
11–02–2018, ఆదివారం
అనంతాపురం,
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా
మహిళల కన్నీటికి కారణమైన మద్యం వ్యాపారం అవసరమా?
ఈరోజు కొత్తపాళెం గ్రామంలో పెద్ద ఎత్తున మహిళలు కలిశారు. ఆ అమ్మలను ఆప్యాయంగా పలకరించాను. ‘మద్యం రక్కసి మా ఊరిని పీడిస్తోందయ్యా..’ అంటూ చెప్పుకొచ్చారు. చంద్రబాబు ప్రభుత్వంపై కాళికలై కన్నెర్రజేశారు. మద్యం రాయుళ్ల ఆగడాలకు హద్దే ఉండటం లేదన్నారు. అర్ధరాత్రి.. అపరాత్రి.. వీధి వాడ.. ఊరంతా తాగుబోతులేనట. చీకటి పడితేచాలు.. బయటికెళ్లాలంటేనే మహిళలు భయపడుతున్నారట. రోడ్డున వెళుతుంటే.. తాగుబోతుల అసభ్య ప్రవర్తనతో చచ్చిపోతున్నామని చెప్పారు. చదువుకునే అమ్మాయిల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. టెన్త్ పరీక్షలకు ప్రత్యేకంగా సిద్ధమవుతున్న అమ్మాయిలు రాత్రి వేళ ఇళ్లకు చేరే వరకూ టెన్షన్‌గానే ఉంటోంది.. బడికెళ్లే దారిలోనే బ్రాందీ షాపు ఉందయ్యా.. అన్నారు. దొంగతనాలు జరుగుతున్నాయి.. మెడలో గొలుసులు తెంచుకుపోతున్నా రంటూ ఎంతో బాధగా చెప్పుకొన్నారు. విసిగిపోయాం.. భరించలేకపోతున్నాం.. ఈ ఊళ్లో మాత్రమే మూసేస్తే ప్రయోజనం లేదు.. చుట్టుపక్కల ఊళ్లలోనూ ఆ మద్యం షాపులు తీసేయించి పుణ్యం కట్టుకోండి.. అంటూ వేడుకున్నారు. ఆ అమ్మల ఆవేదన, ఆవేశమూ చూస్తే ఆశ్చర్యమేసింది. మద్యం మహమ్మారిపై సమరభేరీ మోగించిన చరిత్ర నెల్లూరు జిల్లాదే. కొంగు నడుముకు చుట్టి యావత్ రాష్ట్రాన్నీ కదిలించిన వీర వనితలకు ఈ జిల్లా పుట్టినిల్లు. ఇలాంటి జిల్లాలో మహిళలు కన్నీళ్లు పెడుతుంటే.. ఈ పాలకులకు చీమకుట్టినట్లయినా అనిపించదా? ఆ కన్నీటికి కారణమైన మద్యం వ్యాపారం అవసరమా?
దారిలో గొట్టిగుండాల గ్రామస్తులు కలిశారు. ఆ ఊరి పేదలకు గతంలో భూపంపిణీ కింద దాదాపు 2,000 ఎకరాల భూములు పంచారట. 1995లో వేరే జిల్లాల నుంచి వచ్చిన కొంతమంది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సహకారంతో, ఆ పార్టీ నాయకుల అండదండలతో దొంగ సర్టిఫికెట్లు సృష్టించి, రికార్డులు తారుమారు చేసి ఆ భూములను లాగేసుకున్నారట. ఆ తర్వాత ఎవరైనా నోరు విప్పితే బెదిరించడం మొదలెట్టారట. ‘మీ నాన్నగారి ప్రభుత్వం వచ్చాక మాకు న్యాయం జరిగే దిశగా ప్రయత్నాలు జరిగాయి సార్.. దాదాపు 700 ఎకరాల అసైన్డ్ భూములు తిరిగి అసలైన లబ్ధిదారులకు అందించారు. ఇంకా దాదాపు 1,200 ఎకరాలకు పైగా ఆక్రమణదారుల అధీనంలోనే ఉన్నాయి.. కోర్టులో కేసులూ నడుస్తున్నాయి.. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఆక్రమణ దారుల నుంచి గ్రామస్తులకు బెదిరింపులు మొదలయ్యాయి. వేధింపులు ఎక్కువయ్యాయి’ అంటూ ఆ గ్రామస్తులు బాధగా చెబుతుంటే, అసైన్డ్ భూముల ఆక్రమణల కోసమే ఈ ప్రభుత్వం నడుస్తోందా.. అనిపించింది. వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఇక్కడ అసైన్డ్ భూములు ఎలా అందాయన్నదానిపై విచారణ నిర్వహిస్తే నిజాలు బయటకురావా? చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా అసైన్డ్ భూముల నుంచి గుడి మాన్యాల వరకు వేటికీ భద్రత ఉండదు. గుడినే కాదు.. గుడిలో లింగాన్నీ మింగేసే అరాచకీయాలే నడుస్తుంటాయ్.
చివరిగా ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. గత ఎన్నికల సమయంలో ‘మహిళలకు భద్రత కావాలంటే బాబు రావాలి’ అంటూ ఆర్భాటంగా ప్రకటనలు గుప్పించారు. మరి నేడు మీరు పెంచి పోషిస్తున్న మద్యం మహమ్మారితో తమపై అరాచకాలు పెరిగిపోతున్నాయని కన్నీరు పెడుతూ మహిళలు రోడ్డెక్కుతున్నారు. వీరికేం సమాధానం చెబుతారు?
-వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment