ప్రేక్షకులందరికీ యాత్ర నచ్చుతుంది | Producer Vijay Chilla Speech at Yatra Movie Pre Release Event | Sakshi
Sakshi News home page

ప్రేక్షకులందరికీ యాత్ర నచ్చుతుంది

Published Sat, Feb 2 2019 3:30 AM | Last Updated on Sat, Feb 2 2019 8:22 AM

Producer Vijay Chilla Speech at Yatra Movie Pre Release Event - Sakshi

‘‘మా కథని నమ్మి సినిమా చేసి, మమ్మల్ని ఎంతో సపోర్ట్‌ చేసిన మమ్ముట్టిగారికి థ్యాంక్స్‌. కె. చక్కటి పాటలిచ్చారు. తెలుగు ఇండస్ట్రీలో ఈ పేరు మళ్లీ మళ్లీ వినిపిస్తుంది. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు ఐదు వైవిధ్యమైన పాటలు అద్భుతంగా రాశారు. ‘యాత్ర’ సినిమా వైఎస్‌గారి అభిమానులకు ఎలాగూ నచ్చుతుంది. కానీ, ఈ సినిమా ఆయన అభిమానులకి మాత్రమే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులందరికీ నచ్చుతుంది’’ అని నిర్మాత విజయ్‌ చిల్లా అన్నారు. మహానేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి పాదయాత్ర ప్రధానాంశంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’.

మమ్ముట్టి లీడ్‌ రోల్‌లో నటించారు. మహి వి. రాఘవ్‌ దర్శకత్వం వహించారు. శివ మేక సమర్పణలో 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదలవుతోంది. శుక్రవారం హైదరా బాద్‌లో నిర్వహించిన ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌లో మహి వి.రాఘవ్‌ మాట్లాడుతూ– ‘‘యాత్ర’ షూటింగ్‌ మొత్తం పూర్తయ్యాక జగన్‌ అన్నకి ట్రైలర్‌ చూపిస్తే, బాగుందన్నారు. సినిమా కూడా పూర్తయింది చూస్తారా? అని అన్నను అడిగాం.

‘మీ నాయకుని కథ మీరు చెప్పారు.. నేను చూసి ఏం చెప్పేది’ అన్నారు. ఇక్కడే మనం ఒక మాట గమనించాలి. ఇది మా నాన్న కథ అనలేదు.. మీ నాయకుని కథ అన్నారు. ఒకర్ని గుడ్డిగా నమ్మడానికి, అలాంటి మాట చెప్పడానికి చాలా గుండె ధైర్యం కావాలి. అది జగన్‌ అన్నకు ఉంది. ఈ ఫంక్షన్‌కి ముఖ్య అతిథిగా, అతిథులుగా ఎవర్ని పిలుద్దామన్నప్పుడు వైఎస్‌గారి అభిమానులను పిలుద్దామని చెప్పా. ఇది మన నాయకుడి కథ’’ అన్నారు.

‘‘యాత్ర’ సినిమా వైఎస్‌గారి ఫ్యాన్స్‌కే కాదు.. ఆయన ఫ్యాన్స్‌ కానివారికి కూడా నచ్చుతుంది. అందరికీ నచ్చే స్ఫూర్తిదాయకమైన సినిమా ఇది. ‘యాత్ర’ అన్ని పొలిటికల్‌ పార్టీలు చూసే చిత్రం. వారందరికీ మంచి స్ఫూర్తిగా ఉంటుందనే నమ్మకం నాకుంది’’ అని హీరో సుధీర్‌బాబు అన్నారు. నిర్మాతలు పీవీపీ, దామోదర ప్రసాద్, రవిశంకర్, నటుడు విజయ్‌చందర్, డైరెక్టర్‌ శ్రీరామ్‌ ఆదిత్య, సంగీత దర్శకుడు కృష్ణకుమార్‌ (కె.), చిత్ర కెమెరామెన్‌ సత్యన్‌ సూర్యన్, తుని ఎమ్మెల్యే తాడిశెట్టి రాజ, కెమెరామెన్‌ శ్యామ్‌ దత్, నటి ఆశ్రిత, ‘బిగ్‌ సీ’ డైరెక్టర్‌ గౌతమ్, పాటల రచయిత, గాయకుడు పెంచల్‌దాస్, ఆర్ట్‌ డైరెక్టర్స్‌ రామకృష్ణ, మోనిక పాల్గొన్నారు.


వైఎస్‌ రాజశేఖర రెడ్డిగారి అభిమానులే సెలబ్రిటీలుగా హాజరై ‘యాత్ర’ సినిమాలోని ఒక్కో పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు వైఎస్‌ ప్రవేశపెట్టిన పథకాల ద్వారా ఏ విధంగా లబ్ధి పొందారో తమ మాటల్లో పంచుకున్నారు.

► ‘వైఎస్‌గారు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశ పెట్టిన ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌లో మేము చదువుకున్నాం. నిరుపేదలమైన మేము ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ద్వారా కార్పొరేట్‌ కళాశాలలో ఇంటర్‌ చదివాం’ అని తూర్పుగోదావరి జిల్లా తాల్రేవు మండలం పి.మల్లవరం గ్రామానికి చెందిన స్వర్ణలత, సువర్ణ కుమారి అన్నారు.

► ‘వైఎస్‌గారు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలు నా కుటుంబానికి వర్తించాయని గర్వంగా చెబుతున్నా’ అని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం చిట్టవరం గ్రామానికి చెందిన నక్కా లక్ష్మీనారాయణ అన్నారు.

► ‘వైఎస్‌గారి పాదయాత్రలో నేను కూడా పాల్గొన్నా. నాకు వికలాంగుల పెన్షన్‌తో పాటు ఇల్లు మంజూరు చేశారాయన. రాజన్న చేసిన సేవలు ప్రజలు ఎప్పటికీ మరచిపోలేం. రాజన్న కుమారుడు జగన్‌ అన్న  ముఖ్యమంత్రి కావాలి’’ అని ఆనపాటి వెంకటయ్య చెప్పారు.

► ‘చాలా దూరం నుంచి ఒక్కదానివే ఎలా వచ్చావని ఎంతో మంది నన్ను అడిగారు. వైఎస్‌గారు ఇచ్చిన ధైర్యం చాలదా మనకి ఒంటరిగా రావడానికి? ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో చదువుకుని సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయ్యా’ అని తూర్పు గోదావరి జిల్లా కడియం గ్రామానికి చెందిన వి.నిఖిల సంతోషం పంచుకున్నారు.

► ‘మా అమ్మకి గుండెకి రంధ్రం ఉండేది. అమ్మ ఆపరేషన్‌ కోసమని చదువు మానేశా. పనిలో చేరా. ఆపరేషన్‌ చేయించే స్థోమత లేదు. మా అమ్మ గోడు ఏ దేవుడూ వినలేదు. వైఎస్‌ అనే దేవుడు విన్నారు. ఆయన ప్రవేశపెట్టిన ‘ఆరోగ్యశ్రీ’ పథకంతో మా అమ్మకి హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో రూపాయి ఖర్చు లేకుండా గుండె ఆపరేషన్‌ చేయించా’ అని నిజామాబాద్‌ జిల్లా దేవపల్లికి చెందిన కె. రవికుమార్‌ చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement