రవికుమార్
‘‘మా ఇంటి గడప దగ్గర చెప్పులు వదిలేసి లోపలికి వెళ్తే వైఎస్సార్‌గారివి మూడు ఫోటోలు ఉంటాయి. పదేళ్ల క్రితం ఆగిపోవాల్సిన మా అమ్మ గుండె ఇప్పటికీ వినబడుతుందంటే దానికి కారణం వైయస్సార్‌గారు’’ అంటూ ఎమోషనల్ అయ్యారు రవికుమార్. శుక్రవారం ‘యాత్ర’ ప్రీ–రిలీజ్ వేడుకలో మహానేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాల ద్వారా లబ్ధి పొందిన పలువురు మాట్లాడారు. వారిలో ‘యాత్ర’కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన రవికుమార్ తన మనోభావాలను పంచుకున్నారిలా.
2008లో నేను డిగ్రీ చదువుతున్నాను. మా అమ్మకు ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్‌కి తీసుకెళితే హార్ట్‌లో హోల్ ఉందని, ఆరు నెలల కంటే బతకదని చెప్పారు. మా అమ్మ దండం పెట్టి ‘అరే, నాకు బతకాలని ఉందిరా. ఏమైనా చేసి ఓ మూడు లక్షలు అప్పు చేసి నాకు ఆపరేషన్ చేయించు’ అన్న మాటలు నాకింకా గుర్తు. అమ్మ కంటే ఏదీ ఎక్కువ కాదనిపించి చదువు మానేసి హైదరాబాద్ వచ్చాను. ఓ హోటల్‌లో ఎంగిలి ప్లేట్లు, గ్లాసులు కడుగుతూ పనిచేశాను.
నాలుగు నెలలు కష్టపడి పనిచేస్తే నేను సంపాదించింది 20 వేలు. అవి మా అమ్మ మందులకు, బస్సు చార్జీలకు కరిగిపోయాయి. మా అమ్మకు రోజులు దగ్గర పడ్డాయని తెలిసి నన్ను పిలిచి చెల్లిని బాగా చూసుకోమని చెప్పింది. చర్చి, గుడి, మసీదు ఏ దేవుడినీ వదలకుండా దండం పెట్టుకునేది. ఏ దేవుడూ ఆమె ఏడుపు వినలేదు. కానీ, వైఎస్సార్ అనే దేవుడు ‘నేను విన్నాను, నేను ఉన్నాను’ అని ఆరోగ్యశ్రీ పథకం పెట్టారు. కామినేని హాస్పిటల్‌లో రూపాయి ఖర్చు లేకుండా అమ్మకు వైద్యం చేశారు.
వైద్యం కోసం ఎవరినైనా అప్పు అడిగితే షూరిటీగా ఏం పెడతారు? అని అడిగేవారు. మాకు ఉన్నదల్లా రెండు గదుల ఇందిరమ్మ ఇల్లు మాత్రమే. అది కూడా ఆ దేవుడి (వైఎస్సార్) దయే. ఈ ఫంక్షన్‌కు మా అమ్మను తీసుకొచ్చేవాణ్ని. కానీ తీసుకురాలేదు. కారణం మా అమ్మకి నేను ఇప్పటికీ ఏం పని చేస్తున్నానో తెలియదు. నేను సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నానని మా అమ్మకి చెప్పాలంటే భయం వేసి చెప్పలేదు. ఎందుకంటే సినిమాలంటే ఒప్పుకోరని.
కానీ అమ్మా... ఇప్పుడు చెబుతున్నాను, ఫిబ్రవరి 8న విడుదలయ్యే ‘యాత్ర’ సినిమాను మా అమ్మ, చెల్లెలితో మా ఊరు డిచ్‌పల్లిలో చూస్తాను. నేనీ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి వైఎస్సార్‌గారి రుణం కొంచెమన్నా తీర్చుకున్నాను అనుకుంటున్నాను. నాకీ చాన్స్ ఇచ్చిన దర్శకుడు మహి.వి.రాఘవ్ గారికి నిర్మాతలు విజయ్ చిల్లా గారికి, శశి దేవిరెడ్డి, శివ గార్లకు జీవితాంతం రుణపడి ఉంటాను’’ అని రవికుమార్ ఎమోషనల్ కావడం వీక్షకులను కదిలించింది.
ఈ సందర్భంగా ‘సాక్షి’ మాట్లాడినప్పుడు రవికుమార్ మరిన్ని విశేషాలు పంచుకున్నారు.
► ‘యాత్ర’ మీ మొదటి సినిమానా?
దర్శకుడు మహీ వి. రాఘవ్‌గారు తీసిన ‘పాఠశాల’ నా మొదటి సినిమా. ఆ సినిమాకు ఆఫీస్‌బాయ్‌గా పనిచేశాను. నేను కాఫీ షాప్‌లో చేసే రోజుల్లో మహీ అక్కడికి వస్తుండేవారు. అలా ఆయన సినిమాలతో అసోసియేట్ అయ్యే అవకాశం ఏర్పడింది. మహీగారు చేసిన ‘ఆనందోబ్రహ్మ’కు రైటర్‌గా, ‘యాత్ర’కు రచనా సహకారం అందించాను.
► వైయస్సార్‌గారికి మొదటినుంచే అభిమానిగా ఉండేవారా?
మొదట్లో రాజశేఖర్ రెడ్డిగారంటే రాజకీయనాయకులు, మన ముఖ్యమంత్రి అని తెలుసు. కానీ మా అమ్మకు తిరిగి ప్రాణం పోశాక ఆయన మీద అభిమానం పెరిగిపోయింది.
► మొన్న జరిగిన వేడుకలో మాట్లాడాలని ముందే అనుకున్నారా?
లేదు. పది నిమిషాల ముందు చెప్పారు. టైముంది. నువ్వు కూడా లబ్ధి పొందావు కదా. నీకు అనిపించింది మాట్లాడితే మాట్లాడు అన్నారు. సడెన్‌గా దర్శకులు స్టేజ్ మీద మాట్లాడమంటే ఎమోషనల్ అయిపోయాను.
► ఇలా వైయస్‌గారి బయోపిక్ ఐడియా ఉందని మహీ మీతో చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటి?
మహీసార్, నేను, రాజశేఖర్ అని ఓౖ రెటర్. మేం ముగ్గురం ట్రావెల్ అవుతుంటాం. ఫస్ట్ మాతోనే చెప్పారు. చాలా ఎగై్జట్ అయ్యాను. రైతు ఆత్మహత్య చేసుకునే సీన్ ఒకటి, నారాయణరెడ్డిగారు ఎప్పుడొచ్చినా వైయస్‌గారు ఆయనకు సీట్ ఇచ్చి కూర్చోమనేవారట. అలాగే హై కమాండ్ ఏదో విషయం మాట్లాడటానికి వైయస్‌గారిని ఒక్కరే రావాలని చెప్పారట. నాతో కేవీపి కూడా వస్తారని సమాధానం పంపారట. దానికి వాళ్లు ‘సీటు కావాలంటే ఒక్కరే రావాలి’ అని చెప్పారట. ‘పదవులు చాలా చూస్తాం. నాతో ఉండే మనుషులే ఎక్కువ’ అనుకునేవారట. ఇలా కొన్ని సీన్స్ చెప్పడంతో మేం ముందుకు వెళ్లాం.
► మీ అమ్మగారు ఇప్పుడు ఎలా ఉన్నారు?
బాగున్నారు. చలికాలం అప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మొన్న ఫంక్షన్‌లో నేను మాట్లాడినది విని, ఫోన్ చేసి ఏడ్చారు. ‘యాత్ర’ సినిమాకి పని చేశానన్న ఆనందం అది.
Comments
Please login to add a commentAdd a comment