
13–02–2018, మంగళవారం
కలిగిరి
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా
ప్రత్యేక హోదా మా ఊపిరి..దానికోసం ఊపిరి ఉన్నంత వరకూ పోరాడతాం..
తెలుగు నేల.. తెలుగు జాతి.. తెలుగు సంస్కృతి.. తెలుగువాడి ఆత్మాభిమానం..ఈ మాటలు వింటేనే మన మనసులు ఉప్పొంగుతాయి.
ఒక అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు, పొట్టి శ్రీరాములు.. ఇలాంటి వారి పేర్లు వినగానే తెలుగు జాతి స్వాతంత్య్రం కోసం చేసిన మహోన్నత పోరాట చరిత్ర, ఆత్మాభిమానం గుర్తుకొస్తాయి. అటువంటి ఆంధ్ర ప్రజల ఆత్మాభిమానాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన వ్యక్తి ఈ రోజు మనకున్న ముఖ్యమంత్రి.
ప్రత్యేక హోదా అన్నది రాష్ట్ర విభజన పరిణామాల్లో భాగంగా.. పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ. విభజన వల్ల బాగా దెబ్బతిన్న ఈ రాష్ట్రం కోలుకోవాలంటే, హైదరాబాద్ లేని ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే.. మన పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే.. ప్రత్యేక హోదా తప్ప మరో మార్గం లేదు. విభజన హామీల అమలు విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం నా మనసును తీవ్రంగా కలచివేసింది. కానీ, ఇవాళ చంద్రబాబు ప్రత్యేక హోదాను పూర్తిగా తాకట్టుపెట్టారు. ఎన్నికలకు ముందు.. ఐదేళ్లు కాదు, పదిహేనేళ్లు కావాలన్నారు. ప్రత్యేక హోదా తీసుకురావాలంటే తనను గెలిపించాలంటూ ప్రజల నుంచి అధికారాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ నాయకుడూ మార్చలేనన్ని మాటలు మార్చుకుంటూ వచ్చారు. ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ బ్రహ్మాండం అన్నారు. ఈ రాష్ట్ర ప్రజల ఆమోదం లేకుండానే దానికి తలూపారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందని గుర్తించి ప్రజలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశాక.. ఇప్పుడు సరికొత్త డ్రామాలకు తెరతీశారు. ఈ సందర్భంగా చంద్రబాబుగారికి కొన్ని ప్రశ్నలు వేస్తున్నా..
- పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా అవసరం లేదనే అధికారాన్ని మీకు ఎవరిచ్చారు?
- ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీని మీరు ఎందుకు అడిగారు?
- మీ పార్టీ భాగస్వామిగా.. కేంద్రంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదు బడ్జెట్లను కేంద్ర మంత్రులుగా ఉన్న మీ ఇద్దరు ఎంపీలు ఆమోదించలేదా? అలాంటిది, ఇప్పుడు అన్యాయం జరిగిందంటూ చేస్తున్న నానాయాగీ.. ఒక నాటకం కాదా?
- గతేడాది.. అంటే 2017–2018 బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు జనవరి 26న.. దేశంలో ఏ రాష్ట్రానికీ రానన్ని నిధులు మన రాష్ట్రానికే వచ్చాయని మీడియా ముందు, ప్రజల ముందు స్టేట్‌మెంట్ ఇచ్చింది వాస్తవమైనప్పుడు.. వాళ్లు తక్కువ ఇచ్చారని మీరు ప్రజలను ఏవిధంగా మభ్యపెడతారు?
- మొన్నటికి మొన్న రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ ప్రజల్లో అసంతృప్తి పెల్లుబికిన తర్వాత కూడా ఆర్థిక మంత్రి జైట్లీగారు ఇచ్చిన ప్రకటనలో ఏమీ లేకున్నా సరే.. ఆ ప్రకటనకు మద్దతుగా కేంద్రంలోని మీ పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు బల్లలు చరిచి మరీ హర్షాన్ని వ్యక్తంచేసింది నిజం కాదా?
- ఇంత నాటకం నడిపి ఇప్పుడు మీరు చేస్తున్నదేంటంటే.. మీరుగానీ, మీ ఎంపీలుగానీ.. ప్రత్యేక హోదాను కోరడం లేదు. సరికదా.. మనకు వచ్చిన దాంటోŠల్ పావలానో, ముప్పావలానో తగ్గిందన్న రీతిలో ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేయడం లేదా?
- ఇవాళ్టికి దాదాపుగా 13 రోజులుగా మీరు లీకులు మాత్రమే ఇస్తున్నారు తప్ప, ప్రజల ముందుకొచ్చి.. ఎందుకిలా చేశారని కేంద్రాన్ని ప్రశ్నించడం లేదు? హా ఎందుకు ప్రత్యేక హోదాని తాకట్టుపెట్టి, లేని ప్యాకేజీని ఉన్నట్టుగా డ్రామాలాడారు?
ఇక మీ డ్రామాలు, కపట నాటకాలు ముగించండి. మీలో నిజాయితీ లేదు. ప్రజలకు మేలు చేయాలన్న కోరికా లేదు. ఉన్నదల్లా సొంత ప్రయోజనాలే.
2014 ఎన్నికల తర్వాత గెలుపోటములతో సంబంధం లేకుండా.. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా కోసం వెంటనే పోరాట పంథాలోకి దిగాం. ఏడాదైనా ప్రత్యేక హోదా రాకపోవడంతో ఏకంగా ఢిల్లీలోనే ధర్నా చేశాం. ఆ తర్వాత రాష్ట్రంలో ఎన్నో ధర్నాలు, బంద్‌లు నిర్వహించాం. గుంటూరులో ఏకంగా 8 రోజుల పాటు ఆమరణ దీక్ష చేశాను. ఇన్ని చేసినా.. రాష్ట్రానికి జరిగిన మోసం, అన్యాయం పరాకాష్టకు చేరాయి. అందుకే ప్రజల ప్రయోజనాలే పరమావధిగా, బాధ్యతగల పార్టీగా.. ‘హోదా మా హక్కు – ప్యాకేజీతో మోసం చేయొద్దుŠ’ అనే నినాదంతో పోరాటాన్ని మరింత తీవ్రం చేస్తున్నాం. బడ్జెట్ సమావేశాల చివరి రోజున.. అంటే ఏప్రిల్ 6న.. ప్రభుత్వం దిగిరాకపోతే హోదా సాధించేందుకు చివరి అస్త్రంగా.. మాతో ఉన్న ఎంపీలందరూ లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామాలు చేస్తారు.
ప్రత్యేక హోదా మా ఊపిరి! ఊపిరి ఉన్నంత వరకూ దీనికోసం పోరాడతాం.
-వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment