
మమ్ముట్టి
దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్‌లు రూపొందుతోన్న సంగతి తెలిసిందే. జనరంజకమైన పాలనతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితంపై ‘యాత్ర’ సినిమా తెరకెక్కింది. వైఎస్ పాత్రలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి నటించారు. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహీ వి. రాఘవ్ దర్శకత్వంలో 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించారు. ఈ సినిమాని డిసెంబర్ 21న విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి.
అయితే.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ‘యాత్ర’ డిసెంబర్ 21న విడుదల కావడం లేదట. బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ‘యన్.టి.ఆర్: కథానాయకుడు, యన్.టి.ఆర్: మహానాయకుడు’ పేరుతో రెండు భాగాలుగా వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయనున్నారు. ‘యన్.టి.ఆర్: మహానాయకుడు’ విడుదల అయ్యే రోజున వైఎస్ బయోపిక్ ‘యాత్ర’ సినిమాని ఆ చిత్రబృందం రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. జగపతిబాబు, సుహాసిని, రావు రమేశ్ ముఖ్య పాత్రల్లో నటించిన ‘యాత్ర’ చిత్రానికి కెమెరా: సత్యన్ సూర్యన్.
Comments
Please login to add a commentAdd a comment