mps suspension
-
ఎంపీల సస్పెన్షన్ జరగదని ఆశిస్తున్నా: స్పీకర్‌తో అఖిలేష్
న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్‌గా మరోసారి ఓం బిర్లా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ఎంపీ కే సురేష్‌పై ఓం బిర్లా అత్యధిక ఓటింగ్ సాధింగా వరుసగా రెండోసారి స్పీకర్ పదవి దక్కించుకున్నారు. అనంతరం స్పీకర్ అధ్యక్షతన సమావేశాలు కొనసాగాయి. ఈ సందర్భంగా లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అభినందనలు తెలిపారు. అదేవిధంగా గత సమావేశాల్లో జరిగిన విషయాలను ప్రస్తావిస్తూ స్పీకర్‌కు చురకలంటించారు.గతంలో ఎంపీల సస్పెన్షన్ వంటి చర్యలు సభ గౌరవాన్ని దెబ్బతీశాయని అన్నారు. ఎంపీల సస్పెన్షన్, బహిష్కరణ వంటి చర్యలు కొత్త లోక్‌సభలో జరగవని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. 'ప్రజాప్రతినిధి గొంతు అణచివేయడం, బహిష్కరణ వంటి చర్యలు మళ్లీ జరగవని మేము ఆశిస్తున్నాము. మీ నియంత్రణ కేవలం ప్రతిపక్షంపైనే ఉంది, కానీ అది కూడా అధికార వర్గం వైపు కూడా ఉండాలి' అని అన్నారు.కాగా గత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రికార్డు స్థాయిలో వందకుపైగా ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. టీఎంసీ మహువా మొయిత్రా కూడా నైతిక దుష్ప్రవర్తన కారణంగా బహిష్కరణకు గురరయ్యారు.స్పీకర్ ప్రతిపక్షాల పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. నిష్పాక్షకతంగా ఉండటం అనేది ఈ పదవికి గొప్ప బాధ్యత అని పేర్కొన్నారు.సభ మీ సంకేతాలపై పనిచేయాలని కానీ ఇతర మార్గాల్లో కాదని అన్నారు. స్పీకర్ తీసుకునే న్యాయమైన నిర్ణయాలకు తాము కట్టుబడి నిలబడతామని అన్నారు. ప్రజాస్వామ్య న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా స్పీకర్ ఇక్కడ కూర్చున్నారని, పాలక వ్యవస్థను గౌరవించినట్లే ప్రతిపక్షాలను కూడా గౌరవిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. -
Parliament Winter Session 2023: సస్పెన్షన్ల పర్వం...78 మందిపై వేటు
పార్లమెంట్లో సోమవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంటు భద్రతా వైఫల్యంపై నినాదాలు, నిరసనలతో హోరెత్తించిన క్రమంలో ఏకంగా 78 మంది విపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది! వీరిలో 33 మంది లోక్‌సభ సభ్యులు కాగా 45 మంది రాజ్యసభ సభ్యులున్నారు. ఒకే రోజు ఇంతమందిని బహిష్కరించడం పార్లమెంటు చరిత్రలోనే ఇదే తొలిసారి. గత వారమే 13 మంది లోక్‌సభ, ఒక రాజ్యసభ సభ్యునిపై సస్పెన్షన్ వేటు పడటం తెలిసిందే. దీంతో ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సస్పెండైన విపక్ష సభ్యుల సంఖ్య 92కు చేరింది. భద్రతా వైఫల్యంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వివరణ, రాజీనామాకు డిమాండ్ చేయడమే వీరి సస్పెన్షన్‌కు కారణం. సస్పెన్షన్లపై సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలకమైన బిల్లులపై పార్లమెంట్లో చర్చ జరగకుండా మోదీ సర్కారు కుట్ర పన్నిందని, అందుకే తమను సస్పెండ్ చేసిందని మండిపడ్డారు. న్యూఢిల్లీ: పార్లమెంట్లో సోమవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఉభయ సభల్లో ఏకంగా 78 మంది ప్రతిపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. ఒకేరోజు 78 మందిని బహిష్కరించడం భారత పార్లమెంట్ చరిత్రలో ఇదే మొదటిసారి. పార్లమెంట్లో ఈ నెల 13వ తేదీనాటి భద్రతా వైఫల్యంపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ సభలో తీవ్ర అలజడి సృష్టించిందుకు వీరిని సస్పెండ్ చేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు. లోక్‌సభ నుంచి 33 మంది, రాజ్యసభ నుంచి 45 మంది విపక్ష ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. గత వారమే లోక్‌సభలో 13 మంది, రాజ్యసభలో ఒక విపక్ష ఎంపీపై సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సస్పెండైన మొత్తం ప్రతిపక్ష సభ్యుల సంఖ్య 92కు చేరుకుంది. వీరంతా ఒకే కారణంతో వేటుకు గురయ్యారు. భద్రతా వైఫల్యంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వివరణ, రాజీనామాకు డిమాండ్ చేస్తూ ఉభయ సభల్లో ఆందోళనకు దిగారు. ఎంపీల నినాదాలు, నిరసనలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. సస్పెన్షన్ల పర్వంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలకమైన బిల్లులపై పార్లమెంట్లో చర్చ జరగకుండా ప్రభుత్వం కుట్ర పన్నిందని, అందులో భాగంగానే సస్పెండ్ చేసిందని మండిపడ్డారు. లోక్‌సభలో విపక్షాల రగడ భద్రతా వైఫల్యంపై విపక్ష సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ బిగ్గరగా నినాదాలు చేయడంతో లోక్‌సభ సోమవారం పలుమార్లు వాయిదా పడింది. కేంద్ర మంత్రి అమిత్ షా సభకు వచ్చి సమాధానం చెప్పాలని, పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. శాంతించాలని, సభా కార్యకలాపాలకు సహకరించాలని స్పీకర్ పలుమార్లు కోరినా ఫలితం లేకుండాపోయింది. దాంతో 33 మంది విపక్ష ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు వేర్వేరు తీర్మానాలు మూజువాణి ఓటుతో ఆమోదం పొందాయి. అనంతరం సదరు ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. వీరిలో 10 మంది డీఎంకే, 9 మంది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, 8 మంది కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు. స్పీకర్ పోడియంపైకి చేరుకొని నినాదాలు చేసిన ముగ్గురు కాంగ్రెస్ సభ్యుల ప్రవర్తనపై విచారణ జరపాలని సభా హక్కుల కమిటీని స్పీకర్ ఆదేశించారు. ఆ నివేదిక వచ్చేదాకా వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మిగతా ఎంపీలను శీతాకాల సమావేశాలు ముగిసేదాకా బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. రాజ్యసభలో అదే దృశ్యం రాజ్యసభలో కూడా అదే దృశ్యం పునరావృతమైంది. చైర్మన్ ఆదేశాలను ధిక్కరించడంతోపాటు సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతూ అనుచితంగా ప్రవర్తించడంతో మొత్తం 45 మంది ప్రతిపక్ష సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు. వీరిలో 12 మంది కాంగ్రెస్, ఏడుగురు తృణమూల్, నలుగురు డీఎంకే సభ్యులున్నారు. 45 మందిలో 34 మందిని ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో మిగిలిన సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు. మిగతా 11 మంది సభలో ప్రవర్తించిన తీరుపై విచారణ జరిపి మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని సభా హక్కుల కమిటీని చైర్మన్ ఆదేశించారు. నివేదిక వచ్చేదాకా సభకు దూరంగా ఉండాలని వారిని చైర్మన్ ఆదేశించారు. దాంతో వారు 3 నెలల దాకా సభకు హాజరయ్యే అవకాశం లేనట్లే. ప్రస్తుత సెషన్ ముగిసేదాకా సస్పెండైన లోక్‌సభ సభ్యులు అదీర్ రంజన్ చౌదరి, గౌరవ్ గొగొయ్, కె.సురేశ్, అమర్‌సింగ్, రాజమోహన్ ఉన్నిథాన్, తిరుణావుక్కరసర్, కె.మురళీధరన్, ఆంటోనీ (కాంగ్రెస్); కల్యాణ్ బెనర్జీ, అపురూప పొద్దార్, ప్రసూన్ బెనర్జీ, సౌగతా రాయ్, శతాబ్ది రాయ్, ప్రతిమా మండల్, కకోలీ ఘోష్ దస్తీదార్, అసిత్ కుమార్ మాల్, సునీల్ కుమార్ మండల్ (తృణమూల్ కాంగ్రెస్); టీఆర్ బాలు, ఎ.రాజా, దయానిధి మారన్, టి.సుమతి, కె.నవాస్కని, కళానిధి వీరస్వామి, సి.ఎన్.అన్నాదురై, ఎస్.ఎస్.పళనిమాణిక్కం, జి.సెల్వన్, ఎస్.రామలింగం (డీఎంకే); ఈటీ మొహమ్మద్ బషీర్ (ఐయూఎంఎల్); ఎన్.కె.ప్రేమచంద్రన్ (ఆర్ఎస్పీ); కౌసలేంద్ర కుమార్ జేడీ(యూ) సభా హక్కుల కమిటీ నివేదిక వచ్చేదాకా సస్పెండైన సభ్యులు: కె.జయకుమార్, విజయ్ వసంత్, అబ్దుల్ ఖలీక్ (కాంగ్రెస్) ప్రస్తుత సెషన్ ముగిసేదాకా సస్పెండైన రాజ్యసభ సభ్యులు ప్రమోద్ తివారీ, జైరాం రమేశ్, కె.సి.వేణుగోపాల్, రణదీప్‌సింగ్ సుర్జేవాలా, అమీ యాజ్ఞిక్, నరేన్భాయ్ జె.రాథ్వా, సయీద్ నాసిర్ హుస్సేన్, ఫూలోదేవి నేతమ్, శక్తిసింహ్ గోహిల్, రజని అశోక్‌రావు పాటిల్, రంజీత్ రంజన్, ఇమ్రాన్ ప్రతాప్గార్హీ (కాంగ్రెస్); సుఖేందు శేఖర్ రాయ్, మొహమ్మద్ నదీముల్ హక్, అబిర్ రంజన్ బిశ్వాస్, శాంతను సేన్, మౌసమ్ నూర్, ప్రకాశ్ చిక్ బరాయిక్, సమీరుల్ ఇస్లాం (తృణమూల్ కాంగ్రెస్); ఎం.షణ్ముగలింగం, ఎన్.ఆర్.ఇలాంగో, కనిమొళి ఎన్వీఎన్ సోము, ఆర్.గిరిరాజన్ (డీఎంకే); మనోజ్ కమార్ ఝా, ఫయాజ్ అహ్మద్ (ఆర్జేడీ), రామ్‌గోపాల్ యాదవ్, జావెద్ అలీఖాన్ (ఎస్పీ); రామ్‌నాథ్ ఠాకూర్, అనీల్ ప్రసాద్ హెగ్డే (జేడీ–యూ); వి.సదాశివన్ (సీపీఎం); వందనా చవాన్ (ఎన్సీపీ); మహువా మజీ (జేఎంఎం); జోస్ కె.మణి (కేసీ–ఎం); అజిత్‌కుమార్ భూయాన్ (స్వతంత్ర) సభా హక్కుల కమిటీ నివేదిక వచ్చేదాకా సస్పెండైన సభ్యులు: జెబీ మాథర్ హిషామ్, ఎల్.హనుమంతయ్య, నీరజ్ డాంగీ, రాజమణి పటేల్, కుమార్ కేట్కర్, జి.సి.చంద్రశేఖర్ (కాంగ్రెస్); జాన్ బ్రిట్టాస్, ఎ.ఎ.రహీం (సీపీఎం); బినోయ్ విశ్వం, పి.సందోష్‌కుమార్ (సీపీఐ); మొహమ్మద్ అబ్దుల్లా (డీఎంకే) నియంతృత్వాన్ని పరాకష్టకు తీసుకెళ్లారు. అచ్చం బాహుబలుల మాదిరిగా ప్రవర్తించారు. సభ నడవాలంటే విపక్షాలు ఉండాలనే కనీస నియమాన్నీ మరిచారు. అందర్నీ దారుణంగా సస్పెండ్ చేశారు. – అధీర్ రంజన్ చౌదరి, లోక్‌సభలో కాంగ్రెస్ నేత లోక్‌సభలో పొగ ఘటనకు కారకుడైన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహాను సస్పెండ్ చేయాలని మేం కోరుతుంటే మమ్మల్నే సస్పెండ్ చేశారు. ఈ దారుణ ధోరణి ప్రజాస్వామ్యానికే వ్యతిరేకం. – సౌగతా రాయ్, తృణమూల్ కాంగ్రెస్ నేత పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ ఇలాంటిది జరగలేదు. 33 మంది లోక్‌సభ ఎంపీలను సస్పెండ్ చేస్తారా?. సభను ప్రశాంతంగా నడపాలి. అధికార పార్టీ సభ్యుల వైఖరి మీదే అది ఆధారపడి ఉంటుంది. విపక్షాలు వివరణ కోరుతుంటే ప్రభుత్వం ఈ విధంగా స్పందించడం దారుణం. – టీఆర్ బాలు, డీఎంకే నేత -
చర్య తీసుకున్నాం.. అదే ఫైనల్
న్యూఢిల్లీ: రాజ్యసభ నుంచి 12 మంది విపక్ష ఎంపీలను శీతాకాల సమావేశాల్లో సెషన్ మొత్తం సస్పెండ్ చేయడాన్ని చైర్మన్ వెంకయ్య నాయుడు మంగళవారం సమర్థించారు. వర్షాకాల సమావేశాల్లో సభలో అనుచితంగా ప్రవర్తించారని, అయినప్పటికీ వారిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదన్నారు. ‘12 మందిపై సస్పెన్షన్ వేటు వేస్తూ తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. చర్య తీసుకున్నాం. ఇక అదే ఫైనల్’ అని తేల్చిచెప్పారు. ఈ సస్పెన్షన్‌ను రద్దు చేయాలంటూ రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే చేసిన విజ్ఞప్తిని వెంకయ్య తిరస్కరించారు. అంతకముందు సభలో ఖర్గే మాట్లాడుతూ.. 12 మందిని సస్సెండ్ చేస్తూ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ నిబంధనలకు విరుద్ధంగా తీర్మానం ప్రవేశపెట్టారని విమర్శించారు. ప్రవర్తన సక్రమంగా లేని సభ్యులను సభ నుంచి బహిష్కరించే అధికారం సభాపతికి ఉందని వెంకయ్య గుర్తుచేశారు. సస్పెన్షన్ అంశాన్ని జీరో అవర్‌లో ప్రస్తావించేందుకు వెంకయ్య అవకాశం ఇవ్వలేదు. దీంతో ప్రతిపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీజీ విగ్రహం వద్ద నినాదాలు చేశారు. సస్పెన్షన్‌ను రద్దు చేయండి ఎంపీల సస్పెన్షన్‌ను రద్దు చేయాలని 16 విపక్షాల నేతలు మంగళవారం వెంకయ్యను కలిసి విజ్ఞప్తి చేశారు. అనుచిత ప్రవర్తను క్షమాపణ చెప్పాలని వెంకయ్య సూచించినట్లు తెలిసింది. ప్రతిపక్ష నేతలు తొలుత కాంగ్రెస్ ఎంపీ ఖర్గే చాంబర్లో సమావేశమయ్యారు. ఈ భేటీకి రాహుల్ హాజరైనట్లు తెలిసింది. కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీపీ, శివసేన, సీపీఐ, సీపీఎం, ఆర్జేడీ, టీఆర్ఎస్, ఆర్ఎస్పీ, ఆమ్ ఆద్మీ, ఎండీఎంకే, ఎల్జేడీ, నేషనల్ కాన్ఫరెన్స్ తదితర ప్రతిపక్షాల భేటీకి తృణమూల్ హాజరుకాకపోవడం గమనార్హం. ఈ సెషన్ మొత్తం సస్పెండైన 12 మంది ఎంపీలలో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎంపీలు కూడా ఉన్నారు. ఎంపీలపై నిబంధలనకు విరుద్ధంగా తీర్మానం ప్రవేశపెట్టారని ఖర్గే తెలిపారు. ఇలా చేయడం రూల్స్ ఆప్ ప్రొసీజర్, కాండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్‌లోని రూల్ 256(1)ను ఉల్లంఘించడమే అవుతుందని వెంకయ్యకు లేఖ రాశారు. దిగువ సభలో నిరసనల హోరు లోక్‌సభలో మంగళవారం గందరగోళం నెలకొంది. ప్రతిపక్షాల నిరసనల కారణంగా సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. రైతాంగం సమస్యలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో పలుమార్లు సభను వాయిదా వేయాల్సి వచ్చింది. తొలుత సభ ప్రారంభం కాగానే కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రశ్నోత్తరాలు మొదలుపెట్టగానే టీఆర్ఎస్ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చారు. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, సాగు చట్టాల వ్యతిరేక పోరాటంలో మృతిచెందిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, వామపక్ష సభ్యులు తమ స్థానాల్లో నిల్చొని నినాదాలు చేశారు. వెనక్కి వెళ్లి, సీట్లలో కూర్చోవాలని స్పీకర్ బిర్లా పదేపదే కోరినప్పటికీ టీఆర్ఎస్ సభ్యులు పట్టించుకోలేదు. ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని ఆరోపిస్తూ కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, వామపక్షాల ఎంపీలు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల(వేతనాలు, సేవలు) సవరణ బిల్లు–2021ను ప్రవేశపెట్టారు. అనంతరం స్పీకర్ ఓంబిర్లా సభను బుధవారానికి వాయిదా వేశారు. క్షమాపణ ఎందుకు చెప్పాలి?: రాహుల్ ఎందుకోసం క్షమాపణ చెప్పాలి? ప్రజా సమస్యల ను పార్లమెంట్లో ప్రస్తావించినందుకా? క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. -
ఐదో రోజూ అడ్డుకున్నారు
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభల కార్యకలాపాలను విపక్షాలు వరుసగా ఐదో రోజూ అడ్డుకున్నాయి. ఢిల్లీ అల్లర్లపై, లోక్‌సభ నుంచి కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేయడంపై శుక్రవారం విపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. దాంతో, పలు వాయిదాల అనంతరం లోక్‌సభ, సభ ప్రారంభమైన పావుగంటకే రాజ్యసభ మార్చి 11వ తేదీకి వాయిదా పడ్డాయి. లోక్‌సభ..: ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే ఢిల్లీ అల్లర్లపై తక్షణమే చర్చ జరపాలని కాంగ్రెస్, డీఎంకే, ఐయూఎంఎల్ తదితర పార్టీల సభ్యులు వెల్లోనికి వచ్చి నినాదాలు చేశారు. ఢిల్లీ అల్లర్లపై 11న చర్చ జరుగుతుందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, స్పీకర్ స్థానాన్ని అవమానించారని పేర్కొంటూ గురువారం ఏడుగురు కాంగ్రెస్ సభ్యులను లోక్‌సభ నుంచి ఈ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ సహా పలు విపక్షాలు సభలో నిరసన తెలిపాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా చాలామంది విపక్ష సభ్యులు తమ చేతులకు నల్లని బ్యాడ్జీలు కట్టుకుని నిరసన తెలిపారు. గందరగోళం కొనసాగుతుండటంతో సభను స్పీకర్ స్థానంలో ఉన్న కిరిట్ సోలంకీ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తరువాత కూడా విపక్షం శాంతించలేదు. నినాదాల మధ్యనే ఖనిజ చట్టాల(సవరణ) బిల్లు, దివాలా కోడ్(సవరణ) బిల్లు ఆమోదం పొందాయి. రాజ్యసభ..: సభ ప్రారంభం కాగానే తన శాఖకు సంబంధించిన పత్రాలను సభ ముందుంచేందుకు హోంశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ లేవగానే.. విపక్ష సభ్యులంతా గట్టిగా నినాదాలు చేశారు. ఢిల్లీ అల్లర్లపై చర్చకు పట్టుబట్టారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు చేసిన విజ్ఞప్తిని వారు పట్టించుకోలేదు. దీంతో సభను 11వ తేదీకి వాయిదా వేశారు. జేబుదొంగకు ఉరిశిక్షా? కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్‌పై ఆ పార్టీ నేత ఆధిర్ రంజన్‌చౌధురి సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిన్న తప్పుకు పెద్ద శిక్ష వేశారన్న ఉద్దేశంతో.. ‘జేబు దొంగకు ఉరిశిక్ష వేయకూడదు’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యతో కాంగ్రెస్ సభ్యులు ఇబ్బందిగా ముఖం పెట్టగా, కొందరు పెద్దగా నవ్వేశారు. కాంగ్రెస్ సభ్యుడు చెప్పిన పోలిక వింతగా ఉందని, ఆ ఎంపీలను జేబుదొంగలతో పోల్చడం దురదృష్టకరమని మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. మరోవైపు, తమ ఎంపీల సస్పెన్షన్‌పై రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్లమెంట్ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపింది. -
లోక్‌సభలో 7 గురు కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్
-
మరో 21 మంది ఎంపీలపై వేటు
సాక్షి, న్యూఢిల్లీ: సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్న సభ్యులపై లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వరుసగా రెండో రోజు కొరడా ఝుళిపించారు. బుధవారం 24 మందిని సస్పెండ్ చేసిన ఆమె..గురువారం మరో 21 మందిని నాలుగు రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఈ 45 మంది ఇక ఈ సెషన్లో సభకు హాజరుకావొద్దని ఆదేశించారు. జనవరి 8న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి. గురువారం సభ నుంచి ఉద్వాసనకు గురైన వారిలో 13 మంది టీడీపీ ఎంపీలు, ఏడుగురు ఏఐఏడీఎంకే సభ్యులు, వైఎస్సార్సీపీ టికెట్‌పై గెలిచి టీడీపీలో చేరిన సభ్యురాలు ఉన్నారు. ఇంతమంది సభ్యులపై స్పీకర్ ఒకేసారి చర్యలు తీసుకోవడం పార్లమెంట్ చరిత్రలో అసాధారణ పరిణామమని భావిస్తున్నారు. డిసెంబర్ 11న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కావేరి అంశంపై ఏఐఏడీఎంకే సభ్యులు తరచూ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం జీరో అవర్ ప్రారంభమైన వెంటనే ఏఐఏడీఎంకే, టీడీపీ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. ఏఐఏడీఎంకే సభ్యులు స్పీకర్ కుర్చీ వైపు కాగితాలు విసిరారు. ఆగ్రహించిన స్పీకర్..గొడవ సృష్టిస్తున్న సభ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో వారిని సభ నుంచి సస్పెండ్ చేశారు. రాజ్యసభ నుంచి ఏఐఏడీఎంకే వాకౌట్ కావేరి జలాల వివాదంపై మాట్లాడేందుకు అనుమతి లభించనందుకు నిరసనగా ఏఐఏడీఎంకే సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. లోక్‌సభలో తమ సభ్యులు సస్పెండైన అంశాన్ని ఏఐఏడీఎంకే సభ్యుడు నవనీత్ క్రిష్ణన్ లేవనెత్తగా, చైర్మన్ వెంకయ్యనాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. లోక్‌సభలో సభ్యుల ప్రవర్తనను రాజ్యసభలో చర్చించలేమన్నారు. -
ఆరుగురు ఎంపీల సస్పెన్షన్
తనపైకి పేపర్లు విసిరినందుకు మండిపడ్డ స్పీకర్ ► ‘గోరక్ష’ దళాల హింసపై అట్టుడికిన లోక్‌సభ ► వెల్‌లోకి దూసుకొచ్చిన విపక్షం ► సస్పెన్షన్‌ను తప్పుబట్టిన కాంగ్రెస్ న్యూఢిల్లీ: లోక్‌సభ సోమవారం విపక్షాల ఆందోళనలు, నిరసనలతో దద్దరిల్లింది. గోరక్ష పేరుతో జరుగుతున్న హింసకు సంబంధించి తక్షణమే చర్చ చేపట్టాలని కోరుతూ.. కాంగ్రెస్‌తోపాటుగా తృణమూల్, వామపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి సభాకార్యక్రమాలకు ఆటంకం కలిగించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గోరక్షపై కేంద్రప్రభుత్వం చెబుతున్నదేదీ అమలు కావటం లేదని విమర్శించారు. ఈ నిరసనల మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ నిర్వహించి సభను వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమయ్యాక కూడా కాంగ్రెస్ ఎంపీల ఆందోళన ఆగలేదు. వెల్‌లోకి దూసుకొచ్చి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేయటంతోపాటుగా.. పేపర్లు చించి స్పీకర్‌పైకి వెదజల్లారు. దీంతో ఆరుగురు కాంగ్రెస్ ఎంపీలు గౌరవ్ గొగోయ్, కె. సురేశ్, అధిర్ రంజన్ చౌదరీ, రంజిత్ రంజన్, సుష్మితాదేవ్, ఎంకే రాఘవన్‌లను స్పీకర్ సుమిత్రా మహాజన్ ఐదురోజులపాటు సస్పెండ్ చేశారు. లోక్‌సభ ప్రవర్తన నియమావళి 374 (ఏ) నిబంధన ప్రకారం సస్పెన్షన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. స్పీకర్‌పై పేపర్లు చించివేసిన ఘట నను అధికార, పలు విపక్ష పార్టీలు తీవ్రంగా తప్పుబట్టాయి. వెల్‌లోనే విపక్షాలు సోమవారం సభ ప్రారంభం కాగానే.. దేశవ్యాప్తంగా గోరక్ష పేరుతో జరుగుతున్న అమానవీయ ఘటనలపై చర్చ జరగాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఇందుకోసం వాయిదా తీర్మానాన్ని ఇవ్వగా స్పీకర్ తిరస్కరించారు. దీంతో మండిపడ్డ విపక్షాలు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు, నిరసనలతో సభా కార్యక్రమాలను అడ్డుకున్నాయి. ఈ ఆందోళనలోనే ప్రశ్నోత్తరాలు, జీరో అవర్లను స్పీకర్ నిర్వహించారు. ప్రశ్నోత్తరాల సమయం ముగియగానే కాంగ్రెస్ సభాపక్షనేత మల్లికార్జున ఖర్గే.. దేశంలో మైనార్టీలు, దళితులు, మహిళలు, చిన్నపిల్లలు భయంతో బతుకుతున్నారని విమర్శించారు. ‘ఈ అంశంపై చర్చలో ప్రధాన మంత్రి, హోంమంత్రి పాల్గొనాల్సిందే’ అని ఖర్గే డిమాండ్ చేశారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గోరక్షక దళాలు రెచ్చిపోతున్నాయని టీఎంసీ ఎంపీ సౌగతరాయ్ ఆరోపించారు. ప్రధాని సంయమనం పాటించాలని చెప్పినా.. ఆయన మాటను ఎవరూ పట్టించుకోవటం లేదన్నారు. విపక్షాల ఆందోళన పెరుగుతున్న దశలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ జోక్యం చేసుకుని.. ‘గోవును దేశమంతా అమ్మలా పూజిస్తుందని.. అలాంటి ఆవును కాపాడుకోవటం మనందరి బాధ్యత. అలాగని ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాల్సిన పనిలేదు’ అని పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు శాంతిభద్రతలను కాపాడేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని 2016లోనే ఆదేశాలిచ్చామన్నారు. మంత్రి వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన విపక్ష ఎంపీలు మళ్లీ వెల్‌లోకి దూసుకెళ్లి ‘గోరక్ష పేరుతో హత్యలు ఆపాలి, దేశాన్ని ముక్కలు కానీయం’ అని నినాదాలు చేశారు. -
ఆరుగురు ఎంపీలపై సస్పెన్షన్ వేటు!
-
ఆరుగురు ఎంపీలపై సస్పెన్షన్ వేటు!
న్యూఢిల్లీ: సభలో తనపట్ల అనుచితంగా వ్యవహరించిన ఆరుగురు కాంగ్రెస్ పార్టీ ఎంపీలపై లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సస్పెన్షన్ వేటు వేశారు. వారిని ఐదురోజుల పాటు సభ నుంచి బహిష్కరించారు. గోరక్షణ పేరిట జరుగుతున్న హత్యలపై చర్చించాలంటూ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సోమవారం లోక్‌సభలో దుమారం రేపారు. వెల్‌లోకి దూసుకొచ్చిన ఆ పార్టీ సభ్యులు మోదీ సర్కారు తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు కాగితాలు చింపి స్పీకర్ మహాజన్‌పై విసిరేశారు. దీంతో ఆగ్రహించిన స్పీకర్ మహాజన్ ఐదుగురు సభ్యులపై వేటు వేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గౌరవ్ గొగోయ్, కే సురేశ్, అధీర్ రంజన్ చౌదరి, రంజీత్ రంజన్, సుష్మితా దేవ్, ఎంకే రాఘవన్‌లను సభనుంచి ఐదురోజులపాటు బహిష్కరించారు. అనంతరం సభను మధ్యాహ్నం 2.30 గంటలవరకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన అనంతరం కూడా పరిస్థితి మారలేదు. తమ పార్టీ సభ్యులపై స్పీకర్ సస్పెన్షన్ ఉత్తర్వులను తప్పుబడుతూ.. కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆందోళనకు దిగారు. సభ నడిచే పరిస్థితి లేకపోవడంతో మంగళవారానికి స్పీకర్ మహాజన్ వాయిదా వేశారు. -
సస్పెన్షన్ గురైన ఎంపీలు
-
లోక్‌సభలో 16 మంది ఎంపీల సస్పెన్షన్
న్యూఢిల్లీ : సభలో ఆందోళన చేస్తున్నారంటూ 16 మంది ఎంపీలపై స్పీకర్ మీరాకుమార్ సస్పెన్షన్ వేటు వేశారు. వాయిదా అనంతరం సభ ప్రారంభం కాగానే స్పీకర్ మీరాకుమార్.... సభ్యుల సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రకటించారు. 374(ఎ) సెక్షన్ కింద వారిని అయిదురోజుల పాటు సస్పెండ్ చేశారు. ఎంపీలను సస్పెండ్ అయిన ఎంపీల వివరాలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎస్పీవై రెడ్డి కాంగ్రెస్ : అనంత వెంకట్రామిరెడ్డి మాగుంట శ్రీనివాసులు రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి గుత్తా సుఖేందర్ రెడ్డి ఉండవల్లి అరుణ్ కుమార్ లగడపాటి రాజగోపాల్ రాయపాటి సాంబశివరావు ఎ.సాయిప్రతాప్ సబ్బం హరి టీడీపీ : శివప్రసాద్ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కొనకళ్ల నారాయణ నిమ్మల కిష్టప్ప -
9 మంది సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్
న్యూఢిల్లీ : సమైక్యాంధ్ర నినాదాలతో పార్లమెంట్ సోమవారం మార్మోగిపోయింది. సేవ్ ఆంధ్ర ప్రదేశ్, జై సమ్యాంధ్ర అంటూ సీమాంధ్ర ఎంపీలు సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు. దాంతో లోక్‌సభలో తొమ్మిదిమంది సీమాంధ్ర ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. కాంగ్రెస్, టీడీపీ ఎంపీలను స్పీకర్ మీరాకుమార్ అయిదు రోజుల పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్నారంటూ 347A నిబంధన కింద విచక్షణ అధికారంతో వారిపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెండ్ అయినవారిలో ఎంపీలు సాయి ప్రతాప్, అనంత వెంకట్రామిరెడ్డి, మాగంట శ్రీనివాసులరెడ్డి,లగడపాటి రాజగోపాల్, కనుమూరి బాపిరాజు, కొనకళ్ల నారాయణ, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నిమ్మల కిష్టప్ప, శివప్రసాద్ ఉన్నారు. ఈ నేపథ్యంలో లోక్ సభ సమావేశాలను స్పీకర్ మధ్యాహ్నం రెండు గంటల వరకూ వాయిదా పడ్డాయి. సస్పెన్షన్‌ను నిరసిస్తూ టీడీపీ ఎంపీలు సభలోనే ఆందోళనకు దిగారు. ఇక రాజ్యసభలో సభా కార్యక్రమాలు అడ్డుకున్న ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ లను రాజ్యసభ ఛైర్మన్ సభనుంచి సస్పెండ్ చేశారు. -
9 మంది సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్
న్యూఢిల్లీ : లోక్‌సభలో తొమ్మిదిమంది సీమాంధ్ర ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. కాంగ్రెస్, టీడీపీ ఎంపీలను స్పీకర్ మీరాకుమార్ అయిదు రోజుల పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్నారంటూ 347A నిబంధన కింద విచక్షణ అధికారంతో వారిపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. సస్పండ్ అయినవారిలో ఎంపీలు సాయి ప్రతాప్, అనంత వెంకట్రామిరెడ్డి, మాగంట శ్రీనివాసులరెడ్డి,లగడపాటి రాజగోపాల్, కనుమూరి బాపిరాజు, కొనకళ్ల నారాయణ, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నిమ్మల కిష్టప్ప, శివప్రసాద్ ఉన్నారు. -
9 మంది సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్
-
సస్పెన్షన్ ఎత్తివేయాలని లేఖ రాశా: బొత్స
హైదరాబాద్ : సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేయాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్‌కు లేఖ రాసినట్లు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. సమ్మె విరమించాలని ఆర్టీసీ కార్మికులను కోరినట్లు ఆయన శనివారమిక్కడ పేర్కొన్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మిక నేతలు కోరారని బొత్స తెలిపారు. తమిళనాడు, కర్ణాటకలో ఉన్న విధానాన్ని అధ్యాయనం చేసి, ఆర్టీసీ ప్రభుత్వంలో కలిపే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని ఆయన వెల్లడించారు. లోక్ సభ నుంచి 12మంది సీమాంధ్ర ఎంపీలు సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. -
సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్ ఉపసంహరణ
విపక్షాల నుంచి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం కావడం, అనూహ్యంగా బీజేపీ నుంచి కూడా ప్రతిఘటన రావడంతో సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్‌పై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్ ప్రతిపాదనను వెనక్కి తీసుకుంది. తెలంగాణ అంశంపై లోక్‌సభలో చర్చకు అనుమతి ఇవ్వాలని కూడా నిర్ణయించింది. రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలనే డిమాండ్‌తో లోక్‌సభను స్తంభింపజేసిన 11 మంది సీమాంధ్ర ఎంపీలను ప్రస్తుత లోక్‌సభ వర్షాకాల సమావేశాలు ముగిసేంతవరకూ సస్పెండ్ చేయాలనే ప్రభుత్వ ప్రయత్నాలకు వాస్తవానికి గురువారమే బ్రేక్ పడింది. ప్రతిపక్షంతో పాటు యూపీఏకి మద్దతునిస్తున్న పార్టీలు కూడా ముక్తకంఠంతో వ్యతిరేకించడంతో తీవ్ర గందరగోళం మధ్య తీర్మానాన్ని ఆమోదించకుండానే సభ అర్థంతరంగా శుక్రవారానికి వాయిదా పడింది. ఇది పాలక పక్షానికి అనుకోని షాకిచ్చింది. సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతున్న సభ్యులను సస్పెండ్ చేయాలని కోరుతూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ సభ్యుల పేర్లు చదవడం మొదలుపెట్టగానే బీజేపీ, శివసేన, అకాలీదళ్, జేడీ(యూ), బీజేడీ, సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే తదితర పార్టీల సభ్యులంతా లేచి నిలబడి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. విపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ సైతం తీవ్ర స్థాయిలో సస్పెన్షన్ నిర్ణయాన్ని నిరసించడంతో పాలకపక్షం ఖంగుతింది. చివరకు తప్పనిసరి పరిస్థితుల్లో సస్పెన్షన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. -
లోక్‌సభ సమావేశాలు రేపటికి వాయిదా
న్యూఢిల్లీ : విపక్ష సభ్యుల నిరసనల మధ్య లోక్‌సభ సమావేశాలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. అంతకు ముందు రాష్ట్ర విభజన అంశం లోక్‌సభను కుదిపేసింది. సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేయాలంటూ సీమాంధ్ర ఎంపీలు సభను అడ్డుకునేందుకు యత్నించారు. వెల్‌లోని దూసుకు వెళ్లి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ నినాదాలు చేశారు. స్పీకర్ మీరాకుమార్ తమ స్థానాల్లోకి వెళ్లాలని స్పీకర్ మీరాకుమార్ విజ్ఞప్తి చేసినా ఎంపీలు శాంతించకపోగా, స్పీకర్ మైకులను తోసేశారు. దాంతో అధికార పక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది.పార్లమెంట్ ముగిసేవరకూ 11 మంది సీమాంధ్ర ఎంపీలను సస్పెండ్ చేయాలని నిర్ణయించింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి కమల్‌నాథ్ సస్పెన్షన్ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. దాంతో ఏడుగురు కాంగ్రెస్, నలుగురు టీడీపీ ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. మొత్తం మీద సీమాంధ్ర ఎంపీల నిరసన నేపథ్యంలో తొలిసారి 15 నిముషాలు సభ వాయిదా పడగా, వాయిదా అనంతరం ఎలాంటి మార్పు లేకపోవటంతో లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. మరోవైపు ఎంపీల సస్పెన్షన్ తీర్మానాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. సస్పెండ్ అయిన సభ్యుల వివరాలు కాంగ్రెస్ ఎంపీలు: 1.లగడపాటి రాజగోపాల్ 2. హర్షకుమార్ 3.అనంత వెంకట్రామిరెడ్డి 4. సాయి ప్రతాప్ 5. రాయపాటి సాంబశివరావు 6. ఉండవల్లి అరుణ్ కుమార్ 7. మాగుంట శ్రీనివాసులురెడ్డి టీడీపీ సభ్యులు 1.కొనకొళ్ల నారాయణరావు 2.మోదుగుల వేణుగోపాల్ రెడ్డి 3. శివప్రసాద్ 4. నిమ్మల కిష్టప్ప ..... కాగా సస్పెన్షన్ జరిగే ముందే మరో ఎంపీ కనుమూరి బాపిరాజు సభ నుంచి వెళ్లిపోయారు.