
జీఎస్‌టీకి లోక్‌సభ ఆమోదం
- బిల్లుకు రేపు రాజ్యసభలో పరీక్ష
- బిల్లును స్థాయీ సంఘానికి పంపాలన్న డిమాండ్‌కు సర్కారు తిరస్కరణ
న్యూఢిల్లీ: సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వస్తువులు, సేవల పన్ను బిల్లు (జీఎస్‌టీ) బుధవారం లోక్‌సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లును పార్లమెంటు స్థాయీ సంఘానికి పంపించాలని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ చేసిన డిమాండ్‌ను ప్రభుత్వం తిరస్కరించింది. దీనికి నిరసనగా కాంగ్రెస్ వాకౌట్ చేసింది. ఆ తర్వాత నిర్వహించిన ఓటింగ్‌లో టీఎంసీ, బీజేడీ తదితర పార్టీల మద్దతుతో బిల్లు ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 352 ఓట్లు పోలవగా.. వ్యతిరేకంగా 37 ఓట్లు పోలయ్యాయి. జీఎస్‌టీ అమలు వల్ల ఆదాయం నష్టపోయే రాష్ట్రాలకు కేంద్రం తొలి ఐదేళ్ల పాటు పరిహారం చెల్లిస్తుందని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఏకరూప పరోక్ష పన్ను రేటు.. నిపుణుల కమిటీ సిఫారసు చేసిన పన్ను రేటు 27 శాతం కంటే ఇంకా తక్కువగా ఉంటుందని హామీ ఇచ్చింది. ఓటింగ్ సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభలో లేరు.
జీఎస్‌టీని అమలులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన ఈ రాజ్యాంగ సవరణ బిల్లు.. నిబంధనల మేరకు లోక్‌సభలో మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదం పొందినా.. రాజ్యసభలో ఏం జరుగుతుందనేది ప్రశ్నార్థకంగా ఉంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కారుకు రాజ్యసభలో సాధారణ మెజారిటీ కూడా లేదు. ఈ పరిస్థితుల్లో పెద్దల సభ పరీక్షలో బిల్లు పాసవుతుందా? లేదా? అన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. లోక్‌సభలో కాంగ్రెస్ వాకౌట్ చేయటానికి ముందు.. జీఎస్‌టీ బిల్లుపై చర్చకు ఆర్థికమంత్రి సమాధానం ఇచ్చారు. పరోక్ష పన్నులను సంస్కరించాలన్న ప్రతిపాదన గత 12 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉండిపోయిందని.. తనకన్నా ముందు ఆర్థికమంత్రిగా పనిచేసిన పి.చిదంబరం కూడా యూపీఏ హయాంలో జీఎస్‌టీని ముందుకు తెచ్చారని పేర్కొన్నారు.
ఎర్ర మీట నొక్కేశారు!
జీఎస్‌టీ బిల్లుపై లోక్‌సభలో ఓటింగ్ సందర్భంగా కేంద్రం ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంది. బిల్లులోని రెండవ క్లాజుపై స్పీకర్ సుమిత్రా మహాజన్ ఓటింగ్ కోరగా.. అధికార బీజేపీ సభ్యులు 12 మంది.. ఎర్ర మీట నొక్కి వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో అరుణ్‌జైట్లీ అసంతృప్తికి లోనయ్యారు. వెంటనే మరో మంత్రి రూడీ.. వ్యతిరేకంగా ఓటేసిన సభ్యుల వద్దకు వెళ్లి మాట్లాడారు. మళ్లీ ఓటింగ్ నిర్వహించగా వారంతా సరైన మీటలు నొక్కారు.