
17–02–2018, శనివారం
పోకూరు,
ప్రకాశం జిల్లా
నాన్నగారి ఆరోగ్యశ్రీ స్ఫూర్తిని దేదీప్యమానంగా వెలిగించి తీరాలి
ఉదయం శిబిరం నుంచి బయటకు రాగానే కోటేశ్వరమ్మ అనే అక్క ‘అన్నా.. మేము పాస్ పుస్తకాలు పెట్టి బంగారం లోను కింద రూ.87,000 తీసుకున్నాం. ఎన్నికల ముందు చంద్రబాబు రుణమాఫీ చేస్తానంటే ఆశపడ్డాం. ఇప్పటిదాకా ఒక్క పైసా మాఫీ కాలేదు. అధికారుల చుట్టూ తిరిగాం, కలెక్టర్‌ను కలిశాం. అమరావతి దాకా వెళ్లి అక్కడా పెద్దోళ్లకు విన్నవించాం. అటూ ఇటూ తిరగడానికే ఖర్చులు తడిసి మోపెడయ్యాయి. ఆఖరుకు బంగారం వేలం వేస్తారని తెలిసి, బయట అప్పు తీసుకుని వడ్డీతో సహా బ్యాంకులో కట్టాం. మబ్బుల్ని చూసి ముంతలో నీళ్లు ఒలకబోసుకున్నట్లయింది మా పరిస్థితి.. అంటూ ఆ అక్క చెబుతుంటే.. అయ్యో పాపం అనిపించింది.
సంపత్ అనే సోదరుడిదీ కోటేశ్వరమ్మ కథే. బ్యాంకులో బంగారం పెట్టి రూ.లక్షన్నర లోను తీసుకున్నాడట. రుణమాఫీ కింద మొదటి విడత రూ.25 వేలు ఇచ్చినట్లు రుణ ఉపశమన పత్రం కూడా అందుకున్నాడు. అది పట్టుకుని బ్యాంకుకు పోతే.. ఇంకా రాలేదంటారట. అధికారుల దగ్గరకు పోతే మేం డబ్బులు వేశాం.. బ్యాంకులకు వెళ్లమంటారట. తిరిగీ తిరిగీ విసిగిపోయాడట. ఈ రుణమాఫీ అంతా మోసం సార్.. ఆయనగారి హామీ నమ్మిన పాపానికి నా లక్షన్నర లోను కాస్తా.. వడ్డీలతో కలిపి రూ.మూడు లక్షలు దాటిందంటూ ఆ సోదరుడు చెబుతుంటే.. ఎన్ని బతుకుల్లో బండలు పడ్డాయిరా దేవుడా అనిపించింది.
వీవీపాలెం దగ్గర పొగాకు రైతులు కలిశారు. పొగాకు సేద్యం చేసినందుకు ఏటా నష్టాలేనట. మా లైసెన్స్‌లు తిరిగిచ్చేస్తాం పరిహారమివ్వండి.. పొగాకు సేద్యం ఎత్తేస్తాం.. అని చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. నాన్నగారి హయాంలో పొగాకు సరాసరి ధర రూ.127 ఉంటే.. దాదాపు పదేళ్ల తర్వాత, సాగు ఖర్చులన్నీ రెట్టింపయ్యాక కూడా ఇప్పుడు సరాసరి ధర రూ.116 అంటే.. రైతుకెంత నష్టమో ఆలోచించండి సార్.. అంటూ వారు లెక్కలేసి మరీ చెప్పారు. ‘బతకలేక, వలసలు పోలేక అవస్థలు పడుతున్నాం. ప్రభుత్వం చెప్పిందని గతేడాది శనగ పంట వేస్తే.. తీరా పంట చేతికొచ్చాక ప్రభుత్వం, వ్యాపారులు కుమ్మక్కై మమ్మల్ని నిలువునా ముంచేశారు. గతేడాది రూ.10,000 దాకా పలికిన శనగల బస్తా, ఇప్పుడు రూ.4,000 లోపే పలుకుతోంది. మా దగ్గరేమో రూ.3,800కు కొంటున్నారు. దళారుల చేతుల్లో పడ్డాక ధర రూ.10,000 దాటుతోంది. ఇదెక్కడి న్యాయం?’ అంటూ ఆ రైతన్నలు బాధపడ్డారు. వ్యవసాయాన్ని ఇలా సంక్షోభంలోకి నెట్టేస్తుంటే.. రాష్ట్రానికి ఎంత అరిష్టమో ఈ పాలకులు ఏమైనా ఆలోచిస్తున్నారా.. అనిపించింది.
కందుకూరువాసి 21 ఏళ్ల ప్రవీణ్‌కుమార్ కథ కలచివేసింది. నడుం వంగిపోయి, కళ్లు ఉబ్బిపోయిన ప్రవీణ్ నన్ను చూడగానే కంటతడి పెట్టుకున్నాడు. ‘అన్నా.. మా కష్టాలు పగవాడికీ రాకూడదు. నాకు తలసీమియా. మా అక్కా ఈ జబ్బుతోనే చనిపోయింది. బంగారు షాపులో గుమస్తాగా పనిచేస్తున్న నాన్నకు నా వైద్యం ఖర్చులు తలకు మించిన భారమయ్యాయి. వారానికోసారి రక్తం ఎక్కించుకోవాలి. రోజూ మందులు వాడాలి. మందుల ఖర్చే ఏడాదికి రూ.లక్షవుతోంది. నా కోసం మా నాన్న పడుతున్న యాతన చూసి.. ఎందుకు పుట్టించావురా దేవుడా.. అనిపిస్తోంది. గతంలో నాకు అనారోగ్య సమస్య తలెత్తినప్పుడు లక్షలాది రూపాయల ఆపరేషన్‌ను ఉచితంగా చేయించిన మీ నాన్నగారు మా పాలిట దేవుడు. మాలాంటోళ్లకు ఎంతో మేలు చేసేలా నెలకు రూ.10,000 పింఛన్ ఇస్తామని చెప్పారు మీరు. చాలా సంతోషం అనిపిస్తోంది’ అంటూ చేయి పట్టుకున్నాడు. నాన్నగారి ఆరోగ్యశ్రీ స్ఫూర్తిని దేదీప్యమానంగా వెలిగించి తీరాలి. ఇలాంటి వారి కన్నీళ్లు తుడిచి తీరాలనుకుంటూ ముందుకు అడుగులేశాను.
ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. పొగాకుకు ప్రత్యామ్నాయంగా శనగ వేయండి.. అంటూ రైతులకు భరోసాగా చెప్పారు. తీరా పంటచేతికొచ్చాక ధరలు పతనమైపోతే.. ఆ రైతులు ఇప్పుడు ఎవరిని నిలదీయాలి? ఆదుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలే వ్యాపారులతో కుమ్మక్కై ధరల పతనానికి కారణమైతే.. ఆ రైతుల గోడు ఎవరికి చెప్పుకోవాలి? కంచే చేను మేస్తుంటే కాపాడేదెవరు?
-వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment