speaker sumithra mahajan
-
మరో 21 మంది ఎంపీలపై వేటు
సాక్షి, న్యూఢిల్లీ: సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్న సభ్యులపై లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వరుసగా రెండో రోజు కొరడా ఝుళిపించారు. బుధవారం 24 మందిని సస్పెండ్ చేసిన ఆమె..గురువారం మరో 21 మందిని నాలుగు రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఈ 45 మంది ఇక ఈ సెషన్లో సభకు హాజరుకావొద్దని ఆదేశించారు. జనవరి 8న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి. గురువారం సభ నుంచి ఉద్వాసనకు గురైన వారిలో 13 మంది టీడీపీ ఎంపీలు, ఏడుగురు ఏఐఏడీఎంకే సభ్యులు, వైఎస్సార్సీపీ టికెట్‌పై గెలిచి టీడీపీలో చేరిన సభ్యురాలు ఉన్నారు. ఇంతమంది సభ్యులపై స్పీకర్ ఒకేసారి చర్యలు తీసుకోవడం పార్లమెంట్ చరిత్రలో అసాధారణ పరిణామమని భావిస్తున్నారు. డిసెంబర్ 11న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కావేరి అంశంపై ఏఐఏడీఎంకే సభ్యులు తరచూ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం జీరో అవర్ ప్రారంభమైన వెంటనే ఏఐఏడీఎంకే, టీడీపీ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. ఏఐఏడీఎంకే సభ్యులు స్పీకర్ కుర్చీ వైపు కాగితాలు విసిరారు. ఆగ్రహించిన స్పీకర్..గొడవ సృష్టిస్తున్న సభ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో వారిని సభ నుంచి సస్పెండ్ చేశారు. రాజ్యసభ నుంచి ఏఐఏడీఎంకే వాకౌట్ కావేరి జలాల వివాదంపై మాట్లాడేందుకు అనుమతి లభించనందుకు నిరసనగా ఏఐఏడీఎంకే సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. లోక్‌సభలో తమ సభ్యులు సస్పెండైన అంశాన్ని ఏఐఏడీఎంకే సభ్యుడు నవనీత్ క్రిష్ణన్ లేవనెత్తగా, చైర్మన్ వెంకయ్యనాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. లోక్‌సభలో సభ్యుల ప్రవర్తనను రాజ్యసభలో చర్చించలేమన్నారు. -
స్వర్ణభారత్ సేవలు ఆనందదాయకం
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వెంకటాచలం : పదవులున్నా లేకున్నా స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సామాజిక సేవలు ఆనందదాయకమని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మండలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్ 15వ వార్షికోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, వైద్య, ఉపాధి శిక్షణ రంగాల్లో సేవలందించడం మహానందాన్ని కలుగజేస్తాయన్నారు. ఎంత బిజీగా ఉన్నా.. టెన్షన్లో ఉన్నా స్వర్ణభారత్ ట్రస్ట్‌లో ఒక్కరోజు గడిపితే నూతన ఉత్సాహం వస్తుందన్నారు. ప్రభుత్వంలో ఉండి సేవ చేస్తే కేవలం ఆనందం మాత్రమే కలుగుతుందన్నారు. ప్రభుత్వాలు అన్నీ పనులు చేయలేవని, స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తలు సామాజిక చింతన ఉన్న వ్యక్తులు సేవ చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశంలో ఇంకా 24 శాతం దారిద్య్ర రేఖకు దిగువున ఉన్నారన్నారు. ప్రధాన మంత్రి మోదీ నేతృత్వంలో భారత్‌ను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో చేస్తున్న కృషికి అందరూ భాగస్తులు కావాలని పిలుపునిచ్చారు. స్వర్ణభారత్ లాంటి స్వచ్ఛందసేవా సంస్థలను దేశవ్యాప్తంగా విస్తరింపజేసేందుకు ఆసక్తి చూపాలని కోరారు. కన్నతల్లిని, జన్మభూమిని ఎప్పటికీ మరచిపోకూడదన్నారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ భేటీ బచావో..(ఆడ పిల్లలను రక్షించు) భేటీ పడావో.. (ఆడ పిల్లలను చదివించు) అనే నినాదాలతో అభివృద్ధివైపు అడుగులు వేస్తున్నామని, ఇప్పుడు భేటీ బడావో..(ఆడ పిల్లలను పెంచు) నినాదాలను ఆచరణలో చూపాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు నిదర్శనం దీపా వెంకట్, రజత విజేత పీవీ సింధూ అని తెలిపారు. సమగ్ర అభివృద్ధికి వెంకయ్యనాయుడు దూరదృష్టి స్ఫూర్తిదాయకమన్నారు. పెట్రోలియం సహజవనరులశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కృష్ణ గోదావరి బేసిన్లో అపారమైన గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయన్నారు. ఆయిల్ రీఫైనరీ విస్తరణ, పెట్రో మెడికల్ క్యాంపస్, పెట్రోలియం యూనివర్సిటీ పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు. బాడ్మింటన్ జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్, ఒలంపిక్ రజత పతక విజేత సింధూలు స్వర్ణభారత్ ట్రస్ట్ సేవలను కొనియాడారు. తొలుత ట్రస్ట్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న బ్రిడ్జి స్కూల్, రైతు శిక్షణ కేంద్రం, వివిధ ఉపాధి శిక్షణ కోర్సులను అతిథులకు మంత్రి వెంకయ్యనాయుడు వివరించారు. 15వ వార్షికోత్సవ సావనీర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా అక్షర విద్యాలయ విద్యార్థులు ప్రదర్శించిన దక్షణ భారతదేశ సంస్కృతి, కళల నృత్యరూపకాలు అలరించాయి. అతిథులకు ట్రస్ట్ నిర్వాహకులు జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు వెలగపల్లి వరప్రసాద్‌రావు, గోకరాజు గంగరాజు, కంభంపాటి హరిబాబు, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కలెక్టర్ ముత్యాలరాజు, ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్, సభ్యులు అట్లూరి అశోక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
జీఎస్టీకి లోక్‌సభ ఆమోదం
బిల్లుకు రేపు రాజ్యసభలో పరీక్ష బిల్లును స్థాయీ సంఘానికి పంపాలన్న డిమాండ్‌కు సర్కారు తిరస్కరణ న్యూఢిల్లీ: సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వస్తువులు, సేవల పన్ను బిల్లు (జీఎస్టీ) బుధవారం లోక్‌సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లును పార్లమెంటు స్థాయీ సంఘానికి పంపించాలని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ చేసిన డిమాండ్‌ను ప్రభుత్వం తిరస్కరించింది. దీనికి నిరసనగా కాంగ్రెస్ వాకౌట్ చేసింది. ఆ తర్వాత నిర్వహించిన ఓటింగ్‌లో టీఎంసీ, బీజేడీ తదితర పార్టీల మద్దతుతో బిల్లు ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 352 ఓట్లు పోలవగా.. వ్యతిరేకంగా 37 ఓట్లు పోలయ్యాయి. జీఎస్టీ అమలు వల్ల ఆదాయం నష్టపోయే రాష్ట్రాలకు కేంద్రం తొలి ఐదేళ్ల పాటు పరిహారం చెల్లిస్తుందని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఏకరూప పరోక్ష పన్ను రేటు.. నిపుణుల కమిటీ సిఫారసు చేసిన పన్ను రేటు 27 శాతం కంటే ఇంకా తక్కువగా ఉంటుందని హామీ ఇచ్చింది. ఓటింగ్ సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభలో లేరు. జీఎస్టీని అమలులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన ఈ రాజ్యాంగ సవరణ బిల్లు.. నిబంధనల మేరకు లోక్‌సభలో మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదం పొందినా.. రాజ్యసభలో ఏం జరుగుతుందనేది ప్రశ్నార్థకంగా ఉంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారుకు రాజ్యసభలో సాధారణ మెజారిటీ కూడా లేదు. ఈ పరిస్థితుల్లో పెద్దల సభ పరీక్షలో బిల్లు పాసవుతుందా? లేదా? అన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. లోక్‌సభలో కాంగ్రెస్ వాకౌట్ చేయటానికి ముందు.. జీఎస్టీ బిల్లుపై చర్చకు ఆర్థికమంత్రి సమాధానం ఇచ్చారు. పరోక్ష పన్నులను సంస్కరించాలన్న ప్రతిపాదన గత 12 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉండిపోయిందని.. తనకన్నా ముందు ఆర్థికమంత్రిగా పనిచేసిన పి.చిదంబరం కూడా యూపీఏ హయాంలో జీఎస్టీని ముందుకు తెచ్చారని పేర్కొన్నారు. ఎర్ర మీట నొక్కేశారు! జీఎస్టీ బిల్లుపై లోక్‌సభలో ఓటింగ్ సందర్భంగా కేంద్రం ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంది. బిల్లులోని రెండవ క్లాజుపై స్పీకర్ సుమిత్రా మహాజన్ ఓటింగ్ కోరగా.. అధికార బీజేపీ సభ్యులు 12 మంది.. ఎర్ర మీట నొక్కి వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో అరుణ్‌జైట్లీ అసంతృప్తికి లోనయ్యారు. వెంటనే మరో మంత్రి రూడీ.. వ్యతిరేకంగా ఓటేసిన సభ్యుల వద్దకు వెళ్లి మాట్లాడారు. మళ్లీ ఓటింగ్ నిర్వహించగా వారంతా సరైన మీటలు నొక్కారు.