970 స్క్రీన్స్‌లో వెండితెర యాత్ర | ysr biopic movie yatra releasing in 970 screens | Sakshi
Sakshi News home page

970 స్క్రీన్స్‌లో వెండితెర యాత్ర

Published Fri, Feb 8 2019 5:05 AM | Last Updated on Fri, Feb 8 2019 11:51 AM

ysr biopic movie yatra releasing in 970 screens - Sakshi

మహానేత వైఎస్‌. రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. వైఎస్‌ పాత్రలో మలయాళ స్టార్‌ హీరో మమ్ముట్టి నటించారు. మహి వి. రాఘవ్‌  దర్శకత్వంలో శివ మేక సమర్పణలో విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘యాత్ర’ విశేషాలు.

► ‘భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ’ వంటి హిట్‌ చిత్రాల తర్వాత 70 ఎంఎం బ్యానర్‌లో 3వ చిత్రంగా రూపొందిన చిత్రం ‘యాత్ర’. ‘‘ఈ టైటిల్‌ ప్రకటించినప్పటి నుంచి వైఎస్‌గారి అభిమానుల్లోనే కాదు.. సాధారణ ప్రజల్లో కూడా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇందుకు కారణం.. ఓ మహానేత చరిత్ర తెరకెక్కించటం. వైఎస్‌గారిని ఎలా చూపించనున్నారు? సినిమా పాజిటివ్‌గా ఉంటుందా? లేక నెగటివ్‌గా ఉంటుందా? అనే సందేహాలు ఒకవైపు. అసలు ‘యాత్ర’ ఇప్పడు తీయాల్సిన అవసరం ఏంటి? ఎన్నికల స్టంటా? వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిగారికి సపోర్ట్‌గా తీస్తున్నారా? వంటి ప్రశ్నలు మరోవైపు. వీటన్నింటికీ ఈ రోజు ‘యాత్ర’ సినిమా సమాధానం చెబుతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది.

► 970 స్క్రీన్స్‌లో భారీ ఎత్తున ‘యాత్ర’ విడుదలయింది. సాధారణంగా ఒక సినిమా హీరో  బయోపిక్‌ లేదా బిగ్‌ కాస్టింగ్‌తో తీసిన సినిమాలు ఇంతటి భారీ స్థాయిలో రిలీజ్‌ కావటం చూశాం. కానీ,  తొలిసారిగా ఓ రాజకీయ నాయకుడి బయోపిక్‌ తీస్తే ఒక్క ఓవర్‌సీస్‌లోనే 180 స్క్రీన్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ  రాష్ట్రాల్లో 500 స్క్రీన్స్‌.. ఇలా ప్రపంచ వ్యాప్తంగా 970 స్క్రీన్స్‌లో ఈ చిత్రం విడుదలవటం చూస్తే ‘యాత్ర’పై తెలుగు ప్రజల క్రేజ్‌ ఏంటో తెలుస్తోందని, అటు అమెరికా నుంచి అనకాపల్లి వరకూ ఈ సినిమాకి అనూహ్యమైన స్పందన లభిస్తోందని నిర్మాతల్లో ఒకరైన విజయ్‌ చిల్లా చెప్పారు.  

► ‘నాయకుడిగా మనకు ఏం కావాలో తెలుసుకున్నాం కానీ... జనానికి ఏం కావాలో తెలుసుకోలేకపోయాం’ అంటూ అధిష్టానాన్ని సైతం లెక్కచేయక పేద ప్రజల కష్టాల్ని వినటానికి కడప గడప దాటి పాదయాత్ర చేసిన వైఎస్‌గారు జననేతగా, మహానేతగా, పేద ప్రజల గుండె చప్పుడుగా పదిలమైన చోటు సంపాదించుకున్నారు. వైఎస్‌గారి పాదయాత్ర 68 రోజులు జరిగింది. యాదృచ్ఛికంగా ‘యాత్ర’ షూటింగ్‌ కూడా 68 రోజుల్లో పూర్తికావటం ఆ పెద్దాయన ఆశీస్సులుగా టీమ్‌ భావిస్తున్నారు.

► వైఎస్‌గారి రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలక ఘట్టం. ఆ సమయంలో జరిగిన ముఖ్య సంఘటనల సమాహారమే ఈ ‘యాత్ర’. పాదయాత్రలో రైతుల కష్టాలు, పేదవాళ్ల ఆవేదనలు, ప్రతి ఒక్కరి భావోద్వేగాలని రాజన్న మనసుతో వినటమే ఈ చిత్రంలో కీలక భాగం. రాజకీయాలు లేని రాజకీయ నాయకుడి కథే ఈ సినిమా. ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చూసి భావోద్వేగానికి లోనవుతారు. ఎందుకంటే కష్టం ఎవరికైనా కష్టమే. అందుకే ఈ యూనివర్సల్‌ సబ్జెక్ట్‌ని తెలుగుతోపాటు భారతదేశం మొత్తం విడుదల చేశాం.  ఎమోషనల్‌ కంటెంట్‌తో ఉన్న ఈ చిత్రాన్ని చూసిన  ప్రేక్షకుడు బరువైన గుండెతో థియేటర్స్‌ నుంచి బయటకి వస్తారు.

► మహి చెప్పిన ‘యాత్ర’ కథలోని పాత్రలు, వాటి కష్టాలు మమ్ముట్టిగారిని కలచి వేశాయి. ఆ తర్వాత ఆయన వైఎస్‌గారి గురించి పూర్తిగా తెలుసుకుని పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. ‘ఇది రాజకీయ నాయకుడి కథ మాత్రమే కానీ, రాజకీయాలు ఉండవు.. ప్రజల కష్టాలు, రైతుల బాధలు ఉంటాయి.. ఇవన్నీ భారతదేశం అంతటా ఉంటాయి. ఏ రైతుని అడిగినా, ఏ పేదవాడిని అడిగినా వారి కష్టాలు చెప్తారు’ అని మమ్ముట్టి చెప్పారు. ‘యాత్ర’లో ఆద్యంతం ఎమోషన్‌తో కూడిన పాత్రలు, పాత్ర చిత్రణ కనిపిస్తాయి. తెలుగు ప్రజలందరూ తప్పకుండా చూడాల్సిన చిత్రంగా ఫ్యామిలీ ఎమోషన్స్‌ని దర్శకుడు చూపించారు. సినిమాని ప్రేమించే ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రమిదని నిర్మాతలు అన్నారు.

► ‘‘యాత్ర’ సినిమా చేయాలనుకున్నప్పటి నుంచి విడుదల వరకూ వైఎస్‌ జగన్‌గారు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ ఎక్కడా అభ్యంతరాలు పెట్టలేదు సరికదా కనీసం కథ వివరాలు కూడా అడగలేదు. దర్శకుడికి, ప్రొడక్షన్‌కి ఫ్రీ హ్యాండ్‌ ఇవ్వటం జగన్‌గారి గొప్పతనానికి నిదర్శనం. ఇటీవల జగన్‌గారిని మహి కలిసినప్పుడు.. ‘మీ నాయకుడి చిత్రం మీరు తీస్తున్నారు.. ఆయన గురించి మీకే బాగా తెలుసు.. నాన్నగారు  చేసిన పనులు చెప్పండి చాలు’ అని జగన్‌గారు సున్నితంగా చెప్పటం మా యూనిట్‌కి నూతనోత్సాహం కలిగించింది. ఇందుకు జగన్‌గారికి, వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు’’ అని విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement