సాక్షి, నెల్లూరు : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ చిత్రాన్ని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసించారు. శనివారం ఆయన నెల్లూరులో స్వర్ణభారతి ట్రస్ట్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఈ మధ్యకాలంలో ‘యాత్ర’ సినిమా చూశా.. చాలా బాగుంది. రైతులు, సంస్కృతి, సంప్రదయాలన్నా నాకు ప్రాణం. మనం చేసే మంచి పనులే మన తరువాత మనలను గుర్తుపెట్టుకునేలా చేస్తాయి.’ అని వెంకయ్య అన్నారు. ఏ హోదాలో ఉన్నా సొంత గ్రామాన్ని మరచిపోనని, ఎవరి పని వారు చేయడమే దేశభక్తి అని ఆయన పేర్కొన్నారు. ప్రజా జీవనంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని అనేది తన భావన అని, కానీ తన పదవి, భద్రత, హోదాకు భంగం కలగకుండా ప్రవర్తిస్తున్నట్లు వెంకయ్య తెలిపారు.
అన్ని రాజకీయ పార్టీలతో కలిసి మెలిసి ఉండే తత్వం తనదని చెప్పారు. మాతృభాష పరిరక్షణకు అన్ని రాజకీయ పార్టీలు కృషి చేయాలన్నారు. భాషా ప్రగతికి తీసుకోవాల్సిన చర్యలను ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలలో పర్యటిస్తూ విద్యార్థులకు మార్గదర్శకాలు చెపుతున్నట్లు వెంకయ్య పేర్కొన్నారు. ఉత్తర భారతదేశం వాళ్లు దక్షిణ, దక్షిణాది వాళ్లు ఉత్తరదేశ భాషలు నేర్చుకుంటే దేశ సమైక్యత బలపడుతుందని ఉప రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment