Samaikya sankaravaam
-
వైఎస్ఆర్ సిపిలో చేరిన ధర్మాన ప్రసాదరావు, లక్ష్మీపార్వతి మరియు నేతలు
-
ముగ్గురు ఎమ్మెల్యేలు, లక్ష్మీపార్వతి వైఎస్ఆర్ సిపిలో చేరిక
శ్రీకాకుళం: ఉత్తరాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు పలువురు నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు, ఎంపి వైఎస్ జగన్మోహన రెడ్డి సమక్షంలో ఈ సాయంత్రం మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే తైనాల విజయకుమార్, పలాస ఎమ్మెల్యే జగన్నాయకులు, పలువురు నేతలు పార్టీలో చేరారు. వారితోపాటు ఇదే వేదికపైన ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి కూడా పార్టీలో చేరారు. జగన్మోహన రెడ్డి వారిపై పార్టీ కండువా కప్పి స్వాగతించారు. సమైక్య శంఖారావంలో భాగంగా శ్రీకాకుళం వచ్చిన జగన్మోహన రెడ్డికి ఘనస్వాగతం లభించింది. జగన్ వస్తున్న సందర్భంగా జనం భారీగా తరలి వచ్చారు. సభా ప్రాంగణం అంతా జనంతో కిక్కిరిసిపోయింది. -
అది భయానక పాలన: వైఎస్ జగన్
* తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలన తలచుకుంటేనే భయమేస్తోంది * ఆ పాలనలో ప్రజలు జీవచ్ఛవాల్లా బతికారు.. * రైతన్న ఆత్మహత్యలు అవహేళనకు గురయ్యాయి.. * ఒక వృద్ధుడు చనిపోతేనే మరొకరికి పింఛన్.. అదీ ముష్టి రూ.70.. * అక్కచెల్లెళ్ల రక్తాన్ని రూపాయిన్నర వడ్డీతో పీల్చేశారు * విభజన కుట్రదారులు సోనియా, కిరణ్, చంద్రబాబులు ప్రజాగ్రహంలో కొట్టుకుపోతారు ‘సమైక్య శంఖారావం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘వైఎస్ ముఖ్యమంత్రి కాకముందు రాష్ట్రంలో ఓ భయానకపాలన ఉండేది. ఆ రోజులు నాకు బాగా గుర్తు. పల్లెల్లోకి వెళ్లినప్పుడు అవ్వా తాతలు ‘నాయనా నాకు పింఛన్ ఇప్పించు’ అని దీనంగా అడిగేవారు. పింఛన్ ఎంతిస్తారవ్వా అని అడిగితే ‘డెబ్బై రూపాయలిస్తారు నాయనా’ అని చెప్పేవారు. ముష్టి డెబ్బై రూపాయలకోసం ఈ వృద్ధులు ఇంతగా దేబిరించాలా అని బాధేసేది. సంబంధిత ఎమ్మార్వోకో, ఆర్డీవోకో ఫోన్ చేసి ఆ వృద్ధుల పింఛన్ గురించి అడిగితే వారు చెప్పే సమాధానం విన్నప్పుడు మరింత బాధేసేది. ఆ గ్రామానికి వృద్ధాప్య పింఛన్ల కోటా పది మాత్రమే. ఇప్పుడు పింఛన్ తీసుకుంటున్న వారిలో ఎవరో ఒకరు చనిపోతే అప్పుడు మీరు సిఫారసు చేసిన వ్యక్తికి పింఛన్ ఇవ్వడానికి వీలవుతుందని సమాధానం చెప్పేవారు. అంతటి దౌర్భాగ్య పాలనకు చరమ గీతం పాడేందుకు నాడు మహానేత వైఎస్ నడుం బిగించారు’’ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి గుర్తుచేసుకున్నారు. చిత్తూరు జిల్లాలో నాలుగో విడత జరుగుతున్న జగన్ ‘సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర’ తొమ్మిదో రోజు మంగళవారం సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో సాగింది. శ్రీ కాళహస్తి పట్టణంలో జరిగిన భారీ బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే.. ఆ రోజులు తలచుకుంటేనే భయమేస్తోంది.. వైఎస్ అధికారంలోకి రాకముందు రాష్ట్ర పరిస్థితి చూస్తే రాష్ట్రంలో ఓ భయానక పాలన ఉండేది. వరుస కరువులతో ప్రజలు అల్లాడిపోతుంటే.. వారి కష్టాలను పట్టించుకునే నాథుడు లేడు. పింఛను కోసం సాటి వ్యక్తి చావుకోసం ఎదురుచూడాల్సిన అమానవీయ పరిస్థితులను కల్పించిన పాలన అది. డ్వాక్రా మహిళలకు అప్పులిచ్చి రూపాయిన్నర వడ్డీతో వారి రక్తాన్ని పీల్చేసిన పాలన అది. ఆ రోజులు తలుచుకుంటేనే భయమేస్తోంది. వరుస కరువులతో రైతులు కరెంటు బిల్లు కూడా కట్టలేకున్నారు.. వారికి ఉచితంగా విద్యుత్ ఇవ్వండని వైఎస్ డిమాండ్ చేస్తే.. ఉచితంగా విద్యుత్ ఇస్తే ఆ తీగలు బట్టలారేసుకునేందుకు తప్ప ఎందుకూ పనికిరావంటూ అవహేళన చేసిన పాలన అది. చివరకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ‘వారు తిన్నది అరగక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని’ ఎగతాళి చేసిన పాలన అది. పేదవాడి ముఖాన చిరునవ్వు కోసం వైఎస్ తపించారు ప్రజాకంటక పాలనలో హిట్లరే మేలనిపించిన చంద్రబాబు పాలనకు చరమగీతం పాడేందుకు నాడు వైఎస్ నడుం బిగించారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా దాదాపు 1500 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. పేదవాడి గుండె చప్పుడును దగ్గర నుంచి విన్నారు. తాను ముఖ్యమంత్రి కాగానే ఆ పేదవాడి గుండె చప్పుడుకు అనుగుణంగా పాలననందించారు. పేదవాడి ముఖాన చిరునవ్వు పూయించాలని తపన పడ్డారు. కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేశారు. రాష్ట్రంలో ప్రజలందరూ ఈ వేళ ‘వైఎస్ బతికుంటే ఎంత బాగుండు’ అని అనుకుంటున్నారు. ఇప్పుడు రాజకీయాల్లో నిజాయితీ లేదు.. వైఎస్ మన నుంచి దూరమయ్యాక రాజకీయాల్లో విశ్వసనీయత అన్నదే లేకుండా పోయింది. రాజకీయాల్లో టార్చిలైట్ వేసి వెతికినా నిజాయితీ కనిపించని పరిస్థితి. సోనియా గాంధీ తన కొడుకును ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టేందుకు మన రాష్ట్రాన్ని నిలువునా చీల్చేందుకు సిద్ధపడితే ఇక్కడి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఇద్దరూ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను గాలికొదిలేశారు. అసెంబ్లీలో చర్చలు చూస్తోంటే బాధనిపిస్తోంది. ప్రజలు వ్యతిరేకిస్తున్నా కేంద్రం విభజన బిల్లు రాష్ట్రానికి పంపితే.. దానిపై అసెంబ్లీలో ఎడతెగని చర్చలు చేస్తున్నారు. రాష్ట్రంలో 70 శాతం మంది ప్రజలు విభజనను వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మీరు పంపిన బిల్లును వెనక్కు పంపుతున్నాం అని ఒక్క ముక్కలో తేల్చేయాల్సిన అంశాన్ని ఇలా సాగదీస్తున్నారు. సోనియా, కిరణ్, చంద్రబాబు.. వీరు చేస్తున్న కుట్ర రాజకీయాలను పై నుంచి దేవుడనేవాడు చూస్తూనే ఉన్నాడు. వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ను అభిమానించే ప్రతిగుండె చప్పుడు ఒక్కటవుతుంది.. ఉప్పెన సృష్టిస్తుంది.. ఆ ఉప్పెనతో విభజన కుట్రదారులు బంగాళాఖాతంలో కలిసిపోక తప్పదు.’’ తొమ్మిదోరోజు యాత్ర సాగిందిలా.. మంగళవారం ఉదయం సత్యవేడు నియోజకవర్గంలోని నీర్పాకోటలో దివంగత నేత విగ్రహావిష్కరణతో తొమ్మిదోరోజు యాత్ర ప్రారంభమైంది. జగన్ బుచ్చినాయుడు కండ్రిగ, మయూర సుగర్ ఫ్యాక్టరీ, కాటూరు మీదుగా పచ్చాలమ్మ గుడి చేరుకుని అక్కడ పూజలు చేశారు. తంగేళ్లపాలెం వద్ద శ్రీకాళహస్తి నియోజకవర్గంలోకి అడుగు పెట్టారు. బసవయ్యపాళెం మీదుగా వి.ఎం. పల్లికి చేరుకున్నారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయిన పసల చిన్న పాపయ్య కుటుంబాన్ని ఈ గ్రామంలో జగన్ ఓదార్చారు. అనంతరం శ్రీకాళహస్తి నగరంలోకి జగన్ యాత్ర చేరుకుంది. మండపం సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. సభానంతరం పాతబస్టాండ్, కొత్తపేట, సీతాలమ్మగుడి, బహదూర్ పేట, తెట్టులో రోడ్‌షో నిర్వహించిన జగన్ రాత్రి 10 గంటల ప్రాంతంలో ఏఎం పుత్తూరు సమీపంలో ఉన్న కాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదనరెడ్డి గృహానికి బసకు చేరుకున్నారు. తొమ్మిదో రోజు యాత్రలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, వైఎస్ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ నారాయణ స్వామి, మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వైఎస్ఆర్ సీపీ తిరుపతి పార్లమెంటు పరిశీలకులు డాక్టర్ వరప్రసాద్, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల సమన్వయకర్తలు బియ్యపు మధుసూదనరెడ్డి, ఆదిమూలం పాల్గొన్నారు. -
'ఢిల్లీ గుండె అదిరేలా తీర్పునివ్వండి'
-
ఢిల్లీ గుండె అదిరేలా తీర్పునివ్వండి: వైఎస్ జగన్
చిత్తూరు: ప్రతి పేదవాడికి నేనున్నానే భరోసా కల్పించే దమ్ము ప్రస్తుత రాజకీయాల్లో ఏ నేతకు లేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాజన్న పాలనలో సువర్ణయుగం చూశామని ప్రతి ఒక్కరూ అంటున్నారని ఆయన తెలిపారు. సువర్ణ పాలన చూసే అవకాశం ఎనిమిదిన్నర కోట్ల జనాభాకు మాత్రమే దక్కింది అని పాలసముద్రం సభలో వైఎస్ జగన్ అన్నారు. రాజకీయాలు చదరంగంలా తయారయ్యాయని, ప్రజా రాజకీయాల నుంచి ఓ వ్యక్తిని దూరం చేయాలని కుయుక్తులు పన్నారని జగన్ తెలిపారు. అయితే ప్రతి గుండె చప్పుడులో వైఎస్ఆర్ ఉన్నారనే విషయం వారికి ఇప్పుడు అర్థమైందని ఆయన చెప్పారు. ప్రతి పేదవాడి సంక్షేమం కోసం మండుటెండల్లో పాదయాత్ర చేసి.. కష్టాల్లో ఉన్న ప్రజల గుండెచప్పుడు విన్న ఏకైక నేత వైఎస్ఆర్ అని జగన్ అన్నారు. ప్రతి పేదవాడు బాగుండాలని తాపత్రాయపడింది ఈ రాష్ట్రంలో మహానేత వైఎస్ఆర్ ఒక్కరే అని ఆయన తెలిపారు. 'ప్రతి అక్క నుంచి అవ్వలకు.. అవ్వల నుంచి అయ్యలకు..అయ్యల నుంచి ప్రతి యువకుడు లబ్ది పొందేలా అనేక ప్రజా సంక్షేమ పథకాలను వైఎస్ఆర్ ప్రవేశపెట్టారు' అని వైఎస్ జగన్ తెలిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగువాడి సత్తా చాటుదాం అని ఆయన అన్నారు. ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి యుద్ధం జరుగుతోంది ఆయన వెల్లడించారు. ఢిల్లీ గుండె అదిరేలా తీర్పునివ్వండి వైఎస్ జగన్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో 30 ఎంపీ స్థానాలు గెలుచుకుందాం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారినే ప్రధానిని చేద్దాం. కుమ్మక్కురాజకీయాలను ఛేదిద్దాం అని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. -
అసెంబ్లీ సాక్షిగా కుమ్మక్కు కుట్ర: వైఎస్ జగన్
* సమైక్య శంఖారావం సభలో నిప్పులు చెరిగిన జగన్మోహన్రెడ్డి * అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చించాల్సిందిపోయి.. రాష్ట్రాన్ని ఎలా విభజించాలా అని చర్చిస్తున్నారు.. * సోనియాగాంధీ గీసిన గీత దాటకుండా.. సీఎం సీటు కోసం కిరణ్ నాటకాలాడుతున్నారు * అధికారపక్షంతో అంటకాగుతూ చంద్రబాబు విభజనకు తనవంతు సహకారమందిస్తున్నారు * మెజారిటీ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని విభజించేందుకు అసెంబ్లీలో కుట్ర సాగుతోంది చంద్రబాబు చందమామనూ తెచ్చిస్తానంటారు.. చివరకు పిల్లనిచ్చిన సొంత మామను కూడా పదవికోసం వెన్నుపోటు పొడవడానికి వెనుకాడని చంద్రబాబు నేడో రేపో తాను అధికారంలోకి వస్తే చందమామను తెచ్చిపెడతాననో.. హైదరాబాద్ నగరానికి సముద్ర తీరాన్ని తెస్తాననో చెప్పినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. రాష్ట్ర విభజనను అడ్డుకోకుండా చంద్రబాబు ఇలాంటి కబుర్లు ఎన్ని చెప్పినా జనం నమ్మరు. అయితే ఈ రోజు నేను గర్వంగా చెప్పగల్గుతున్నా.. ‘జగన్ చెప్పింది చేస్తాడు. ఇచ్చిన మాట కోసం ఎందాకైనా వెళతాడు’ అన్న నమ్మకం సంపాదించుకోగలిగా. ప్రియతమ నాయకుడు, దివంగత నేత వైఎస్ నుంచి వారసత్వంగా ‘విశ్వసనీయత’ను సంతరించుకున్నానని నేను గర్వంగా చెప్పగలను. - వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ప్రజా సమస్యలను పక్కనపెట్టి, మెజారిటీ ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా.. రాష్ట్రాన్ని ఎలా విభజించాలా అని అసెంబ్లీలో పాలక, ప్రతిపక్ష నేతలు చేస్తున్న చర్చలు దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. సోనియా గీచిన గీత దాటకుండా.. ఎంతకాలం వీలైతే అంతకాలం సీఎం కుర్చీలో ఉండేందుకు కిరణ్ కుమార్ రెడ్డి తాపత్రయ పడుతుంటే.. మరోవైపు అధికారపక్షంతో అంటకాగుతూ రాష్ట్రాన్ని చీల్చేందుకు చంద్రబాబు తనవంతు సహకారాన్ని అందిస్తున్నారంటూ జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘ఇంతగా దిగజారిపోయిన రాజకీయ వ్యవస్థను, రాజకీయ నాయకులను చూస్తున్నప్పుడు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి మరీ మరీ గుర్తుకొస్తున్నారు. రాజకీయాల్లో విశ్వసనీయతకు అర్థం చెప్పిన వైఎస్ జీవించి ఉంటే మన రాష్ట్రాన్ని విభజించే సాహసం ఎవరైనా చేయగలిగేవారా?’’ అని అన్నారు. దిగజారుడు, కుమ్మక్కు రాజకీయాలకు చరమగీతం పాడి ‘సమైక్య రాష్ట్రం’ దక్కించుకునే కృషిలో భాగస్వాములు కావాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లాలో నాలుగో విడత ‘సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర’ను జగన్మోహన్రెడ్డి సోమవారం ప్రారంభించారు. తొలిరోజు యాత్రలో భాగంగా ఆయన వడవాలపేట, పుత్తూరు సభల్లో ప్రసంగించారు. ఆ ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే.. ప్రతి గుండె చప్పుడూ సమైక్యాంధ్ర.. ‘‘కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు చదువుకున్న ప్రతి పిల్లవాడి గుండె చప్పుడు.. జై సమైక్యాంధ్ర. ప్రతి రైతన్న మదిలో మెదిలే ఒకే ఒక మాట జై సమైక్యాంధ్ర. కుప్పం నుంచి శ్రీకాకుళం వరకూ సముద్రపు నీరు తప్ప మంచినీరు లభించని ప్రమాదపుటంచున ఉన్న ప్రతి ఒక్కరి గుండె చప్పుడు సమైక్యాంధ్ర. ఇందరి మనోభీష్టానికి వ్యతిరేకంగా సీట్లు, ఓట్ల కోసం నేడు కుమ్మక్కు కుట్రతో రాష్ట్రాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక సారి టీవీ పెట్టి అసెంబ్లీ సమావేశాల చర్చ చూస్తే.. రాష్ట్రంలో రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయో అర్థమవుతుంది. ఓట్లు, సీట్ల కోసం ఎంత నీచానికైనా పాల్పడే పరిస్థితులు ఉన్నాయి. సోనియా గాంధీ గీచిన గీత దాటకుండా ఎంత కాలం వీలైతే అంత కాలం సీఎం కుర్చీలో ఉండేందుకు కిరణ్ కుమార్‌రెడ్డి జనాన్ని మోసం చేస్తున్నారు. సీమాంధ్ర ప్రాంతమంతా సమైక్యం కోసం ఒక్క గొంతుతో నినదిస్తున్న వేళ.. ఆయన ఉద్యోగులను బెదిరించి సమ్మె విరమింపజేశారు. ఢిల్లీ నుంచి బిల్లు రాగానే ఆగమేఘాలపై తాను సంతకం చేయడమే కాక మిగతా ప్రభుత్వ కార్యదర్శులతో సంతకాలు చేయించి 17 గం టల్లోనే బిల్లును అసెంబ్లీకి పంపారు. ఇలా విభజన కోసం చేసేవన్నీ చేస్తూ కిరణ్ కుమార్‌రెడ్డి పైకేమో సమైక్యవాది ముసుగుతో జనాన్ని మోసం చేస్తున్నారు. కాలర్ పట్టుకుని నిలదీయాల్సిన చంద్రబాబు.. మన ప్రతిపక్ష నేత చంద్రబాబు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అసెంబ్లీలో తన ఎమ్మెల్యేలలో సీమాంధ్ర వారిచేత సమైక్యాంధ్ర అనిపిస్తారు... తెలంగాణ వారిచేత విభజన మాట పలికిస్తారు. అయ్యా చంద్రబాబూ.. విభజనకు అనుకూలంగా మీరిచ్చిన లేఖను ఎందుకు వెనక్కు తీసుకోరు? ఇంత వరకూ సమైక్యమన్న మాటే మీ నోటి వెంట ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నా. రాష్ట్రాన్ని అడ్డంగా చీల్చే ప్రయత్నం చేస్తున్న సోనియాను, కిరణ్‌కుమార్ రెడ్డిని కాలర్ పట్టుకుని నిలదీయాల్సిన చంద్రబాబు ఆ పని చేయకుండా ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపే హామీలనిస్తున్నారు. ప్రజలకు అన్నీ ఉచితంగా ఇస్తానంటూ ‘ఆల్ ఫ్రీ బాబు’గా కొత్త అవతారం ఎత్తుతున్నారు. తొమ్మిదేళ్లు అధికారంలో ఉండగా కరువు రైతుల అప్పులపై వడ్డీ మాఫీచేయని చంద్రబాబు.. ఇప్పుడు అధికారంలోకి వస్తే మొత్తం అప్పులే రద్దు చేస్తారట. హార్స్పవర్ విద్యుత్ చార్జీలు రూ.50 నుంచి రూ.625కి పెంచిన చంద్రబాబు, ఉచిత విద్యుత్ ఇస్తే తీగలపై బట్టలారేసుకోవాల్సిందే అన్న చంద్రబాబు.. ఇప్పుడు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తారట. ఎన్నికల ముందు మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పిన ఆయన... అధికారంలోకి రాగానే మద్యనిషేధం వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతోందని ‘ఈనాడు’లో పెద్ద పెద్ద వార్తలు రాయించుకున్నారు. చివరకు ఊరూరా బెల్టుషాపులు వెలిసేలా చేశారు. సమైక్యంగా ఉంచేవారినే ప్రధానిని చేద్దాం.. ఢిల్లీ అహంకారానికి, తెలుగు వాడి ఆత్మాభిమానానికి మధ్య జరుగుతున్న పోరులో.. కుటిల, కుమ్మక్కు రాజకీయాలకు తగిన బుద్ధి చెపుదాం. త్వరలో ఎన్నికలు వస్తాయి. మనమే సొంతంగా 30 మంది ఎంపీలను గెలిపించుకుందాం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే వ్యక్తినే ప్రధాని పదవిలో కూర్చోబెడదాం. రాష్ట్రాన్ని నిలువునా చీల్చే ప్రయత్నం చేసిన సోనియాకు, సీఎం పదవికోసం ఆమె గీచిన గీత దాటని కిరణ్‌కు, కుమ్మక్కు రాజకీయం చేస్తున్న చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా బలంగా సమైక్య నినాదాన్ని వినిపిద్దాం.’’ తొలిరోజు యాత్ర ఇలా.. సోమవారం ఉదయం 8.50 గంటలకు చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయం నుంచి సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర మొదలైంది. గాజుల మండ్యం, కదిరి మంగళం మీదుగా 12.30 గంటలకు బ్రాహ్మణ పట్టు గ్రామం చేరుకున్న జగన్మోహన్రెడ్డి అక్కడ వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పత్తిపుత్తూరులో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సాయంత్రం 3.30గంటలకు అప్పలాయకుంటలోని ప్రసన్న వెంకటేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం తిరుమంద్యం మీదుగా వడమాలపేట చేరుకుని సభలో ప్రసంగించారు. అనంతరం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో పుత్తూరు సభలో ప్రసంగించారు. సోమవారం యాత్రలో ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, అమరనాథ రెడ్డి, నగరి నియోజకవర్గ సమన్వయకర్త రోజాతో పాటు వైఎస్ఆర్ సీపీ జిల్లా నేతలు నారాయణ స్వామి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి, బియ్యపు మదుసూదన రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, డాక్టర్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
‘సమైక్య శంఖారావం’ నేటి నుంచి పునఃప్రారంభం
-
‘సమైక్య శంఖారావం’ నేటి నుంచి పునఃప్రారంభం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి చేపట్టిన సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర సోమవారం నుంచి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి పునః ప్రారంభం కానుంది. ఈ సమైక్య శంఖారావం ఈ నెల 17 నుంచే ప్రారంభం కావాల్సి ఉండగా జగన్‌కు తీవ్ర మెడనొప్పి కారణంగా మూడు రోజులు వాయిదా పడిన విషయం విదితమే. సోమవారం ఉదయం జగన్ హైదరాబాద్ నుంచి విమానంలో తిరుపతి చేరుకుంటారని పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం తెలిపారు. రేణిగుంట వివూనాశ్రయుం నుంచి రోడ్డు వూర్గంలో బయులుదేరి నగరి నియోజకవర్గంలో సమైక్య శంఖారావం కొనసాగిస్తారు. కేఎల్ఎం సర్కిల్, గాజులమండ్యం, అతూరు, పుడి, కాయం పర్యటిస్తూ బ్రహ్మణపట్టెడలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. ఆ తర్వాత పత్తిపుత్తూరులో కూడా వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు చెప్పారు. అక్కడి నుంచి అప్పాలాయగుంట, తిరుమన్యం, గోలకంద్రీగ, వడమలపేట, తడుకు, పుత్తూరులో బహిరంగసభ ఉంటుందని రఘురాం వెల్లడించారు. -
17 నుంచి నాలుగో విడత సమైక్య శంఖారావం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి నాలుగో విడత సమైక్య శంఖారావం యాత్రను ఈ నెల 17వ తేదీన చిత్తూరు జిల్లా నగరి నుంచి పునఃప్రారంభిస్తారని పార్టీ కార్యక్రమాల కోఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. సంక్రాంతి పండుగ కారణంగా ఈ నెల 13 నుంచి నాలుగు రోజుల పాటు యాత్రకు జగన్ విరామం ఇచ్చిన సంగతి విదితమే. ఈ యాత్రలో భాగంగా 17న సాయంత్రం పుత్తూరు పట్టణంలో బహిరంగ సభ జరుగుతుందని రఘురాం పేర్కొన్నారు.