
18–02–2018, ఆదివారం
కందుకూరు, ప్రకాశం జిల్లా
భావితరాల బంగారు భవితవ్యం కోసం.. ఎన్ని త్యాగాలకైనా సిద్ధం
బడేవారిపాలెం ఎస్సీ కాలనీకి చెందిన బొమ్మల చిన్నయ్య రావడం రావడమే బాబుగారిపై ఆగ్రహాన్ని వెళ్లగక్కాడు. ‘సార్.. ఈ గవర్నమెంటును నమ్మేదానికే లేకుండా పోతోంది. నాకున్న కొద్దిపాటి పొలాన్ని నమ్ముకుని కుటుంబాన్ని సాక్కుంటున్నాను. వర్షాల్లేక పంటలు ఎండి పోతుంటే బోరు వేసుకుందామనుకున్నాను. ఎస్సీ కార్పొరేషన్‌కు పోతే బోరు మంజూరు చేశారు. ఇది జరిగి రెండేళ్ల పొద్దయింది. ఇప్పటికీ నా పొలంలో బోరుపడ్డ పాపానపోలేదు. ఇదేమి సామీ అనుకుంటూ అధికారులకు, ఆఖరుకు కలెక్టర్‌కు కూడా పలుమార్లు విన్నవించుకున్నాను. పట్టించుకున్న నాథుడే లేడు. రెండేళ్లుగా తిరుగుతూ ఉంటే విసుగొస్తోంది.. కోపమొస్తోంది. ఆ కోపం ఎవరిమీద చూపించాలో తెలియడం లేదు.’ అంటూ 65 ఏళ్ల వృద్ధుడు ఆవేశపడిపోతుంటే ధర్మాగ్రహమే కదా.. అనిపించింది. పాపం ఇప్పుడు కూడా మిర్చి పంట ఎండిపోయే పరిస్థితికి వచ్చిందట. పంట ఎండిపోతే రైతు బతుకులో జీవకళ పోయినట్టే కదా. అందుకే రైతులందరికీ ఉచిత బోరు పథకమనేది వర్తించేలా చేయాలన్న నా సంకల్పం దృఢపడింది.
జలదంకి మండలానికి చెందిన దర్గాబాబుకూ ఇదేరకం చేదు అనుభవం ఎదురైంది. మినీ డెయిరీ పెట్టుకోవడం కోసం ఎస్సీ కార్పొరేషన్‌ను ఆశ్రయించాడట. గతేడాది ఇంటర్వ్యూ చేసి సెలక్ట్ అయ్యావన్నారట. మొదట రూ.6 లక్షలు మంజూరు చేస్తామన్నారట. సెలక్షన్‌లు అయిపోయాక లోన్‌ను రూ.3 లక్షలకే కుదించారట. కలెక్టర్ శాంక్షన్ లెటర్ అయితే ఇచ్చారు గానీ, ఆయనకు మాత్రం ఏడాది గడిచిపోతున్నా నిరీక్షణ తప్పలేదట. ఆయనతో పాటు ఆ లోన్లకు ఎంపికయిన మరో 32 మంది ఎస్సీ సోదరులదీ అదే పరిస్థితి. ఇంతవరకూ ఏ ఒక్కరికి కూడా లోన్ ఇవ్వకపోగా.. ఈ సంవత్సరా నికి సంబంధించి మళ్లీ ఇంటర్వ్యూలు జరుపుతున్నారట. ఇది ఎవర్ని మోసం చేయడానికి? కులానికో కార్పొరేషన్ పెట్టి.. వాటిని పట్టించుకోకుండా నిర్వీర్యం చేసి.. ఇలా ఎంతకాలం మోసం చేస్తూ పోతారు? ఇలా చేయడం ధర్మమేనా.. అంటూ ఆగ్రహం వ్యక్తంచేశాడు.
ప్రజల కష్టసుఖాలు తెలిసిన మనసున్న నేత అధికారంలో ఉంటే.. ఏం జరుగుతుందనే దానికి నిదర్శనం కందుకూరు తాగునీటి సమస్య పరిష్కా రం. మెట్ట ప్రాంతం, ఆపై ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన కందుకూరు ఒకప్పుడు తాగునీటికి కటకటలాడిన పట్టణం. ఇక్కడ అక్కచెల్లెమ్మలు మైళ్ల దూరం వెళితేగానీ.. బిందెడు మంచినీరు దొరకని పరిస్థితి. ఆ ఇక్కట్లను గుర్తెరిగిన నాన్నగారు అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు రూ.110 కోట్లు ఖర్చు చేసి నాగార్జునసాగర్ నుంచి కృష్ణాజలాలను కందుకూరుకు రప్పించి ఈ ప్రాంత ప్రజల దాహార్తి తీర్చారు. ఆ మేలును ఎన్నటికీ మరువలేమంటూ ఈ ప్రజలు పదే పదే గుర్తుచేస్తుంటే.. మనసంతా సంతోషంతో నిండిపోయింది.
జనంతో పోటెత్తిన కందుకూరు సభలో హోదా కోసం ఎందాకైనా పోరాడాల న్న నా సంకల్పాన్ని, దృఢచిత్తాన్ని మరోసారి ప్రజల ముందుంచి.. హోదా సాధన కోసం రాష్ట్రమంతా ఏకమై చిత్తశుద్ధితో పోరాడదామని పిలుపుని చ్చాను. రాష్ట్రానికి పరిశ్రమల కోసం.. పిల్లల ఉద్యోగాల కోసం.. మన రాష్ట్ర ప్రయోజనాల కోసం.. భావి తరాల బంగారు భవితవ్యం కోసం.. ఎవరితో నైనా కలుస్తాం. ఎన్ని త్యాగాలకైనా సిద్ధం. ఎన్ని పోరాటాలకైనా సన్నద్ధం. అవిశ్వాసానికైనా.. రాజీనామాలకైనా. మన ఆశ, మన శ్వాస హోదాయే.
ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. హోదాను తాకట్టుపెట్టారు.. ప్రత్యేక ప్యాకే జీ అన్నారు.. హోదాలో ఉన్నవన్నీ ప్యాకేజీలో ఉన్నాయన్నారు.. అందుకే అంగీకరించామన్నారు. మీరు, బీజేపీ వారు ఇవే మాటలు మాట్లాడారు. రాజ్యసభలో వెంకయ్యగారు మాట్లాడిన మాటలు, తిరుపతిలో ప్రధాని సమక్షంలో మీరు పలికిన పలుకులు ఒక్కసారి గుర్తుచేసుకోండి.. అబద్ధాలు చెబుతూ మీ మనస్సాక్షిని ఎలా అమ్ముకోగలుగుతున్నారు? ఇది అధర్మం కాదా? అన్యాయం అనిపించలేదా?
-వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment