YSR Biopic
-
వైఎస్ జగన్ పాత్రలో జీవా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రలో తమిళ నటుడు జీవా నటించనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్‌తో ‘యాత్ర’ (2019) సినిమాని తెరకెక్కించిన దర్శకుడు మహీ వి. రాఘవ్ ప్రస్తుతం ‘యాత్ర 2’కి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ‘రంగం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తమిళ హీరో జీవాను జగన్ మోహన్ రెడ్డి పాత్రకు సంప్రదించారు మహీ. ఈ చిత్రంలో నటించడానికి జీవా సుముఖత వ్యక్తపరిచారు. ఇక వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో 2009 నుంచి 2019 వరకు జరిగిన ఘటనల నేపథ్యంలో ‘యాత్ర 2’ కథ సాగుతుంది. జగన్ పాదయాత్ర నుంచి ప్రారంభమై సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఈ సినిమా ముగుస్తుంది. ప్రస్తుతం ప్రీ ్ర΄÷డక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ ఆగస్టు 3న మొదలవుతుంది. 2024 ఫిబ్రవరిలో ‘యాత్ర 2’ సినిమా విడుదల కానుంది. కాగా మహీ వి. రాఘవ్ దర్శకత్వం వహించిన ‘సిద్దా లోకం ఎలా ఉంది నాయనా?’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. -
‘యాత్ర’.. ఓ మహానాయకుడి వ్యక్తిత్వానికి వెండితెర రూపం
కొన్ని కథలు ప్రేక్షకులను అలరిస్తాయి.. ఆలోచింపజేస్తాయి. మరికొన్ని కథలు హృదయాలను హత్తుకుంటాయి. కన్నీళ్లను తెప్పిస్తాయి. అలా మనసుల్ని హత్తుకునే కథలు అప్పుడప్పుడు మాత్రమే వస్తాయి. అలాంటి వాటిలో ‘యాత్ర’ ఒకటి. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన బయోగ్రాఫికల్ మూవీ ఇది. వైఎస్సార్‌లో రాజకీయపరంగానే కాక వ్యక్తిత్వ పరంగా కూడా ఎన్నో మార్పులు తీసుకువచ్చిన ప్రజా ప్రస్థానం యాత్ర నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. నాడు ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్సార్.. పాదయాత్ర ద్వారా జనంలోకి ఎలా వెళ్లగలిగారు? సమస్యలు ఎలా తెలుసుకున్నారు? కష్టాలకు పట్టించుకోకుండా.. మండుటెండల్లో ఎలా ముందడుగు వేశారు.. మండుటెండల్లో ఎలా ముందడుగు వేశారు? ఆయన పాదయాత్రకు దారి తీసిన పరిస్థితులేంటి? పాదయాత్ర రాజశేఖర్‌రెడ్డి వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పులు తీసుకు వచ్చింది? యాత్రలో ఆయనకు ఎదురైన అనుభవాలేంటి ? పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయి కష్టాల్లో ఉన్న పార్టీని వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన పట్టుదలతో ఎలా విజయతీరాలకు చేర్చారు? అన్నదే ఈ సినిమా కథ. ఒక సినిమాకు కథతో పాటు క్యారెక్టర్ సెలక్షన్ కూడా చాలా ముఖ్యం. ఇదే సినిమా సక్సెస్‌ని నిర్ణయిస్తుంది. వైఎస్సార్ పాత్రకు మలయాళ నటదిగ్గజం మమ్ముట్టిని ఎంపిక చేయడంతోనే ఈ సినిమా సగం విజయం సాధించింది. ‘యాత్ర’ సినిమా అనేది ఓ ఎమోషనల్ జర్నీ. ఇందులో పెద్దగా కథ కంటే పాత్రలే ముఖ్యం. వైఎస్సార్ పాత్రకు మమ్ముట్టి ప్రాణం పెట్టి నటించాడు. ఫస్ట్ సీన్ నుంచి చివరి వరకు తెర మీద రాజన్ననే చూస్తున్నామన్నంతగా ప్రేక్షకుడిని కథలో లీనం చేశాడు మమ్ముట్టి. రాజశేఖరరెడ్డి రాజసం, హుందాతనం, రాజకీయం, నమ్మిన వారికోసం ఎంతకైన తెగించే వ్యక్తిత్వం లాంటి విషయాలను తెర మీద అద్భుతంగా పలికించాడు. సినిమా అంతా ఒక ఎత్తైయితే క్లైమాక్స్‌లో వచ్చే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీన్స్ మరో ఎత్తు. అప్పటి వరకు వైఎస్సార్ గొప్పతనాన్ని తెలుసుకొని ఉప్పొంగిపోయిన ప్రేక్షకులను చివర్లో చూపించే రియల్ ఫుటేజ్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. అన్ని బయోపిక్ మూవీస్‌లా కేవలం కథను మాత్రమే చెప్పే ప్రయత్నం చేయలేదు దర్శకుడు మహి వీ రాఘవ. సినిమా తొలి సన్నివేశం నుంచే ప్రేక్షకుడిని కథలో లీనం చేసి రాజన్నతో ప్రయాణం చేసేలా చేశాడు. అందుకే విమర్శకులు సైతం రాఘవపై ప్రశంసలు కురిపించారు. సూటిగా సుత్తి లేకుండా, చెప్పాల్సిన విషయాన్ని ఎమోషనల్‌గా.. ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా.. కంటతడి పెట్టించేలా ‘యాత్ర’ను తీర్చి దిద్దారు. (యాత్ర సినిమా విడుదలై నేటికి(ఫిబ్రవరి 8) నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా..) -
రెండో యాత్రకు శ్రీకారం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితంలోని పాదయాత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ‘యాత్ర’. వైఎస్సార్ పాత్రలో మలయాళ స్టార్ మమ్ముట్టి నటించారు. మహీ వి. రాఘవ్ దర్శకత్వంలో విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి నిర్మించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 8న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దీంతో ‘యాత్ర’ సీక్వెల్‌కు శ్రీకారం చూట్టారు మహీ వి. రాఘవ్. ‘‘వై.ఎస్. రాజారెడ్డి (వైఎస్సార్ తండ్రి), వై.ఎస్. జగన్ పాత్రలు లేకుండా వైఎస్సార్‌గారి కథ సంపూర్ణంగా అనిపించదు. ‘యాత్ర’ సినిమా వై.ఎస్. జగన్‌గారి విజువల్స్‌తో ముగుస్తుంది. ‘యాత్ర 2’ను అక్కడి నుంచి స్టార్ట్ చేయాలనే ఆలోచనతోనే అలా చేశాం’’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మహి.వి. రాఘవ్. -
మాలో యాత్ర
ప్రజా సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని, ఎనలేని జనాదరణను సొంతం చేసుకున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన పాదయాత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ‘యాత్ర’. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహి వి. రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శివ మేక సమర్పణలో విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి నిర్మించారు. వైఎస్ పాత్రలో మలయాళ స్టార్ మమ్ముట్టి నటించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 8న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి అద్భుతంగా నటించారని ప్రేక్షకులు ప్రశంసించారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయంబర్స్మెంట్ వంటి పథకాలకు పాదయాత్రలో ఎలా అంకురార్పణ జరిగిందనే విశేషాలను చాలా అర్థవంతంగా మహి చూపించారని కూడా వీక్షకులు అన్నారు. ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది ప్రేక్షకులు మరోసారి ఆ మహానేతను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఈ సినిమా ఇప్పుడు బుల్లితెరపై ప్రదర్శితం కానుంది. ‘యాత్ర’ చిత్రం ఈ రోజు (ఆదివారం) మధ్యాహ్నం 12 గంటలకు ‘స్టార్‌మా’ చానెల్లో ప్రదర్శితం కానుంది. -
యాత్ర సినిమా చూశా: వెంకయ్య నాయుడు
సాక్షి, నెల్లూరు : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ చిత్రాన్ని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసించారు. శనివారం ఆయన నెల్లూరులో స్వర్ణభారతి ట్రస్ట్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఈ మధ్యకాలంలో ‘యాత్ర’ సినిమా చూశా.. చాలా బాగుంది. రైతులు, సంస్కృతి, సంప్రదయాలన్నా నాకు ప్రాణం. మనం చేసే మంచి పనులే మన తరువాత మనలను గుర్తుపెట్టుకునేలా చేస్తాయి.’ అని వెంకయ్య అన్నారు. ఏ హోదాలో ఉన్నా సొంత గ్రామాన్ని మరచిపోనని, ఎవరి పని వారు చేయడమే దేశభక్తి అని ఆయన పేర్కొన్నారు. ప్రజా జీవనంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని అనేది తన భావన అని, కానీ తన పదవి, భద్రత, హోదాకు భంగం కలగకుండా ప్రవర్తిస్తున్నట్లు వెంకయ్య తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలతో కలిసి మెలిసి ఉండే తత్వం తనదని చెప్పారు. మాతృభాష పరిరక్షణకు అన్ని రాజకీయ పార్టీలు కృషి చేయాలన్నారు. భాషా ప్రగతికి తీసుకోవాల్సిన చర్యలను ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలలో పర్యటిస్తూ విద్యార్థులకు మార్గదర్శకాలు చెపుతున్నట్లు వెంకయ్య పేర్కొన్నారు. ఉత్తర భారతదేశం వాళ్లు దక్షిణ, దక్షిణాది వాళ్లు ఉత్తరదేశ భాషలు నేర్చుకుంటే దేశ సమైక్యత బలపడుతుందని ఉప రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. -
‘యాత్ర’ బ్లాక్‌బస్టర్ మీట్
-
వైఎస్‌గారి పాత్ర చేయడం నా అదృష్టం
‘‘యాత్ర’ సినిమాకి ముందు తెలుగులో చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ ఆసక్తికరంగా అనిపించకపోవడంతో చేయలేదు. అయితే ‘యాత్ర’ సినిమాను కాదనలేకపోయాను. కథ బాగుంది.. మంచి ఎమోషనల్ టచ్ కూడా ఉంది. ప్రజల నాయకుడైన ఒక గొప్ప రాజకీయ నాయకుడి కథ ఇది. ప్రజలను అర్థం చేసుకోకపోతే రాజకీయ నాయకుడు.. ప్రజానాయకుడు కావడం కష్టం. మన దేశంలో ప్రజాస్వామ్యం ఉంది. ప్రజలు మెచ్చిన నాయకుడే రూలర్ అవుతారు’’ అని హీరో మమ్ముట్టి అన్నారు. మహి వి. రాఘవ్ దర్శకత్వంలో మమ్ముట్టి లీడ్ రోల్లో తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. శివ మేక సమర్పణలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సందర్భంగా శుక్రవారం వైజాగ్‌లో నిర్వహించిన ‘బ్లాక్ట్‌బస్టర్ మీట్’లో మమ్ముట్టి మాట్లాడుతూ– ‘‘అందరికీ నమస్కారం. నాకు తెలుగు రాదు.. నన్ను క్షమించండి. తెలుగు స్పష్టంగా మాట్లాడటం ఇంకా రాలేదు. నా డైలాగ్స్‌కు జాగ్రత్తగా డబ్బింగ్ చెప్పుకున్నాను. ఉగ్రవాద దాడిలో అమరులైన వీరజవాన్లకు సెల్యూట్ చేస్తున్నాను. తెలుగులో ప్రత్యక్షంగా ‘యాత్ర’ నా మూడో చిత్రం. కె.విశ్వనాథ్‌గారితో ఒక సినిమా, ఉమా మహేశ్వరరావుగారితో మరో తెలుగు సినిమా చేశాను. ‘యాత్ర’ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ సాంగ్ షూట్ చేశాం. ఆ తర్వాత ఓ సీన్‌ను చిత్రీకరించాం. కాస్త భయం వేసింది.. నెర్వస్‌గా ఫీలయ్యాను. లక్కీగా ఆ సీన్ సినిమాలో లేదు. ఆ తర్వాత మ్యానేజ్ చేశాను. దర్శక–నిర్మాతలు నాకు మ్యాగ్జిమమ్ కంఫర్ట్ లెవల్స్ ఇచ్చారు. నా నుంచి కొత్తవిషయాలు నేర్చుకున్నానని మహి చెప్పారు. కానీ, నేర్చుకున్నది నేను. పాత్ర కోసం కొత్త భాష నేర్చుకున్నాను. సెట్లో ప్రతి రోజూ నాకు కొత్త రోజే. డైలాగ్స్ పలకడానికి సహకరించిన అసోసియేట్ డైరెక్టర్స్‌తో పాటు టీమ్ అందరికీ ధన్యవాదాలు. సినిమాల్లో నాకు అనుభవం ఎక్కువగా ఉండొచ్చు. కానీ తెలుగులో తక్కువ. సినిమా సక్సెస్ అయ్యింది. ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ‘యాత్ర’లో హీరో లేడు.. హీరోయిన్ లేదు.. ఫైట్స్ లేవు.. పాటలు, కామెడీ సీన్స్ లేవు.. అయినా ప్రేక్షకులు ఆదరించారు. సినిమాలను చూడటంలో వారి అభిరుచి మారింది. తెలుగులో మరిన్ని మంచి సినిమాలు రావాలి. విభిన్నమైన సినిమాలను ఆదరించే ప్రేక్షకులు ఆల్రెడీ పెరిగారు. వైఎస్‌ఆర్‌గారిలా నన్ను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఆయన పాత్రలో నటించడం నా అదృష్టం’’ అన్నారు. నిర్మాత విజయ్ చిల్లా మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్లో మూడో సినిమా ‘యాత్ర’. మొదటి సినిమా ‘భలే మంచి రోజు’ చేసినప్పుడు బాగా పేరొచ్చింది కానీ డబ్బులు రాలేదు. రెండో సినిమా మహితో ‘ఆనందో బ్రహ్మ’ చిత్రం చేసినప్పుడు బాగా డబ్బులు వచ్చాయి కానీ పెద్దగా పేరు రాలేదు. ‘యాత్ర’ మా మూడో సినిమా. ఈ చిత్రానికి మాకు ఎంత డబ్బు వచ్చిందో అంతకు మించి రెట్టింపు పేరొచ్చింది. సినిమా రిలీజ్ అయ్యాక కొన్ని వేల ఫోన్‌కాల్స్ వచ్చాయి. అందరూ ఒక్కటే మాట చెప్పారు. ‘మేం జీవితాంతం మీ రుణం తీర్చుకోలేం.. మా ముందుకు మళ్లీ వైఎస్ఆర్గారిని తీసుకొచ్చారు’ అనడంతో మేం పడ్డ ఏడాదిన్నర కష్టం మరచిపోయాం. ఈ సినిమాని చూసి విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు. డిస్ట్రిబ్యూటర్లు కూడా కాల్ చేసి సంతోషం వ్యక్తం చేయడం వెరీ హ్యాపీ. ఈ సినిమా కేవలం డబ్బు కోసం తీయలేదు. వైఎస్‌గారి అభిమానుల నమ్మకాన్ని నిలబెట్టినందుకు చాలా గర్వపడుతున్నాం. థ్యాంక్స్ టు మమ్ముట్టిసార్.. వైఎస్‌గారిని మళ్లీ తీసుకొచ్చారు. సినిమా రిలీజ్ అయ్యాక నేను, మహి వెళ్లి జగన్ అన్నని కలిశాం.. ‘యాత్ర’ ప్రొడ్యూసర్.. రండి అని అన్న అనడంతో చాలా సంతోషం వేసింది’’ అన్నారు. దర్శకుడు మహి వి.రాఘవ్ మాట్లాడుతూ– ‘‘మమ్ముట్టిగారు నమ్మకపోతే ఈ సినిమా చేయడం అసాధ్యం. వైఎస్‌గారిపై అభిమానం వేరే, కృతజ్ఞత వేరే అని ఈ సినిమా ద్వారా తెలుసుకున్నా. వైఎస్‌గారిపై అభిమానం, ప్రేమకు మించిన ఒక భావం కానీ, ఏదైనా ఒక ఫీలింగ్ ఉందంటే అది కృతజ్ఞత. ఆయన్ను ప్రేమించేవారికి ఓ కృతజ్ఞత ఉంది. అది క్రీడాకారులకో, సినిమా వాళ్లకో రాదు.. అది అసాధ్యం. నేను ఇంకా పెద్ద సినిమాలు చేయొచ్చు.. ఎక్కువ డబ్బులు రావొచ్చేమో కానీ, నా జీవితంలో నాకు తెలిసి ఇంత కృతజ్ఞత కానీ, ప్రేమ కానీ రాదని కచ్చితంగా చెప్పగలను. ప్రేక్షకుల స్పందన చాలా బాగుంది. ఒకతను నాకు ఫోన్ చేసి, ‘ఓ వైపు కన్నీళ్లు వస్తున్నాయ్.. మరోవైపు చప్పట్లు కొడుతూ ఉండిపోయాను’ అన్నాడు. ఓ మహిళ ఫోన్ చేసి, ‘ఇకపై రైతు మార్కెట్లో టమోటాని ధర కన్నా రెండు రూపాయలకు తక్కువ ఇమ్మని రైతులను అడగను’ అని చెప్పింది. ఓ కథ ఇంత ప్రభావం చూపిస్తుందని, ఎమోషనల్‌గా కనెక్ట్ చేస్తుందని నేను అనుకోలేదు. జగనన్నకి కూడా థ్యాంక్స్. ఎన్నికలు ఉన్న ఏడాదిలో నేను ఎవర్నో కూడా తెలియకుండా నన్ను గుడ్డిగా నమ్మి ‘మీ నాయకుని కథ మీరు చెప్పుకోండి’ అన్నారు. ఆ మాట అనాలంటే నిజంగా ధైర్యం ఉండాలి. అందుకు అన్నకి థ్యాంక్స్ చెబుతున్నా. సినిమాల్లో చాలామంది కడప కథలు చెప్పారు. తొలిసారి ఓ కడప బిడ్డ కథ చూపించాం. వైఎస్‌గారు కడపలో పుట్టినా ప్రతి గడపలోకి వచ్చారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని మారుమూల గ్రామాల్లో కూడా ఆయన్ని ప్రేమించారు. రాఘవేంద్రరావుగారు, రామ్‌గోపాల్‌వర్మగారు... ఇలా చాలామంది సినిమా బావుందని అభినందించారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటీనటులు అశ్రిత, ఉమ, ‘దిల్’ రమేశ్, దయానంద్, మొయినుద్దీన్, బాలనటి సహస్ర, శ్రీమిత్ర చౌదరి తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సింగపూర్‌లో వైఎస్సార్‌కు కన్నీటి నివాళి
-
సింగపూర్‌లో వైఎస్సార్‌కు కన్నీటి నివాళి
సింగపూర్ వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ వింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహానేత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా తొలి షోను 700 మందికి పైగా వీక్షించారు. సింగపూర్‌లోని రెక్స్ సినిమా గోల్డెన్ మైల్ టవర్ థియేటర్ జోహార్ వైఎస్సార్ నినాదాలతో మారెమోగిపోయింది. యాత్ర చిత్రాన్ని సింగపూర్‌లో తెలుగు ప్రజలతో వీక్షించేందుకు విచ్చేసిన వైఎస్సార్సీపీ నేత మార్గాని భరత్‌కి సింగపూర్ వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ వింగ్ కృతజ్ఞతలు తెలిపింది. సినిమా అద్భుతంగా ఉందని, పెద్దాయన వైఎస్సార్ జీవితాన్ని ప్రత్యక్షంగా చూసినట్టుందని, సినిమా హాలు నుండి బయటకు వస్తూ వీక్షకులు ప్రజానేత రాజన్నను తలుచుకుంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. పెద్దాయన రాజశేఖర రెడ్డి మరణించి ఏళ్లు గడుస్తున్నా ఇంకా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నాడనడానికి ప్రేక్షకుల కన్నీటి నివాళే ఉదాహరణ అని సింగపూర్ వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ వింగ్ సభ్యులు తెలిపారు. సినిమా చూస్తున్నంతసేపు జోహార్ వైఎస్సార్ నినాదాలతో థియేటర్ హోరెత్తింది. సింగపూరులో ఉండే వైఎస్సార్ అభిమానులతో పాటు అసంఖ్యాక తెలుగు కుటుంబాలు చిత్ర ప్రదర్శనకు మెదటి రోజు మొదటి షోకి రావడం తెలుగు చలన చిత్ర చరిత్రలో మొట్ట మొదటి సారి అని తెలిపారు. పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా రాజన్నని జనం ఎంతగా ప్రేమిస్తున్నారో యాత్ర చిత్రానికి వస్తున్న ఆధరణ చూస్తుంటే అర్థమవుతుందన్నారు. యాత్ర తెలుగు సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబోతున్న ఒక అద్భుత చిత్రం అని కొనియాడారు. సింగపూర్‌లో ఉండే తెలుగు కుటుంబాలు వైఎస్సార్ జీవితాన్ని తమ పిల్లలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజన్నజీవితం ఈ తరానికే కాదు, రాబోయే తరాలకు ఆదర్శప్రాయం అనివైఎస్సార్‌సీపీ ఎన్ఆర్ఐ వింగ్ సభ్యులు పేర్కొన్నారు. తాను కూడా వైఎస్సార్ సింగపూర్ కుటుంబసభ్యులతో యాత్ర చిత్రాన్ని థియేటర్లో చూడడం ఆనందంగా ఉందని మార్గాని భరత్ అన్నారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఎంత ఆవశ్యకమో వివరించారు. సింగపూర్‌లో వైఎస్సార్సీపీ పిలుపు మేరకు చేస్తున్న కార్యక్రమాలను మార్గని భరత్ అభినందించారు. -
‘యాత్ర’ బృందానికి వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, హైదరాబాద్: యాత్ర సినిమాను విజయవంతంగా నిర్మించి విడుదల చేసిన మహి వి.రాఘవ, దేవిరెడ్డి శశి, విజయ్ చిల్లా, శివ మేకా, వైఎస్సార్ పాత్రధారి హీరో మమ్ముట్టిలకు, ఇతర చిత్ర బృందానికి ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ‘యాత్ర సినిమా తీయడంలోనూ.. ఆ మహానేత జీవితంలోని వాస్తవాలను, వ్యక్తిత్వాన్ని, ఆయన వ్యవహారశైలిని సినిమా రూపంలో ప్రతిబింబింపజేయడంలోనూ మీరు ప్రదర్శించిన అభిరుచి, అంకిత భావాలకు నేను మనఃపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని జగన్ ఆదివారం ట్విట్టర్లో పేర్కొన్నారు. Congratulations @MahiVraghav @devireddyshashi @VijayChilla @ShivaMeka @mammukka & entire crew on the successful release of #Yatra.I wholeheartedly thank you & appreciate your passion & dedication in wanting to depict cinematically,the character & essence of the great leader,YSR. — YS Jagan Mohan Reddy (@ysjagan) February 10, 2019 -
మెల్బోర్న్లో వైఎస్సార్ అభిమానుల కోలాహలం
మెల్బోర్న్ : దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన యాత్ర సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్హిట్టాక్తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా దేశ విదేశాల్లోని థియేటర్లు వైఎస్సార్ అభిమానులతో కోలాహలంగా మారాయి. వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా కమిటీ ఆధ్వర్యంలో మెల్బోర్న్లోని బాక్లాట్ స్టూడియోస్, 64 హెగ్ స్ట్రీట్‌లో యాత్ర చిత్రాన్ని ప్రదర్శించారు. వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ కౌశిక్ మామిడి, రమణారెడ్డి, లోకేశ్ కాసు, అజయ్ ముప్పలనేని, రమేష్ బొల్ల, రమ్య యార్లగడ్డలతోపాటూ వైఎస్సార్ అభిమానులు చిత్రాన్ని వీక్షించారు. మహానేత వైఎస్సార్‌ను ప్రతిబింబించేలా చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని కొనియాడారు. -
జైత్ర యాత్ర
-
వాషింగ్టన్ డీసీలో ‘యాత్ర’ జైత్రయాత్ర
సాక్షి, వాషింగ్టన్ డీసీ : దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన యాత్ర సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సందర్భంగా దేశ విదేశాల్లోని థియేటర్లు వైఎస్సార్ అభిమానులతో కోలాహలంగా మారాయి. వాషింగ్టన్ డీసీ మెట్రో ఏరియాల్లో (మేరీల్యాండ్, డెలావేర్, వర్జీనియా) యాత్ర ప్రీమియర్ షోల సందర్భంగా దివంగత నాయకుడు రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 'యాత్ర' చిత్ర యూనిట్‌కి వైఎస్సార్ అభిమానులు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్ అభిమానులు యాత్ర రిలీజ్‌ను పండగలా జరుపుకున్నారు. వైఎస్సార్ జీవితంలో మహోజ్వల ఘట్టంగా నిలిచిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా ప్రజల హృదయాలను హత్తుకునేలా ఉందని వైఎస్సార్సీపీ సలహాదారు (యూఎస్ఏ), రీజనల్ ఇంఛార్జ్(మిడ్ అట్లాంటిక్) వల్లూరు రమేష్ రెడ్డి అన్నారు. వైఎస్సార్ పాత్రకు మమ్ముట్టి జీవం పోసి అత్యంత అద్భుతంగా నటించారని, బాడీ లాంగ్వేజ్ వైఎస్సార్‌ని తలపించిందని, చివరికి డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్గా చెప్పారన్నారు. వర్జీనియాలోని సినేమార్క్ థియేటర్లో వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలతో కలిసి సతీసమేతంగా యాత్ర సినిమా చూస్తున్నంతసేపు గుండె బరువెక్కిందని, భావోద్వేగానికి లోనయ్యానని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అందరూ 'యాత్ర' లో పాల్గొనాల్సిందేనని తెలిపారు. పలు సందర్భాలలో మహానేత రాజశేఖర రెడ్డి తమతో ఉన్నట్లుగా ఈ చిత్రం తమను కదిలించిందని పేర్కొన్నారు. ఈ యాత్రలో వాస్తవిక సంఘటనలున్నాయన్నారు. పంటలకు గిట్టుబాటు ధర దొరక్క ఓ రైతు చేసే ఆత్మహత్యాయత్నం, పేదరికంతో వైద్యం చేయించలేక ఓ కన్నతల్లి తన బిడ్డను కోల్పోవడం, పై చదువులు చదవాలని ఉన్నా ఆర్థిక ఇబ్బందులతో అల్లాడే ఓ విద్యార్థి వేదనవంటివి దర్శకుడు మహి వి. రాఘవ్ చూపించిన తీరు వైఎస్సార్‌కి ఇచ్చిన నివాళి అనడం సబబేమో అని కొనియాడారు. యాత్ర సినిమాని చుసిన తరువాత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డిని తలచుకుని పలువురు తమ వ్యక్తిగత అభిప్రాయాలను వెలిబుచ్చారు. వైఎస్ రాజశేఖరెడ్డి పాత్రను (రాజన్నను) కళ్లకు కట్టినట్టుగా చూపించారని కృష్ణ రెడ్డి చాగంటి, భువనేశ్ భుజాల, రామ్ రెడ్డి వ్యాఖ్యానించారు. మాధవీ గత స్మృతులను గుర్తుచేసుకుంటూ నిజ జీవితంలో మాట ఇస్తే వెనక్కి తగ్గని వైఎస్ వ్యక్తిత్వాన్ని కళ్లకు కట్టినట్టుగా వెండితెరపై ఆవిష్కరించిన చిత్రం ‘యాత్ర’ అని సపోర్టింగ్ యాక్టర్స్ అందరూ తమ వంతు బాధ్యతలు చక్కగా నిర్వర్తించారని అన్నారు. లక్ష్మి, గీత మాట్లాడుతూ... రాజన్న రాజసం చక్కగా సినిమాలో చూపించారని ప్రశంసించారు. మహానేత పాదయాత్ర నాయకుడికి.. ప్రజలకు మధ్య దూరాన్ని చెరిపేసిందని, రాష్ట్ర స్థితిగతులను మార్చి ఎందరికో మార్గదర్శకమైందని అందుకే ఆయనను ప్రేమించని హృదయం ఉండదంటే అతిశయోక్తి కాదని సత్తిరాజు సోమేశ్వర రావు అన్నారు. సమాజం మళ్లీ ఒక్కసారి వైఎస్ స్మృతులను నెమరు వేసుకోవడం చాలా అందమైన అనుభవమని ప్రవాసులు అన్నారు. సహజత్వానికి దూరం పోకుండా నిజాయతీగా తీసిన సినిమా ‘యాత్ర’. తక్కువ పదాల్లో ఎక్కువ చెప్పిన మహీ ప్రయోగం బాగుందని తెలిపారు. ఎంత ఖర్చయినా పర్వాలేదు ఓ మహా యోధుడిని సమాజానికి చూపించాలనే ఆకాంక్ష నిర్మాతలు విజయ్, శశి దేవిరెడ్డి, శివ మేకలది. ఈ కార్యక్రమంలో వల్లూరు రమేష్ రెడ్డి, మాధవి రెడ్డి, సోమిరెడ్డి, క్రిష్ణా రెడ్డి, గీత రెడ్డి, రామ్ రెడ్డి, లక్ష్మి రెడ్డి, కోటి రెడ్డి, సంతోష్ రెడ్డి, రాజశేఖర్ కాసారానేని, భువనేశ్ భుజాల, రాజశేఖర్ బసవరాజు, సత్తిరాజు సోమేశ్వర రావు అనేక మంది పాల్గొన్నారు. -
లాస్ ఏంజిల్స్‌లో వైఎస్సార్ అభిమానుల సందడి
లాస్ ఏంజిల్స్ : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర కథాంశంగా నిర్మించిన ‘యాత్ర’ సినిమా రిలీజ్ వేడుకలు శుక్రవారం విదేశాల్లో ఘనంగా జరిగాయి. ఏంజిల్స్‌లో జరిగిన సినిమా వేడుకల్లో పెద్ద ఎత్తున వైఎస్సార్, మమ్ముట్టీ అభిమానులు పాల్గొన్నారు. ఏంజిల్స్‌లోని సినిమార్క్ సెంచరీ థియేటర్స్‌లో యాత్ర ప్రీమియర్ ఫ్యాన్ షోకు తెల్ల షర్టులు, పంచకట్టుతో అభిమానులు సినిమాకు వచ్చి వైఎస్సార్‌ని గుర్తు చేసుకున్నారు. డ్రమ్స్, డ్యాన్సులతో థియేటర్ వద్ద సంబరాలు చేసుకున్నారు. థియేటర్లో భారీ కటౌట్‌ను పెట్టారు. సినిమాను చూసి సీఎంగా వైఎస్సార్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. -
హ్యూస్టన్‌లో 'యాత్ర' సంబరాలు
-
మలేషియాలో ‘యాత్ర’ టికెట్ రూ.90 వేలు
కౌలాలంపూర్ : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర కథాంశంగా నిర్మించిన ‘యాత్ర’ సినిమా రిలీజ్ వేడుకలు శుక్రవారం విదేశాల్లో ఘనంగా జరిగాయి. మలేషియాలో జరిగిన సినిమా విడుదల వేడుకల్లో పెద్ద ఎత్తున వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా మొదటి టికెట్ వేలం వేయగా 5,250 రింగెట్స్ (ఇండియన్ కరెన్సీలో రూ.90 వేలు) పలికినట్లు వైఎస్సార్ అభిమాని చిలేకాంపల్లె విష్ణువర్థన్‌రెడ్డి తెలిపారు. సింగపూర్‌లోనూ వైఎస్సార్ అభిమానులు సినిమా రిలీజ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సింగపూర్‌లోని కార్నివాల్ షో టవర్స్‌లో జరిగిన యాత్ర సినిమా విడుదల వేడుకల్లో వైఎస్సార్ అభిమానులు పాల్గొని.. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. -
హ్యూస్టన్‌లో 'యాత్ర' సంబరాలు
హ్యూస్టన్ : మమ్ముట్టి లీడ్ రోల్లో మహి వి. రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’.. శివ మేక సమర్పణలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్ర చుట్టూ సాగే ఈ ‘యాత్ర’ ఆయన అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. యాత్ర చిత్ర విడుదల సందర్భంగా హ్యూస్టన్‌లో 200 కార్లతో వైఎస్సార్ అభిమానులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున పాల్గొని కేటీలోని సినేమార్క్ థియేటర్లో యాత్ర చ్రిత విడుదలను సంబరంగా జరుపుకున్నారు. సినిమా అయిపోయిన తరువాత అందరు ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఈ సందర్బంగా వారు చిత్ర దర్శకునికి, నిర్మాతలకు, చిత్రానికి పని చేసిన సాంకేతిక నిపుణులకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. యాత్ర చిత్రాన్ని రాజకీయాలతో ముడిపెట్టకూడదని, ఒక మనిషి మాట ఇచ్చిన తర్వాత ఎంత వరకైనా వెళ్లగలను అనడానికి వైఎస్సార్ ఒక గొప్ప ఉదాహరణ అని కొనియాడారు. ఈ వేడుకల్లో సుమారు 300 మంది వైఎస్సార్ అభిమానులు పాల్గొని యాత్ర కేక్ కట్ చేశారు. జోహార్ వైఎస్సార్, జై జగన్ నినాదాలతో థియేటర్ మొత్తాన్ని హోరెతించారు. సినిమా విజయవంతం అయినందుకు అభిమానులు సంబరాలు చేసుకున్నారు. సినిమాకి వచ్చిన అందరికి డిస్ట్రిబ్యూటర్ రఘువీర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు . -
ప్రేక్షకుల నుంచి విశేష స్పందన
-
970 స్క్రీన్స్‌లో వెండితెర యాత్ర
మహానేత వైఎస్. రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. వైఎస్ పాత్రలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటించారు. మహి వి. రాఘవ్ దర్శకత్వంలో శివ మేక సమర్పణలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘యాత్ర’ విశేషాలు. ► ‘భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ’ వంటి హిట్ చిత్రాల తర్వాత 70 ఎంఎం బ్యానర్లో 3వ చిత్రంగా రూపొందిన చిత్రం ‘యాత్ర’. ‘‘ఈ టైటిల్ ప్రకటించినప్పటి నుంచి వైఎస్‌గారి అభిమానుల్లోనే కాదు.. సాధారణ ప్రజల్లో కూడా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇందుకు కారణం.. ఓ మహానేత చరిత్ర తెరకెక్కించటం. వైఎస్‌గారిని ఎలా చూపించనున్నారు? సినిమా పాజిటివ్‌గా ఉంటుందా? లేక నెగటివ్‌గా ఉంటుందా? అనే సందేహాలు ఒకవైపు. అసలు ‘యాత్ర’ ఇప్పడు తీయాల్సిన అవసరం ఏంటి? ఎన్నికల స్టంటా? వైఎస్ జగన్మోహన్రెడ్డిగారికి సపోర్ట్‌గా తీస్తున్నారా? వంటి ప్రశ్నలు మరోవైపు. వీటన్నింటికీ ఈ రోజు ‘యాత్ర’ సినిమా సమాధానం చెబుతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ► 970 స్క్రీన్స్‌లో భారీ ఎత్తున ‘యాత్ర’ విడుదలయింది. సాధారణంగా ఒక సినిమా హీరో బయోపిక్ లేదా బిగ్ కాస్టింగ్‌తో తీసిన సినిమాలు ఇంతటి భారీ స్థాయిలో రిలీజ్ కావటం చూశాం. కానీ, తొలిసారిగా ఓ రాజకీయ నాయకుడి బయోపిక్ తీస్తే ఒక్క ఓవర్సీస్లోనే 180 స్క్రీన్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 500 స్క్రీన్స్.. ఇలా ప్రపంచ వ్యాప్తంగా 970 స్క్రీన్స్‌లో ఈ చిత్రం విడుదలవటం చూస్తే ‘యాత్ర’పై తెలుగు ప్రజల క్రేజ్ ఏంటో తెలుస్తోందని, అటు అమెరికా నుంచి అనకాపల్లి వరకూ ఈ సినిమాకి అనూహ్యమైన స్పందన లభిస్తోందని నిర్మాతల్లో ఒకరైన విజయ్ చిల్లా చెప్పారు. ► ‘నాయకుడిగా మనకు ఏం కావాలో తెలుసుకున్నాం కానీ... జనానికి ఏం కావాలో తెలుసుకోలేకపోయాం’ అంటూ అధిష్టానాన్ని సైతం లెక్కచేయక పేద ప్రజల కష్టాల్ని వినటానికి కడప గడప దాటి పాదయాత్ర చేసిన వైఎస్‌గారు జననేతగా, మహానేతగా, పేద ప్రజల గుండె చప్పుడుగా పదిలమైన చోటు సంపాదించుకున్నారు. వైఎస్‌గారి పాదయాత్ర 68 రోజులు జరిగింది. యాదృచ్ఛికంగా ‘యాత్ర’ షూటింగ్ కూడా 68 రోజుల్లో పూర్తికావటం ఆ పెద్దాయన ఆశీస్సులుగా టీమ్ భావిస్తున్నారు. ► వైఎస్‌గారి రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలక ఘట్టం. ఆ సమయంలో జరిగిన ముఖ్య సంఘటనల సమాహారమే ఈ ‘యాత్ర’. పాదయాత్రలో రైతుల కష్టాలు, పేదవాళ్ల ఆవేదనలు, ప్రతి ఒక్కరి భావోద్వేగాలని రాజన్న మనసుతో వినటమే ఈ చిత్రంలో కీలక భాగం. రాజకీయాలు లేని రాజకీయ నాయకుడి కథే ఈ సినిమా. ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చూసి భావోద్వేగానికి లోనవుతారు. ఎందుకంటే కష్టం ఎవరికైనా కష్టమే. అందుకే ఈ యూనివర్సల్ సబ్జెక్ట్‌ని తెలుగుతోపాటు భారతదేశం మొత్తం విడుదల చేశాం. ఎమోషనల్ కంటెంట్‌తో ఉన్న ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకుడు బరువైన గుండెతో థియేటర్స్ నుంచి బయటకి వస్తారు. ► మహి చెప్పిన ‘యాత్ర’ కథలోని పాత్రలు, వాటి కష్టాలు మమ్ముట్టిగారిని కలచి వేశాయి. ఆ తర్వాత ఆయన వైఎస్‌గారి గురించి పూర్తిగా తెలుసుకుని పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. ‘ఇది రాజకీయ నాయకుడి కథ మాత్రమే కానీ, రాజకీయాలు ఉండవు.. ప్రజల కష్టాలు, రైతుల బాధలు ఉంటాయి.. ఇవన్నీ భారతదేశం అంతటా ఉంటాయి. ఏ రైతుని అడిగినా, ఏ పేదవాడిని అడిగినా వారి కష్టాలు చెప్తారు’ అని మమ్ముట్టి చెప్పారు. ‘యాత్ర’లో ఆద్యంతం ఎమోషన్‌తో కూడిన పాత్రలు, పాత్ర చిత్రణ కనిపిస్తాయి. తెలుగు ప్రజలందరూ తప్పకుండా చూడాల్సిన చిత్రంగా ఫ్యామిలీ ఎమోషన్స్‌ని దర్శకుడు చూపించారు. సినిమాని ప్రేమించే ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రమిదని నిర్మాతలు అన్నారు. ► ‘‘యాత్ర’ సినిమా చేయాలనుకున్నప్పటి నుంచి విడుదల వరకూ వైఎస్ జగన్‌గారు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ ఎక్కడా అభ్యంతరాలు పెట్టలేదు సరికదా కనీసం కథ వివరాలు కూడా అడగలేదు. దర్శకుడికి, ప్రొడక్షన్‌కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం జగన్‌గారి గొప్పతనానికి నిదర్శనం. ఇటీవల జగన్‌గారిని మహి కలిసినప్పుడు.. ‘మీ నాయకుడి చిత్రం మీరు తీస్తున్నారు.. ఆయన గురించి మీకే బాగా తెలుసు.. నాన్నగారు చేసిన పనులు చెప్పండి చాలు’ అని జగన్‌గారు సున్నితంగా చెప్పటం మా యూనిట్‌కి నూతనోత్సాహం కలిగించింది. ఇందుకు జగన్‌గారికి, వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు’’ అని విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి అన్నారు. -
యాత్ర బుకింగ్‌లు చూస్తుంటే హ్యాపీ
‘‘యాత్ర’ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వైఎస్ రాజశేఖర రెడ్డిగారి పాదయాత్ర ఎంత సెన్సేషన్ అయిందో ప్రేక్షకులందరికీ తెలుసు. పాదయాత్రలో ఉన్న ఎమోషన్స్, మూమెంట్స్‌ని తీసుకుని మహి రెడీ చేసిన కథతో విజయ్ ‘యాత్ర’ నిర్మించారు. మమ్ముట్టిలాంటి లెజెండ్ నటించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ చూసినప్పుడు, పాటలు విన్నప్పుడు సినిమా ఎప్పుడు చూస్తామా? అనే ఓ ఎగై్జట్‌మెంట్ కనిపించింది. మా విజయ్‌కి, మహికి ఆల్ ది బెస్ట్’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. మహి వి. రాఘవ్ దర్శకత్వంలో శివ మేక సమర్పణలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ‘యాత్ర’ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు ఓవర్సీస్లో ఈ సినిమా ఓపెనింగ్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఓపెనింగ్స్ స్ట్రాంగ్‌గా ఉంటేనే ఆ సినిమాకి రెవెన్యూ పరంగా మంచి మ్యాజిక్ జరుగుతుంది. ఫస్ట్ మంచి ఓపెనింగ్స్ రావాలి.. ఆ తర్వాత మంచి టాక్ రావాలి. ఓ సినిమాకి ఓపెనింగ్స్ అన్నవి ఎప్పుడూ ముఖ్యమే.. కానీ ఇప్పుడు చాలా ముఖ్యం అయిపోయాయి. ఒకప్పుడు సినిమా ఫర్వాలేదు అంటే మెల్లిగా ఓపెనింగ్స్ పెరిగేవి. ఇప్పుడు అలా లేదు.. మంచి ఓపెనింగ్స్ వస్తేనే సినిమా. ‘యాత్ర’ అడ్వాన్స్ బుకింగ్‌లు చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాని నైజాం, వైజాగ్ ఏరియాల్లో మా సంస్థ విడుదల చేస్తోంది. వైఎస్‌గారి పాదయాత్ర మూమెంట్స్‌ని ఆ రోజుల్లో టీవీల్లో చూడటం, పేపర్లో చదవటమే. పాదయాత్రతో ఆయన హీరో అయిపోయారు. దాని తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. జనాలకోసం ఏదైనా చేస్తాను అని పాదయాత్ర ద్వారా చూపించారాయన. ఎన్టీ రామారావుగారి తర్వాత మళ్లీ తెలుగు రాష్ట్రాల ప్రజల్లో వైఎస్గారికే అంత ఇమేజ్ వచ్చింది.అలాంటి ఆయన నేపథ్యంలో వస్తున్న ఈ ‘యాత్ర’ పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. విజయ్ చిల్లా మాట్లాడుతూ– ‘‘యాత్ర’ కోసం ఏడాదిన్నరగా పని చేస్తున్నాం. రేపు విడుదలవుతోందంటే చాలా ఎగై్జటింగ్‌గా, సంతోషంగా ఉంది. వైఎస్‌గారు రాజకీయ నేత కావొచ్చు.. సినిమాలో రాజకీయాలు ఉండొచ్చు.. కానీ ఇది పూర్తిగా పొలిటికల్ సినిమా కాదు. ఎటువంటి వివాదాలు లేవు. ఈ సినిమా మొత్తానికి సోల్ అండ్ స్పిరిట్ వైఎస్గారే. సినిమా చూడండి.. నచ్చితే ఇతరులకు చెప్పండి. ఇది కేవలం ఆయన అభిమానులకే కాదు.. సినిమాను ప్రేమించేవారెవరైనా చూసి ఎంజాయ్ చేయొచ్చు’’ అన్నారు. ‘యాత్ర’ సినిమాను ఉద్దేశిస్తూ దర్శకుడు మహి వి. రాఘవ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కథను చెప్పడం చాలా గౌరవంగా భావిస్తున్నా. ఆయన కుటుంబం, అభిమానుల నుంచి మాకు అమితమైన ఆదరణ లభించడం గొప్ప విషయం. చిత్రబృందం చాలా కష్టపడింది. దీన్ని మరో సినిమాతో పోల్చి.. ఓ రేస్‌లా చేయకండి. వైఎస్సార్ ప్రయాణంలా భావించి సెలబ్రేట్ చేసుకుందాం’. ‘ఎన్టీఆర్, వైఎస్సార్.. ఇద్దరూ ఈ నేలతల్లి బిడ్డలు, తెలుగు జాతి గర్వించదగ్గ నాయకులు. మన భిన్నాభిప్రాయాలు వారిని అగౌరవపర్చడానికి కారణాలు కాకూడదు. నాకు వైఎస్సార్, చిరంజీవిగార్లపై ఉన్న ఇష్టం, అభిమానం ఎప్పటికీ చెరిగిపోదు. మనకు స్ఫూర్తినిచ్చిన వారి సినిమాను సెలబ్రేట్ చేసుకుందాం. అదే మనం వారికిచ్చే గొప్ప నివాళి’. ‘మా ‘యాత్ర’ సినిమాను ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో తెలుసుకోవాలని చాలా ఆత్రుతగా ఉంది. నిజాయతీగా మీ స్పందన చెప్పండి. నేను వినయంగా వాటిని స్వీకరిస్తా. ఈసారి ఇంకా మంచి కథతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తా.. ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. -
యాత్ర తొలి టికెట్ @ రూ.4.37లక్షలు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిపై ప్రజల్లో ఎంత అభిమానం ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన చేపట్టిన పాదయాత్ర నేపథ్యంలో మమ్ముట్టి లీడ్ రోల్లో మహి వి. రాఘవ్ తెరకెక్కించిన చిత్రం ‘యాత్ర’. శివ మేక సమర్పణలో 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడి నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా అమెరికాలో ‘యాత్ర’ ప్రీమియర్ షో మొదటి టికెట్‌ను వేలం వేయగా మునీశ్వర్ రెడ్డి 6,116 డాలర్లకు (దాదాపు 4.37 లక్షలు) సొంతం చేసుకుని వైఎస్‌పై తనకున్న అభిమానం చాటుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి మాట్లాడుతూ– ‘‘యాత్ర’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్లో ఈ చిత్రానికి మంచి క్రేజ్ నెలకొంది. 70 ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్, నిర్వాణ సంస్థలు అమెరికాలోని సీటెల్‌లో ‘యాత్ర’ ప్రీమియర్ షో మొదటి టికెట్‌ను వేలం వేయగా వైఎస్‌గారి అభిమాని మునీశ్వర్ రెడ్డి భారీ మొత్తాన్ని చెల్లించి మొదటి టికెట్‌ను సొంతం చేసుకున్నారు. అయితే ఆయన ఇచ్చిన డబ్బులో టికెట్‌కి సరిపడా 12 డాలర్లు (దాదాపు 860) మాత్రమే తీసుకుని, మిగతా డబ్బుని వైఎస్సార్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇస్తాం. రాజన్న క్యాంటీన్స్, వాటర్ ప్లాంట్స్ కోసం ఈ డబ్బును వెచ్చించనున్నారు. ఈ వేలంలో పాల్గొన్నవారందరికీ కృతజ్ఞతలు. వైఎస్‌గారి పాదయాత్ర చరిత్రలో నిలిచిపోయింది. ఆయన పోరాట పటిమ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. అలాంటి రాజకీయ ప్రజ్ఞాశాలి పాదయాత్రలో జరిగిన వాస్తవిక, భావోద్వేగ సంఘటనలతో ఈ సినిమా నిర్మించాం’’ అన్నారు. -
వైఎస్సార్ అనే దేవుడు మా బాధ విన్నాడు
‘‘మా ఇంటి గడప దగ్గర చెప్పులు వదిలేసి లోపలికి వెళ్తే వైఎస్సార్గారివి మూడు ఫోటోలు ఉంటాయి. పదేళ్ల క్రితం ఆగిపోవాల్సిన మా అమ్మ గుండె ఇప్పటికీ వినబడుతుందంటే దానికి కారణం వైయస్సార్‌గారు’’ అంటూ ఎమోషనల్ అయ్యారు రవికుమార్. శుక్రవారం ‘యాత్ర’ ప్రీ–రిలీజ్ వేడుకలో మహానేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాల ద్వారా లబ్ధి పొందిన పలువురు మాట్లాడారు. వారిలో ‘యాత్ర’కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన రవికుమార్ తన మనోభావాలను పంచుకున్నారిలా. 2008లో నేను డిగ్రీ చదువుతున్నాను. మా అమ్మకు ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్‌కి తీసుకెళితే హార్ట్‌లో హోల్ ఉందని, ఆరు నెలల కంటే బతకదని చెప్పారు. మా అమ్మ దండం పెట్టి ‘అరే, నాకు బతకాలని ఉందిరా. ఏమైనా చేసి ఓ మూడు లక్షలు అప్పు చేసి నాకు ఆపరేషన్ చేయించు’ అన్న మాటలు నాకింకా గుర్తు. అమ్మ కంటే ఏదీ ఎక్కువ కాదనిపించి చదువు మానేసి హైదరాబాద్ వచ్చాను. ఓ హోటల్లో ఎంగిలి ప్లేట్లు, గ్లాసులు కడుగుతూ పనిచేశాను. నాలుగు నెలలు కష్టపడి పనిచేస్తే నేను సంపాదించింది 20 వేలు. అవి మా అమ్మ మందులకు, బస్సు చార్జీలకు కరిగిపోయాయి. మా అమ్మకు రోజులు దగ్గర పడ్డాయని తెలిసి నన్ను పిలిచి చెల్లిని బాగా చూసుకోమని చెప్పింది. చర్చి, గుడి, మసీదు ఏ దేవుడినీ వదలకుండా దండం పెట్టుకునేది. ఏ దేవుడూ ఆమె ఏడుపు వినలేదు. కానీ, వైఎస్సార్ అనే దేవుడు ‘నేను విన్నాను, నేను ఉన్నాను’ అని ఆరోగ్యశ్రీ పథకం పెట్టారు. కామినేని హాస్పిటల్లో రూపాయి ఖర్చు లేకుండా అమ్మకు వైద్యం చేశారు. వైద్యం కోసం ఎవరినైనా అప్పు అడిగితే షూరిటీగా ఏం పెడతారు? అని అడిగేవారు. మాకు ఉన్నదల్లా రెండు గదుల ఇందిరమ్మ ఇల్లు మాత్రమే. అది కూడా ఆ దేవుడి (వైఎస్సార్) దయే. ఈ ఫంక్షన్‌కు మా అమ్మను తీసుకొచ్చేవాణ్ని. కానీ తీసుకురాలేదు. కారణం మా అమ్మకి నేను ఇప్పటికీ ఏం పని చేస్తున్నానో తెలియదు. నేను సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నానని మా అమ్మకి చెప్పాలంటే భయం వేసి చెప్పలేదు. ఎందుకంటే సినిమాలంటే ఒప్పుకోరని. కానీ అమ్మా... ఇప్పుడు చెబుతున్నాను, ఫిబ్రవరి 8న విడుదలయ్యే ‘యాత్ర’ సినిమాను మా అమ్మ, చెల్లెలితో మా ఊరు డిచ్‌పల్లిలో చూస్తాను. నేనీ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి వైఎస్సార్‌గారి రుణం కొంచెమన్నా తీర్చుకున్నాను అనుకుంటున్నాను. నాకీ చాన్స్ ఇచ్చిన దర్శకుడు మహి.వి.రాఘవ్ గారికి నిర్మాతలు విజయ్ చిల్లా గారికి, శశి దేవిరెడ్డి, శివ గార్లకు జీవితాంతం రుణపడి ఉంటాను’’ అని రవికుమార్ ఎమోషనల్ కావడం వీక్షకులను కదిలించింది. ఈ సందర్భంగా ‘సాక్షి’ మాట్లాడినప్పుడు రవికుమార్ మరిన్ని విశేషాలు పంచుకున్నారు. ► ‘యాత్ర’ మీ మొదటి సినిమానా? దర్శకుడు మహీ వి. రాఘవ్గారు తీసిన ‘పాఠశాల’ నా మొదటి సినిమా. ఆ సినిమాకు ఆఫీస్‌బాయ్‌గా పనిచేశాను. నేను కాఫీ షాప్‌లో చేసే రోజుల్లో మహీ అక్కడికి వస్తుండేవారు. అలా ఆయన సినిమాలతో అసోసియేట్ అయ్యే అవకాశం ఏర్పడింది. మహీగారు చేసిన ‘ఆనందోబ్రహ్మ’కు రైటర్‌గా, ‘యాత్ర’కు రచనా సహకారం అందించాను. ► వైయస్సార్‌గారికి మొదటినుంచే అభిమానిగా ఉండేవారా? మొదట్లో రాజశేఖర్ రెడ్డిగారంటే రాజకీయనాయకులు, మన ముఖ్యమంత్రి అని తెలుసు. కానీ మా అమ్మకు తిరిగి ప్రాణం పోశాక ఆయన మీద అభిమానం పెరిగిపోయింది. ► మొన్న జరిగిన వేడుకలో మాట్లాడాలని ముందే అనుకున్నారా? లేదు. పది నిమిషాల ముందు చెప్పారు. టైముంది. నువ్వు కూడా లబ్ధి పొందావు కదా. నీకు అనిపించింది మాట్లాడితే మాట్లాడు అన్నారు. సడెన్‌గా దర్శకులు స్టేజ్ మీద మాట్లాడమంటే ఎమోషనల్ అయిపోయాను. ► ఇలా వైయస్‌గారి బయోపిక్ ఐడియా ఉందని మహీ మీతో చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? మహీసార్, నేను, రాజశేఖర్ అని ఓౖ రెటర్. మేం ముగ్గురం ట్రావెల్ అవుతుంటాం. ఫస్ట్ మాతోనే చెప్పారు. చాలా ఎగై్జట్ అయ్యాను. రైతు ఆత్మహత్య చేసుకునే సీన్ ఒకటి, నారాయణరెడ్డిగారు ఎప్పుడొచ్చినా వైయస్‌గారు ఆయనకు సీట్ ఇచ్చి కూర్చోమనేవారట. అలాగే హై కమాండ్ ఏదో విషయం మాట్లాడటానికి వైయస్గారిని ఒక్కరే రావాలని చెప్పారట. నాతో కేవీపి కూడా వస్తారని సమాధానం పంపారట. దానికి వాళ్లు ‘సీటు కావాలంటే ఒక్కరే రావాలి’ అని చెప్పారట. ‘పదవులు చాలా చూస్తాం. నాతో ఉండే మనుషులే ఎక్కువ’ అనుకునేవారట. ఇలా కొన్ని సీన్స్ చెప్పడంతో మేం ముందుకు వెళ్లాం. ► మీ అమ్మగారు ఇప్పుడు ఎలా ఉన్నారు? బాగున్నారు. చలికాలం అప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మొన్న ఫంక్షన్లో నేను మాట్లాడినది విని, ఫోన్ చేసి ఏడ్చారు. ‘యాత్ర’ సినిమాకి పని చేశానన్న ఆనందం అది. -
యాత్ర మదిలో వైఎస్ఆర్
-
‘యాత్ర’ ప్రీరిలీజ్ ఫంక్షన్
-
ప్రేక్షకులందరికీ యాత్ర నచ్చుతుంది
‘‘మా కథని నమ్మి సినిమా చేసి, మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేసిన మమ్ముట్టిగారికి థ్యాంక్స్. కె. చక్కటి పాటలిచ్చారు. తెలుగు ఇండస్ట్రీలో ఈ పేరు మళ్లీ మళ్లీ వినిపిస్తుంది. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు ఐదు వైవిధ్యమైన పాటలు అద్భుతంగా రాశారు. ‘యాత్ర’ సినిమా వైఎస్‌గారి అభిమానులకు ఎలాగూ నచ్చుతుంది. కానీ, ఈ సినిమా ఆయన అభిమానులకి మాత్రమే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులందరికీ నచ్చుతుంది’’ అని నిర్మాత విజయ్ చిల్లా అన్నారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర ప్రధానాంశంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. మమ్ముట్టి లీడ్ రోల్లో నటించారు. మహి వి. రాఘవ్ దర్శకత్వం వహించారు. శివ మేక సమర్పణలో 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదలవుతోంది. శుక్రవారం హైదరా బాద్‌లో నిర్వహించిన ప్రీరిలీజ్ ఫంక్షన్లో మహి వి.రాఘవ్ మాట్లాడుతూ– ‘‘యాత్ర’ షూటింగ్ మొత్తం పూర్తయ్యాక జగన్ అన్నకి ట్రైలర్ చూపిస్తే, బాగుందన్నారు. సినిమా కూడా పూర్తయింది చూస్తారా? అని అన్నను అడిగాం. ‘మీ నాయకుని కథ మీరు చెప్పారు.. నేను చూసి ఏం చెప్పేది’ అన్నారు. ఇక్కడే మనం ఒక మాట గమనించాలి. ఇది మా నాన్న కథ అనలేదు.. మీ నాయకుని కథ అన్నారు. ఒకర్ని గుడ్డిగా నమ్మడానికి, అలాంటి మాట చెప్పడానికి చాలా గుండె ధైర్యం కావాలి. అది జగన్ అన్నకు ఉంది. ఈ ఫంక్షన్‌కి ముఖ్య అతిథిగా, అతిథులుగా ఎవర్ని పిలుద్దామన్నప్పుడు వైఎస్‌గారి అభిమానులను పిలుద్దామని చెప్పా. ఇది మన నాయకుడి కథ’’ అన్నారు. ‘‘యాత్ర’ సినిమా వైఎస్‌గారి ఫ్యాన్స్‌కే కాదు.. ఆయన ఫ్యాన్స్ కానివారికి కూడా నచ్చుతుంది. అందరికీ నచ్చే స్ఫూర్తిదాయకమైన సినిమా ఇది. ‘యాత్ర’ అన్ని పొలిటికల్ పార్టీలు చూసే చిత్రం. వారందరికీ మంచి స్ఫూర్తిగా ఉంటుందనే నమ్మకం నాకుంది’’ అని హీరో సుధీర్‌బాబు అన్నారు. నిర్మాతలు పీవీపీ, దామోదర ప్రసాద్, రవిశంకర్, నటుడు విజయ్‌చందర్, డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య, సంగీత దర్శకుడు కృష్ణకుమార్ (కె.), చిత్ర కెమెరామెన్ సత్యన్ సూర్యన్, తుని ఎమ్మెల్యే తాడిశెట్టి రాజ, కెమెరామెన్ శ్యామ్ దత్, నటి ఆశ్రిత, ‘బిగ్ సీ’ డైరెక్టర్ గౌతమ్, పాటల రచయిత, గాయకుడు పెంచల్దాస్, ఆర్ట్ డైరెక్టర్స్ రామకృష్ణ, మోనిక పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డిగారి అభిమానులే సెలబ్రిటీలుగా హాజరై ‘యాత్ర’ సినిమాలోని ఒక్కో పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు వైఎస్ ప్రవేశపెట్టిన పథకాల ద్వారా ఏ విధంగా లబ్ధి పొందారో తమ మాటల్లో పంచుకున్నారు. ► ‘వైఎస్‌గారు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశ పెట్టిన ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మేము చదువుకున్నాం. నిరుపేదలమైన మేము ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ చదివాం’ అని తూర్పుగోదావరి జిల్లా తాల్రేవు మండలం పి.మల్లవరం గ్రామానికి చెందిన స్వర్ణలత, సువర్ణ కుమారి అన్నారు. ► ‘వైఎస్‌గారు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలు నా కుటుంబానికి వర్తించాయని గర్వంగా చెబుతున్నా’ అని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం చిట్టవరం గ్రామానికి చెందిన నక్కా లక్ష్మీనారాయణ అన్నారు. ► ‘వైఎస్‌గారి పాదయాత్రలో నేను కూడా పాల్గొన్నా. నాకు వికలాంగుల పెన్షన్‌తో పాటు ఇల్లు మంజూరు చేశారాయన. రాజన్న చేసిన సేవలు ప్రజలు ఎప్పటికీ మరచిపోలేం. రాజన్న కుమారుడు జగన్ అన్న ముఖ్యమంత్రి కావాలి’’ అని ఆనపాటి వెంకటయ్య చెప్పారు. ► ‘చాలా దూరం నుంచి ఒక్కదానివే ఎలా వచ్చావని ఎంతో మంది నన్ను అడిగారు. వైఎస్‌గారు ఇచ్చిన ధైర్యం చాలదా మనకి ఒంటరిగా రావడానికి? ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో చదువుకుని సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయ్యా’ అని తూర్పు గోదావరి జిల్లా కడియం గ్రామానికి చెందిన వి.నిఖిల సంతోషం పంచుకున్నారు. ► ‘మా అమ్మకి గుండెకి రంధ్రం ఉండేది. అమ్మ ఆపరేషన్ కోసమని చదువు మానేశా. పనిలో చేరా. ఆపరేషన్ చేయించే స్థోమత లేదు. మా అమ్మ గోడు ఏ దేవుడూ వినలేదు. వైఎస్ అనే దేవుడు విన్నారు. ఆయన ప్రవేశపెట్టిన ‘ఆరోగ్యశ్రీ’ పథకంతో మా అమ్మకి హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో రూపాయి ఖర్చు లేకుండా గుండె ఆపరేషన్ చేయించా’ అని నిజామాబాద్ జిల్లా దేవపల్లికి చెందిన కె. రవికుమార్ చెప్పారు. -
ఇవే నా రాజకీయాలు : మమ్ముట్టి
‘‘ఇప్పటివరకు దాదాపు 375 చిత్రాల్లో నటించాను. ఏడాదికి ఐదారు సినిమాలు చేయాలని నేను ఒప్పందం కుదుర్చుకోవడంలేదు. నా దగ్గరకు వచ్చిన సినిమాలను నేను చేస్తూ వెళ్తున్నానంతే. సినిమాల పట్ల నాకు ఉన్న తపన అలాంటిది’’ అన్నారు మలయాళ స్టార్ మమ్ముట్టి. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితంలోని పాదయాత్ర ఘట్టం ఆధారంగా రూపొందిన చిత్రం ‘యాత్ర’. వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి నటించారు. మహి వి.రాఘవ్ దర్శకత్వంలో శివ మేక సమర్పణలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించారు. ఈ నెల 8న సినిమా విడుదలవుతున్న సందర్భంగా మమ్ముట్టి చెప్పిన విశేషాలు. ► చాలా కాలం తర్వాత తెలుగు సినిమా చేశాను. తెలుగు ప్రేక్షకులు అన్ని రకాల సినిమాలను ఆదరిస్తారు. ఇండస్ట్రీలో మంచి వాతావరణం ఉంటుంది. వైఎస్సార్ లాంటి లెజెండరీ క్యారెక్టర్ కోసం మహి పూర్తి స్క్రిప్ట్‌తో నా వద్దకు వచ్చారు. నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. సినిమా ఆలస్యం కాకుండా నిర్మించగల మంచి నిర్మాత దొరికారు. ఇలా చాలా అంశాలు ఉన్నాయి ఈ ‘యాత్ర’ సినిమా చేయడానికి. ► వైఎస్సార్ బాడీ లాంగ్వేజ్‌ని ఇమిటేట్ చేయలేదు. ఆయనది డిఫరెంట్ పర్సనాలిటీ. సినిమాలో సోల్ ఆఫ్ ది క్యారెక్టర్‌ను మాత్రమే తీసుకుని నటించాను. స్క్రిప్ట్ ప్రకారం చేశానంతే. ఒక గొప్ప వ్యక్తి లైఫ్‌ని రెండుగంటల్లో చెప్పడం కష్టం. ఇది పూర్తి బయోపిక్ కాదు. వైఎస్సార్ పాదయాత్ర ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రం. పాదయాత్రలో భాగంగా వైఎస్సార్ ప్రజలను కలవడం, వారితో మాట్లాడటం, వారి భావోద్వేగాలను పంచుకోవడం, వారి సమస్యలను విని పరిష్కార మార్గాల గురించి చర్చించడం వంటి అంశాల ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. ► వైఎస్సార్ పాత్రలో పాద యాత్ర చేసినప్పుడు సినిమాలో ప్రజలు తమ కష్టాలను చెప్పుకునే సీన్స్ ఉంటాయి కదా. ఆ కష్టాలన్నీ నిజంగా జరిగినవే. అవి విన్నప్పుడు ఎమోషనల్‌గా అనిపించింది. నా ఎమోషన్‌ను కంట్రోల్ చేసుకున్నాను. ఎందుకంటే నేను చేస్తున్నది పాత్ర అని నాకు తెలుసు. ప్రజల సమస్యలు ఎక్కడైనా ఒకేలా ఉంటాయి. పేదరికం ఒకేలా ఉంటుంది. ► మహి డైరెక్ట్ చేస్తున్నట్లు నాకు అనిపించలేదు. బాగా చేశారు. టీమ్ ఎఫర్ట్ ఇది. షూటింగ్ అంతా విహార యాత్రలా గడిచింది. ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ రావడం చాలా సంతోషంగా అనిపించింది. యాత్రలో నాకు యంగ్ ఏజ్ ఫాదర్‌గా నటించారు జగపతిబాబు. నా ‘మధురరాజా’ (మలయాళం) సినిమాలో ఆయనతో మంచి కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. ► నా కెరీర్లో ఇప్పటివరకు 70కి పైగా కొత్త దర్శకులతో పని చేశాను. వారిలో దాదాపు 90 శాతం మంది మాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్నారు. కోలీవుడ్‌లో ఇద్దరు పెద్ద దర్శకులు అయ్యారు. మహి వి. రాఘవ్ ఆల్రెడీ రెండు సినిమాలు చేశారు. ► కొత్తభాష నేర్చుకోవడమంటే నాకు చాలా ఆసక్తి. అందుకే ఈ సినిమాకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నా. నా దర్శక నిర్మాతలు, నా సహచర నటులు నా తెలుగు పట్ల హ్యాపీగానే ఉన్నారు. తెలుగు, మలయాళ భాషలో కొన్ని సిమిలర్ పదాలు ఉన్నాయి. ఉచ్చారణలో పెద్ద తేడా లేదు. కొన్ని టేక్స్ తీసుకుని ఫైనల్‌గా బాగానే కంప్లీట్ చేశాను. నా కెరీర్లో పొలిటికల్ చిత్రాలు ఉన్నాయి. కానీ బయోపిక్స్ లేవు. ‘అంబేద్కర్, బషీర్’ల బయోపిక్స్ మాత్రమే చేశాను. 38 ఏళ్లు సినిమాల్లో గడిచిపోయాయి. ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్లడం ఎందుకు? ఇవే (సినిమా) నా రాజకీయాలు (నవ్వుతూ). ► గత 30 ఏళ్లతో పోలిస్తే ఇప్పుడు అన్ని ఇండస్ట్రీస్‌లో మార్పు కనిపిస్తోంది. విశ్వనాథ్‌గారు భిన్నమైన చిత్రాలు చేశారు. నేను గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేశా. తెలుగులో మంచి మసాలా సినిమా చేసే అవకాశం రాలేదు. గతంలో కోడి రామకృష్ణ డైరెక్షన్లో ‘రైల్వేకూలి’ అనే సినిమా అంగీకరించాను. అది పూర్తి కాలేదు. ► నేను తెలుగు సినిమాలు చూస్తాను. ‘రంగస్థలం, భరత్ అనే నేను’ సినిమాలు చూశాను. తెలుగుభాషపై పట్టు కోసం యూట్యూబ్‌లో కొన్ని క్లిపింగ్స్ చూశాను. ఇప్పుడు నేను చేస్తున్న నా మలయాళ సినిమాలు కూడా తెలుగులో రిలీజ్ అవుతాయా? కావా? అనేది ‘యాత్ర’ రిజల్ట్‌ని బట్టి ఉంటుంది. ► వైఎస్ జగన్‌ను నేను కలవలేదు. వైఎస్సార్సీపీ అభిమానులు ఎవరూ ఈ సినిమా గురించి నాతో మాట్లాడలేదు. వైఎస్సార్సీపీ అభిమానుల నుంచి మా సినిమాకు మద్దతు లభిస్తుందేమో నాకు తెలీదు. ► ఏ ఇండస్ట్రీలో సినిమా చేయడం కంఫర్ట్‌గా ఉంటుంది అనే విషయం మనం చేస్తున్న సినిమాపై ఆధారపడి ఉంటుంది. వందకోట్లతో సినిమా చేయవచ్చు. యాభైలక్షలతో కూడా చేయవచ్చు. మన సినిమాలను ఎప్పటికప్పుడు విశ్లేషించుకోవాలి. అప్పుడు మన నటనలో తేడా తెలుస్తుంది. ఇందుకోసం నేను ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నాను. ప్రతిభ ఉండటమే కాదు. దాన్ని నిరూపించుకునేందుకు కష్టపడటం కూడా ముఖ్యమే. ఇప్పటికీ నా సహచర నటులను చూసి ఇన్స్పైర్ అవుతుంటాను. ► అప్పటి ‘స్వాతికిరణం’ సినిమాలో ఎలా ఉన్నానో ఇప్పుడూ అలానే ఉన్నాను అంటే ఇందుకు కారణం నాకు తెలీదు. దేవుడి దయ అనుకుంటున్నాను. నేను ఎప్పుడూ పాజిటివ్‌గానే ఆలోచిస్తాను. నాది 1980 బ్యాచ్ కాదు. 2018 బ్యాచ్. ► నా మలయాళ చిత్రం ‘మధుర రాజా’ షూటింగ్ జరుగుతోంది. ఏప్రిల్‌లో రిలీజ్ అనుకుంటున్నాం. కన్నడంలో ఓ సినిమా చేస్తున్నాను. వెబ్ సిరీస్‌లో నటించే ఆలోచన ప్రస్తుతం లేదు. -
చేసినవే చూపించండి... చేయనివి వద్దన్నారు
‘‘ఆనందో బ్రహ్మ’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కోసం చెన్నై వెళ్లాం. అప్పుడు ‘యాత్ర’ ఐడియా గురించి చెప్పాడు మహి. ఫస్ట్ ‘యాత్ర’ కథ నాకు చెప్పలేదు. జస్ట్ ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ డైలాగ్‌కి సంబంధించిన సీన్ మాత్రమే చెప్పాడు. అప్పుడు నేను ఒకటే మాట చెప్పా. సినిమా మొత్తం ఇదే ఎమోషన్ ఉంటే తప్పకుండా చేద్దాం అన్నాను’’ అని విజయ్ చిల్లా అన్నారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. మమ్ముట్టి లీడ్ రోల్లో నటించారు. మహి వి. రాఘవ్ దర్శకత్వం వహించారు. శివ మేక సమర్పణలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదలవుతోంది. ఈ సందర్భంగా విజయ్ చిల్లా విలేకరులతో మాట్లాడారు. ‘యాత్ర’ పక్కా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్. ఇందులో ఉన్న కమర్షియల్ ఎలిమెంట్ ఏంటంటే.. ‘ఎమోషన్’. 2 గంటల పాటు ప్రేక్షకులు ఎమోషన్‌తో ఎంగేజ్ అవుతారు. పాదయాత్ర నాటికి వైఎస్సార్‌గారి లుక్స్‌కి, సినిమాలో మమ్ముట్టిగారి లుక్స్‌కి చాలా తేడా ఉంది. డైలాగ్ మాడ్యులేషన్ విషయంలో కూడా వైఎస్సార్గారిలా మాట్లాడమని చెప్పలేదు. అలాగే వైఎస్సార్‌గారు ఎలా నడిస్తే చాలా నడవాలని చెప్పలేదు. పాత్రను అవగాహన చేసుకుని మమ్ముట్టిగారు నటించారు. మేం తీసిన ‘భలే మంచి రోజు’కి శ్యామ్ దత్‌గారు కెమెరామేన్‌గా చేశారు. ఆయన ద్వారానే మమ్ముట్టిగారిని సంప్రదించాం. అప్పుడు ఆయన వేరే సినిమా షూటింగ్లో ఉన్నారు. గ్యాప్‌లో లైన్ విన్నారు. ఆ తర్వాత ఓ రోజు పిలిచి కథ విని, పదిరోజుల్లో పూర్తి స్క్రిప్ట్‌తో రమ్మన్నారు. మరో రోజు వెళ్లినప్పుడు మొత్తం కథ తెలుగులోనే విన్నారు. మధ్యలో మహి కొంచెం ఇంగ్లీష్ వాడినా తెలుగులోనే చెప్పమనేవారు. ఎక్కడైనా అర్థం కాకపోతే అడిగి మళ్లీ మళ్లీ చదివించుకుని 10 గంటల పాటు కథ విన్నారు. మహి, నా కెరీర్లో లాంగెస్ట్ నెరేషన్ అంటే అదే. కథ విని నటించేందుకు మమ్ముట్టిగారు ఒప్పుకున్నా వెంటనే డేట్స్ ఇవ్వలేకపోయారు. 3, 4 నెలలు వేచి ఉండగలిగితే సినిమా చేద్దాం అన్నారు. ఓ రోజు ఫోన్ చేసి 45 రోజులు డేట్స్ ఉన్నాయి చేయగలరా? అన్నారు. కుదరదు సార్.. మాకు 3 నెలలు కావాల్సిందే అని రిక్వెస్ట్ చేశాం. మామూలుగా అయితే 90 రోజుల్లో మలయాళంలో రెండు సినిమాలు చేసేయొచ్చు. కానీ మన దగ్గర వీలుపడదు. వైఎస్సార్‌గారి పాదయాత్ర ప్రధానాంశం కాబట్టి ఈ సినిమాలో దాదాపు ప్రతి సీన్లో ఎక్కువమంది జనాలు ఉంటారు. అందుకే ఎక్కువ రోజులు అడిగాం. మమ్ముట్టిగారు ఓకే అన్నారు. ‘యాత్ర’ సినిమా ఒక ఈవెంట్ బేస్డ్ మూవీ. కొన్ని బయోపిక్స్ ఎలా ఉంటాయంటే.. పుట్టినప్పటి నుంచి బిగిన్ అయి, చనిపోయే వరకూ ఉంటాయి. మరికొన్ని ముఖ్యమైన అంశం చుట్టూ తిరుగుతాయి. మా సినిమా మాత్రం వైఎస్సార్‌గారి జీవితాన్ని ప్రభావితం చేసిన పాదయాత్ర చుట్టూ తిరుగుతుంది. బయోపిక్‌లో అన్నీ కరెక్ట్‌గా చూపించడానికి కుదరదు. అలా చూపిస్తే డాక్యుమెంటరీ అవుతుంది. అందుకే వైఎస్సార్‌గారి జీవితంలో జరిగిన వాస్తవాలనే సినిమాటిక్ లిబర్టీతో సినిమా ఫార్మాట్లో చూపించాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారు పాదయాత్రలో ఉన్నప్పుడు కలిసి, ఈ సినిమా గురించి చెప్పాము. ఆయన ఇన్పుట్స్ ఇస్తారేమో అనుకున్నాం. కానీ ‘మా నాన్నగారు చేసిందే చూపించండి.. చేయనివి చూపించకండి. ఇది మీ నాయకుడి సినిమాలా మీ వెర్షన్లో మీరు చేస్తున్నారు. అలాగే చేయండి’ అని ఆయన అన్నారు. అంతకుమించి ఈ బయోపిక్‌లో జగన్‌గారి ప్రమేయం లేదు. ‘యాత్ర’ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉంటుందని నమ్మకంగా ఉన్నాం. ఈ సినిమా వెనక ఏ పార్టీ బ్యాకింగ్ లేదు. మా అంతట మేమే తీశాం. మేమే రిలీజ్ చేస్తున్నాం. -
ప్రతి శుక్రవారం చాలా మారుతుంది
‘‘సినిమా ఫ్లాప్ అయినప్పుడు చాయిస్ ఉండదు. హిట్ అయితే నెక్ట్స్ డిఫరెంట్ సినిమా చేయడానికి చాన్స్ వస్తుంది. నా గత చిత్రం ‘ఆనందోబ్రహ్మా’ హిట్ సాధించడంతో ‘యాత్ర’ వంటి డిఫరెంట్ మూవీచేయగలిగా. ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి శుక్రవారం చాలా మారుతుంది’’ అని దర్శకుడు మహి వి. రాఘవ్ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ‘యాత్ర’. వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి నటించారు. మహి వి. రాఘవ్ దర్శకత్వంలో శివ మేక సమర్పణలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 8న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మహి చెప్పిన విషయాలు. ∙వైఎస్సార్‌గారి గురించి కావాలని చేసిన సినిమా కాదు ‘యాత్ర’. ఒక గొప్ప వ్యక్తి జీవిత కథను చెప్పే నైపుణ్యం నాలో ఇంకా రాలేదు. అయితే చాలామంది ఆయన గురించి చెప్పినవి, ఆయన చేసిన మంచి పనుల గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నవి విని, స్ఫూర్తి పొందాను. వైఎస్సార్‌గారి గురించి కొందరిని అడిగినప్పుడు ఆయన ధైర్యసాహసాలు గురించి ఎక్కువగా చెప్పలేదు నాకు. ఆయన చేసిన మంచి పనులు, ప్రవేశపెట్టిన పథకాలు, జనరంజకమైన పాలన గురించే చెప్పారు. ఒక రాజకీయ నాయకుడి గురించి ప్రజలు ఇంత మంచిగా చెప్పడం తక్కువ. అప్పుడు అనిపించింది వైఎస్సార్‌గారి గురించి ఓ కథ చెప్పాలని. ఆయన జీవితం మొత్తం చూపించాలనుకోవడం లేదు. మనం ఎంచుకుంటున్నది వివాదాలు లేని పాదయాత్ర ఎపిసోడ్ అనుకుని కథ రాశాను. ∙ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాల వల్ల వైఎస్సార్‌గా గుర్తుండిపోయారు. ఇలాంటి అంశాలు సబ్‌ప్లాట్స్‌గా ఉంటాయి సినిమాలో. వైఎస్సార్‌గారు పాదయాత్ర పూర్తిచేసిన వరకూ సినిమా ఉంటుంది. కానీ ఆ తర్వాత ఆయన లైఫ్ గురించి బ్రీఫ్‌గా పెంచలదాస్గారి ఎమోషనల్ సాంగ్ ఉంటుంది. ∙వైఎస్సార్‌గారి పాత్రకు మమ్ముట్టిగారైతే సరిగ్గా సరిపోతారని అనిపించింది మాకు. కథ విని మమ్ముట్టిగారు ఎగై్జట్ అయ్యారు. మమ్ముట్టిగారి దృష్టిలో పర్ఫార్మెన్స్ అంటే యాక్టింగ్ విత్ డబ్బింగ్. నిజంగా వేరే వారితో చెప్పించినా కూడా ఇప్పుడు మమ్ముట్టిగారు చెప్పినంత బాగా అవుట్‌పుట్ వచ్చేది కాదేమో. -
యాత్ర పొలిటికల్ సినిమా కాదు
వైఎస్ఆర్... జనరంజకమైన పాలన, సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానేత. ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. వైఎస్ఆర్ పాత్రలో మలయాళ స్టార్ మమ్ముట్టి నటించారు. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహి వి. రాఘవ్ దర్శకత్వం వహించారు. శివ మేక సమర్పణలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా మహి వి.రాఘవ్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ. ► ‘యాత్ర’ని గతేడాది చివర్లోనే పూర్తి చేశారు కదా, సినిమా విడుదల తేదీ ఎందుకు మార్చారు? మహి: నిజానికి గతేడాది డిసెంబర్ 21కి రిలీజ్ అనుకున్నాం. ఆ తర్వాత ఈ జనవరి 9న విడుదల అని ఫిక్స్ అయ్యాం. అయితే సంక్రాంతికి ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతుండటం వల్ల థియేటర్ల సమస్య ఉంటుంది. ప్రాక్టికల్‌గా... థియేటర్లు దొరికి రిలీజ్ చేసే అంత బలం మా వద్ద లేదు. అందుకే ఫిబ్రవరి 8న రిలీజ్ చేస్తున్నాం. మరో కారణం ఏంటంటే ‘యన్.టి.ఆర్ : మహానాయకుడు’ కూడా ఫిబ్రవరిలోనే విడుదలవుతోంది కదా. అప్పుడే ‘యాత్ర’ రిలీజ్ చేస్తే అయిపోతుందిలే అనుకున్నాం. అందులో దాచిపెట్టేది ఏమీ లేదు. ► అసలు ‘యాత్ర’ ఎలా మొదలైంది? ‘యాత్ర’ చేద్దామనుకున్నప్పుడు నాకు తెలిసిన ఏ ఒక్కరు కూడా ‘ఏం పర్లేదు చెయ్.. మంచిది అనలేదు. పొలిటికల్ సినిమా ఎందుకు?’ అన్నారు. కానీ నాకు నా కథపై నమ్మకం ఉంది. ఇప్పుడు కాకపోయినా ఓ 50 ఏళ్ల తర్వాతైనా వైఎస్‌గారి గురించి చెప్పాల్సిన కథ ఇది. నా ‘ఆనందో బ్రహ్మ’ సినిమా సక్సెస్ అయింది కాబట్టి ‘యాత్ర’కి రిస్క్ తీసుకునే చాన్స్ దొరికింది. ఆ సినిమా ఫ్లాప్ అయ్యుంటే మార్కెట్‌ని బట్టి పోవాల్సి వచ్చేది. ‘ఆనందో బ్రహ్మ’ చేస్తున్నప్పుడే ‘యాత్ర’ కథ గురించి విజయ్ చల్లా, శశి దేవిరెడ్డిగార్లతో చర్చించేవాణ్ని. కథ బాగా వస్తే చూద్దామన్నారు. కథ బాగా కుదరడం, పైగా నాపై ఉన్న నమ్మకంతో చేద్దామన్నారు. ► వైఎస్‌గారి బయోపిక్ తీయాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఈ కథకి స్ఫూర్తి ఏంటి? నాకు వైఎస్‌గారి గురించి చాలా తక్కువ తెలియడం అడ్వాంటేజ్ అయింది. ఆయన పాదయాత్ర చేసినప్పుడు కానీ, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ నేను ఈ దేశంలో లేను. వైఎస్‌గారి మరణానికి ఏడాది ముందు 2008లో ఇండియా వచ్చాను. 2009లో ఎలక్షన్లు రావడం.. వైఎస్‌గారు మళ్లీ అధికారం చేపట్టడం జరిగాయి. ఆయన మరణానంతరం జనాలంతా ఎక్కడ చూసినా ఆయన గురించే మాట్లాడుకుంటుండటం విన్నాను. వైఎస్‌గారి అభిమానులో, వీరాభిమానులో మాట్లాడుకుంటుంటే విని సినిమా తీయడం కష్టం అయ్యుండేది. ఆయన గురించి వేరేవాళ్లు చెబుతున్నప్పుడు కొత్తగా, బాగా అనిపించింది. అప్పుడే ఆయనపై స్టోరీ రెడీ చేద్దామనిపించింది. వైఎస్గారితో ప్రయాణం చేసిన వారిని కలిసి, వారి అనుభవాలు, జరిగిన సంఘటనలు తెలుసుకున్నా. ఆయనతో ఏ సంబంధం లేనివాళ్లు కూడా ‘వైఎస్ అది చేశారు.. ఇది చేశా’రని మాట్లాడుకుంటుండం ఆశ్చర్యమనిపించింది. వైఎస్గారితో ప్రయాణం చేసినవాళ్లో, కడపలోనే ఆయన గురించి మాట్లాడుతున్నారంటే అది వేరే విషయం. అరే.. ఓ ఐదారేళ్లలో ఆయన ప్రజలకి ఎంత సేవ చేసి ఇంత ఇంపాక్ట్ చూపించారో అనిపించింది. ► మీరు ఎప్పుడైనా వైఎస్‌గారిని కలిశారా? నాకా భాగ్యం కలగలేదు. కానీ, ఆయనతో మాకున్న చిన్న లింక్ ఏంటంటే మా అమ్మది ఇడుపులపాయ దగ్గర చక్రాయపేట మండలంలోని చిలేకాంపల్లె అనే ఊరు. కానీ, వైఎస్‌గారి కథ మనం చెప్పాలని మాత్రం ఉండేది. మా అమ్మ నా సినిమాలు ఎప్పుడూ చూడలేదు. కానీ, ‘యాత్ర’ సినిమా చూస్తానన్నారు. అది కూడా నా గురించి కాదు.. వైఎస్‌గారి గురించి. ► ఈ బయోపిక్ చేయాలనుకున్నప్పుడు విజయమ్మగారిని కానీ, వైఎస్ జగన్‌గారిని కానీ కలిశారా? ‘యాత్ర’ పోస్టర్ లుక్ రిలీజ్ చేసిన తర్వాత పాదయాత్రలో జగన్ అన్నని కలిశాను. వైఎస్‌గారిపై సినిమా చేయాలనుకుంటున్నానంటే ఓకే అన్నారు. జగన్ అన్న ‘మా నాన్న చేయనివి చెప్పొద్దు. నాన్నగారు చేయనిదాని క్రెడిట్ మనకొద్దు’ అన్నారు. అంతేకాదు.. ‘నాన్నగారి గురించి జనాలకు మీరు ఓ కథ చెప్పాలనుకున్నారు. ఆ కథ ఏంటని నేను తెలుసుకుని, మార్పులు చేర్పులు చేయమని చెప్పడం కరెక్ట్ కాదు’ అన్నారు. ఆ మాట జగన్ అన్న చెప్పడం చాలా గ్రేట్. ఇప్పుడొస్తున్న బయోపిక్‌లలో ఎస్టాబ్లిష్ అయ్యే విషయాలనే చూపిస్తున్నారు. ► వైఎస్‌గారి బాల్యం, విద్యార్థి దశ ఈ సినిమాలో ఉంటాయా? లేదు. ఆయన పాదయాత్ర ఘట్టం నుంచే సినిమా ఉంటుంది. ఈ కథని డ్రైవ్ చేయడానికి ఏం అవసరం అనే అంశాలన్నీ తీసుకుని కథ రెడీ చేశా. అలాగని కేవలం పాదయాత్ర గురించి మాత్రమే ఉండదు. అయితే 2004 ఎన్నికలకు ఆర్నెల్ల ముందు నుంచి పాదయాత్ర చేసినట్టు చూపించాం. ఆయన వాస్తవంగా ఎన్నికలకు ఏడాదిన్నర క్రితం పాదయాత్ర చేశారని మనకు తెలుసు. కానీ, మనం సినిమా అనే ఫార్మాట్లో.. ఓ డ్రమటైజ్డ్ ఫార్మాట్లో చెప్పదలచుకున్నాం కాబట్టి ఆ పాత్రల్ని మూవ్ చేయడం కానీ, తగ్గించడమో, పెంచడమో చేశాం. ► ఈ సినిమాలో వైఎస్‌గారి తనయుడి పాత్రలో జగన్‌గారు కనిపిస్తారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి? సినిమా చివరలో వచ్చే సన్నివేశంలో ఓ ఫుటేజ్‌లో ఉంటారే కానీ, సినిమాలో ఎక్కడా నటించలేదు. వైఎస్‌గారు చనిపోయినప్పుడు తీసుకున్న కొన్ని రియల్ విజువల్స్‌లో ఆయన ఎక్కడైనా కనిపిస్తారు కానీ, సెపరేట్‌గా ఆయనపై షూట్ చేయలేదు. ∙‘యాత్ర’ పక్కా పొలిటికల్ మూవీ అని, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉంటుందనే ప్రచారం సాగుతోంది. ఈ విషయాలు మీదాకా వచ్చాయా? అలా ఏం లేదు. వైఎస్‌గారి గొప్పతనం చెప్పడానికి ఇంకొకర్ని మనం చిన్నగా చేయాల్సిన అవసరం లేదు. ఒకర్ని తిట్టాల్సిన లేదా చెడు చేయాల్సిన అవసరం కూడా లేదు. వైఎస్‌గారికి ఉన్న పాజిటివ్ థ్రెడ్స్‌ని మనం కరెక్ట్‌గా చూపించగలిగితే చాలు అనుకున్నాం. మన దేవుణ్ని మహానుభావుడు అనుకోవడానికి వేరొకర్ని చిన్నగా చేయాల్సిన అవసరం రాలేదు. పైగా అలాంటి లక్షణం వైఎస్‌గారిది కాదు. ► ఫిబ్రవరిలో ‘యాత్ర’ రిలీజవడం ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుందనుకుంటున్నారా? నిజాయతీగా చెప్పాలంటే అలా అనుకోవడం ఓవర్ ఎస్టిమేషన్ అనుకుంటున్నాం. ఇప్పుడున్న ప్రజలు, ఓటర్లు స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్. ఎవరికి ఓటేస్తే ఎంత లాభం అని ఓ క్యాలిక్యులేషన్‌తో చెప్పేస్తారు. అంత తెలివైన ఓటర్లు ఓ సినిమాతో ప్రభావితం అవుతారని నేను అస్సలు నమ్మను. 30 ఏళ్ల కిందట సినిమా చూసి వాళ్లు ఎగై్జట్ అయ్యి ఓట్లు వేసుండొచ్చేమో. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒకవేళ మా సినిమా ప్రభావితం చేస్తే మంచిదే. ► ‘యాత్ర’ టీజర్, ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది. జగన్‌గారికి చూపించారా? చూపించాను.. బాగుందన్నారు. సినిమాలో ఏం ఉంటుందనే అంశాల్ని ట్రైలర్లో చూపించాం అంతే. ఏ అంశాన్నీ మిస్లీడ్ చేయలేదు. ► ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతవరకూ రీచ్ అవుతుందనుకుంటున్నారు? నాకు ఆ ఆలోచన లేదండీ. ఇదొక హానెస్ట్ ఫిల్మ్. సినిమా చూసినప్పుడు ఆ పాత్రతో వాళ్లు ఎమోషనల్‌గా కచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఎంతమంది చూస్తారు, ఎంత వసూలు చేస్తుందనే ఆలోచన లేదు. తెలుగు ప్రేక్షకులే కాదు.. మలయాళ ప్రేక్షకులు కూడా ‘యాత్ర’ని ఓ మంచికథగా యాక్సెప్ట్ చేస్తారు. వైఎస్‌గారు తెలిసిన వాళ్లు చూడటం కాదు.. తెలియని వారు కూడా చూడాలి.. ‘ఎవరో ఓ నాయకుని కథ, చరిత్ర ఇది. కథగా చాలా ఇంట్రెస్టింగ్గా, ఎమోషన్‌గా ఉంది’ అనేది అచీవ్ అవ్వాలి. అది మేం అచీవ్ అయ్యామనుకుంటున్నాం. ► మీ తర్వాతి ప్రాజెక్ట్స్ ఏంటి? ‘యాత్ర’ బాగా ఆడితే ఇంతకంటే ఇంకో పెద్ద సినిమా వస్తుంది. ఆడకుంటే మరో చిన్న సినిమా అవకాశం వస్తుంది. అది కూడా సరిగ్గా ఆడకుంటే ఏ వెబ్‌సిరీసో చేయాలి. మనం కథ చెప్పాలని వచ్చాం. అది సినిమానా, వెబ్ సిరీసా, అమేజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి సంస్థలకు చెబుతామా? అన్నది ముఖ్యం కాదు. ఏదేమైనా ఓ సినిమా నా చరిత్రను అంతం చేయదు. ఈ సినిమా కాకుంటే మరో సినిమా.. అది కూడా కాకుంటే వెబ్ సిరీస్. అంతేకానీ కథ చెప్పడం మాత్రం ఆపం (నవ్వుతూ). ‘యాత్ర’ రాజకీయ సినిమా అని ప్రేక్షకులు భావిస్తున్నారు. వాళ్లకున్న సర్ప్రైజ్ ఏంటంటే ఇందులో రాజకీయాలు ఉన్నది కేవలం 20 శాతమే. మిగిలిన 80 శాతం హ్యూమన్ డ్రామా. ఎమోషనల్‌గా చాలా బాగుంటుంది. వైఎస్‌గారు రాజకీయ నాయకుడు కావొచ్చు కానీ, ఇది పొలిటికల్ సినిమా మాత్రం కాదు. రాజకీయాలు చాలా తక్కువ ఉంటాయి. పాదయాత్రకి ముందు వరకూ వైఎస్గారంటే ఒక విధమైన లీడర్ అనే ప్రచారం చేశారు కొందరు వ్యక్తులు.. మీడియా వాళ్లు. పాదయాత్ర ద్వారా ఆయన ప్రజల్ని కలుసుకుని, మాట్లాడారు. దీంతో వైఎస్‌గారు ఇంత మంచి మనిషా అంటూ జనాలు భావించారు. అప్పటివరకూ ఆయనపై ఉన్న ఇమేజ్ వట్టిదే అనుకుని మార్పు చెందారు. -
నేను విన్నాను.. నేను ఉన్నాను
‘నీళ్లుంటే కరెంటు ఉండదు.. కరెంటు ఉంటే నీళ్లు ఉండవు.. రెండూ ఉండి పంట చేతికొస్తే సరైన ధర ఉండదు. అందరూ రైతే రాజు అంటారు.. సరైన కూడు, గూడు, గుడ్డ, నీడ లేని ఈ రాచరికం మాకొద్దయ్యా.. మమ్మల్ని రాజులుగా కాదు.. కనీసం రైతులుగా బతకనివ్వండి చాలు.. అని ప్రతి రైతు గొంతెత్తి అరుస్తున్న సమయం అది.. ఎవరైనా ఆదుకుంటారా అని రైతన్న ఎదురుచూసిన సమయంలో ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ విడుదలైన ‘యాత్ర’ టీజర్ రైతుల కష్టాలను కళ్లకు కట్టింది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ‘యాత్ర’. వైఎస్ పాత్రలో మమ్ముట్టి నటించారు. మహి వి. రాఘవ్ దర్శకత్వం వహించారు. శివ మేక సమర్పణలో 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 8న మూడు భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి మాట్లాడుతూ– ‘‘మడమ తిప్పని నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారి జీవితంలో అతి కీలకమైన పాదయాత్ర ఘట్టాన్ని ప్రధానాంశంగా తీసుకుని ‘యాత్ర’ చిత్రాన్ని నిర్మించాం. మా బ్యానర్ నుంచి ‘భలేమంచి రోజు, ఆనందోబ్రహ్మ’ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ‘యాత్ర’ హ్యాట్రిక్ సినిమాగా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నాం. తెలుగు ప్రజలందరూ తప్పకుండా చూడాల్సిన చిత్రమిది. సెన్సార్ నుంచి క్లీన్ యు సర్టిఫికెట్ లభించింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఫిబ్రవరి 8న సినిమా విడుదల చేస్తున్నాం’’ అన్నారు. రావు రమేష్, జగపతిబాబు, సుహాసిని, అనసూయ, పోసాని కృష్ణమురళి, సచిన్ కడ్కర్, వినోద్ కుమార్, జీవా, 30 ఇయర్స్ పృథ్వి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సత్యన్ సూర్యన్, సంగీతం:కె (కృష్ణ కుమార్). -
విజయమ్మలా...
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా ‘యాత్ర’ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. మహి వి.రాఘవ్ దర్శకత్వంలో 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 8న విడుదలవుతోంది. ఈ చిత్రంలో వైఎస్ పాత్రలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ చూస్తే వైఎస్ పాత్రలో మమ్ముట్టి చక్కగా ఒదిగిపోయారంటున్నారు సినీ అభిమానులు. ఇందులో వైఎస్ తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు నటించారు. మరి వైఎస్ సతీమణి విజయమ్మ పాత్రను ఎవరు చేశారు? అనే ఆసక్తి అటు సినీ వర్గాలతో పాటు ఇటు వైఎస్ అభిమానులు, ప్రేక్షకుల్లో నెలకొంది. తాజాగా ‘యాత్ర’ బృందం వైఎస్ విజయమ్మ పాత్రధారి అశ్రిత వేముగంటి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ పోస్టర్ చూసినవాళ్లు అచ్చం విజయమ్మలాగే అశ్రిత ఉందంటున్నారు. ‘బాహుబలి 2’లో అనుష్క వదిన పాత్రలో నటించారు అశ్రిత. -
మాట ఇచ్చాక ఆలోచించేది ఏముంది.. ముందుకెళ్లాల్సిందే
-
యాత్ర ట్రైలర్ : మాట ఇచ్చేముందు ఆలోచిస్తాను కానీ..
తెలుగు ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితం ఆధారంగా యాత్ర పేరుతో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లెజెండరీ నటుడు మమ్ముట్టీ, వైఎస్సార్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్రనే ప్రధానంగా చూపించనున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర బృందం ప్రారంభించింది. అందులో భాగంగా సోమవారం చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. పాదయాత్ర ముందు వైఎస్సార్‌కు ఎదురైన కొన్ని పరిస్థితులతో పాటు, పాదయాత్ర సాగిన తీరును ఈ చిత్రంలో ప్రధానంగా చూపించినట్టు ట్రైలర్లో ప్రతిబింబించింది. వైఎస్సార్ పాదయాత్రలో ప్రజలతో మమేకమైన తీరును కళ్లకు కట్టినట్టు చూపించారు. ‘నా విధేయతను.. విశ్వాసాన్ని బలహీనతగా తీసుకోకండి’, ‘నాయకుడిగా మనకు ఏం కావాలో తెలుసుకోగలిగాం కానీ.. జనాలకు ఏం కావాలో తెలుసుకోలేకపోయాం’, ‘మాట ఇచ్చేముందు ఆలోచిస్తాను.. ఇచ్చాక ఆలోచించేది ఏముంది.. ముందుకెళ్లాల్సిందే’ అని మమ్ముట్టీ పలికిన డైలాగులు గుండెకు హత్తుకునేలా ఉన్నాయి. చివర్లో ఓ వ్యక్తి రాజశేఖర ఈ సారి నా ఓటు నీకే.. నీ పార్టీకి కాదు అని పలికిన డైలాగ్ ఆకర్షించేదిగా ఉంది. వైఎస్ విజయమ్మగా ఆశ్రిత మేముగంటి ట్రైలర్‌కు కొద్ది గంటల ముందు సినిమాకు సంబంధించిన మరో విశేషాన్ని చిత్ర బృందం ప్రేక్షకులతో పంచుకుంది. వైఎస్సార్ జీవితంలో సగ భాగమైన ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ పాత్రను ఈ చిత్రంలో ఆశ్రిత వేముగంటి పోషిస్తున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను కూడా రిలీజ్ చేసింది. ఫస్ట్ లుక్‌లో ఆశ్రిత అచ్చం వైఎస్ విజయమ్మను పోలినట్టు ఉన్నారు. Introducing #AshritaVemuganti as #YSVijayamma. #YatraTrailer will be out at 5 pm today. Get ready to join the remarkable #Yatra.@mammukka @MahiVRaghav @VijayChilla @devireddyshashi #ShivaMeka @K_RiverRecords @70mmentertains @MangoMusicLabel #YatraOnFeb8th pic.twitter.com/2FrLHnrCEb — #YatraOnFeb8th (@70mmEntertains) 7 January 2019 ఇప్పటికే రిలీజ్అయిన ఈ చిత్ర టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్సాన్స్ వచ్చింది. వైఎస్సార్ అభిమానులతోపాటు, తెలుగు సినీ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం 2019 ఫిబ్రవరి 8న రిలీజ్ కానుంది. జగపతిబాబు, సుహాసిని, అనసూయ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ మళయాల భాషల్లోనూ యాత్ర సినిమా రిలీజ్ అవుతోంది. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మా సినిమాలను నిర్మించిన విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ బయోపిక్‌ను నిర్మిస్తున్నారు. పాఠశాల, ఆనందో బ్రహ్మా చిత్రాల దర్శకుడు మహి వి రాఘవ ఈ చిత్రానికి దర్శకుడు. -
రాజన్నా.. నిన్నాపగలరా..
మహానేత వైయస్ రాజశేఖర్‌రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘యాత్ర’. మమ్ముట్టి టైటిల్ రోల్ పోషించారు. మహీ వి. రాఘవ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించారు. ‘యాత్ర’లోని రెండవ పాట ‘రాజన్నా నిన్నాపగలరా..’ను ఇటీవల రిలీజ్ చేశారు. ‘‘ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి నేరుగా ప్రజల వద్దకు వచ్చి వారి సమస్యలను తెలుసుకోవడాన్ని, దాంతో ప్రజలంతా పొందిన ఆనందాన్ని ఈ పాటలో చూపించబోతున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ‘యాత్ర’ చిత్రాన్ని ఫిబ్రవరి 8న రిలీజ్ చేస్తున్నాం. తెలుగు, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: కె, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, కెమెరా: సత్యన్ సూర్యన్. -
ఆ రోజు యాత్ర షురూ
తెలుగు ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న మహానేత వైయస్సార్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తన మేనియాతో తిరగరాసిన వ్యక్తి ఆయన. ప్రస్తుతం వైయస్సార్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యాత్ర’. ఆయన జీవితంలోని కీలక ఘట్టమైన పాదయాత్ర అప్పుడు జరిగిన ముఖ్య సంఘటనల సమాహారమే ‘యాత్ర’. వై.యస్. రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, టీజర్, మొదటి సాంగ్‌తో ఈ చిత్రంలోని హై ఇంటెన్సిటీ చూపించారు. ‘ఆనందో బ్రహ్మ’ చిత్రంతో చక్కని విజయాన్ని సొంతం చేసుకున్న మహి.వి.రాఘవ్ దర్శకత్వంలో ‘భలే మంచి రోజు’, ‘ఆనందో బ్రహ్మ’ వంటి హిట్ చిత్రాలను నిర్మించిన 70 యమ్.యమ్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శివ మేక సమర్పిస్తున్నారు. చిత్రనిర్మాతలు విజయ్, శశి మాట్లాడుతూ– ‘‘ఆ మహా నేత పాదయాత్ర చేశారని తెలుగు వారందరికి తెలుసు కానీ, ఆ పాద యాత్ర ఆయన రాజకీయ జీవితంలో ఎంత కీలకమో కొద్దిమందికి మాత్రమే తెలుసు. పాదయాత్ర ద్వారా ప్రజల దగ్గరకెళ్లి వాళ్ల సమస్యలు తెలుసుకోవడానికి నడుం కట్టారు వైయస్ఆర్. పేదవారు దేనికోసం ఎదురు చూస్తున్నారో తెలుసుకున్నాక ఆయన మనసు చలించి పోయింది. ఈ యాత్ర ప్రారంభం నుండి ముగింపు వరకు ఉన్న ఘట్టాన్ని తీసుకుని సినిమా చేశాం. ఆద్యంతం భావోద్వేగ సంఘటనలతో వైయస్సార్ మడమ తిప్పని నైజంతో పాటు, నిరుపేదలంటే ఆయనకు ఎంత ప్రాణమో ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాం. ఆయన చేసిన పోరాట పటిమ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుంది. మమ్ముట్టి గారు వైయస్సార్‌గారి పాత్రలో పరకాయ ప్రవేశం చేశారా అన్నట్లు నటిస్తున్నారు. టీజర్‌కు, ఫస్ట్ సింగిల్‌కు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల నుండి అనూహ్యమైన స్పందన లభించింది. మా బ్యానర్లో ‘యాత్ర’ చిత్రం హ్యాట్రిక్‌గా నిలుస్తుందనే నమ్మకం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా ఫిబ్రవరి 8న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ‘యాత్ర’ చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. -
వచ్చే ఏడాది జన నేత
దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్‌లు రూపొందుతోన్న సంగతి తెలిసిందే. జనరంజకమైన పాలనతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితంపై ‘యాత్ర’ సినిమా తెరకెక్కింది. వైఎస్ పాత్రలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి నటించారు. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహీ వి. రాఘవ్ దర్శకత్వంలో 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించారు. ఈ సినిమాని డిసెంబర్ 21న విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి. అయితే.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ‘యాత్ర’ డిసెంబర్ 21న విడుదల కావడం లేదట. బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ‘యన్.టి.ఆర్: కథానాయకుడు, యన్.టి.ఆర్: మహానాయకుడు’ పేరుతో రెండు భాగాలుగా వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయనున్నారు. ‘యన్.టి.ఆర్: మహానాయకుడు’ విడుదల అయ్యే రోజున వైఎస్ బయోపిక్ ‘యాత్ర’ సినిమాని ఆ చిత్రబృందం రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. జగపతిబాబు, సుహాసిని, రావు రమేశ్ ముఖ్య పాత్రల్లో నటించిన ‘యాత్ర’ చిత్రానికి కెమెరా: సత్యన్ సూర్యన్. -
ఇది మరచిపోలేని యాత్ర
ఇటీవలే ‘యాత్ర’ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహా నేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి పాత్రను పోషించారు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ జర్నీలో మమ్ముట్టితో తనకు ఏర్పడిన అనుబంధాన్ని దర్శకుడు మహీ. వి రాఘవ్ ఈ విధంగా రాసుకొచ్చారు. ‘‘మమ్ముట్టిగారితో మా ప్రయాణం ముగిసింది. 390కి పైగా సినిమాలు, 3 నేషనల్ అవార్డులు, 60మందికి పైగా నూతన దర్శకులను పరిచయం చేసిన వ్యక్తి మమ్ముట్టిగారు. ఇవన్నీ కాకుండా చాలా గొప్ప మనిషి, మంచి గురువు. ఇన్ని చేసిన ఆయన ఇంకా నిరూపించుకోవాల్సింది, సాధించాల్సింది ఏమీ లేదు. బంధువును గౌరవించుకోవడం మన సంప్రదాయం అంటారు. ఏదైనా సినిమాలో తన పాత్రను సరిగ్గా నిర్వర్తించకపోయినా, మీ అంచనాలను అందుకోకపోయినా ప్రేక్షకులుగా మీరు ఆయన్ను విమర్శించవచ్చు. కానీ, నటుడిగా ఆయనకున్న డెడికేషన్ అభినందించకుండా ఉండలేనిది. ఈ స్క్రిప్ట్‌ని తెలుగులోనే విన్నారు. ప్రతి అక్షరానికీ అర్థం తెలుసుకున్నారు. ప్రతి డైలాగ్‌ని ఆయన భాషలో రాసుకొని క్షుణ్ణంగా సెట్లో పలికారు. డబ్బింగ్లో ఒకటికి రెండు సార్లు జాగ్రత్తపడ్డారు. ఆయనకు మన సంప్రదాయాలు, సంస్కృతి మీద విపరీతమైన గౌరవాభిమానాలు ఏర్పడ్డాయి. ఈ క్యారెక్టర్‌కు మమ్ముట్టిగారు తప్ప మరెవరూ న్యాయం చేయలేరని బలంగా చెప్పగలను. మమ్ముట్టిగారు నిజంగా మ్యాజిక్, వండర్ఫుల్. ఆయనతో చేసిన ఈ యాత్ర ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా’’ అన్నారు. ‘యాత్ర’ చిత్రం డిసెంబర్ 21న విడుదల కానుంది. -
పోచంపల్లిలో ‘యాత్ర’ సినిమా షూటింగ్
భూదాన్‌పోచంపల్లి(భువనగిరి) : పోచంపల్లిలో 70ఎంఎం పిక్చర్స్ బ్యానర్‌పై దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా నిర్మిస్తున్న ‘యాత్ర’ సినిమా షూటింగ్ బుధవారం జరిగింది. పోచంపల్లిలోని టూరిజం పార్క్, చెరువు కట్ట సమీపంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాత్రలో నటిస్తున్న మళయాల సూపర్‌స్టార్ మమ్ముట్టి, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పాత్రలో నటిస్తున్న ప్రముఖ నటి సుహాసినిపై పాదయాత్రకు సంబంధించిన పలు సన్నివేశాలను చిత్రీకరించారు. పాదయాత్రలో భాగంగా ఓ పాటలోని బ్యాక్‌గ్రౌండ్ సన్నివేశాలను ప్రముఖ కొరియోగ్రాఫర్ బృంద పర్యవేక్షణలో వివిధ వర్గాల ప్రజలను కలిసే సన్నివేశాలను తెరకెక్కించారు. కాగా ఈ సినిమాకు మహి, వి రాఘవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి, సంగీతం కృష్ణకుమార్, కెమెరామెన్‌గా సత్యన్‌సూర్యన్ వ్యవహరిస్తున్నారు. కాగా సినిమా షూటింగ్ చూడడానికి ప్రజలు భారీగా తరలిరావడంతో సందడి నెలకొంది. చదవండి: యాత్ర టీజర్.. గడప కష్టాలు వినేందుకు రాజన్న... నిన్ను నీవే జయించు -
వైఎస్ జగన్ బర్త్‌డేకి యాత్ర
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాల్ని తిరగరాసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రను ‘యాత్ర’ పేరుతో సినిమాగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి నటిస్తున్నారు. మహి వి.రాఘవ దర్శకత్వంలో 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ‘యాత్ర’ చిత్రాన్ని వైఎస్ఆర్ తనయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి మాట్లాడుతూ– ‘‘మడమ తిప్పని నాయకుడు వైఎస్ఆర్ రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలక ఘట్టం. ఆ సమయంలో జరిగిన ముఖ్య సంఘటనల సమాహారమే మా సినిమా. తెలుగు ప్రజలందరూ తప్పకుండా చూడాల్సిన చిత్రంగా తెరకెక్కిస్తున్నాం. మా బ్యానర్లో వచ్చిన ‘భలే మంచి రోజు, ఆనందోబ్రహ్మ’ చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు ‘యాత్ర’ చిత్రం హ్యాట్రిక్ హిట్‌గా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: శివ మేక, కెమెరా: సత్యన్ సూర్యన్, సంగీతం: కె (కృష్ణ కుమార్). -
‘యాత్ర’ విడుదల తేదీ ఖరారు
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న యాత్ర చిత్రం విడుదల తేదీని యూనిట్ సభ్యులు ఖరారు చేశారు. లెజెండరీ నటుడు మమ్ముట్టీ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 21వ తేదీన విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర బృందం వినాయక చవితి సందర్భంగా బుధవారం విడుదల చేసింది. ప్రజానేత జీవితంలోని మహాప్రస్థానం(పాదయాత్ర) అనే కీలక ఘట్టం ఆధారంగా ఈ చిత్రాన్ని ఆనందోబ్రహ్మ ఫేమ్ మహి వీ రాఘవ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన టీజర్, ఫస్ట్ సాంగ్ లిరికల్ వీడియోకు విపరీతమైన స్పందన వచ్చింది. శరవేగంగా జరుగుతున్న షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని తొలుత సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా అందుకు కొన్ని రోజుల ముందుగానే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం నిర్ణయించింది. 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలో జగపతిబాబు, సుహాసిని, రావు రమేశ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సత్యన్ సూర్యన్. -
కన్నుల్లో కొలిమై రగిలే..
-
కన్నుల్లో కొలిమై రగిలే..
సాక్షి, హైదరాబాద్ : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా దిగ్గజ నేతపై రూపొందుతున్న బయోపిక్ ‘యాత్ర’ యూనిట్ సమరశంఖం అంటూ సాగే పూర్తి సాంగ్ లిరిక్స్‌ను లాంఛ్ చేసింది. వేలాది మంది వెంటరాగా మహానేత పాదయాత్రగా ప్రజాక్షేత్రంలోకి వడివడిగా వెళుతున్న దృశ్యాలు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘నీ కన్నుల్లో కొలిమై రగిలే..కలేదో నిజమై తెలవారెనే.. వెతికే వెలుగే రానీ.ఈనాటి సుప్రభాత గీతమే..నీకిదే అన్నది స్వాగతం’ అంటూ సాగే ఈ పాట ఆనాటి చారిత్రాత్మక యాత్రను కళ్లకుకట్టేలా ఉంది. మళయాళ మెగాస్టార్ మమ్ముటీ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రం ఆనందోబ్రహ్మ ఫేమ్ మహి వీ రాఘవ డైరెక్షన్లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ లిరికల్ వీడియో నెటిజన్లలో వైరల్ అవుతోంది. -
వైఎస్సార్ బయోపిక్ ‘యాత్ర’ టీజర్ రిలీజ్
-
యాత్ర టీజర్.. గడప కష్టాలు వినేందుకు రాజన్న...
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ ‘యాత్ర’ టీజర్ రిలీజ్ అయ్యింది. మళయాళ మెగాస్టార్ మమ్ముటీ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రం ఆనందోబ్రహ్మ ఫేమ్ మహి వీ రాఘవ డైరెక్షన్లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రజానేత జీవితంలోని మహాప్రస్థానం(పాదయాత్ర) అనే కీలక ఘట్టం ఆధారంగా యాత్రను మహి రూపొందిస్తున్నారు. టీజర్ విషయానికొస్తే... పాదయాత్ర ప్రారంభించే ముందు వైఎస్సార్ మాటల్ని గుర్తు చేస్తూ టీజర్ ప్రారంభమైంది. ‘తెలుసుకోవాలని ఉంది.. వినాలని ఉంది.. ఈ కడప దాటి ప్రతీ గడపలోకి వెళ్లాలని ఉంది.. వాళ్లతో కలిసి నడవాలని ఉంది.. వాళ్ల గుండె చప్పుడు వినాలని ఉంది. గెలిస్తే పట్టుదల అంటారు, ఓడిపోతే మూర్ఖత్వం అంటారు. పాదయాత్ర నా మూర్ఖత్వమో.. పట్టుదలో... చరిత్రే నిర్ణయించుకోని’ అంటూ బ్యాక్ గ్రౌండ్లో డైలాగులు వినిపించాయి. పంచెకట్టులో రాజన్నను తలపిస్తూ.. అదే దరహాసం.. అదే తరహా అభివాదం ఓవరాల్‌గా మమ్ముట్టి.. లుక్ ఆకర్షించింది. ‘కే’ అందించిన బ్యాక్ గ్రౌడ్ స్కోర్ గూస్బమ్స్ తెప్పించేదిలా ఉంది. 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా సాగుతోంది. అతిత్వరలో యాత్రను ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ కృషి చేస్తోంది. -
స్క్రీన్ ప్లే 6th July 2018
-
మాతో జీవితకాల ప్రయాణానికి సిద్ధంకండి!
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా ‘యాత్ర’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వైఎస్సార్ జయంతి సందర్భంగా జూలై 8వ తేదీన ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘షూ లేసులు కట్టుకోండి.. మాతో జీవితకాల ప్రయాణానికి సిద్ధంకండి’ అంటూ వైఎస్సార్ జయంతి కానుకగా ‘యాత్ర’ టీజర్ విడుదల చేయనున్నట్టు తెలిపింది. ‘కడప దాటి వస్తున్నా.. మీ గడప కష్టాలు వినటానికి’ అనే ట్యాగ్‌లైన్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ సినిమాలో మహానేత పాదయాత్రను ప్రముఖంగా చూపించనున్నారు. మహి వీ రాఘవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వైఎస్సార్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తుండగా, జగపతిబాబు, రావు రమేశ్, అనసూయ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మా సినిమాలను నిర్మించిన విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ బయోపిక్‌ను నిర్మిస్తున్నారు. -
జూలై 8న ‘యాత్ర’ టీజర్!
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితకథ ఆధారంగా యాత్ర పేరుతో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లెజెండరీ నటుడు మమ్ముట్టీ, వైఎస్సార్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను సింగిల్ షెడ్యూల్ పూర్తిచేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 8న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా యాత్ర టీజర్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. జగపతిబాబు, సుహాసిని, అనసూయ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను 2019 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మా సినిమాలను నిర్మించిన విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ బయోపిక్‌ను నిర్మిస్తున్నారు. పాఠశాల, ఆనందో బ్రహ్మా చిత్రాల దర్శకుడు మహి వి రాఘవ ఈ చిత్రానికి దర్శకుడు. -
యాత్రలో జగపతిబాబు
వైఎస్ రాజారెడ్డి.. ఈ పేరు చెప్పగానే దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి అని గుర్తుకొస్తారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో రాజారెడ్డి అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఆయన ప్రస్తావన ఎందుకంటే.. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘యాత్ర’. వైఎస్ పాత్రలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహీ వి. రాఘవ్ దర్శకత్వంలో 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో వైఎస్ తండ్రి రాజారెడ్డి పాత్రలో విలక్షణ నటుడు జగపతిబాబు కనిపించనున్నారు. రాజారెడ్డి అంటే రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా పులివెందుల ప్రాంత ప్రజలకు ఎనలేని అభిమానం. అటువంటి రాజారెడ్డి పాత్రకు జగపతిబాబు అయితే కరెక్టుగా సరిపోతారని భావించిన చిత్రబృందం ఆయన్ను సంప్రదించడం, ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి. ఆదివారం రాత్రి దర్శక–నిర్మాతలతో మాట్లాడాక జగపతిబాబు ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే లుక్ టెస్ట్ చేయనున్నారు. కాగా ఈ చిత్రంలో మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాత్రలో సుహాసిని నటిస్తోన్న విషయం తెలిసిందే. -
‘యాత్ర’లో అనసూయ?
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితకథ ఆధారంగా యాత్ర పేరుతో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లెజెండరీ నటుడు మమ్ముట్టీ, వైఎస్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్రలో ప్రముఖ యాంకర్ అనసూయ నటించనుందట. ఇటీవల రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో ఆకట్టుకున్న అనసూయ సినిమాల్లోనూ బిజీ అవుతున్నారు. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మా సినిమాలను నిర్మించిన విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ బయోపిక్‌ను నిర్మిస్తున్నారు. పాఠశాల, ఆనందో బ్రహ్మా చిత్రాల దర్శకుడు మహి వి రాఘవ ఈ చిత్రానికి దర్శకుడు. ‘కడప దాటి వస్తున్నా.. మీ గడప కష్టాలు వినటానికి’అనే ట్యాగ్ లైన్‌తో వస్తున్న ఈ సినిమాలో ప్రజా ప్రస్థానం పాదయాత్రను ప్రముఖంగా చూపించనున్నారు. -
రీల్ వైఎస్సార్‌కు గ్రాండ్ వెల్కం
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితకథ ఆధారంగా యాత్ర పేరుతో సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. లెజెండరీ నటుడు మమ్ముట్టీ, వైఎస్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మమ్ముట్టీని సెట్స్ లోకి ఆహ్వానించేందుకు గ్రాండ్‌గా ఏర్పాట్లు చేశారు. మమ్ముట్టి పాత సినిమాల్లోని పాటలకు డ్యాన్సులు చేస్తూ సెట్స్‌లోకి స్వాగతం పలికారు. చాలా కాలం తరువాత మమ్ముట్టి తెలుగు సినిమాలో నటిస్తుండటంతో చిత్ర యూనిట్ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మా సినిమాలను నిర్మించిన విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ బయోపిక్‌ను నిర్మిస్తున్నారు. పాఠశాల, ఆనందో బ్రహ్మా చిత్రాల దర్శకుడు మహి వి రాఘవ ఈ చిత్రానికి దర్శకుడు. ‘కడప దాటి వస్తున్నా.. మీ గడప కష్టాలు వినటానికి’అనే ట్యాగ్ లైన్‌తో వస్తున్న ఈ సినిమాలో ప్రజా ప్రస్థానం పాదయాత్రను ప్రముఖంగా చూపించనున్నారు. వైఎస్సార్ బయోపిక్ ‘యాత్ర’కు సంబంధించిన మరిన్ని వార్తలకు ఈ కింది లింక్స్ క్లిక్ చేయండి....! కడప దాటి వస్తున్నా ప్రతి గడపలోకి వస్తున్నా యాత్ర ఫస్ట్ లుక్.. వైఎస్సార్‌గా మెగాస్టార్ సబితగా సుహాసిని వైఎస్ బయోపిక్ యాత్ర.. అధికారిక ప్రకటన -
మమ్ముట్టీకి సెట్స్ లో గ్రాండ్ వెల్కం
-
కడప దాటి వస్తున్నా
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కనున్న చిత్రం ‘యాత్ర’. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహీ వి. రాఘవ్ దర్శకత్వంలో 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఈరోజు ప్రారంభమవుతోంది. వైఎస్ పాత్రలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. ఈ సందర్భంగా విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి మాట్లాడుతూ– ‘‘భలేమంచి రోజు, ఆనందో బ్రహ్మ’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత మా బ్యానర్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘యాత్ర’. 2003లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు పేదల కష్టాల్ని స్వయంగా తెలుసుకోవటానికి ‘కడప దాటి వస్తున్నా.. మీ గడప కష్టాలు వినటానికి’ అనే నినాదంతో పాదయాత్ర ప్రారంభించి, 60 రోజుల్లో 1500 కిలోమీటర్లు నడిచారు. ఇప్పుడు ‘యాత్ర’ సినిమా కూడా నాన్‌స్టాప్ షెడ్యూల్లో చిత్రీకరిస్తున్నాం. ఈరోజు షూటింగ్ మొదలుపెట్టి సెప్టెంబర్‌కి పూర్తి చేస్తాం. టాలీవుడ్లో ఇదే లాంగెస్ట్ షెడ్యూల్‌గా చెప్పవచ్చు. వైఎస్‌గారి బయోపిక్ గురించి దర్శకుడు మహి చెప్పిన విధానం నచ్చి, చాలా గ్యాప్ తర్వాత మమ్ముట్టి తెలుగులో నటిస్తున్నారు. ముఖ్యంగా మడమతిప్పని పాత్ర కావటం వల్ల వైఎస్‌గారి బాడీలాంగ్వేజ్‌ని ఆయన బాగా అవగాహన పట్టి, పూర్తి డెడికేషన్‌తో ఈ పాత్ర చేస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కి అనూహ్యమైన స్పందన వచ్చింది. మా ప్రొడక్షన్ విలువలు రెట్టింపు చేసేలా, ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ‘యాత్ర’ నిర్మిస్తాం’’ అన్నారు. వైఎస్సార్ బయోపిక్ ‘యాత్ర’కు సంబంధించిన మరిన్ని వార్తలకు ఈ కింది లింక్స్ క్లిక్ చేయండి....! ప్రతి గడపలోకి వస్తున్నా యాత్ర ఫస్ట్ లుక్.. వైఎస్సార్‌గా మెగాస్టార్ సబితగా సుహాసిని వైఎస్ బయోపిక్ యాత్ర.. అధికారిక ప్రకటన -
సబితగా సుహాసిని
‘నా సోదరి’ అని మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆప్యాయంగా అనేవారు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అన్నకు ఎంతో ఇష్టంగా రాఖీ కట్టేవారు సబిత. వైఎస్ హయాంలో తొలి మహిళా హోంమంత్రిగా సబిత బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే మహానేత వైయస్సార్ జీవితం ఆధారంగా ‘యాత్ర’ పేరుతో ఓ సినిమా నిర్మాణంలో ఉన్న విషయం తెలిసిందే. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహీ వి. రాఘవ్ దర్శకత్వంలో ‘యాత్ర’ సినిమా తెరకెక్కుతోంది. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సబితా ఇంద్రారెడ్డి పాత్రను సుహాసిని చేయనున్నారు. త్వరలో లుక్ టెస్ట్ జరగనుంది. వైఎస్ పాత్రలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటిస్తున్నారు. వైఎస్ గెటప్‌లో ఉన్న మమ్ముట్టి ఫస్ట్ లుక్‌కి అనూహ్య స్పందన లభించింది. -
ప్రతి గడపలోకి వస్తున్నా
దివంగత మహానేత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా ‘యాత్ర’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వైఎస్ పాత్రలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటిస్తున్నారు. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహీ వి. రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ’ వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 9న ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా వైయస్సార్ గెటప్‌లో ఉన్న మమ్ముట్టి మొదటి లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఫస్ట్ లుక్‌లో మమ్ముట్టి అచ్చం వై.ఎస్. లాగా ఉన్నారు. ‘కడప దాటి ప్రతీ గడపలోకి వస్తున్నాను.. మీతో కలిసి నడవాలనుంది.. మీ గుండె చప్పుడు వినాలనుంది’ అని ఫస్ట్ లుక్‌పై ఉన్న మాటలు సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘60 రోజుల్లో 1500 కిలోమీటర్లు కాలి నడకతో ప్రతి గడపకు వెళ్లి పేదవాడి కష్టాన్ని, అక్కచెల్లెళ్ల బాధల్ని, రైతుల ఆవేదనని స్వయంగా తెలుసుకున్న మహానేత వైఎస్ గారు.ప్రజల కష్టాలను తీర్చి వారి హృదయాల్లో స్థానం సంపాదించిన ఏకైక నాయకుడు రాజశేఖర్ రెడ్డిగారు. ఉచిత కరెంటు, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ.. లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారాయన. అలాంటి మహానేత జీవిత చరిత్రను మేం తెరకెక్కిస్తుండటం, ఈ పాత్రలో జాతీయ అవార్డు గ్రహీత మమ్ముట్టిగారు నటిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. వైఎస్‌గారి రియల్ పాదయాత్ర 2003 ఏప్రిల్ 9న ప్రారంభమైంది. రీల్ పాదయాత్ర ఈ నెల 9న ప్రారంభం అవుతోంది. ఈ చిత్రంలో కొన్ని కీలక సన్నివేశాల్లో వై.ఎస్‌గారి తండ్రి రాజారెడ్డిగారి, తనయుడు జగన్ మోహన్‌రెడ్డిగారి పాత్రలు కనిపిస్తాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: శివ మేక. -
యాత్ర ఫస్ట్ లుక్.. వైఎస్సార్‌గా మెగాస్టార్
మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ యాత్ర చిత్రం ఫస్ట్ లుక్ వచ్చేసింది. మళయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మహి వీ రాఘవ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. నిన్న సాయంత్రం టైటిల్ లోగోను విడుదల చేసిన మేకర్లు.. నేడు ఫస్ట్ లుక్‌ను వదిలారు. పంచెకట్టులో రాజన్నను తలపిస్తూ.. అదే దరహాసం.. అదే తరహా అభివాదం చేస్తున్న మమ్ముట్టి పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ఈ నెల 9 నుంచి చిత్ర షూటింగ్ మొదలుకానుంది. మహా ప్రస్థానం పేరిట దివంగత నేత చేపట్టిన పాదయాత్ర నేపథ్యంలోనే యాత్ర చిత్రం ఉండబోతుందన్న సంకేతాలను దర్శకుడు ఇది వరకే ఇచ్చేశాడు. ఈ చిత్ర ప్రధాన తారాగణం.. మిగతా వివరాలను త్వరలో తెలియజేసే అవకాశం ఉంది. త్వరగతిన చిత్రాన్ని పూర్తి చేసి విడుదల చేయాలన్న ఆలోచనలో దర్శకుడు మహి ఉన్నట్లు తెలుస్తోంది. -
వైఎస్ బయోపిక్.. అఫీషియల్
దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్‌పై అఫీషియల్ ప్రకటన వెలువడింది. ‘యాత్ర’ పేరుతో తెరకెక్కించనున్న ఈ చిత్ర టైటిల్ లోగోను కాసేపటి క్రితం విడుదల చేశారు. మళయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించబోతున్న విషయాన్ని అధికారికంగా తెలియజేశారు. ఏప్రిల్ 9 నుంచి ఈ చిత్రం షూటింగ్ మొదలుకాబోతోంది. పాఠశాల, ఆనందో బ్రహ్మ చిత్రాల దర్శకుడు మహీ వి రాఘవ్ యాత్రను తెరకెక్కించబోతున్నారు. ఒక్క అడుగుతో చర్రిత సృష్టించే బదులు.. జనాల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి అన్న ఇంగ్లీష్ కాప్షన్‌ను.. ‘కడప దాటీ ప్రతీ గడపలోకి వస్తున్నాను. మీతో కలిసి నడవాలనుంది. మీ గుండెచప్పుడు వినాలనుంది’.. అన్న సందేశంతో థీమ్ లోగోను వదిలారు. దీంతో వైఎస్ఆర్ పాదయాత్రకు సంబంధించిన విషయాలను చిత్రంలో ప్రధానాంశంగా చూపించబోతున్నారని స్పష్టమౌతోంది. జనరంజక పాలన, సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన దివంగత నేత బయోపిక్‌పై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించనున్నారు. మిగతా తారాగణం వివరాలను త్వరలోనే తెలియజేసే అవకాశం ఉంది. మరోవైపు మమ్ముట్టి కూడా తన ఫేస్బుక్లో ఈ విషయాన్ని ధృవీకరించారు. సుమారు పాతికేళ్ల తర్వాత ఆయన తిరిగి తెలుగులో నటిస్తుండటం విశేషం. గతంలో రౌడీ కూలీ, సూర్య పుత్రులు, స్వాతి కిరణం చిత్రాల్లో నటించారు.