మహి. వి. రాఘవ్, ‘దిల్’ రాజు, విజయ్ చిల్లా
‘‘యాత్ర’ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వైఎస్ రాజశేఖర రెడ్డిగారి పాదయాత్ర ఎంత సెన్సేషన్ అయిందో ప్రేక్షకులందరికీ తెలుసు. పాదయాత్రలో ఉన్న ఎమోషన్స్, మూమెంట్స్‌ని తీసుకుని మహి రెడీ చేసిన కథతో విజయ్ ‘యాత్ర’ నిర్మించారు. మమ్ముట్టిలాంటి లెజెండ్ నటించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ చూసినప్పుడు, పాటలు విన్నప్పుడు సినిమా ఎప్పుడు చూస్తామా? అనే ఓ ఎగై్జట్‌మెంట్ కనిపించింది. మా విజయ్‌కి, మహికి ఆల్ ది బెస్ట్’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు.
మహి వి. రాఘవ్ దర్శకత్వంలో శివ మేక సమర్పణలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ‘యాత్ర’ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు ఓవర్‌సీస్‌లో ఈ సినిమా ఓపెనింగ్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఓపెనింగ్స్ స్ట్రాంగ్‌గా ఉంటేనే ఆ సినిమాకి రెవెన్యూ పరంగా మంచి మ్యాజిక్ జరుగుతుంది. ఫస్ట్ మంచి ఓపెనింగ్స్ రావాలి.. ఆ తర్వాత మంచి టాక్ రావాలి.
ఓ సినిమాకి ఓపెనింగ్స్ అన్నవి ఎప్పుడూ ముఖ్యమే.. కానీ ఇప్పుడు చాలా ముఖ్యం అయిపోయాయి. ఒకప్పుడు సినిమా ఫర్వాలేదు అంటే మెల్లిగా ఓపెనింగ్స్ పెరిగేవి. ఇప్పుడు అలా లేదు.. మంచి ఓపెనింగ్స్ వస్తేనే సినిమా. ‘యాత్ర’ అడ్వాన్స్ బుకింగ్‌లు చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాని నైజాం, వైజాగ్ ఏరియాల్లో మా సంస్థ విడుదల చేస్తోంది. వైఎస్‌గారి పాదయాత్ర మూమెంట్స్‌ని ఆ రోజుల్లో టీవీల్లో చూడటం, పేపర్లో చదవటమే. పాదయాత్రతో ఆయన హీరో అయిపోయారు. దాని తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. జనాలకోసం ఏదైనా చేస్తాను అని పాదయాత్ర ద్వారా చూపించారాయన.
ఎన్టీ రామారావుగారి తర్వాత మళ్లీ తెలుగు రాష్ట్రాల ప్రజల్లో వైఎస్‌గారికే అంత ఇమేజ్ వచ్చింది.అలాంటి ఆయన నేపథ్యంలో వస్తున్న ఈ ‘యాత్ర’ పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. విజయ్ చిల్లా మాట్లాడుతూ– ‘‘యాత్ర’ కోసం ఏడాదిన్నరగా పని చేస్తున్నాం. రేపు విడుదలవుతోందంటే చాలా ఎగై్జటింగ్‌గా, సంతోషంగా ఉంది. వైఎస్‌గారు రాజకీయ నేత కావొచ్చు.. సినిమాలో రాజకీయాలు ఉండొచ్చు.. కానీ ఇది పూర్తిగా పొలిటికల్ సినిమా కాదు. ఎటువంటి వివాదాలు లేవు. ఈ సినిమా మొత్తానికి సోల్ అండ్ స్పిరిట్ వైఎస్‌గారే. సినిమా చూడండి.. నచ్చితే ఇతరులకు చెప్పండి. ఇది కేవలం ఆయన అభిమానులకే కాదు.. సినిమాను ప్రేమించేవారెవరైనా చూసి ఎంజాయ్ చేయొచ్చు’’ అన్నారు.
‘యాత్ర’ సినిమాను ఉద్దేశిస్తూ దర్శకుడు మహి వి. రాఘవ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కథను చెప్పడం చాలా గౌరవంగా భావిస్తున్నా. ఆయన కుటుంబం, అభిమానుల నుంచి మాకు అమితమైన ఆదరణ లభించడం గొప్ప విషయం. చిత్రబృందం చాలా కష్టపడింది. దీన్ని మరో సినిమాతో పోల్చి.. ఓ రేస్‌లా చేయకండి. వైఎస్సార్ ప్రయాణంలా భావించి సెలబ్రేట్ చేసుకుందాం’.
‘ఎన్టీఆర్, వైఎస్సార్.. ఇద్దరూ ఈ నేలతల్లి బిడ్డలు, తెలుగు జాతి గర్వించదగ్గ నాయకులు. మన భిన్నాభిప్రాయాలు వారిని అగౌరవపర్చడానికి కారణాలు కాకూడదు. నాకు వైఎస్సార్, చిరంజీవిగార్లపై ఉన్న ఇష్టం, అభిమానం ఎప్పటికీ చెరిగిపోదు. మనకు స్ఫూర్తినిచ్చిన వారి సినిమాను సెలబ్రేట్ చేసుకుందాం. అదే మనం వారికిచ్చే గొప్ప నివాళి’.
‘మా ‘యాత్ర’ సినిమాను ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో తెలుసుకోవాలని చాలా ఆత్రుతగా ఉంది. నిజాయతీగా మీ స్పందన చెప్పండి. నేను వినయంగా వాటిని స్వీకరిస్తా. ఈసారి ఇంకా మంచి కథతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తా.. ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment