ఢిల్లీ గుండె అదిరేలా తీర్పునివ్వండి: వైఎస్ జగన్
చిత్తూరు: ప్రతి పేదవాడికి నేనున్నానే భరోసా కల్పించే దమ్ము ప్రస్తుత రాజకీయాల్లో ఏ నేతకు లేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాజన్న పాలనలో సువర్ణయుగం చూశామని ప్రతి ఒక్కరూ అంటున్నారని ఆయన తెలిపారు. సువర్ణ పాలన చూసే అవకాశం ఎనిమిదిన్నర కోట్ల జనాభాకు మాత్రమే దక్కింది అని పాలసముద్రం సభలో వైఎస్ జగన్ అన్నారు.
రాజకీయాలు చదరంగంలా తయారయ్యాయని, ప్రజా రాజకీయాల నుంచి ఓ వ్యక్తిని దూరం చేయాలని కుయుక్తులు పన్నారని జగన్ తెలిపారు. అయితే ప్రతి గుండె చప్పుడులో వైఎస్ఆర్ ఉన్నారనే విషయం వారికి ఇప్పుడు అర్థమైందని ఆయన చెప్పారు. ప్రతి పేదవాడి సంక్షేమం కోసం మండుటెండల్లో పాదయాత్ర చేసి.. కష్టాల్లో ఉన్న ప్రజల గుండెచప్పుడు విన్న ఏకైక నేత వైఎస్ఆర్ అని జగన్ అన్నారు.
ప్రతి పేదవాడు బాగుండాలని తాపత్రాయపడింది ఈ రాష్ట్రంలో మహానేత వైఎస్ఆర్ ఒక్కరే అని ఆయన తెలిపారు. 'ప్రతి అక్క నుంచి అవ్వలకు.. అవ్వల నుంచి అయ్యలకు..అయ్యల నుంచి ప్రతి యువకుడు లబ్ది పొందేలా అనేక ప్రజా సంక్షేమ పథకాలను వైఎస్ఆర్ ప్రవేశపెట్టారు' అని వైఎస్ జగన్ తెలిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగువాడి సత్తా చాటుదాం అని ఆయన అన్నారు. ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి యుద్ధం జరుగుతోంది ఆయన వెల్లడించారు. ఢిల్లీ గుండె అదిరేలా తీర్పునివ్వండి వైఎస్ జగన్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో 30 ఎంపీ స్థానాలు గెలుచుకుందాం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారినే ప్రధానిని చేద్దాం. కుమ్మక్కురాజకీయాలను ఛేదిద్దాం అని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.