
మమ్ముట్టి
‘నీళ్లుంటే కరెంటు ఉండదు.. కరెంటు ఉంటే నీళ్లు ఉండవు.. రెండూ ఉండి పంట చేతికొస్తే సరైన ధర ఉండదు. అందరూ రైతే రాజు అంటారు.. సరైన కూడు, గూడు, గుడ్డ, నీడ లేని ఈ రాచరికం మాకొద్దయ్యా.. మమ్మల్ని రాజులుగా కాదు.. కనీసం రైతులుగా బతకనివ్వండి చాలు.. అని ప్రతి రైతు గొంతెత్తి అరుస్తున్న సమయం అది.. ఎవరైనా ఆదుకుంటారా అని రైతన్న ఎదురుచూసిన సమయంలో ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ విడుదలైన ‘యాత్ర’ టీజర్ రైతుల కష్టాలను కళ్లకు కట్టింది.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ‘యాత్ర’. వైఎస్ పాత్రలో మమ్ముట్టి నటించారు. మహి వి. రాఘవ్ దర్శకత్వం వహించారు. శివ మేక సమర్పణలో 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 8న మూడు భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి మాట్లాడుతూ– ‘‘మడమ తిప్పని నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారి జీవితంలో అతి కీలకమైన పాదయాత్ర ఘట్టాన్ని ప్రధానాంశంగా తీసుకుని ‘యాత్ర’ చిత్రాన్ని నిర్మించాం.
మా బ్యానర్ నుంచి ‘భలేమంచి రోజు, ఆనందోబ్రహ్మ’ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ‘యాత్ర’ హ్యాట్రిక్ సినిమాగా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నాం. తెలుగు ప్రజలందరూ తప్పకుండా చూడాల్సిన చిత్రమిది. సెన్సార్ నుంచి క్లీన్ యు సర్టిఫికెట్ లభించింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఫిబ్రవరి 8న సినిమా విడుదల చేస్తున్నాం’’ అన్నారు. రావు రమేష్, జగపతిబాబు, సుహాసిని, అనసూయ, పోసాని కృష్ణమురళి, సచిన్ కడ్కర్, వినోద్ కుమార్, జీవా, 30 ఇయర్స్ పృథ్వి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సత్యన్ సూర్యన్, సంగీతం:కె (కృష్ణ కుమార్).
Comments
Please login to add a commentAdd a comment