మమ్ముట్టి
తెలుగు ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న మహానేత వైయస్సార్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తన మేనియాతో తిరగరాసిన వ్యక్తి ఆయన. ప్రస్తుతం వైయస్సార్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యాత్ర’. ఆయన జీవితంలోని కీలక ఘట్టమైన పాదయాత్ర అప్పుడు జరిగిన ముఖ్య సంఘటనల సమాహారమే ‘యాత్ర’. వై.యస్. రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, టీజర్, మొదటి సాంగ్‌తో ఈ చిత్రంలోని హై ఇంటెన్సిటీ చూపించారు.
‘ఆనందో బ్రహ్మ’ చిత్రంతో చక్కని విజయాన్ని సొంతం చేసుకున్న మహి.వి.రాఘవ్ దర్శకత్వంలో ‘భలే మంచి రోజు’, ‘ఆనందో బ్రహ్మ’ వంటి హిట్ చిత్రాలను నిర్మించిన 70 యమ్.యమ్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శివ మేక సమర్పిస్తున్నారు. చిత్రనిర్మాతలు విజయ్, శశి మాట్లాడుతూ– ‘‘ఆ మహా నేత పాదయాత్ర చేశారని తెలుగు వారందరికి తెలుసు కానీ, ఆ పాద యాత్ర ఆయన రాజకీయ జీవితంలో ఎంత కీలకమో కొద్దిమందికి మాత్రమే తెలుసు.
పాదయాత్ర ద్వారా ప్రజల దగ్గరకెళ్లి వాళ్ల సమస్యలు తెలుసుకోవడానికి నడుం కట్టారు వైయస్‌ఆర్. పేదవారు దేనికోసం ఎదురు చూస్తున్నారో తెలుసుకున్నాక ఆయన మనసు చలించి పోయింది. ఈ యాత్ర ప్రారంభం నుండి ముగింపు వరకు ఉన్న ఘట్టాన్ని తీసుకుని సినిమా చేశాం. ఆద్యంతం భావోద్వేగ సంఘటనలతో వైయస్సార్ మడమ తిప్పని నైజంతో పాటు, నిరుపేదలంటే ఆయనకు ఎంత ప్రాణమో ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాం.
ఆయన చేసిన పోరాట పటిమ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుంది. మమ్ముట్టి గారు వైయస్సార్‌గారి పాత్రలో పరకాయ ప్రవేశం చేశారా అన్నట్లు నటిస్తున్నారు. టీజర్‌కు, ఫస్ట్ సింగిల్‌కు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల నుండి అనూహ్యమైన స్పందన లభించింది. మా బ్యానర్‌లో ‘యాత్ర’ చిత్రం హ్యాట్రిక్‌గా నిలుస్తుందనే నమ్మకం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా ఫిబ్రవరి 8న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ‘యాత్ర’ చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment