
ఆరుగురు ఎంపీల సస్పెన్షన్
తనపైకి పేపర్లు విసిరినందుకు మండిపడ్డ స్పీకర్
► ‘గోరక్ష’ దళాల హింసపై అట్టుడికిన లోక్‌సభ
► వెల్‌లోకి దూసుకొచ్చిన విపక్షం
► సస్పెన్షన్‌ను తప్పుబట్టిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: లోక్‌సభ సోమవారం విపక్షాల ఆందోళనలు, నిరసనలతో దద్దరిల్లింది. గోరక్ష పేరుతో జరుగుతున్న హింసకు సంబంధించి తక్షణమే చర్చ చేపట్టాలని కోరుతూ.. కాంగ్రెస్‌తోపాటుగా తృణమూల్, వామపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి సభాకార్యక్రమాలకు ఆటంకం కలిగించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గోరక్షపై కేంద్రప్రభుత్వం చెబుతున్నదేదీ అమలు కావటం లేదని విమర్శించారు.
ఈ నిరసనల మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ నిర్వహించి సభను వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమయ్యాక కూడా కాంగ్రెస్ ఎంపీల ఆందోళన ఆగలేదు. వెల్‌లోకి దూసుకొచ్చి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేయటంతోపాటుగా.. పేపర్లు చించి స్పీకర్‌పైకి వెదజల్లారు. దీంతో ఆరుగురు కాంగ్రెస్ ఎంపీలు గౌరవ్ గొగోయ్, కె. సురేశ్, అధిర్ రంజన్ చౌదరీ, రంజిత్ రంజన్, సుష్మితాదేవ్, ఎంకే రాఘవన్‌లను స్పీకర్ సుమిత్రా మహాజన్ ఐదురోజులపాటు సస్పెండ్ చేశారు. లోక్‌సభ ప్రవర్తన నియమావళి 374 (ఏ) నిబంధన ప్రకారం సస్పెన్షన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. స్పీకర్‌పై పేపర్లు చించివేసిన ఘట నను అధికార, పలు విపక్ష పార్టీలు తీవ్రంగా తప్పుబట్టాయి.
వెల్‌లోనే విపక్షాలు
సోమవారం సభ ప్రారంభం కాగానే.. దేశవ్యాప్తంగా గోరక్ష పేరుతో జరుగుతున్న అమానవీయ ఘటనలపై చర్చ జరగాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఇందుకోసం వాయిదా తీర్మానాన్ని ఇవ్వగా స్పీకర్ తిరస్కరించారు. దీంతో మండిపడ్డ విపక్షాలు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు, నిరసనలతో సభా కార్యక్రమాలను అడ్డుకున్నాయి. ఈ ఆందోళనలోనే ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌లను స్పీకర్ నిర్వహించారు. ప్రశ్నోత్తరాల సమయం ముగియగానే కాంగ్రెస్ సభాపక్షనేత మల్లికార్జున ఖర్గే.. దేశంలో మైనార్టీలు, దళితులు, మహిళలు, చిన్నపిల్లలు భయంతో బతుకుతున్నారని విమర్శించారు.
‘ఈ అంశంపై చర్చలో ప్రధాన మంత్రి, హోంమంత్రి పాల్గొనాల్సిందే’ అని ఖర్గే డిమాండ్ చేశారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గోరక్షక దళాలు రెచ్చిపోతున్నాయని టీఎంసీ ఎంపీ సౌగతరాయ్ ఆరోపించారు. ప్రధాని సంయమనం పాటించాలని చెప్పినా.. ఆయన మాటను ఎవరూ పట్టించుకోవటం లేదన్నారు. విపక్షాల ఆందోళన పెరుగుతున్న దశలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ జోక్యం చేసుకుని.. ‘గోవును దేశమంతా అమ్మలా పూజిస్తుందని.. అలాంటి ఆవును కాపాడుకోవటం మనందరి బాధ్యత. అలాగని ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాల్సిన పనిలేదు’ అని పేర్కొన్నారు.
ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు శాంతిభద్రతలను కాపాడేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని 2016లోనే ఆదేశాలిచ్చామన్నారు. మంత్రి వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన విపక్ష ఎంపీలు మళ్లీ వెల్‌లోకి దూసుకెళ్లి ‘గోరక్ష పేరుతో హత్యలు ఆపాలి, దేశాన్ని ముక్కలు కానీయం’ అని నినాదాలు చేశారు.