* తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలన తలచుకుంటేనే భయమేస్తోంది
* ఆ పాలనలో ప్రజలు జీవచ్ఛవాల్లా బతికారు..
* రైతన్న ఆత్మహత్యలు అవహేళనకు గురయ్యాయి..
* ఒక వృద్ధుడు చనిపోతేనే మరొకరికి పింఛన్.. అదీ ముష్టి రూ.70..
* అక్కచెల్లెళ్ల రక్తాన్ని రూపాయిన్నర వడ్డీతో పీల్చేశారు
* విభజన కుట్రదారులు సోనియా, కిరణ్, చంద్రబాబులు ప్రజాగ్రహంలో కొట్టుకుపోతారు
‘సమైక్య శంఖారావం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘వైఎస్ ముఖ్యమంత్రి కాకముందు రాష్ట్రంలో ఓ భయానకపాలన ఉండేది. ఆ రోజులు నాకు బాగా గుర్తు. పల్లెల్లోకి వెళ్లినప్పుడు అవ్వా తాతలు ‘నాయనా నాకు పింఛన్ ఇప్పించు’ అని దీనంగా అడిగేవారు. పింఛన్ ఎంతిస్తారవ్వా అని అడిగితే ‘డెబ్బై రూపాయలిస్తారు నాయనా’ అని చెప్పేవారు. ముష్టి డెబ్బై రూపాయలకోసం ఈ వృద్ధులు ఇంతగా దేబిరించాలా అని బాధేసేది. సంబంధిత ఎమ్మార్వోకో, ఆర్డీవోకో ఫోన్ చేసి ఆ వృద్ధుల పింఛన్ గురించి అడిగితే వారు చెప్పే సమాధానం విన్నప్పుడు మరింత బాధేసేది. ఆ గ్రామానికి వృద్ధాప్య పింఛన్ల కోటా పది మాత్రమే. ఇప్పుడు పింఛన్ తీసుకుంటున్న వారిలో ఎవరో ఒకరు చనిపోతే అప్పుడు మీరు సిఫారసు చేసిన వ్యక్తికి పింఛన్ ఇవ్వడానికి వీలవుతుందని సమాధానం చెప్పేవారు. అంతటి దౌర్భాగ్య పాలనకు చరమ గీతం పాడేందుకు నాడు మహానేత వైఎస్ నడుం బిగించారు’’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి గుర్తుచేసుకున్నారు. చిత్తూరు జిల్లాలో నాలుగో విడత జరుగుతున్న జగన్ ‘సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర’ తొమ్మిదో రోజు మంగళవారం సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో సాగింది. శ్రీ కాళహస్తి పట్టణంలో జరిగిన భారీ బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..
ఆ రోజులు తలచుకుంటేనే భయమేస్తోంది..
వైఎస్ అధికారంలోకి రాకముందు రాష్ట్ర పరిస్థితి చూస్తే రాష్ట్రంలో ఓ భయానక పాలన ఉండేది. వరుస కరువులతో ప్రజలు అల్లాడిపోతుంటే.. వారి కష్టాలను పట్టించుకునే నాథుడు లేడు. పింఛను కోసం సాటి వ్యక్తి చావుకోసం ఎదురుచూడాల్సిన అమానవీయ పరిస్థితులను కల్పించిన పాలన అది. డ్వాక్రా మహిళలకు అప్పులిచ్చి రూపాయిన్నర వడ్డీతో వారి రక్తాన్ని పీల్చేసిన పాలన అది. ఆ రోజులు తలుచుకుంటేనే భయమేస్తోంది. వరుస కరువులతో రైతులు కరెంటు బిల్లు కూడా కట్టలేకున్నారు.. వారికి ఉచితంగా విద్యుత్ ఇవ్వండని వైఎస్ డిమాండ్ చేస్తే.. ఉచితంగా విద్యుత్ ఇస్తే ఆ తీగలు బట్టలారేసుకునేందుకు తప్ప ఎందుకూ పనికిరావంటూ అవహేళన చేసిన పాలన అది. చివరకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ‘వారు తిన్నది అరగక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని’ ఎగతాళి చేసిన పాలన అది.
పేదవాడి ముఖాన చిరునవ్వు కోసం వైఎస్ తపించారు
ప్రజాకంటక పాలనలో హిట్లరే మేలనిపించిన చంద్రబాబు పాలనకు చరమగీతం పాడేందుకు నాడు వైఎస్ నడుం బిగించారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా దాదాపు 1500 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. పేదవాడి గుండె చప్పుడును దగ్గర నుంచి విన్నారు. తాను ముఖ్యమంత్రి కాగానే ఆ పేదవాడి గుండె చప్పుడుకు అనుగుణంగా పాలననందించారు. పేదవాడి ముఖాన చిరునవ్వు పూయించాలని తపన పడ్డారు. కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేశారు. రాష్ట్రంలో ప్రజలందరూ ఈ వేళ ‘వైఎస్ బతికుంటే ఎంత బాగుండు’ అని అనుకుంటున్నారు.
ఇప్పుడు రాజకీయాల్లో నిజాయితీ లేదు..
వైఎస్ మన నుంచి దూరమయ్యాక రాజకీయాల్లో విశ్వసనీయత అన్నదే లేకుండా పోయింది. రాజకీయాల్లో టార్చిలైట్ వేసి వెతికినా నిజాయితీ కనిపించని పరిస్థితి. సోనియా గాంధీ తన కొడుకును ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టేందుకు మన రాష్ట్రాన్ని నిలువునా చీల్చేందుకు సిద్ధపడితే ఇక్కడి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఇద్దరూ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను గాలికొదిలేశారు. అసెంబ్లీలో చర్చలు చూస్తోంటే బాధనిపిస్తోంది. ప్రజలు వ్యతిరేకిస్తున్నా కేంద్రం విభజన బిల్లు రాష్ట్రానికి పంపితే.. దానిపై అసెంబ్లీలో ఎడతెగని చర్చలు చేస్తున్నారు. రాష్ట్రంలో 70 శాతం మంది ప్రజలు విభజనను వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మీరు పంపిన బిల్లును వెనక్కు పంపుతున్నాం అని ఒక్క ముక్కలో తేల్చేయాల్సిన అంశాన్ని ఇలా సాగదీస్తున్నారు. సోనియా, కిరణ్, చంద్రబాబు.. వీరు చేస్తున్న కుట్ర రాజకీయాలను పై నుంచి దేవుడనేవాడు చూస్తూనే ఉన్నాడు. వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ను అభిమానించే ప్రతిగుండె చప్పుడు ఒక్కటవుతుంది.. ఉప్పెన సృష్టిస్తుంది.. ఆ ఉప్పెనతో విభజన కుట్రదారులు బంగాళాఖాతంలో కలిసిపోక తప్పదు.’’
తొమ్మిదోరోజు యాత్ర సాగిందిలా..
మంగళవారం ఉదయం సత్యవేడు నియోజకవర్గంలోని నీర్పాకోటలో దివంగత నేత విగ్రహావిష్కరణతో తొమ్మిదోరోజు యాత్ర ప్రారంభమైంది. జగన్ బుచ్చినాయుడు కండ్రిగ, మయూర సుగర్ ఫ్యాక్టరీ, కాటూరు మీదుగా పచ్చాలమ్మ గుడి చేరుకుని అక్కడ పూజలు చేశారు. తంగేళ్లపాలెం వద్ద శ్రీకాళహస్తి నియోజకవర్గంలోకి అడుగు పెట్టారు. బసవయ్యపాళెం మీదుగా వి.ఎం. పల్లికి చేరుకున్నారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయిన పసల చిన్న పాపయ్య కుటుంబాన్ని ఈ గ్రామంలో జగన్ ఓదార్చారు.
అనంతరం శ్రీకాళహస్తి నగరంలోకి జగన్ యాత్ర చేరుకుంది. మండపం సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. సభానంతరం పాతబస్టాండ్, కొత్తపేట, సీతాలమ్మగుడి, బహదూర్ పేట, తెట్టులో రోడ్‌షో నిర్వహించిన జగన్ రాత్రి 10 గంటల ప్రాంతంలో ఏఎం పుత్తూరు సమీపంలో ఉన్న కాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదనరెడ్డి గృహానికి బసకు చేరుకున్నారు. తొమ్మిదో రోజు యాత్రలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, వైఎస్‌ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ నారాయణ స్వామి, మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వైఎస్‌ఆర్ సీపీ తిరుపతి పార్లమెంటు పరిశీలకులు డాక్టర్ వరప్రసాద్, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల సమన్వయకర్తలు బియ్యపు మధుసూదనరెడ్డి, ఆదిమూలం పాల్గొన్నారు.
అది భయానక పాలన: వైఎస్ జగన్
Published Wed, Jan 29 2014 1:33 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement
Advertisement