స్వర్ణభారత్ సేవలు ఆనందదాయకం
-
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
వెంకటాచలం :
పదవులున్నా లేకున్నా స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సామాజిక సేవలు ఆనందదాయకమని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మండలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్ 15వ వార్షికోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, వైద్య, ఉపాధి శిక్షణ రంగాల్లో సేవలందించడం మహానందాన్ని కలుగజేస్తాయన్నారు. ఎంత బిజీగా ఉన్నా.. టెన్షన్‌లో ఉన్నా స్వర్ణభారత్ ట్రస్ట్‌లో ఒక్కరోజు గడిపితే నూతన ఉత్సాహం వస్తుందన్నారు. ప్రభుత్వంలో ఉండి సేవ చేస్తే కేవలం ఆనందం మాత్రమే కలుగుతుందన్నారు.
ప్రభుత్వాలు అన్నీ పనులు చేయలేవని, స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తలు సామాజిక చింతన ఉన్న వ్యక్తులు సేవ చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశంలో ఇంకా 24 శాతం దారిద్య్ర రేఖకు దిగువున ఉన్నారన్నారు. ప్రధాన మంత్రి మోదీ నేతృత్వంలో భారత్‌ను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో చేస్తున్న కృషికి అందరూ భాగస్తులు కావాలని పిలుపునిచ్చారు. స్వర్ణభారత్ లాంటి స్వచ్ఛందసేవా సంస్థలను దేశవ్యాప్తంగా విస్తరింపజేసేందుకు ఆసక్తి చూపాలని కోరారు.
కన్నతల్లిని, జన్మభూమిని ఎప్పటికీ మరచిపోకూడదన్నారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ భేటీ బచావో..(ఆడ పిల్లలను రక్షించు) భేటీ పడావో.. (ఆడ పిల్లలను చదివించు) అనే నినాదాలతో అభివృద్ధివైపు అడుగులు వేస్తున్నామని, ఇప్పుడు భేటీ బడావో..(ఆడ పిల్లలను పెంచు) నినాదాలను ఆచరణలో చూపాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు నిదర్శనం దీపా వెంకట్, రజత విజేత పీవీ సింధూ అని తెలిపారు. సమగ్ర అభివృద్ధికి వెంకయ్యనాయుడు దూరదృష్టి స్ఫూర్తిదాయకమన్నారు. పెట్రోలియం సహజవనరులశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కృష్ణ గోదావరి బేసిన్‌లో అపారమైన గ్యాస్ నిక్షేపాలు
ఉన్నాయన్నారు. ఆయిల్ రీఫైనరీ విస్తరణ, పెట్రో మెడికల్ క్యాంపస్, పెట్రోలియం యూనివర్సిటీ పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు. బాడ్మింటన్ జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్, ఒలంపిక్ రజత పతక విజేత సింధూలు స్వర్ణభారత్ ట్రస్ట్ సేవలను కొనియాడారు. తొలుత ట్రస్ట్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న బ్రిడ్జి స్కూల్, రైతు శిక్షణ కేంద్రం, వివిధ ఉపాధి శిక్షణ కోర్సులను అతిథులకు మంత్రి వెంకయ్యనాయుడు వివరించారు. 15వ వార్షికోత్సవ సావనీర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా అక్షర విద్యాలయ విద్యార్థులు ప్రదర్శించిన దక్షణ భారతదేశ సంస్కృతి, కళల నృత్యరూపకాలు అలరించాయి. అతిథులకు ట్రస్ట్ నిర్వాహకులు జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు వెలగపల్లి వరప్రసాద్‌రావు, గోకరాజు గంగరాజు, కంభంపాటి హరిబాబు, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కలెక్టర్ ముత్యాలరాజు, ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్, సభ్యులు అట్లూరి అశోక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.