. లోక్‌సభలో తమ సభ్యులు సస్పెండైన అంశాన్ని ఏఐఏడీఎంకే సభ్యుడు నవనీత్‌ క్రిష్ణన్‌ లేవనెత్తగా, చైర్మన్‌ వెంకయ్యనాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. లోక్‌సభలో సభ్యుల ప్రవర్తనను రాజ్యసభలో చర్చించలేమన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement