వైఎస్‌ బయోపిక్‌.. అఫీషియల్‌ | YSR Biopic Yatra Theme Logo Revealed | Sakshi
Sakshi News home page

వైఎస్‌ బయోపిక్‌ యాత్ర.. అధికారిక ప్రకటన

Published Fri, Apr 6 2018 6:41 PM | Last Updated on Mon, Aug 27 2018 9:16 PM

YSR Biopic Yatra Theme Logo Revealed - Sakshi

దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి బయోపిక్‌పై అఫీషియల్‌ ప్రకటన వెలువడింది. ‘యాత్ర’ పేరుతో తెరకెక్కించనున్న ఈ చిత్ర టైటిల్‌ లోగోను కాసేపటి క్రితం విడుదల చేశారు. మళయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి హీరోగా నటించబోతున్న విషయాన్ని అధికారికంగా తెలియజేశారు. ఏప్రిల్‌ 9 నుంచి ఈ చిత్రం షూటింగ్‌ మొదలుకాబోతోంది.

పాఠశాల, ఆనందో బ్రహ్మ  చిత్రాల దర్శకుడు మహీ వి రాఘవ్‌ యాత్రను తెరకెక్కించబోతున్నారు. ఒక్క అడుగుతో చర్రిత సృష్టించే బదులు.. జనాల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి అన్న ఇంగ్లీష్‌ కాప్షన్‌ను.. ‘కడప దాటీ ప్రతీ గడపలోకి వస్తున్నాను. మీతో కలిసి నడవాలనుంది. మీ గుండెచప్పుడు వినాలనుంది’.. అన్న సందేశంతో థీమ్‌ లోగోను వదిలారు. దీంతో వైఎస్‌ఆర్‌ పాదయాత్రకు సంబంధించిన విషయాలను చిత్రంలో ప్రధానాంశంగా చూపించబోతున్నారని స్పష్టమౌతోంది. జనరంజక పాలన, సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన దివంగత నేత బయోపిక్‌పై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించనున్నారు. మిగతా తారాగణం వివరాలను త్వరలోనే తెలియజేసే అవకాశం ఉంది.

మరోవైపు మమ్ముట్టి కూడా తన ఫేస్‌బుక్‌లో ఈ విషయాన్ని ధృవీకరించారు. సుమారు పాతికేళ్ల తర్వాత ఆయన తిరిగి తెలుగులో నటిస్తుండటం విశేషం.  గతంలో రౌడీ కూలీ, సూర్య పుత్రులు, స్వాతి కిరణం చిత్రాల్లో నటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement